‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగానరసం ఫణి’.
పసిబిడ్డలను, పశుపక్ష్యాదులను సైతం రంజింపజేసేది సంగీతం అన్నది దానర్థం. 12 స్వరాల పునాదులపై 72 మేళకర్తరాగాల సమాహారమే సంగీతం. కానీ ఎంతోమంది గొప్ప విద్వాంసులు సైతం మేళకర్తరాగాలను సులభశైలిలోకి తీసుకురాలేకపోయారు. ఆ పని చేయడంలో సఫలీకృతుడయ్యారు ‘స్వర వీణాపాణి’. చిన్నారులు కూడా తేలిగ్గా సంగీతస్వరాలను నేర్చుకోవాలంటున్న ఆయన
పదహారేళ్లపాటు కఠోర సాధన చేసి 72 మేళకర్త రాగాల సమ్మేళన ప్రయోగం చేశారు. ఆ ప్రయాణంలో తన అనుభవాలను ‘నవ్య’తో ముచ్చటించారాయన..
‘‘మాది గుంటూరు జిల్లా రావెల. అమ్మా నాన్నలు ఓగేటి అన్నపూర్ణమ్మ, లక్ష్మీనరసింహశాసి్త్ర. నాన్న ఎలిమెంటరీ స్కూల్లో హెడ్‌మాస్టర్. ఆయనకు సంగీతమంటే మహాపిచ్చి. అందుకే సిరిపురం నుంచి నాజర్ అనే సన్నాయి వాయిద్యకారుణ్ని పిలిపించుకుని సంగీత సాధన చేసేవారు. ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్న ఆయన కొన్ని వందలమందికి సంగీతపాఠాలు నేర్పారు. మేం ఐదుగురం సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. అందరికీ నాన్న సంగీతం నేర్పారు. అయితే అందరికన్నా నేనే ఆసక్తిగా సంగీతం నేర్చుకున్నాను.
‘‘అరవయ్యేళ్ల క్రితం మంగళంపల్లి వారు ఒక్కో రాగంలో ఒక్కో కీర్తన పాడి రికార్డు చేశారు. అన్ని రాగాల్లో కీర్తనలు పాడింది మంగళంపల్లివారొక్కరే. ఇంతవరకూ మళ్లీ ఆ సాహసానికి ఎవ్వరూ పూనుకోలేదు. అలాంటిది ఆరు నిమిషాల్లో 72 మేళకర్తరాగాలంటే ఆయనెలా అంగీకరిస్తారు? అయినా ఈ ప్రయోగం వినేందుకు మంగళంపల్లి గారు ఒప్పుకున్నారు. భయంతోనే ఆయన వద్దకు వెళ్లాను. నోట్సు ఆయన చేతిలో పెట్టి ఆలపించాను’’
మా ఊరే గుర్తించింది..
మా ఊరి రామాలయం మైకులో ప్రతిరోజూ భజనపాటలు పాడుతుండేవారు. నేను, మా నాన్న కూడా పాటలు పాడుతూ హార్మోనియం వాయించేవాళ్లం. మా చుట్టుపక్కల గ్రామాల్లో భజన బృందాల పోటీలు జరుగుతుండేవి. మా వూరి బృందం కూడా పోటీలకు వెళ్లేది. ఒక్కోసారి మా బృందం ఓడిపోయేదశలో వున్నప్పుడు నేను ఆశువుగా పాటలు పాడేవాణ్ని. దాంతో మేం గెలిచేవాళ్లం. చిన్నప్పటి నుంచీ నాకు సంగీతంతో పాటు సాహిత్యమూ కొంత అబ్బింది. చిన్నప్పుడే నేను 108 పాటలు రాశాను. అన్నీ అంజనీపుత్రునిపైనే. ఆ పాటలు విని చాలామంది మెచ్చుకుంటుండేవారు. అయితే గుంటూరులోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదివేందుకు చేరినప్పుడు ఉత్సాహం కొద్దీ ఆ పాటల్ని నాటి ప్రిన్సిపల్ పొన్నెకంటి హనుమంతరావుగారికి ఎలా వున్నాయో చూడమని ఇచ్చాను.. ఆయన అవి చదివి నన్ను అభినందించారు. ఇంటర్‌లో వున్నప్పుడే నేను గణేశునిపై ఒక పాట రాశాను. ఆ పాట ఇప్పటికీ మావూరి ఆలయంలో పాడుతున్నారు. ‘గుడి- బడికి వెళ్లేటప్పుడు నా పాటలు పనికొస్తాయా?ఎవరైనా పాడతారా?’ అని అనుకునేవాణ్ని. కానీ ఆ తరువాతి కాలంలో నా ఆలోచన కార్యరూపం దాల్చింది. ఎస్‌పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల వంటివారు నేను రాసిన పాటల్ని, నేను స్వరపరచిన పాటల్ని ఆలపించారు. అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను. మావూరి ఆలయంలో ‘ఏకాహం’ జరిగేది. అంటే ఒక రాగం తీసుకుని ‘హరే రామ.. హరే కృష్ణ…’ అంటూ పాడేవారు. దానిని నాన్నగారు 4 గంటల పాటు నిరంతరాయంగా పాడేవారు. అందరూ అచ్చెరువొందేవారు. అదే నాకు స్ఫూర్తి. ‘సప్తస్వరాల్ని 4 గంటల పాటు ఎలా చెబుతున్నారు’ అన్న ఆలోచనే నా ఈ ఆరు నిమిషాల్లో 72 మేళకర్తల ప్రయోగానికి స్ఫూర్తి.
