చరిత్ర సృష్టించిన చరితార్ధులు
చరిత్ర స్‌సయ్యద్ నశీర్ అహమ్మద్ ఒక చరిత్రకారుడు, బహుగ్రంథకర్త ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు’, ‘భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు, భారతి స్వాతంత్య్రోద్యమము -ముస్లిం ప్రజాపోరాటాలు, చిరస్మరణీయులు, 1857 -ముస్లింలు, అక్షర శిల్పులు, అష్పాబుల్లాఖాన్, టిపూసుల్తాన్ వంటి గ్రంథాలను సమాజానికందించారు. ఈ గ్రంథాలు అందించే క్రమంలో ఆయన చేసిన పరిశోధన, పడిన శ్రమ అనితర సాధ్యం. కొన్ని వేల కిలోమీటర్లు తిరగడం వందలాది మందిని కలుసుకోవడం, ఆ ప్రాంతపు ముస్లిం యోధుల గురించి తెలుసుకోవడం చరిత్ర మరుగునపడిపోయిన ఆ యోధుల చరిత్రని వెలికి తీయడం నశీర్ అహమ్మద్‌కి నిత్యవ్యాపకం. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇదేపనిలో నిమగ్నమై ఉన్నారాయన. జర్నలిస్ట్‌గా, అడ్వకేట్‌గా, ఇలా అనేక వ్యాపకాలను నెరిపినా ప్రస్తుతం పరిశోధనకే జీవితాన్ని అంకితం చేసి ముందుకు సాగుతున్నారు నశీర్. బహుశా మరుగున పడిన ముస్లిం ప్రముఖుల చరిత్రలను వెలికితీసి నిక్షిప్తం చేస్తున్నవారు అరుదే నేమో! అయితే ముస్లింల చరిత్రను నిక్షిప్తంచేసే క్రమంలో ఆయన పరమతాలకు చెందిన ఎవరిని ఏ సందర్భంలోనూ కించపరిచిన దాఖలాలు లేవు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే 1757 నుండి 1947 వరకు బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని ముస్లిం యోధుల చిత్రాలు, అలాగే వారి సంక్షిప్త వివరాలతో ‘చరితార్థులు’ పేరుతో ఒక మంచి పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం తీసుకురావడంలో ఆయన ఎంతగానో శ్రమించారు. ఇది ఒక అరుదైన పుస్తకం. కొందరి త్యాగాలకు చరిత్రలో స్థానం లేకుండా పోవడం శోచనీయమైన అంశం. అయితే దాన్ని ఈనాడు భర్తీ చేయాలంటే చరిత్ర మూలాల్ని పరిశోధించాల్సి ఉంటుంది. దానికి పూనుకొని నిరంతరం శ్రమిస్తున్న పరిశోధకుడు నశీర్ అహమ్మద్. చరితార్థులు పుస్తకానికి ఆయన మాటగా రాసుకున్న దానిలో ఇలా అంటారు.
చరితార్థులు (తెలుగు) ‘ది ఇమ్మోర్టల్స్’ (ఆంగ్లం) ఆల్బమ్ గత పదిహేనేండ్ల నా అన్వేషణ, శ్రమఫలితం. 1757 నుండి 1947 వరకు సాగిన బ్రిటిష్ వ్యతిరేకపోరాటాలలో పాల్గొన్న భారత ఉపఖండంలోని అసంఖ్యాక ముస్లిం యోధులలో నేను సమకూర్చుకోగలిగిన 155 మంది చిత్రాలు, ఫొటోలు, సమాచారం ఆధారంగా రూపొందించిన ప్రతి రూపాలు, సంక్షిప్త వివరాలు ఇందులో పొందుపర్చాను. ఈ గ్రంథంలో భారత పునర్వికాసోద్యమ నిర్మాతలలో ఒకరుగా ఖ్యాతి గాంచిన ముల్లా అబ్దుల్ ఖయ్యూంఖాన్ (హైదరాబాద్) బ్రిటిష్ ప్లాంటర్లు ప్రయోగించిన విషాహారం నుండి మహాత్ముణ్ణి కాపాడిన బతఖ్‌మియా అన్సారి (మోతిహరి, బీహార్) చిత్రపటాలు మాత్రం నా దృష్టికి వచ్చిన గ్రంథాలలో పేర్కొన్న వర్ణనలను బట్టి చిత్రకారుడి ద్వారా రూపకల్పన జరిగింది. అముత్సలాం (రాజస్థాన్) ఫొటో మాత్రం ఆమె చేత మహాత్మాగాంధీ స్వయంగా నిరాహారదీక్ష విరమింపజేస్తున్న దృశ్యం లభ్యం కావడంతో, ఆ అంశం ప్రాధాన్యత దృష్ట్యా, ఆ ఫొటోను యధాతథంగా వాడానని వివరిస్తారు నశీర్ అహమ్మద్. ఇక చక్రవర్తులు, రాజులు, రాజప్రముఖులు, సైనిక ప్రముఖులు సైన్యాధికారులు, సైనికులు, సాహసికులైన సామాన్య ప్రజల చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఈ పుస్తకం తెలుగు, ఇంగ్లీషు భాషలతో వెలువడటం వల్ల ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలవారు చదువుకోవడానికి అవకాశమేర్పడింది.
