బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’

బుద్ధుని తత్వం ‘ప్రతీత్య సముత్పాద’

భారతీయత హైందవ మతంలో వుంది అని మన పాఠ్య పుస్తకాలు పదే పదే వల్లె వేస్తూ, హిందువులు కాని వారందరినీ ఈ దేశంలో పరాయి వారుగానూ, నేరస్థులుగానూ వెలివేసి, ఈ దేశపు వాస్తవికతను మరుగుపరిచాయి. క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోనే వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, బహుజన హితాన్ని బహుజనుల సుఖాన్ని ఆకాంక్షిస్తూ, సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించిన గౌతమ బుద్ధుని తాత్వికతను అధ్యయనం చేసిన వారికి ఈ దేశం బౌద్ధ దేశమని, భారతీయత అంటూ వుంటే అది బౌద్ధంలోనే వుంది అని అర్థమవుతుంది.

వేదాలు అపౌరుషేయాలు, అవి నేరుగా సృష్టికర్త అని భావించబడుతున్న బ్రహ్మ నుంచి భూమ్మీద కొచ్చిన పవిత్ర గ్రంథాలు, అందులో వున్నదే ప్రామాణికం అని బ్రాహ్మణ మతస్థులు ప్రజల్ని నమ్మబలుకుతూ వారి అజ్ఞానాన్ని సొమ్ము చేసుకుంటున్న కాలంలో వేదాల్నే కాకుండా అప్పటికి స్థిరపడిన ఆధిపత్య భావజాలాన్ని కూడా నిలదీసి ప్రశ్నించిన తొలి సామాజిక విప్లవకారుడు బుద్ధుడు.
ప్రపంచాన్ని పట్టి పీడించే దుఃఖానికి బుద్ధుడు ‘అష్టాంగ మార్గం’లో పరిష్కారాన్ని చూపించాడు. బుద్ధుని బోధనలలో ‘అనాత్మ’ వాదం, ‘అనిత్వత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటివి బుద్ధుడిని ఇతర తత్వవేత్తల కంటే, ప్రవక్తల కంటే భిన్నం గా నిలబెట్టాయనవచ్చు. ‘అనాత్మ’ వాదం పూర్తిగా భౌతిక వాదంగా భావించవచ్చు. మతాలన్ని ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం వంటి భావనల చుట్టూ పరిభ్రమిస్తుంటే బుద్ధుడు ఆత్మ లేదనడం ఆనాటికే కాదు, ఈనాటికీ సాహసోపేతమైన చర్య. అలాగే ‘అనిత్వత’ అనేది- మార్పును, చలనశీలతను గురించి వివరిస్తూ బౌద్ధంలోని శాస్ర్తీయతకు అద్దం పడుతుంది. బుద్ధుని తాత్విక చింతనలో ‘ప్రతీత్య సముత్పాద’ అనేది వివిధ అంశాల మధ్య వుండే కార్యకారణ సంబంధాన్ని వివరిస్తుంది. ఇది బౌద్ధంలోని హేతువాద దృష్టికి నిదర్శనం. బుద్ధుని బోధనలలోని ‘మధ్యేమార్గం’ అన్ని అంశాలకు, అన్ని కాలాలకు సరిపోయే విధంగా ఎంతో ప్రాసంగికతను కలిగి వుంది. నైతికత, శాస్ర్తీయ దృష్టి, సమత, మైత్రి, కరుణ, ప్రజ్ఞ, శీలం అనే బౌద్ధ ధర్మంలోని భావనలు బౌద్ధాన్ని మతం అనే స్థాయి నుంచి గొప్ప తత్వశాస్త్ర స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు.
‘సంఘం’ అనే భావనకు మొట్టమొదటి సారిగా బుద్ధుడు రూపకల్పన చేసినట్లు చరిత్ర చెబుతుంది. బౌద్ధ సంఘం తదనంతరం అనేక సంఘాల నిర్మాణానికి మార్గం చూపిందనవచ్చు. ‘బుద్ధుడు’ ‘ధమ్మం’ తర్వాత త్రిశరణాలలో చివరిది ‘సంఘం’. బుద్ధుడు తన భావజాల వ్యాప్తి కోసం సంఘాన్ని నిర్మించి అందులో అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు. మంగలి కులస్థుడైన ఉపాలి, వేశ్యాపుత్రుడైన జీవకుడు, వేశ్యయైున ఆమ్రపాలి, దొంగ అయిన అంగుళీమాలుడు బౌద్ధ సంఘంలో సభ్యత్వాన్ని పొందారు. ఇది ప్రజాస్వామికమైన నిర్మాణం.
స్ర్తీని భోగవస్తువుగా పురుషునికి వారసులను కనియిచ్చే యంత్రంగా పరిగణించే ఆనాటి సమాజంలో బుద్ధుడు స్ర్తీల విషయంలో విశాల దృష్టితో వ్యవహరించినట్లు తెలుస్తుంది. బుద్ధుని సంఘంలో రాకుమార్తెలు, బానిస స్ర్తీలు, వేశ్యా వృత్తిలో వున్నవారు, బిడ్డల చేత, భర్తల చేత నిర్లక్ష్యం చెయ్యబడిన అనాథలు సమానంగా చూడబడ్డారు. స్ర్తీలకు సన్యాసం పుచ్చుకునే స్వేచ్ఛ, కర్మ జ్ఞానాధికారాలు లేని రోజుల్లో స్ర్తీల పట్ల బుద్ధుడు వ్యవహరించిన తీరు విప్లవాత్మకమైనదనే చెప్పాలి.
