కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-13
రామయ్యగారి రూపు రేఖలు
పొడుగ్గా వెడల్పైన భుజాలతో బలిష్టంగా(రోబస్ట్) అంత అందమైన ముఖం కాకపోయినా ఆకర్షణీయం గా రామయ్య గారు ఉండేవారు .చూడటానికి మొరటు మనిషిలా కనిపించినా ఆయన పొడవైన బాహువులు చూస్తె అతి మృదులంగా ,కోమలంగా ఉండట౦ అందరికీ ఆశ్చర్యం కలిగించేవి .గోళ్ళు ఆల్మండ్ షేప్ లో ఉండేవి .కళ్ళు చిలిపితనం కు ఆలవాలంగా ఉండేవి .ఈ కలలకే అమ్మాయిలూ ఫ్లాటై పోయేవారు .చాలా హుషారుగా కనిపించేవారు .నవ్వుతూ పలకరించటం ఆయన ప్రత్యేకత .ఆయన కళ్ళల్లో ఆయన మేధస్సు ప్రతి ఫలిస్తూ కనిపించేవి .అందమైన కళ్ళు గా అందరూ భావించేవారు .విశ్రాంతి అంటే ఏమిటో రామయ్యగారికి తెలియనే తెలియదు .చాలా ప్రశాంతం గా సంతృప్తి గా కనిపించటం ఆయన ప్రత్యేకత .ఎప్పుడూ ఎక్కడా తొందరపడిన సంఘటనలు ఆయన జీవితం లో లేనే లేవు .కోపం ,విసుగు ,చిరాకులకు ఆయన ఆమడ దూరం .
గజేంద్ర (గణేష్ )రామయ్య
భారతీయ మిత్రులు రామయ్యగారిని తమ తండ్రిగా భావించేవారు అలానే పిలిచేవారు కూడా .అంటే కాదు ఇంకో పేరూ ఆయనకు ఉంది .అదే ‘’గజేంద్రుడు ‘’‘’.ఏనుగు బలానికి సంకేతం ,ఎంతటి కష్టమైన పనినైనా సునాయాసంగా చేసే నేర్పూ ఓర్పూ ఉన్న జంతువూ .అంతే కాదు రాజసం(మెజెస్టి )ఉట్టి పడే జీవి .స్నేహితులు ఆయన్ను గజేంద్ర అనేవారు అంటే ఆయనలో పైన చెప్పిన లక్షణాలన్నీ పూర్తిగా ఉన్నాయనే .ఏనుగు గమనం లో ఠీవి ఉన్న్నట్లే రామయ్య గారి నడకలోనూ ఉంది .చీమకు కూడా ఏనుగు హాని చేయదని మన పురాణాలలో ఉంది .అలాగే రామయ్య గారి వలన ఎవరికీ హాని జరగలేదు .ఏనుగు ఆకారం మహా సౌష్టవం గా ఉండి , సంపూర్ణత కు నిలయం అనిపిస్తుంది దాని ఆలోచనలూ ఉత్తమోత్తమంగా ఉంటాయి .రామయ్య గారివీ అదే స్థాయిలో ఉండటం విశేషం .రామయ్య గారి హైతీ మిత్రుడు ‘’రామయ్య గారి కళ్ళు మాత్రమె కాదు చేతులు కూడా గానం చేస్తాయి ‘’అన్నాడు .ఫ్రెంచ్ భాష రాకపోయినా రామయ్య మాట్లాడుతూ ఉంటె బాడీ లాంగ్వేజ్ వలన అయన ఏమి చెబుతున్నారో తనకు అర్ధమయ్యేది అన్నాడు అలెక్సీ అనే ఆయన .గజ ముఖుడు అయిన వినాయకుడు మనకు పరమ ఆరాధనీయ దైవం. మొదటి పూజ ఆయన కేగా . .రామయ్య గారి అందమైన కళ్ళు దిగ్భ్రాంతిని కలిగించేవి .ఆయన చూపులలో అపారమైన కరుణా ,ప్రేమా పొంగి పొరలేవి .ఏంతో ఆప్యాయంగా ,ఆత్మీయం గా ఆయన మిత్రులను ఆలింగనం చేసుకొనేవారు .అందులో శుద్ధత ,స్వచ్చత ,పవిత్రత ఉండేవి .చిలిపి కళ్ళే అయినా అందులో విజ్ఞాన ప్రకాశం జ్యోతక మయ్యేది .అవి ఆయన మానసిక ,బౌద్ధిక ఉన్నతికి ఆకరాలు అనిపించేవి .కనుక రామయ్య గారిని’’ An elephant of intellect ‘’అని అత్యంత గౌరవం గా సంబోధించేవారు .వంకర తిరిగిన పెదవులలో చిరునవ్వు ,ఏటవాలు కళ్ళు ఆయన ప్రవర్తనకు, స్వభావానికి అద్దం పట్టేవి .ప్రశాంతమైన ,అడ్డులేని సాగర తరంగ స్వారి లాగా చాలా మృదువుగా ,అరికట్టలేని స్వభావం గల వారిగా రామయ్యగారు అందరికీ ఆకర్షణీయం గా ,ఆరాధనీయం గా దర్శనమిచ్చేవారు .అదీ రామయ్య గారి స్పెషాలిటి .’’ఎ పెర్సనాలిటీ విత్ మెజెస్టి ‘’ అని పించేవారు రామయ్య గారు .
