ఇప్పటివరకూ మనం పతంజలిని గూర్చిన కథ తెలుసుకున్నాం. ఇపుడు పతంజలి యోగసూత్రాలలోనికి వెడదాం.
అథ యోగానుశాసనమ్
శాసనం అంటే మనపై వేరే ఎవరో విధించే నిబంధన. అనుశాసనం అంటే మనకు మనమే విధించుకునే నిబంధన. ఈ రెండింటికీ తేడా గమనించారా? మరి, యోగ అనుశాసనం అంటున్నారెందుకు? ఈ నిబంధన, క్రమశిక్షణ అవసరమా? నిబంధనలు ఎప్పుడు అవసరమవుతాయి?
మీకు దాహం వేసినపుడు నీళ్ళు తాగాలని కోరుకుంటారు. దాహం వేసినపుడు నీళ్ళు తాగటం క్రమశిక్షణ అని అనుకోరు. మీకు ఆకలివేసినపుడు ఆహారం తింటారు. ఆకలి వేసినపుడు ఆహారం తినటాన్ని ఒక నిబంధనగా భావిస్తారు. అలాగే ప్రకృతిని ఆస్వాదించటం, ఆనందించటం ఒక క్రమశిక్షణగా అనుకుంటారు. ఆనందంగా ఉండటానికి ఏ నిబంధనలూ అవసరం లేదు. చిన్న పాప తన తల్లిని చూడగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఒడిలో వాలిపోతుంది తప్ప, ‘నేను అమ్మను చూడగానే పరుగెత్తుకు వెళ్ళాలి. అది క్రమశిక్షణ’ అని అనుకోదు. అవునా?
మరి ఈ క్రమశిక్షణ ఎక్కడినుండి వచ్చింది?

ఏదైతే మొదలుపెట్టటానికి అంత ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా ఉండదో అటువంటి పనిని మొదలుపెట్టడానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఆ పనిచేస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుందని, ఆనందాన్నిస్తుందని మీకు తెలుసు. అయినా మొదట్లో మాత్రం అంత ఆనందంగా ఉండదు. మీరు నిబద్ధతో ఉన్నప్పుడు, ఆనందంగా, ప్రశాంతంగా- నిజమైన ఆనందాన్ని కలిగి ఉన్నప్పుడు- అపుడు మీరు మీతోనే ఉన్నారు. ఆ స్థితిలో క్రమశిక్షణ అంటూ ఏమీ ఉండదు. అనా కానపుడు మాత రం కుక్కపిల్ల తోకను ఊపినట్లుగా మీ బుద్ధి అటూ ఇటూ పరుగెడుతూ ఉంటుంది, అపుడు దానిని శాంతపరచటానికి, స్వస్థానంలోకి తీసుకురావటానికి క్రమశిక్షణ అవసరం అవుతుంది. అంతిమంగా ఈ క్రమశిక్షణకు ఫలితం పరమానందంగా ఉంటుంది. మధుమేహవ్యాధి ఉన్న వ్యక్తి తీపి వస్తువులను తినకూడదని తనకు తానే నిర్ణయించుకుని పాటిస్తాడు. అలాగే క్రొవ్వు అధికంగా ఉన్నవారు, తమకు ఇష్టమైనా సరే, మానేయటం కష్టంగా అనిపించినా సరే, క్రొవ్వు పదార్థాలను తీసుకోరు. ఎందుకంటే క్రొవ్వు పదార్థాలు రుచిగా ఉన్నా, దీర్ఘకాలంలో చేటుతెస్తాయి కాబట్టి. ఈ క్రమశిక్షణకు ఫలితం ఆరోగ్యమే కదా.