ఈ పుస్తకంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా మొదలుకొని షేర్ ఖాదర్ మొహియుద్దీన్ వరకు మొత్తం నూటయాభై మంది చిత్రాలు అలాగే క్లుప్తంగా వారి చరిత్రలు ఇంగ్లీషు, తెలుగు భాషల్లో కూర్చారు.
ఎంతో ఆసక్తికరంగా వీరి చరిత్రలు అందించడంలో నూటికి నూరు శాతం సఫలమయ్యారని చెప్పవచ్చు. కొన్ని అరుదైన చిత్రాలు సేకరించి అందించారు నశీర్ అహమ్మద్. హైదర్ అలీ, టీపూసుల్తాన్, బేగం హజరత్ మహల్, బహదూర్ షాహ్‌జఫర్, అష్ఫాఖుల్లా ఖాన్, బేగం నిషాతున్నిషా మోహాని, డాక్టర్ ఉమర్ అలీషా, మొహమ్మద్ అలీఖన్నా, షోయాబుల్లా ఖాన్, బతఖ్‌మియా అన్సారి, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ జాకీర్ హుస్సేన్, డాక్టర్ మఖ్దూం మొహియుద్దీన్, షేక్ గాలిబ్ సాహెబ్, మొహమ్మద్ ఇస్మాయిల్, డాక్టర్ ఫక్రుద్దీన్ అలీఅహ్మద్, బేబి అమతుస్సలాం, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ వంటివారు ఇందులో చోటు చేసుకున్నారు.
చరిత్రకారులు కొందరిని కావాలని పక్కన బెట్టడం, అలాగే కొందరి చరిత్రను వక్రీకరించడం వంటివి ఎన్నో జరిగాయి. ఇందులో దళితులు, ముస్లింలను ఎక్కువగా విస్మరించడం జరిగాయి. ఇటువంటి వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టి ముస్లిం ప్రముఖుల చరిత్రను సేకరించడంలో నశీర్ చేస్తున్న కృషిని ఏమాత్రం తక్కువ చేయకూడదు. ఒకరి చరిత్రను అధ్యయనం చేయడమంటే నాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక అంశాలను అధ్యయనం చేసినట్లేకదా! ఇలా భారతదేశంలోని ఈ చరితార్థుల చరిత్రను రికార్డు చేయడం ప్రశంసనీయం.
బ్రిటిష్ వలస పాలకులనుండి ఈ దేశ విముక్తికోసం అలుపెరుగక పోరుసలిపిన ముస్లిం త్యాగధనులకు సరి అయిన గుర్తింపు లభించలేదనేది వాస్తవం. చారిత్రక ఆధారాలతో వచ్చిన ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావలసిన అవసరం వుంది.
అలాగే ఇందులోని చరితార్థుల గురించి సమగ్రమైన చరిత్రలను నిక్షిప్తం చేయాల్సిన అవసరమూ వుంది. ఇది ఒక్క ముస్లింలేకాక అందరూ చదివి భద్రపరుచుకోవాల్సిన పుస్తకమిది.
”ఈ ఆల్బమ్ రూపకర్త శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ ఎంతో శ్రమకోర్చి సేకరించిన 155 ముస్లిం యోధుల చిత్రపటాలు, ఆయా యోధుల వివరాలు ఇందులో పొందుపర్చారు. 1757 నుండి 1947 వరకూ దేశం కోసం త్యాగాలు చేసిన, ప్రాణాలర్పించిన ముస్లిం వీరులు, దేశభక్తులు సమర యోధులు ‘చరితార్థులు’లో వున్నారు. ఇవి దృశ్యమాలికలు. క్రితం కఈఊి, కఇి లాంటి సంస్థలు ఈ దిశలో కొన్ని గ్రంథాలు వెలువరించాయి. వీటిని సరసన చేర్చగల ప్రామాణిక గ్రంథాన్ని మిత్రులు నశీర్ అహమ్మద్ తయారు చేసి వెలువరించడం హర్షణీయం అంటారు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ. ఇది అక్షర సత్యం. ప్రతులకు -9440241727.