వ్యవస్థ మూలాలలో తేడా –సోషలిజం లో నిజం
రష్యా సైంటిస్ట్ అగ్ర నేత తో సమావేశం అయిన తర్వాత రామయ్యగారు అమెరికాలో తాను పనిచేసిన పెట్రోకెమికల్స్ అధినేత హేంక్ తో ఈయనను పోల్చుకొన్నారు .నక్కకూ నాగ లోకానికి ఉన్నంత తేడా గమనించారు .హేంక్ భయపడినట్లు రష్యన్లు అమెరికా ఆకాశ హర్మ్యాలను కూల్చటానికేమీ ప్రయత్నించటం లేదని మేధస్సును భూమి దున్ని పంటలు పండించటానికే వినియోగిస్తున్నారని తెలిసి మనసులో ‘’పూర్ హేంక్ ‘’అనుకొన్నారు .ప్రముఖ రష్యా సైంటిస్ట్ చెప్పిన మాటలు ఏంతో విలువైనవిగా అనిపించాయి .ఆ మాటలసారాంశం –‘రష్యా ’విప్లవం ‘’అంటే ఒక మార్పు మాత్రమేకాదు ,అధికార బదిలీ కూడా కాదు .ముఖ్య గమ్యం .నూతన మానవావిర్భావం .విప్లవం ప్రజలవల్లనే ,ప్రజలకోసమే .ప్రతి వ్యక్తికీ చేతినిండా పని ఇవ్వగలగటం. దీనికోసం పంచ వర్ష ప్రణాలికా రచన జరిగి అమలు పరుస్తున్నారు .అవి విజయ వంతమైనాయి .నిన్నటిదాకా బానిస బతుకులు బతికిన వాళ్ళు ఇవాళ వారి జీవితాలకు యజమానులయ్యారు .అందుకే వారంతా సోవియట్ శక్తికి బలాన్ని చేకూరుస్తున్నారు .ప్రాణ త్యాగానికైనా సిద్ధం గా ఉన్నారు .అంతమాత్రం చాలదు .సోషలిజం ప్రతి వ్యక్తీ నరనరానా వ్యాపించాలి .కొత్త జీవితాలు ఏర్పడాలి ‘’your life style defines your consciousness ‘’అన్నది సిద్ధాంతం అవ్వాలి .ప్రతి వ్యక్తికీ తన బలం మీద, తెలివి తేటలమీద నమ్మకం కలిగించాలి .వ్యక్తీ తాను అద్బుతాలు సృస్టిం చ గలను అనే నమ్మకాన్ని కలిగిఉండాలి .సోషలిజం ఒక కల కాదు .అదొక వ్యక్తిగత కర్తవ్యమ్ .అందుకే సోషలిజం అనేది వాస్తవం .
అభివృద్ధిలో బాగా దూసుకు పోయిన దేశాలతో రష్యా పోటీ పడాలి .పాత అలవాట్లు ,పాత జీవితాలకు స్వస్తి పలకాలి. కొత్త లోకం ఆవిర్భవించాలి .నూతన మానవుడు అందులో సుఖ సంతోషాలతో జీవించాలి .లేకపోతె వాళ్ళు ‘’పారిస్ కమ్మ్యూన్ ‘’లో మనుష్యులను మట్టు పెట్టినట్టే రష్యా ప్రజలనూ చేస్తారు ఇక్కడ రష్యా ప్రజల ఉనికికే ప్రమాదమేర్పడుతుంది .అందుకే ఎక్కడ మేదోజీవులున్నా వారందరినీ రష్యాకు ఆహ్వానించి వారి సేవలు అందజేసి సోవియట్ దేశ పురోభి వృద్ధికి కృషి చేయమని ఆహ్వానించారు .ఈ మాటలు విన్న రామయ్యగారి మనసులో సన్నని అలజడి రేగింది .విప్లవం అంటే ఉన్న అంతర్జాతీయ భావన అర్ధమయింది .ప్రతి విషయం క్రిస్టల్ క్లియర్ గా ఉందనిపించింది .తానూ మళ్ళీ రాజమార్గం మీదే నడుస్తున్నననే నమ్మకం బలపడింది .
