“కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-15

పల్లెటూరి పిల్లతో   రామయ్య రెండో పెళ్లి

ఆ రాముడికి ఒకే బాణం ఒకే భార్య .కాని విధి వక్రించి ఈ రామయ్య కు రెండో వివాహం జరిగింది .అదీ యాదృచ్చికం గా .మొదటి అమ్మాయి అమెరికా కు చెందిన సారా .ఆమె ఈయనతో రష్యాకు రానన్నది .అక్కడే ఉండి పోయింది .రామయ్యగారి అన్ని ప్రయత్నాలు విఫలమై ఆమెను వదిలి రష్యాకు ఒంటరిగా రావాల్సి వచ్చింది  .అప్పటి నుండి ఒంటరి జీవితమే గడిపారు .మళ్ళీ ఆయన జేవితం లోకి’’ కాత్యా’ అనే ఆమె ప్రవేశించి భార్య అయి సంతానం అంద జేసింది .రష్యా అంతర్యుద్ధం అనేక విధాలుగా ప్రజా జీవితాలను అస్త వ్యస్తం చేసింది .వేల కుటుంబాలకు నీడ లేకుండా పోయింది .ఆకలి తో జనం అల్లల్లాడారు .తీవ్రమైన జబ్బు పడ్డ మనిషి నెమ్మది నెమ్మదిగా కోలు కొన్నట్లుగా ఇప్పుడు రష్యా క్రమంగా కోలు కుంటోంది .రామయ్య గారు రష్యా చేరిన కొన్నేళ్ళకు విపరీతమైన కరువు కాటకాలోచ్చాయి .పంట బాగా తగ్గిపోయింది  ఓల్గా తీరాన ఉన్న ‘’పావోల్జీ ‘’ప్రాంతం మరీ దెబ్బ తిన్నది .వేలాది మంది తిండి లేక చనిపోయారు .మిగిలిన వారు వారి స్వగ్రామలను వదిలి ఉపాధి, తిండి దొరికే ప్రాంతాలకు వలస పోయారు .అలాంటికరువు  సమయం లో ఒక ‘’పల్లెటూరి పిల్ల’’సర్వస్వం కోల్పోయి అనాధ యై ,ఎన్నో కస్టాల కడలి దాటి నెమ్మదిగా మాస్కో నగరం చేరింది .కాయ  కష్టం చేసి పొట్ట పోసుకొంటూ నగర జీవితానికి క్రమంగా అలవాటు పడింది .ఇక్కడ రామయ్యగారు తాను  పూర్వం ఉయ్యూరు నుండి మద్రాస్ చేరిన సంగతి తో ఈ సంఘటనను పోల్చుకొన్నారు .తాను  ఆ రోజుల్లో జ్ఞాన దాహం ,విజ్ఞాన ఆకలి తీర్చుకోవటానికి మద్రాస్ చేరారు కాని ఈ విధివంచిత కడుపు ఆకలి తీర్చుకోవటం కోసం ,  బతకటం కోసం మాస్కో నగరం చేరింది .ఇద్దరి విధి ఒకే తీరుగా ఉందనిపించింది .ఆమెను మొదటి సారి కలిసి నపుడు ఆమె తనను సానుభూతితో అర్ధం చేసుకొంటుంది అనిపించింది .క్రమంగాఒకరికొకరు దగ్గరయ్యారు .సారాలాగా ఈమె తనతో ఎప్పుడూ పోట్లాడి ఎరుగదు .ఆమె తనకంటే సాంఘికం గా ,విద్యా పరంగా చాలా తక్కువ స్తితిలో ఉన్నప్పటికీ ఆమె తనకు తగిన భార్య గా భావించి,పరస్పర అంగీకారం తో  పెళ్లి చేసుకొన్నారు .ఇద్దరికీ మూలాల లో భేదం ఉన్నా ,’’రష్యన్ పిలుపు ‘’ఇద్దర్నీ దగ్గరకు చేర్చింది అంటారు రామయ్య .సలహా ,ప్రేమ తమను పరస్పరం కలిపాయి అన్నారు .ఆమె తనకు భార్య అయినందుకు రామయ్యగారు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు అదీ రామయ్య గారి సంస్కారం. తానేదో జీన జనోద్దరణ  చేశానని డబ్బా కొట్టుకోలేదు ..ఆమె వలననే తనకు నెమ్మది నెమ్మదిగా రష్యా భాష మాట్లాడటం ఆలోచనలు , దేశం పరిస్తితుల్ని ఆకళింపు చేసుకోవటం జరిగింది అంటారు. తానూ ఎప్పుడైనా  తప్పని సరి అయితే తెలుగు కాని సంస్కృతం కాని మాటలు నేర్పే వారామెకు .కనుక తాను  రష్యా వచ్చిన కొన్నేళ్ళ వరకు భార్య కాత్యా పైననే ఆధార పడి ఉన్నానని నిస్సంకోచం గా తెలియ జేశారు .అన్ని రకాల అర్హతలున్న జీవిత భాగ స్వామిని లభించిందని సంతోషించారు .నిజం గా కాత్యా తనకు అర్ధాంగి  .తాను  రామయ్య అయితే ఆమె సీతమ్మ తల్లి .

నిజమైన ‘’సీతా’’ రామయ్య ‘’

ఆ రోజుల్లో తమ ఇల్లు ‘’హౌస్ ఆఫ్ సెవెన్ విండ్స్ ‘’లాగా ఉండేదట .ఎందరో ఇంటికి వచ్చి వెడుతూ ఉండేవారు అందులో సైంటిస్టులు ,ఇండియా నుంచి వచ్చే స్నేహితులు , తనతో పాటు పని చేసేవారు సహా విద్యార్ధులు కొమిటేర్న్ వారు ,ఇతర రిపబ్లిక్ దేశాలలో ఉన్న మిత్రులు వచ్చి ఆతిధ్యం అందుకొని వెళ్ళేవారు అందరికీ భార్య కాత్యా ఏంతో ఆదరం గా ఆత్మీయంగా వండి వడ్డించి అతిదిమర్యాదాలు చేసేది .ఆమె అందరి పాలిటి  అన్నపూర్ణ అయింది .’’వండ నలయదు వేవురు వచ్చిరేని ,నడికి రే యైన –అన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి ‘’అన్న పెద్దన గారి ప్రవరాఖ్యుని భార్యలాగా కాత్యా ప్రవర్తించి అందరిని ఆదరించింది . అందరితో చక్కగా మాట్లాడే గొప్ప సావకాశం కల్పించింది .ఆమెలో ఏంతో శక్తి నిండి నిబిడీకృతం గా ఉండేది . యెంత  శ్రమ పడుతున్నా ఆమె ముఖం లో చిరునవ్వు చేరిగేదికాడు. అలసట కనిపించేదికాదు . రామయ్య గారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు .ఆమె పవిత్రమైన నవ్వుకు అందరూ జేజేలు పలికేవారు .అదృష్ట వంతులు రామయ్య. సరైన సమయం లో సరైన అర్ధాని లభించి ఆయనకు పూర్తిగా బాసట గా నిలిచింది .ఇప్పుడు నిజంగా ‘’సీతా ‘’రామయ్య ‘’అయ్యారు .

రామయ్య గారి  రెండవ ప్రపంచ యుద్ధ జ్ఞాపకాలు

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన రోజు ను గుర్తుకు తెచ్చు కొంటూ రామయ్యగారు ‘’ఆ రోజు మా కుటుంబం అంతా  ‘’ఆల్ యూనియన్ అగ్రికల్చరల్ ఎక్సి బిషన్ ‘’ను చూస్తున్నాం .చాలా ప్రశాంతమైన రోజు అది .మా అమ్మాయి  లీలావతి  పూల తోటల మధ్య హాయిగా పరి రిగెత్తుతూ ఆడుకొంటోంది .ఆ ఆనందం శాశ్వతం అనుకొన్నాను .ఇలా ఆనందంగా చాలా ఏళ్ళుగా ఉన్నాం కూడా .అప్పుడే లౌడ్ స్పీకర్ల నుండి యేవో సూచనలు హెచ్చరికలు వినిపించాయి . మేము ఎమైనామో  నని మా దగ్గరికిపిల్ల కంగారుగా  పరిగెత్తుకొచ్చింది .’’ఇప్పడు ఏమౌతుంది ?’’ అని నా భార్య కాత్యా అడిగింది . మిగిలిన వారికి ఏమి అవుతుందో మనకీ అదే అవుతుంది కాత్యా ! అన్నారు రామయ్య .అక్కడున్న మిగిలిన అందరిభార్యలు భర్తలను అదే ప్రశ్న వేస్తున్నారు .కాత్యాకు అర్ధమై పోయింది విషయం .నా దగ్గర ఏడవ కుండా గుడ్ల నీరు కుక్కుకోన్నది .నేను ‘’వాన్ కొమాట్ ‘’వెళ్లి పోయాను వాళ్ళను అక్కడ వదిలేసి .ఇప్పుడు నా కర్తవ్యమ్ మా  ఇంటినే కాదు నా భార్యా కూతుర్ని మాత్రమె కాదు నా దేశాన్ని రక్షించాలి .అదే ఇప్పుడు గౌరవం స్వేచ్చ .నాభారత దేశం పై నా ,ప్రపంచం పై నా ఆశ ‘’అని అంటారు .