ఆనందం మూడు రకాలు- సాత్వికం, తామసికం, రాజసికం
సాత్విక ఆనందం, అంత సౌకర్యంగా లేకున్నా, అంతిమంగా ఆనందానికి దారితీస్తుంది. ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం వల్ల పొందే ఆనందం సాత్వికానందం- ఇది దీర్ఘకాలం నిలిచి ఉండేది. ఏ ఆనందమైతే మొదట్లో సంతోషాన్నిచ్చి, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుందో అది ఆనందం కానేకాదు. కాబట్టి అసలైన సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అంటే మిమ్మల్ని మీరు అనవసరంగా హింసించుకోవటం కాదు సుమా. క్రమశిక్షణ యొక్క ఉద్దేశ్యం ఆనందాన్ని పొందటమే. కొన్నిసార్లు ప్రజలు తమపై తాము విధించుకునే నిబంధనలు వారికి ఆనందాన్ని ఇవ్వవు, చుట్టూ ఉన్నవారికీ ఆనందాన్ని కలిగించవు. ఇది తామసిక ఆనందం. తామసిక ఆనందం అనేది ఆనందంలా కనిపిస్తుంది గాని, నిజానికి మొదటి నుండీ చివరి వరకూ అంతా దుఃఖమే. తామసిక ఆనందానికి ఏ క్రమశిక్షణా అవసరం లేదు. క్రమశిక్షణ ఉండకపోవటమే తామసిక ఆనందం. రాజసిక ఆనందం చూడటానికి ఆనందంతోనే మొదలైనప్పటికీ, చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. క్రమశిక్షణ తప్పు దారిలో పడటం దీనికి కారణం. క్రమశిక్షణ లేకపోవటం కూడా రాజసిక ఆనందానికి దారితీయవచ్చు. సాత్విక ఆనందం పొందటానికి క్రమశిక్షణ అవసరం. ఏదైనా సౌకర్యంగా లేదో దానిని భరించటమే క్రమశిక్షణ. అసౌకర్యం అన్ని వేళలా ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉన్నా సరే దానిని భరించి ముందుకు సాగటానికి క్రమశిక్షణ నీకు అవసరం.
అందుకే పతంజలి ‘అథ’ (ఇప్పుడు) అంటూ మొదలుపెట్టాడు. ఈ క్షణంలో , విషయం తేటతెల్లంగా లేని పరిస్థితిలో , నీ బుద్ధి సరియైున స్థానంలో ఇంకా కుదురుకోని స్థితిలో మొదలుపెట్టాడు.
యోగానుశాసనమ్
యోగ అనేది ఎవరో మనపై రుద్దినది కాదు. మనకు మనమే విధించుకున్న క్రమశిక్షణ ఇది. మీకు మీరే విధించుకుని పాటిస్తున్నవి ఏవి? రోజూ పొద్దునే లేవగానే పళ్ళు తోముకుంటారు, రాత్రి పడుకునే ముందు మరోసారి తోముకుంటారు. ఇది మీ క్రమశిక్షణ. అయితే ఇవి చిన్నప్పుడే నీకు అలవాటు చేయబడ్డాయి. నీవు చిన్నవాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు క్రమశిక్షణ నేర్పింది. ఒకసారి అలవాటైనాక, దాని వలన కలిగే మంచి ఏమిటో నీకు తెలిసింది. ఒకసారి విషయం అర్థమైనాక ఇక అది మీ అమ్మ విధించిన నిబంధన కాదు, నీకు నీవే పాటిస్తున్నదిగా మారిపోయింది. నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, వ్యాయామం చేయటం, ధ్యానం చేయటం, ఇతరుల పట్ల దయ కలిగి ప్రవర్తించడం- ఇవన్నీ నీ క్రమశిక్షణకు తోడ్పడటం కోసం నీకు నీవే విధించుకున్నవి. అవును కదా?
సరే, ఈ క్రమశిక్షణ ఏం చేస్తుంది?
క్రమశిక్షణ, నిన్ను నీ ఆత్మలో కలుపుతుంది. నీలో నీకు తెలియని ఖాళీలను పూరించి నీ అస్తిత్వాన్ని సంపూర్ణం చేస్తుంది.
తదాదృష్టః స్వరూపే అవస్థానమ్. నిన్ను నీ ఆత్మలో ఉంచుతుంది.
అలా కానప్పుడు, నీవు నీ ఆత్మలో లేనపుడు ఏం జరుగుతోంది?
వచ్చేవారం చూద్దాం..
శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు