|
సరిగ్గా ఈ రోజు, అంటే జనవరి 23 న కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఒక మహత్తర సంఘటన జరుగుతూ ఉంది. ఎన్నో సంవత్సరాలలో ఒకసారి జరిగే సంఘటన ఇది. ఆదిశంకరులు ఎనిమిదివ శతాబ్దంలో స్థాపించిన శృంగేరీ పీఠానికి కాబోయే పీఠాధిపతిగా ఒక యువకుణ్ణి ఎంచుకొని సంన్యాస దీక్ష ఇచ్చే ప్రక్రియ ఇది. శ్రీ శంకరులు ఈ పీఠాన్ని దక్షిణ దేశానికంతా ధర్మప్రచార బాధ్యతల్ని అప్పజెప్పుతూ ఏర్పాటు చేశారు. నాలుగు రాషా్ట్రల ప్రజలూ ఈ పీఠానికి వెళుతూంటారు.
సంన్యాసం అంటే ఇంటిని, భార్యాపిల్లల్ని వదిలేయడమని సాధారణంగా అనుకుంటాం. కానీ అలాకాదు. ఇది ఆధ్యాత్మిక చింతనలో, జ్ఞానమార్గంలో ఒక ముఖ్యదశ. సమాజం ఒక నిర్దిష్ట మార్గంలో నడవడానికి వేదాలు ప్రతి వ్యక్తీ కొన్ని కర్మల్ని తప్పకుండా చేయాలని నిర్దేశిస్తాయి. ఉదాహరణకు అతిథుల్ని ఆదరించడం(అతిథి యజ్ఞం). దేవతల్ని పూజించడం(దేవయజ్ఞం), సమాజానికి హితమయ్యే పనులు చేయటం మొదలైనవి. ఈ కర్మల వల్ల పుణ్యము, పుణ్యం వల్ల స్వర్గం మొదలైన సుఖాలు లభిస్తాయి అనేది మతం అనే స్థాయిలో చెప్పుకునే వ్యవస్థ. దీనికి అతీతంగా ఎదిగి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్య లక్ష్యం. ఈ లక్ష్యంతో ఉన్నవాడు కర్మల్ని వదిలేయాలి. కర్మను వదిలేయడమే సంన్యాసంలో ముఖ్య విషయం. భార్యాపిల్లలు, ఇల్లు , వేళకు భోజనం మొదలైన సుఖాలని వదిలేయడం దీనిలో భాగం మాత్రమే. సంన్యాసి జీవితం ఎంత కఠినంగా, కత్తిమీద సాములా ఉంటుందో ‘నారద పరివ్రాజక ఉపనిషత్తు’ చూస్తే ఆశ్చర్యమవుతుంది. కేవలం కర్మల్ని వదిలేయడం సులభంగానే చేయవచ్చు. కానీ మనస్సులోని రాగద్వేషాలూ, కోరికలూ మొదలైనవి వదులుకోవడం చాలా కష్టం. మనందరికీ సమాజంలో ఒక వ్యక్తిత్వం, ఐడెంటిటీ ఉంటుంది. పలానా వంశం వాడు, ఫలానా ఉద్యోగం చేసేవాడు, ఎంతో గొప్పవాడు అంటూ ఒక చిరునామా నిర్మించబడి ఉంటుంది. దీన్ని పూర్తిగా వదిలి తాను ఏ వర్ణానికీ, సంప్రదాయానికీ, కులానికీ చెందినవాడు కాదని తెలుపుతూ కులాన్ని తెలిపే శిఖ, జందెం మొదలైనవాటిని వదిలేయాలి. నదిలో నిల్చుని ఇదివరకూ ఉన్న వసా్త్రలను వదిలేసి, గురువు ఇచ్చిన కౌపీనాన్ని పెట్టుకుని శరీరం పట్ల ప్రేమభావాన్ని వదిలి నది నుండి బయటకు రావాలి. గుడ్డల్ని వదిలేయటం అనాగరికత చిహ్నం కాదు. దేహంపై అభిమానం లేకపోవడం, భగవంతునిపై ధ్యానం ఉండటం అనే దానికి నిదర్శనం. లోకజ్ఞానం కలగకముందు ఆడం, ఈవ్‌లు కూడా ఈ దశలో తిరగడానికి ఇదే అర్థం. సంన్యాసి కాబోయే వ్యక్తి ఎనిమిది రకాల శ్రాద్ధాలు చేయాలి. అంతవరకూ తాను పూజిస్తున్న దేవతలు, పితృదేవతలు మొదలైన వారికి శ్రాద్ధాలు చేయాలి. ఒక విధంగా చూస్తే వారితో వీడ్కోలు తీసుకున్నట్లు. అలాగే తనకు తానే శ్రాద్ధం పెట్టుకోవాలి. దీన్ని ఆత్మశ్రాద్ధం అంటారు. అంటే ఇన్నాళ్ళూ తనకున్న వ్యక్తిత్వాన్ని పూర్తిగా నశింపజేసుకున్నట్లు భావన. తాను కేవలం పరమాత్మతత్వమే అనే భావనతో అందరిపట్ల సమభావనతో మెలగడానికి మొదటిమెట్టు. ఇరవై ఐదేళ్ళ యువకుడు తల్లిదండ్రుల ఎదురుగా తనకు తానే శ్రాద్ధం పెట్టుకుంటుంటే దాన్ని చూసే తల్లిదండ్రుల మనస్సులోని భావోద్వేగం ఊహాతీతం. ఇదొక గొప్ప త్యాగానికి చిహ్నం. హిందూసమాజం త్యాగం పట్ల ఎక్కువ ఆదరం చూపింది. మనదేశ చరిత్రను చూస్తే రాజులు, చక్రవర్తుల కంటే ఎక్కువగా