
|
మరో ప్రతిభావంతుడైన కళాకారుణ్ణి తెలుగు చిత్రపరిశ్రమ కోల్పోయింది. ‘ఆహుతి’ ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు చిత్రపరిశ్రమకు హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ మరణం నిజంగా పెద్ద దెబ్బే. ఆయన హాస్యరస పోషణలో ఆయనదొక ప్రత్యేకమైన ఒరవడి. స్వతహాగా రచయిత కావడంతో తనకు ఇచ్చిన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్ది తన నటనతో దానికి జీవం పోసేవారు. ముఖ్యంగా తాగుబోతు పాత్రలకు ఆయన పెట్టింది పేరు. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకొన్న ఎమ్మెస్ మరణం నిజంగా తీరని లోటే.
సినిమాల్లోకి రాకముందు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూనే, పలు నాటకాల్లో వేషాలు వేశారాయన. పరుచూరి గోపాలకృష్ణ రచించిన సోషలిజం’ ఆయన నటించిన తొలి నాటకం. మొదటి నాటకంలోనే ఉత్తమ నటుడిగా అవార్డ్‌ను అందుకున్నారు. తెలుగు మాస్టార్‌గా ఉన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణలో క్రియాశీలక పాత్ర పోషించారాయన. దివిసీమ ఉప్పెన వచ్చిన సందర్భంలో బాధితులకు ఏదోలా సాయం చేయాలని ‘జీవచ్ఛవం’ నాటికను రాసి స్కూల్ విద్యార్ధులతో ఆడించి సేకరించిన మొత్తాన్ని ఉప్పెన బాధితులకు అందించిన ఘనత ఆయనది. 1978లో భీమవరంలో ఉద్యోగం చేస్తూనే ఎమ్.ఏ కట్టి పాసయ్యారు. తర్వాత భీమవరంలోనే లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఆయన జీతం రూ. 250. ఎమ్మెస్ గతం తెలుసుకున్న భీమవరం కాలేజ్ యాజమాన్యం సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలన్నీ ఎమ్మెస్‌కే అప్పగించారు. ఆయన రాసిన ‘ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఈక్వల్’ నాటిక విద్యార్ధులతో వేయించారు. దానికి ఎనిమిది ఫ్రైజ్‌లొచ్చాయి. అంతే అక్కడి వాళ్ళంతా ఎమ్మెస్సా మజాకా! అన్నారు. కళాప్రపూర్ణ ప్రోత్సాహంతోనే… జనరల్‌గా సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబంలో ఏ ఒక్కరూ ఒప్పుకోరు. కానీ ఎమ్మెస్ భార్య అలాకాదు వెన్నుతట్టి ఆయనను ప్రోత్సాహించింది. ‘ఏదయినా సాధించే వరకూ ఇంటిముఖం చూడొద్దని’ ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మళ్లీ చెన్నై ప్రయాణమాయ్యరు. ఓ చిన్న గది అద్దెకు తీసుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంత దూరమైన కాలినడకే శరణ్యం. కానీ అవకాశాలు ఈయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయినా ఎమ్మెస్ నిరూత్సాహపడలేదు. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే, ప్రయత్నం విరమిస్తే మరణించినట్టే’ అని డైరీలో అప్రయత్నంగా రాసుకున్న ఓ డైలాగ్ పదేపదే చదువుకుంటూ ఉత్సాహాన్ని నింపుకున్నారు. ‘సవ్యసాచి’తో రచయితగా తొలి అవకాశం కొన్నాళ్ళకు రవిరాజా పినిశెట్టి ఆయన దగ్గర ‘సవ్యసాచి’ కథను కొన్నారు. అక్కడి నుండి ఆయనతో మంచి సాన్నిహిత్యం పెరిగింది. రవిరాజా సినిమాలకు కలం సాయం కూడా చేశారాయన. తర్వాత ‘ప్రయత్నం’ కథను పరుచూరి గోపాలకృష్ణ కొన్నారు. ‘అలెగ్జాండర్’, ‘పేకాట పాపారావు’, ‘ప్రతిష్ట’, ‘అదిరింది గురూ’ అనే సినిమా కథఽలతో సినిమా రచయితగా ఎమ్మెస్ స్థిరపడ్డారు. మెల్లగా కామెడీలోకి సాఫీగా సాగుతున్న ఆయన రచన జీవితానికి ఓ బ్రేకి చ్చారు రవిరాజా పినిశెట్టి. ‘నీలో మంచి నటుడు ఉన్నాడు. నువ్వు ఉండాల్సింది తెర వెనుక కాదు తెర ముందు’ అని తను తీస్తున్న ‘ఎమ్.