‘’రష్యా దేశం చాలా క్లిష్ట పరిస్తితులలో ఉంటె’’ ఇష్టపడి అభి వృద్ధికి రామయ్య చేసిన కృషి
రామయ్యగారు మాంచి ఉత్సాహంగా పని చేశారు .తన టీం చేత అదే ఉత్సాహం తో పని చేయించారు .ప్రతి మనిషి ఇద్దరు మనుషుల పని చేసేవాడు .అయినా అలసట అనిపించేదికాదు .రోజు మొత్తం మీద నాలుగైదు గంటలు మాత్రమె నిద్రపోయేవారు .చీకటి తోనే లేచి మళ్ళీ పనుల్లో చేరేవారు .దీనికి కారణం సరైన సమయం లో సరైన ప్రదేశానికి వచ్చి పని చేస్తున్నామన్న ఆనందం .దేశానికి ఏం కావాలో తెలిసింది తాము ఏమి అంద జేయాలో అర్ధమైంది .అందుకే ఈ పనిలో అంత ఉత్సాహం .మనసు ,మెదడు కాళ్ళు , చేతులు అన్నీ ఒకే’’ రిదం ‘’తో పని చేస్తున్నాయి. కనుక పని స్పీడ్ అందుకొన్నది .ఆశించిన సమయం కంటే పనులు ముందే పూర్తయి పోతున్నాయి .’’’త్వరగా ఇంకా త్వరగా ‘’అనేదే అందరి నినాదం అయింది .అదే ప్రణవ మంత్రం గా ధ్వనించింది .ఆలస్యం అనే మాట నే మర్చిపోయారు అందరు .
రామయ్య గారి బృందం అంతా టీనేజి బృందం .ఉరకలు వేసే ఉత్సాహ వంతులే అందరూ .మయకోవ్ స్కి చెప్పినట్లు ‘’దేశమంతా యవ్వన దశలో ఉందని’’పించింది .లేబ్ లో పని చేసే యువకులు ఫ్రెష్ గా కాలేజి విద్య పూర్తీ చేసుకొని వచ్చి చేరిన వాళ్ళే .అన్నీ బాగానే ఉన్నాయి కాని రష్యా జీవితం చాలా కష్ట భరితం గా ఉంది. అనుభవజ్ఞులు,,స్పెషలిస్ట్ లు లేరు రామయ్య దగ్గర .ఆ లోపం ఉంది .ఆహార సమస్య ఒకటి బాధిస్తోంది .ఇంటి సమస్య దీనికి తోడైంది .అమెరికాలో అనుభవించిన సౌఖ్యాలు ఇక్కడ ప్రస్తుతం గగన కుసుమాలే .కాని రష్యన్ ప్రభుత్వం చేయగలిగినంత గరిస్ట సదుపాయాలూ కల్పించింది .రామయ్య గారికి ఒక ఫ్లాట్ ఇచ్చారు .దానికి కావలసిన ఫర్నిచర్ అంతటినీ సమకూర్చారు .కష్టాలలో ,ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్ధిక నియంత్రణ లో ఉన్న ఉన్న దేశం ఈ సౌకర్యాలు కలగ జేయటం ఒక రకం గా తలకు మించిన భారమే .అయినా కనీస గౌరవ మర్యాదలను ఇచ్చి తృప్తిని చేకూర్చిందని రామయ్య సంతృప్తి చెందారు .
దేశం రామయ్య బృందం ముందు చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనుల పెద్ద లిస్టు పెట్టింది .వీటిలో సమస్యలు ఉంటె పరిష్కరించాలి .సాంకేతిక నైపుణ్యం ప్రస్తుతం పూజ్యం .పరిశోధనకు అవసరమైన సామగ్రి ఇతర దేశాల నుండి తెప్పించుకోవాలి .కాని తమకు కావలసిన వాటిని తామే స్వయం గా తయారు చేసుకోవాలి .దీనినే రష్యన్లు ‘’మదర్ విట్ ‘’అంటారు .తక్కువ ఖర్చుతోఅక్కడే లభించే వాటితో మంచి ఫలితాలకోసం ఒక ప్రయోగ శాల ఏర్పాటు చేసుకోవాలి .అప్పుడు రామయ్య గారికి ‘’బంధాలనుండి విముక్తుడైన స్వేచ్చా జీవి అద్భుతాలు సృస్టించ గలడు ‘’అన్న సూక్తి జ్ఞాపకానికి వచ్చింది .