పరివ్రాజకులు, గురువులే సమాజంపై ప్రభావాన్ని చూపారు. అందువల్లే సంన్యాసులు, గురువులు అనేక క్లిష్ట సమయాల్లో ధర్మాన్ని కాపాడగలిగారు. ఉపనిషత్తుల కాలంలో సంన్యాసమంటే పూర్తిగా కర్మల్ని వదిలేసి జడుడిగా, భిక్షుకుడిగా తిరిగే ఆచారముండేది. రాను రాను హిందూ ధర్మంలో పీఠాలు, ఆశ్రమాలు అనే వ్యవస్థ ఏర్పడింది. మన మతానికి ఒక గట్టి సంస్థాగత నిర్మాణం లేకపోయినా ఈ పీఠాలు, గురువులు ధర్మప్రచారం చేస్తూ వచ్చారు. బహుశా బౌద్ధుల ఆరామాలు, వారికున్న పటిష్టమైన ప్రచారవ్యవస్థ చూసిన తర్వాత వాటికి సమాంతరంగా శంకరులు ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేశారని కొందరి అభిప్రాయం. శ్రీ శంకరుల తర్వాత శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు కూడా ఇదే మార్గాన్ని పాటించి పీఠాలు ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో ఈ వ్యవస్థను కొత్తరూపంలో నిర్మించిన వ్యక్తి శ్రీ వివేకానందులు. వీరు స్థాపించిన రామకృష్ణ మిషన్ ఆధునిక అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా చాలామంది సాధువుల్ని తీర్చిదిద్దింది. ఎంతోమంది ఆధునిక విద్యావంతులు, సంస్కృతానికి దూరమైనవారు, సంస్కృతంతో సంబంధం లేకుండా మన మూల సిద్ధాంతాల్ని తెలుసుకోగలిగారు. ప్రపంచంలో అనేక దేశాల్లో వేదాంతం పట్ల ఆదరం, అభిమానం కలగడానికి శ్రీ వివేకానందుల కృషి ముఖ్యమైనది. ఇదే ఆదర్శంతో చిన్మయామిషన్ మొదలైనవి ప్రారంభమయ్యాయి. తెలుగు రాషా్ట్రలలో సుమారు తొంభై సంవత్సరాల క్రితం మళయాళ స్వామివారు యేర్పేడులో స్థాపించిన ఆశ్రమం వందలాది సాధువుల్ని తయారు చేసింది. వీరు కులమతభేదం లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైన మూల గ్రంథాల్లో ఉన్న ఉదాత్తమైన భావాల్ని తీసుకెళ్ళడం వల్లనే సమాజంలోని అనేక వర్గాలు పైగ్రంథాల బోధనల్ని గ్రహించగలిగాయి. ఈ ఆధునిక సంప్రదాయాలకు చెందిన సాధువుల్ని కూడా ప్రాచీన పీఠాలతో సమానంగా ఆదరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే సంన్యాసదీక్ష తీసుకున్న వారందరూ కులమత భేదాలకు అతీతంగా ఎదిగినవారే. సంన్యాస దీక్ష తీసుకున్న వ్యక్తిని అతి వర్ణాశ్రమి అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. అతి వర్ణాశ్రమి అంటే బ్రాహ్మణ, క్షత్రియ మొదలైన వర్ణభేదాలకు అతీతంగా ఎదిగినవాడు అని అర్థం. సమాజంలో అందరినీ సమానంగా చూడగలిగి ఉండాలి. అలాగే జగద్గురువు అనే మాట కూడా అర్థవంతమైనది. ఈ పదానికి జగత్తుకు గురువు అని అర్థం. జగత్తు అంటే – గచ్ఛతి ఇతి జగత్ – ఎప్పుడూ మారే స్వభావం కలది అని అర్థం. మార్పు అన్నది సహజం. సమాజంలోని మార్పును గమనించి సామాజిక సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి జగద్గురువు. ప్రాచీన కాలంలోని గురువులు వారి సమకాలీన సిద్థాంతాల్ని బాగా తెలిసినవారు. ఆ సిద్థాంతాల ప్రభావాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నవారు. ప్రస్తుత గురువులకు కూడా మన ధర్మానికి సవాలుగా నిలిచిన ఈనాటి సిద్థాంతాల పట్ల, సమాజ సమస్యల పట్ల అవగాహన అవసరం . అలాంటి అవగాహనతో గురువులు ముందుకు నడిస్తే సమాజం వారికి బ్రహ్మరథం పడుతుంది. డాక్టర్ కె. అరవిందరావు రిటైర్డు డీజీపీ ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com |