ధర్మరాజు ఎమ్‌ఏ’ సినిమాలో చెవిటి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర బాగా పండడంతో ఎమ్మెస్‌కు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘రుక్మిణి’, ‘పెదరాయుడు’ వంటి ఏడు సినిమాల్లో వరుసగా అవకాశాలిచ్చారు రవిరాజా పినిశెట్టి. ‘రుక్మిణి’లో తాగుబోతు పాత్ర పోషించి ఎమ్మెస్ ప్రేక్షకులను మెప్పించారు. ఆ క్యారెక్టర్‌ను చూసిన ఈవీవీ సత్యనారాయణ ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో అవకాశమిచ్చారు. ఆయన నట జీవితానికి రవిరాజా పినిశెట్టి పునాది వేస్తే, దానిపై ఈవీవీ ఇల్లు కట్టుకునే అవకాశమిచ్చారని ఎమ్మెస్ తరచూ చెబుతుండేవారు. అలా అవకాశాలు పెరిగాక 1998లో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇప్పటికి 700కుపైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయంలో గొప్ప హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. ఇందులో 200కు పైగా తాగుబోతు పాత్రలే. ఎమ్మెస్ మాంచి తాగుబోతు నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నేను గ్లాస్ పట్టుకుని ఎన్నిసార్లు జనాలముందుకెళ్ళినా వారు మాత్రం బోర్ ఫీల్ కాలేదని’ ఆయన పలు సందర్భాల్లో చెప్పేవారు. ప్రిన్సిపాల్ పాత్రలు కూడా ఎమ్మెస్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. ‘మా నాన్నకు పెళ్లి’, ‘సర్దుకుపోదాం రండి’, ‘రామసక్కనోడు’, ‘శివమణి’, ‘దూకుడు’ సినిమాలకు ఐదు నందులు అందుకున్నారు. ఉత్తమ హాస్యనటుడిగా దూకుడు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. రెండు సినీగోయర్స్ అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. ‘కొడుకు’ సినిమాతో దర్శకుడిగా ఎమ్మెస్ తనయుడు విక్రమ్‌ని హీరోగా పరిచయం చేసి ‘కొడుకు’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘భజంత్రీలు’ సినిమాకు కూడా ఆయనే దర్శకుడు. తమిళంలో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ‘క్రేజీవాలా’, ‘నవాబ్ బాషా’, ‘శుభోదయం’ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతోపాటు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన నటించగా విడుదలైన చివరి చిత్రం ‘పటాస్’లో సునామీస్టార్‌గా ఆకట్టుకున్నారు. ‘శంకర’, ‘రేయ్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘నిద్రపోయేటప్పుడు విశ్రాంతి తీసుకో.. మెలకువగా ఉండి పడుకోవద్దు’ అని ఎమ్మెస్ తండ్రి చెప్పిన మాటల్ని చివరి వరకు పాటించారు ఎమ్మెస్. ‘తాగుబోతు’గా చరిత్ర సృష్టించారు నారాయణా! మా మానాన మేం సినిమాల్లో మీ కామెడీ సీన్లు ఎంజాయ్ చేస్తుంటే, రెండ్రోజులుగా ఉన్నట్లా, లేనట్లా అంటూ, ఏడిపించీ ఏడిపించకుండా ఏడిపించారేమిటి ఎమ్మెస్? ‘అసలేం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి ఎమ్మెస్!’ అని మేం అడగాలనుకునేంతలోనే ‘ఇక నవ్వించింది చాలు’ అంటూ మమ్మల్నందరినీ నిజంగానే ఏడిపిస్తూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారా నారాయణా! ‘అతడు’లో మీరు చేసింది సింగిల్ సీనే అయినా, ‘మీ మానాన మీరు మాడిపోయిన మసాలా దోశ’ తినే ఆ ఒక్క సీనుతో ఎంతగా గుర్తుండిపోయారు? ‘దుబాయ్ శీను’లో ‘పైర్‌స్టార్ సాల్మన్‌రాజు’గా స్టార్ హీరోలపై చెణుకులు విసురుతూ మీరు చేసిన విన్యాసాలకు పొట్టచెక్కలయ్యేలా ఎంతగా నవ్వుకున్నాం! ‘దూకుడు’లో వెంకట్రావు పాత్రలో ‘యమదొంగ’, ‘మగధీర’, ‘సింహా’, ‘రోబో’ కేరక్టర్ల స్ఫూఫింగ్‌తో అలరించిన మిమ్మల్ని బ్రహ్మానందం ‘కళ్లకింద అంతంత క్యారీ బ్యాగులు పెట్టుకొని ఎలా హీరో అవుదామనుకున్నావ్‌రా’ అంటే, చాలా అమాయకంగా ‘గ్రాఫిక్స్‌లో తీసేస్తారనుకున్నా’ అన్న మీ డైలాగ్‌తో నవ్వి నవ్వి నవ్వలేక అలసిపోయాం కదా ఎమ్మెస్! వెండితెరపై తాగుబోతు పాత్ర అంటే ఏ హాస్యనటుడూ మీకు సాటిరాడు కదా. ఎన్ని తాగుబోతు పాత్రలు! మీరు చేసిన ఏడొందల యాభై పై చిలుకు పాత్రల్లో రెండొందల యాభై పైగా తాగుబోతు పాత్రలే. అయినా మాకు విసుగనేది కలగలేదంటే, మేం మొనాటనీ ఫీలవ్వలేదంటే, అదంతా మీ నటనా చాతుర్యమే కదా. తాగుబోతు పాత్రల్లో మీది చెరిగిపోని చరిత్ర. మీరు తాగుతారని మాకు తెలుసు. అందుకే మాలో చాలామంది మీరు తాగే ఆ పాత్రల్లో చెలరేగిపోతారని అనుకుంటూ వచ్చారు. కానీ, మొహం మీద మేకప్ ఉండగా ఎప్పుడూ మీరు తాగలేదనే సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది తాగుబోతు పాత్రల్లో ఒక తరహాలో డైలాగ్స్ చెప్పడమే మాకు తెలుసు. కానీ మీరు ఆ పాత్రల్లో ముక్కుతోటి విలక్షణంగా డైలాగ్స్ చెబుతూ మీదైన శైలిని సృష్టించారు. నిజంగా హాస్యనటుల్లో ‘తాగుబోతు’గా మీరు ట్రెండ్‌సెట్టర్ ఎమ్మెస్. కేవలం ‘తాగుబోతు’ అంటే మిమ్మల్ని మేం కించపరిచినట్లే. తాగుబోతు కాని పాత్రల్లోనూ ఎంతగా మమ్మల్ని నవ్వించారు నారాయణా. విలన్ల అసిస్టెంట్‌గా, లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, యాక్టర్‌గా, పల్లెటూరి రైతుగా, అమాయక భర్తగా, కొడుకులతో తిప్పలు పడే తండ్రిగా – ఎన్నెన్ని పాత్రల్లో ఎంతగా కడుపుబ్బించారు! ఎప్పుడైనా దర్శకులు మీచేత ఎబ్బెట్టు మాటలు పలికించారేమో కానీ, మీ హాస్యం ఎప్పుడూ ఎబ్బెట్టనిపించలేదు. తెరపై మీరు కనిపిస్తే చాలు, మా మొహాల మీద నవ్వు దానంతట అదే ప్రత్యక్ష్యం. ఇప్పుడు బుల్లితెరపై అచేతనంగా ఉన్న మీ దేహాన్ని చూస్తుంటే, అంత ఆపుకుందామన్నా ఆగకుండా దూకుతోంది దుఃఖం. మీరు చనిపోయారంటే నమ్మడం కష్టంగా ఉంది ఎమ్మెస్. మీరు లేకున్నా, మీరు చేసిన పాత్రల్లో జీవించే ఉంటారు. ఎప్పటికీ మమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు. – ఒక ప్రేక్షకుడు ప్రముఖుల సంతాపాలు ప్రముఖ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు ఎమ్మెస్ నారాయణ మృతికి సినీ ప్రముఖులు పలువురు సంతాపాలను వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అపహాస్యం చేయలేదు ‘‘ఎమ్మెస్ నారాయణ పరిశ్రమలో రచయితగా ప్రవేశించి, నటుడిగా టర్న్ అయ్యాడు. అతి తక్కువ సమయంలో 700లకి పై చిలుకు సినిమాల్లో నటించడం గొప్ప విషయం. ఆయన ఎప్పుడూ హాస్యాన్ని అపహాస్యం చేయలేదు. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి అతను. హాస్యం పండించడంలో అందెవేసిన చేయి. ఆరోగ్యంగా ఉన్న ఎమ్మెస్ హఠాత్తుగా పోవడం బాధాకరం.’’ – దాసరి నారాయణరావు మనసున్న వ్యక్తి ‘‘ఎమ్మెస్ నారాయణ మనసున్న వ్యక్తి. మా సినిమా ‘ఎం.ధర్మరాజు.ఎం.ఎ’తో నటుడిగా పరిశ్రమకు పరిచయమయ్యాడు. ‘పెదరాయుడు’లో తన నటన చూసి గొప్ప నటుడవుతాడని అనుకున్నా. నాతోనూ, నా బిడ్డలతోనూ నటించడానికి ఎంతో ఆసక్తి చూపించేవాడు. ఏ రోజూ నాకింత పారితోషికం కావాలని నోరు తెరిచి అడగలేదు. వ్యక్తిగత విషయాలను కూడా చెప్పి సలహాలడిగేవాడు. అతను మంచి నటుడు, కవి, దర్శకుడు ఎమ్మెస్.’’ – డా.ఎం.మోహన్‌బాబు అద్భుతమైన నటుడు ‘‘ఎమ్మెస్ నారాయణ అద్భుతమైన నటుడు. నాకు మంచి మిత్రుడు. పలు సినిమాల్లో కలిసి చేశాం. ఆయన లేరన్న వార్త మనసును కలచివేసింది. ఇటీవల ‘లయన్’లో కూడా కలిసి నటించాం. ఆయన మరణంతో పరిశ్రమ గొప్పనటుడిని కోల్పోయింది.’’ – నందమూరి బాలకృష్ణ వెర్సటైల్ నటుడు ‘‘ఎమ్మెస్ నారాయణగారు వెర్సటైల్ ఆర్టిస్ట్. ప్రతిభావంతుడు. ఆయన మరణవార్త విని బాధపడ్డాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.’’ – పవన్‌కల్యాణ్ గుండె ఝల్లుమంది ‘‘నాకు ఎమ్మెస్ నారాయణ అత్యంత ఆప్తుడు. మంచి నటుడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నా పట్ల చాలా అభిమానంగా ఉండేవాడు. ఎమ్మెస్ ఇకలేడన్న వార్త వినగానే గుండె ఒక్కసారి ఝల్లుమంది. విద్యాధికుడైన కమెడియన్ అతను. తన మాటల్లో డెప్త్ ఉండేది. ఈవీవీ ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా చేస్తున్నప్పుడు ఎమ్మెస్ గురించి చెప్పి పరిచయం చేశాను. ఆ తర్వాత కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. నాకిష్టమైన హాస్యనటుల్లో, వ్యక్తుల్లో ముఖ్యుడు ఎమ్మెస్.’’ – బ్రహ్మానందం నవ్వుల తోటమాలి ‘‘ఎమ్మెస్ నారాయణగారిని తెరపై రియల్‌హీరోగా శ్రీనువైట్ల, నేను, తాజాగా అనిల్ రావిపూడి చూపించాం. ‘ప్రేమలో పావని కల్యాణ్’కు తొలిసారి ఎమ్మెస్‌గారితో కలిసి పనిచేశా. ‘సవాల్’ మేం కలిసి పనిచేసిన రెండో సినిమా. అందులో తన ట్రాక్ చూసి చాలా ఆనందించారు. ‘ఇక అందరూ ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తారేమో అమ్మాయ్’ అని అనేవారు. మా మధ్య దర్శకురాలు, నటుడు అనే బంధాన్ని మించిన ఆత్మీయత ఉండేది. ఒకే చోట పక్కపక్క ఫ్లోర్‌లలో షూటింగ్ చేస్తుంటే ‘అమ్మాయి.. భోజనానికి వస్తున్నాను’ అని కబురుపెట్టి మరీ వచ్చేవారు. అలాంటి గొప్ప బంధం మాది. తెలుగు సినిమా పరిశ్రమలో నవ్వుల తోటమాలి అయిన ఎమ్మెస్‌గారు లేని లోటు భర్తీచేయలేనిది.’’ |