హార్మొనీతోనే కాలం..
కాలేజీలో చేరినా హార్మొనీ సాధనను మాత్రం వీడలేదు. విద్యార్థులకు నాటకాలు వేయడం నేర్పుతూనే వాటికి హార్మోనియం వాయించేవాణ్ని. దాంతో వచ్చే డబ్బుతో నేను చదువుకునేవాణ్ని. అనంతరం బీకాం తరువాత వేలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ‘లా’ చేశాను. అక్కడ నైట్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే రాత్రిళ్లు నాటకాలకు హార్మొనియం వాయించేందుకు వెళ్లే నాకు నైట్ కాలేజీ అంటే కుదిరేపనేనా? అందుకే ప్రిన్సిపల్ వద్దకెళ్లి డే కాలేజీలో సీటివ్వాలని అడిగాను. నా విన్నపాన్ని విన్నతరువాత ఆయన డే కాలేజీకి మార్చారు. దాంతో పగలు కాలేజీ, రాత్రి నాటకాలతో కాలం గడిచిపోయింది. అలా కొన్నాళ్లకు ‘లా’ పూర్తి చేశాను. గుంటూరు జిల్లా కోర్టులో, మున్సిబుకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు మొదలెట్టాను. అయితే ఏదో అసంతృప్తి. అది మనకు సరైన మార్గం కాదన్న భావన నిత్యం నాలో అలజడి రేపుతుండేది. అప్పుడు కూడా నాటకాలకు హార్మొనీ వాయించడం మానలేదు. అప్పుడు భక్తి సంగీతం నుంచి లలిత సంగీతం వైపు మనసు మళ్లింది. నేనే పాటలు రాసి నేనే కంపోజ్ చేయడం మొదలుపెట్టాను. కొన్ని ఆల్బమ్స్ కూడా చేశాను.
హైదరాబాద్‌కి మకాం
ఆ తరువాత మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చాను. ఇక్కడ కనిపించిన వారికి నా ఆల్బమ్ క్యాసెట్లు ఇస్తుండేవాణ్ని. ఓసారి తనికెళ్ల భరణిగారు పరిచయం అయ్యారు. నా సంగీతం, పని తీరు నచ్చి ఓరోజు తనకు సంగీతం నేర్పమని అడిగారాయన. నాకు పెద్దగా సంగీతం రాదంటే ‘నీకు సంగీతం వచ్చో, రాదో నాకు తెలుసు. నువ్వు నేర్పు’ అన్నారు. నేను కూడా మా నాన్న తరహాలోనే (కోపమొస్తే కొట్టడం) నేర్పుతానన్నాను. దాంతో ఆయన వారి పిల్లలతో సహా సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు (నవ్వుతూ). సంగీతదర్శకత్వం వహించాలన్న నా కోరిక విని ఓ రోజు దర్శకుడు శివనాగేశ్వరరావ్‌ని పిలిచి అవకాశం ఇవ్వాలని చెప్పారు భరణిగారు. శివనాగేశ్వరరావ్‌కు నా పాట వినిపించాను. అప్పటికి ఆయన ఏ సినిమా అనుకోలేదు. కానీ పాట వినగానే ఆయనే నాకు డబ్బు ఇచ్చేశారు. ఆ తరువాత ‘పట్టుకోండి చూద్దాం’ సినిమాకు అవకాశం ఇచ్చారు. దాంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.
స్వరవీణాపాణిగా నేను..
ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నా అసలు పేరు ఓగేటి నాగవెంకట రమణమూర్తి. కానీ మొదటి సినిమా సమయంలో పేరు బాగా లేదని మంచి పేరు పెట్టాలని శివనాగేశ్వరరావ్‌గారు భరణిగారిని అడిగారు. ఓ రోజు నేను భరణిగారి పిల్లలకు సంగీత పాఠాలు చెబుతుండగా.. పూజమందిరం నుంచి ‘వరవీణా మృదుపాణి…’ అంటూ పాటపాడుకుంటూ వచ్చిన ఆయన ‘నీ పేరు వీణాపాణి’ అన్నారు. అప్పటి నుంచి అదే నా పేరుగా మారిపోయింది. ఆ తరువాత ‘దేవస్థానం’ సినిమా సమయంలో దర్శకుడు జనార్ధనమహర్షి నాకు ‘స్వరవీణాపాణి’ అని పేరు పెట్టారు. అదే నాకు స్థిరమైపోయింది. నేను ‘పట్టుకోండి చూద్దాం’, ‘దేవస్థానం’, ‘ఆల్‌రౌండర్’, ‘టైంపాస్’, ‘సిరా’ సినిమాలకు దర్శకత్వం వహించాను. అయినా ఏదో అసంతృప్తి. భరణిగారు అప్పుడప్పుడూ ‘సంగీతంలో ఏదైనా మీరు కొత్తగా చేయాలండీ’ అంటుండేవారు.
