హైదరాబాద్, జనవరి 23 : ప్రముఖ హాస్యనటుడు ఎమ్‌ఎస్ నారాయణ(63) కన్నుమూశారు. జనవరి 19న భీమవరంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎమ్‌ఎస్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. కొండపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఎమ్‌ఎస్ బాధపడుతున్నారు.
ఎమ్‌ఎస్ 1951 ఏప్రిల్ 16న పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో ఓ రైతు కుటుంబంలో జన్మించారు. ఎమ్‌ఎస్ పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. 1995లో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన హాస్యనటుడిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. తాగుబోతు పాత్రలను పోషించడంలో ఎమ్‌ఎస్ ప్రసిద్ధిగాంచారు. దాదాపు 500 చిత్రాలకుపైగా నటించి నవ్వించారు. రచయిత కావాలని వచ్చి హాస్యనటుడిగా స్థిరపడిన ఎమ్‌ఎస్ 2011లో విడుదలైన దూకుడులో తన నటవిశ్వరూపం ప్రదర్శించారు.
ఈ చిత్రానికి ఎమ్‌ఎస్‌కు హాస్యనటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. కెరీర్‌లో ఐదు నంది అవార్డులను నారాయణ అందుకున్నారు. ఎమ్‌ఎస్ నారాయణ తొలి చిత్రం ఎం. ధర్మరాజు ఎంఏ. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు ఎమ్‌ఎస్ దర్శకత్వం వహించారు.
నువ్వునాకు నచ్చావ్, శివమణి, ఇడియట్, యమదొంగ, దూకుడు, ఆగడు, బాద్‌షా, అతడు, అత్తారింటికి దారేది, సొంతం, ఆది, దిల్, ఆనందం, జులాయి, సుడిగాడు, రెడీ, కింగ్, రెబల్, రచ్చ, డార్లింగ్, గోలీమార్, స్వయంవరం, సమరసింహారెడ్డి, మానాన్నకు పెళ్లి చిత్రాలో ఎమ్‌ఎస్ నారాయణ నటించి మెప్పించారు. ఎమ్‌ఎస్‌కు భార్య కళాప్రపూర్ణ, కొడుకు, కుమార్తె ఉన్నారు. కొడుకు విక్రమ్ కొడుకు సినిమాతో ఇండస్ర్టీలో అడుగు పెట్టగా, కుమార్తె శశికిరణ్ ఈ మధ్యే దర్శకురాలిగా అడుగుకు ముందుకేశారు.