ఎప్పుడో వస్తుందనుకొన్న యుద్ధం  అనుకోకుండా ఒక్కసారి  వచ్చి మీద పడింది .ప్రతిసారీ ఆయన ఆలోచనలు మూలాలలోకి వెడతాయి .హిట్లర్ దళాలు తన దేశం పై ఎందుకు దాడి చేస్తున్నట్లు ?అదీ రాత్రి పూట మరీ ?ప్రజలందరూ హాయిగా నిద్రలోకి జారుకున్న సమయం లో ఈ భయంకర యుద్ధ ప్రళయం ఏమిటి ?ఈ సమయమే వాళ్లకు చాలా అనుకూల సమయం అని ఎంచుకోన్నారా?ఈ అర్ధ రాత్రి వేళ జనమే కాదు సైన్యమూ ప్రమత్తతతో నిద్రపోతూ ఉంటుంది .కొద్దిమంది జర్మన్లకోసం ఇంత మందిని హిట్లర్ నరమేధం చేయాలా ?హిట్లర్  తన ప్రజల మీద ఆ మధ్య అంత ప్రేమ ఒలక బోస్తూ మాట్లాడాడు .ఇంతలో ఇంత మార్పా ?హిట్లర్ భయపడ్డాడా ?యూరప్ ను జయించినంత సులభం కాదు రష్యాతో పోరాటం .హిట్లర్ కు సోవియట్ రష్యా అంటే భయం ,ఒణుకు కూడా .అక్కడ తన పప్పులు ఉడకవు.ఇప్పుడిప్పుడే కోలుకొని ఎదుగుతున్న రష్యా పై ఇంత కసీ ,కక్షానా ?ఈ యుద్ధం లో హిట్లర్ విజయమన్నా సాధించాలిలేక పోతే చచ్చి అయినా పోవాలి. రెండే అతని ముందున్న మార్గాలు .రష్యాతో యుద్ధం మొదలు పెట్టిన రోజు నుండి ప్రతి రోజు సైన్యం వెంటే ఉండి నడిపిస్తున్నాడు .రష్యా సర్వస్వాన్ని ఒడ్డి ఎదిరిస్తోంది నిలవరిస్తోంది హిట్లర్ పురోగమనాన్ని .

అకడేమీషియన్ అయిన వేర్నాన్దిస్కి మాటల ప్రకారం జెర్మని ఫాసిసిజం చారిత్రాత్మకం గా పతనమైనట్లే .మానవ ప్రాధమిక పరిణామానికి వ్యతిరేకం గా హిట్లర్ ప్రవర్తిస్తున్నాడు .అందుకే వాళ్ళు తప్పక ఓడిపోవాలి .రామయ్యగారికీ అదే నిజమని పించింది .అయితే విజయ సాధనకు ఎంత మూల్యం చేల్లి౦చాలొ ?ఫాసిస్ట్ లకు ,రక్షణ లేని ఇండియా రష్యాను సమర్ధించటం మధ్య ఒక అడ్డంకిఉన్నట్లు అని పించింది .ఇలా చేస్తే తన బంగారు తల్లి భారత దేశాన్ని పతనం నుండి చావు నుండి కాపాడిన వాడినవుతాను అని భావించారు రామయ్య .

సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్

ట్రాక్టర్ కు యుద్ధ టాంక్ కు చాలా భేదం ఉంది .వాటికి పని చేసే మోటార్ ల పని భిన్నంగా ఉంటుంది .ఆ రోజుల్లో అన్ని వాతావరణ పరిస్తితులలో యా మోటారర్ల లోని ఇంధనం అనుకూలం గా పని చేసేట్లు చేయటమే లక్ష్యం గా ఉండేది . భారీ యంత్రాలు చాలా సమర్ధంగా ఎక్కువ కాలం మన్నాలి .ఎక్కువ వేగంగా పని చేయాలి .టాంక్ అంటే ఆయుధాలున్న ట్రాక్టర్ కాదు అనిపించింది రామయ్యగారికి .చాలా చిక్కు సమస్యలు ఇందులో ఉన్నాయి వీటిని అత్యవసరంగా పరిష్కరించాలి ముందు .అందుకే కొత్త తరహా కిరోసిన్ ను కనిపెట్టి వాడారు అది బ్రహ్మాండమైన, అపూర్వమైన విజయాలనిచ్చింది .దీనితో రష్యా టాంకులు శత్రు జర్మనీ టాంకుల కంటే సర్వ సమర్ధంగా పని చేసి సామర్ధ్యాన్ని నిరూపించాయి .ఈ విజయం రామయ్య గారి టీం సాధించిన ఘన విజయమే .సర్వ శ్రేష్టమైన రష్యన్ టాంక్ ఆవిర్భావం రామయ్య గారి బృందం వలన ఏర్పడి అద్భుత యుద్ధ విజయాలను చేకూర్చి పెట్టాయి..

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-5-15 –ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.