72 మేళకర్త రాగాలు..
ఏ పనిలో నిమగ్నమైనా ఏదో అసంతృప్తిగా వుండేది. ప్రపంచ సంగీతానికి 12 స్వరచక్రాలే పునాదులు. సంగీతంలోని మొత్తం 72 మేళకర్తల్ని 12 చక్రాలుగా కుదించారు. ఒక్కో చక్రానికి ఆరేసి మేళకర్తలుంటాయి. ఆ మేళకర్త రాగాలను ఒక్కోదాన్ని ఒక్కో గంటపాటు అంటే 72 గంటల పాటు వుండేలా కంపోజ్ చేశా. అలా దానిపై సాధన చేస్తూనే వున్నా. నా ప్రయోగానికి తనికెళ్ల భరణిగారే తొలిశ్రోత. ‘చాలా బాగా చేశావ్. కానీ ఎవరైనా పెద్దవారు వింటే బావుంటుంది’ అని సూచించారు. ఆయన సలహాతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు మోహనకృష్ణ వద్దకెళ్లి నా ప్రయోగాన్ని వినిపించాను. వెంటనే మంగళంపల్లివారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఆ మాట విని ఆయన కొట్టిపారేశారు. అది అసాధ్యమని తేల్చేశారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. అరవయ్యేళ్ల క్రితం మంగళంపల్లి వారు ఒక్కో రాగంలో ఒక్కో కీర్తన పాడి రికార్డు చేశారు. అన్ని రాగాల్లో కీర్తనలు పాడింది మంగళంపల్లివారొక్కరే. ఇంతవరకూ మళ్లీ ఆ సాహసానికి ఎవ్వరూ పూనుకోలేదు. అలాంటిది ఆరు నిమిషాల్లో 72 మేళకర్తరాగాలంటే ఆయనెలా అంగీకరిస్తారు? అయినా ఈ ప్రయోగం వినేందుకు మంగళంపల్లి గారు ఒప్పుకున్నారు. భయంతోనే ఆయన వద్దకు వెళ్లాను. నోట్సు ఆయన చేతిలో పెట్టి ఆలపించాను. ‘ఛీ, పో. ఇది సంగీతమే కాదు!’ అని ఆయన అంటారని నిర్ణయించేసుకున్నాను. క్షణాలు గడిచేకొద్దీ ఆయన ఏమంటారోనని గుండె కొట్టుకుంటున్న తరుణంలో ‘భారతీయ సంగీతానికి ఇది గేట్ వే’ అన్నారాయన. ఇక నా ఆనందం చెప్పనలవి కాలేదు. ఆ తరువాత నన్ను దగ్గరకు తీసుకున్నారు. ‘‘నేనూ చేశాను. ఈ రాగాల్ని ఆలపించాను. కానీ నువ్వు చేసింది అసామాన్యం. సమాజం నేర్చుకోవడానికి సులువుగా వుంది. దీనిని నేనూ పాడతా’’ అన్నారు. ఆ తరువాత దేశంలోని మహాసంగీత మేధావులందరి వద్దకెళ్లీ నా సాధనను వినిపించాను.
ఇది జనాల్లో ప్రాచుర్యం పొందేందుకు 72 మంది సంగీత విద్వాంసులు, గాయనీగాయకుల చేత ఈ 72 రాగాల్ని పాడించాలన్నది నా కోరిక. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడే ఇది ప్రపంచవ్యాప్తమవుతుంది. ‘స్వరనిధి సంగీత విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేసి ఔత్సాహికులందరికీ సంగీతం ఉచితంగా అందించాలన్నది కూడా నా లక్ష్యం. నా ఈ ప్రయోగం గురించి తెలిసి నార్త్ టెక్సాస్ యూనివర్శిటీ వారు పరిశోధన కోసం పిలిచారు. త్వరలోనే అక్కడకు వెళ్లబోతున్నాను. ఆ యూనివర్శిటీ నుంచి పరిశోధనకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ సంగీతకారుణ్ని నేనే.
స్వరవీణాపాణి మొబైల్ నెంబర్: 09848498344
ఈమెయిల్:
swaraveenapani@gmail.com