ఆ రోజులను గుర్తుకు చేసుకొంటూ రామయ్య ‘’అవి బహు అందమైన రోజులు .అందమైనవి ఎందుకయ్యాయి అంటే నూతనత్వం వలన ,బృహత్తర ఉద్యమం లో భాగస్వాములవటం వలన .అప్పుడు మేమూ యవ్వనం లో స్వచ్చంగా బల శక్తి సంపన్నంగా ఆశ తో ఉన్నాం ‘కనుక .’’అన్నారు .రష్యా వచ్చినా సారా రామయ్య గారి మనసులో నుండి తొలగి పోలేదు .ఆమె తనకు ఆత్మీయురాలు ,స్నేహితురాలు .అన్నీ అర్ధం చేసుకున్నా ,ఏదీ అర్ధం కానట్లు ప్రవర్తించే పిల్ల అనుకొన్నారు .పొన్నాంబలం ద్వారా తన విషయాలు ఆమెకూ, ఆమె విషయాలు తనకూ తెలుస్తున్నాయి .ఆమెకు రామయ్య గారి అడ్రస్ ఇచ్చాడు పొన్నాంబలం .కాని ఆమె నుండి రామయ్యగారికి ఒక్క ఉత్తరం కూడా రాలేదు .ఆమె రష్యావచ్చి తనను అమెరికా కు తీసుకెళ్ళే ఆలోచనలో ఉందేమో ననుకొన్నారు . ఏమైనా ఇద్దరి దారులూ వేరైపోయాయి .ఇక కలిసే పరిస్తితి లేనే లేదని పించింది .
రష్యాలో అందుకొన్న మొదటి ప్రోత్సాహక బహుమతి
కోపెన్ అనే సహచరుడు అప్పుడప్పుడు జర్మనీ వెళ్లి వస్తూండేవాడు .జర్మనీ లో ఫాసిస్ట్ జుంటా ఆగడాలు విడమర్చి చెప్పేవాడు .రీచ్ స్టాగ్ ను తగల బెట్టిన వార్త చెప్పాడు .అప్పుడప్పుడు కోపెన్ అవార్డు ఫంక్షన్ లకు వచ్చి కలుస్తూ వివరాలు చెప్పేవాడు .ఇద్దరూకలిసి లూబ్రికంట్స్ లో ‘’గరిష్ట టెన్షన్ఆఫ్ డిస్ప్లేస్ మెంట్’’ ను విజయవంతం గా కొలిచినందుకు (గణించి నందుకు )అవార్డ్ పొందారు .కోపెన్ కు బోనస్ ఇచ్చారు రామయ్య గారికి స్వదేశం లో తయారు చేసిన రేడియో ను బహూక రించారు .ఈ సందర్భం లో రామయ్యగారింట్లో మిత్ర బృందం చేరి, చిన్న పార్టీ చేసుకొన్నారు తమదేశం రేడియో లాంటి అవసర సాధనాలను స్వదేశం లోనే తయారు చేసుకొంతటున్నందుకు సంబర పడ్డారు .ఈ రేడియో సెట్లు బహుళ ప్రయోజనకరం గా పరమ నాణ్యంగా ఉన్నాయి .రామయ్య గారి రేడియో యుద్ధం వరకు బాగానే పని చేసింది .రేడియో లో హిట్లర్ ప్రసంగాలు విన్నారు అందరూ .అతను జాతి స్వచ్చత గురించి చెప్పాడు .ఆర్య జాతి గొప్పతనాన్ని చాటి చెప్పాడు అది తన జర్మని అంటున్నాడు మధ్య మధ్యలో .నెమ్మదినెమ్మదిగా గొంతు పెంచి మాట్లాడుతున్నాడు హిట్లర్ .కోపెన్ కు కోపం పిచ్చగా వచ్చి ‘’ఈ వెధవ మూలంగా నా జర్మన్లు వేలాది మంది సైన్యం లో చేరి బలై పోతున్నారు .వీళ్ళంతా కలిసి నా జర్మనీని బుగ్గి చేసేస్తారు ‘’అన్నాడు ఉద్రేకం గా .హిట్లర్ మాటల్లోని జాతి వివక్షతపై రామయ్య గారు ఆలోచించారు .హిట్లర్ విధానం సరైనది కాదనిపించింది .అతనివలన మానవ మారణ హోమం జరిగే ప్రమాదముందని ఊహించారు .తానూ కోపెన్ యిద్దరూ ఆర్యులు కారు .కనుక తమ కర్తవ్యమ్ ఫాసిస్ట్ జర్మనీ తో కాదు అభి వృద్ధి చెందుతున్న సోవియట్ యూనియన్ తోనే అని బలంగా అనుకొన్నారు .రామయ్య గారికి రష్యన్లు తనను చంపరనే నమ్మకం కలిగింది .నాజీలంటే అసహ్యమేసింది .దాన్ని దాచుకోలేదుకూడా .బహిరంగం గా చెప్పేవారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