వైదిక మతంలో కర్మకాండలు, యజ్ఞ యాగాలు, క్రతువుల పేరున జంతువులను వధించడాన్ని, మూఢాచారాలను బుద్ధుడు ఖండించాడు. హేతువుకు అధిక ప్రాధాన్యత నిచ్చాడు. హేతువుకు లొంగనిది ఏదీ బౌద్ధంలో లేదని బౌద్ధ పండితుడైన ప్రొఫెసర్‌ లక్ష్మీ నరుసు అభిప్రాయం. బుద్ధుని ఆలోచనా విధానం, కార్యాచరణలలో బ్రాహ్మణ వాదానికి ప్రత్యామ్నాయ దృక్పథం కనిపిస్తుంది. ఆనాటికి పండితుల భాషగా స్థిరపడిన సంస్కృతాన్ని కాదని ప్రజల భాషయైున పాళీ భాషను ప్రచార మాధ్యమంగా ఎన్నుకోవడంలో బుద్ధుడు ఒక సాంస్కృతిక విప్లవానికి నాంది పలికినట్లు తెలుస్తుంది.
అయితే బౌద్ధాన్ని సమాజంలోని వివిధ వర్గాలు ఎలా అర్థం చేసుకున్నాయి? అనేది ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఎక్కువ మంది బుద్ధుడు ఒక రాకుమారుడుగా పుట్టి, సుకుమారంగా పెరిగి, కొన్ని బాధాకరమైన దృశ్యాలను చూసి, జీవితం మీద విరక్తి కలిగి సన్యాసం పుచ్చుకున్నాడని అంటారు. గాంధే య వాదులు బుద్ధుడు జీవహింస చెయ్యకూడదని చెప్పాడు కాబట్టి ఆయన్ని ఓ అహింసామూర్తిగా అభిమానిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వివేకానంద వంటి వారు బౌద్ధాన్ని హిందూ మతంలో భాగంగా గుర్తిస్తారు. పండిత అమోతీ దాస్‌, ప్రొఫెసర్‌ పోకల లక్ష్మీనరుసు, అంబేద్కర్‌ వంటి వారు బుద్ధుడిని బ్రాహ్మణీయ వైదిక సంస్కృతిపై తిరుగుబాటు చేసిన సామాజిక విప్లవ కారుడిగా అర్థం చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ బుద్ధుడిని కేవలం అహింసావాదిగా చూసేవారు బుద్ధుడి యొక్క అహింసా వాదంలోని సామాజిక కోణాన్ని పరిగణించినట్లు కనిపించదు. ఎందుకంటే బుద్ధుడు భౌతిక హింస కంటే మానసిక హింసను ఎక్కువగా ఖండిస్తాడు. ఆహారపు అలవాట్ల దృష్ట్యా చూసినా కూడా బుద్ధుడు మాంసాహారి అని తెలుస్తుంది.
బౌద్ధాన్ని, బుద్ధుడిని హిందూ మతంలో భాగంగా పరిగణించే వారి వాదన బౌద్ధ ధర్మానికే విరుద్ధం. ‘బుద్ధుడు తాను ఒక మతాన్ని స్థాపిస్తున్నానని చెప్పుకోలేదు. ఆయన వైదిక మతంలో పుట్టి, పెరిగి వైదిక మతంలోనే మరణించాడు.’ అని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించడం యాదృచ్ఛికం కాదు. మొదటి నుంచీ తనని వ్యతిరేకించిన వారిని తనలోనే జీర్ణం చేసుకుని అక్టోప్‌సలా విస్తరించిన హిందూ సామ్రాజ్యవాద ధోరణిగా దీనిని అర్థం చేసుకోవచ్చు. బుద్ధుని ఆలోచనా విధానంలోని కీలకాంశమైన బ్రాహ్మణ వ్యతిరేకతను ఉద్దేశ్యపూర్వకంగానే తమకు అనుకూలంగా కప్పిపుచ్చడమే! వైదిక మతంలోని డొల్లతనాన్ని, హేతు రాహిత్యాన్ని ఎండగట్టి బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసించిన బుద్ధుడు వైదిక హిందూమతంలో భాగం ఎలా అవుతాడు?
బౌద్ధాన్ని వైదిక మతంపై తిరుగుబాటుగా భావించేవారు బుద్ధుడిని సామాజిక విప్లవకారుడుగా పరిగణిస్తారు. గెయిల్‌ ఆంవెత్‌ అనే సామాజిక శాస్త్రవేత్త బౌద్ధాన్ని ఏ్ఛ్ట్ఛటౌఛీ్ఠౌ ఖ్ఛజూజీజజీౌుఽ అని పిలిచారు. సమానత్వం ప్రాతిపదికగా వున్న బౌద్ధాన్ని అమోతీదాస్‌ పీడితుల విముక్తి సిద్ధాంతంగా ప్రచారం చేశాడు. ప్రొఫెసర్‌ లక్ష్మీ నరుసు సత్యాన్వేషణకు, హేతువాద దృష్టికి బౌద్ధం పెద్దపీట వేసిందని వివరించాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను తాను ఫ్రెంచి విప్లవం నుంచి కాక బౌద్ధం నుంచి స్వీకరించానని అంబేద్కర్‌ ప్రకటించాడు. బుద్ధుడు పుట్టుక ఆధారంగా వచ్చే ఆధిక్యతను కాదని ప్రయత్నంతోనూ, ప్రజ్ఞతోనూ సాధించే ఆధిక్యతకు ప్రాధాన్యతనివ్వడం అంబేద్కర్‌కు బౌద్ధం పట్ల ఆసక్తిని కలిగించింది. అంబేద్కర్‌ బౌద్ధ ధర్మ స్వీకరణ భారతదేశపు బౌద్ధమత చరిత్రలో ఓ కీలక అధ్యాయం.
బుద్ధుని అనంతరం హిందుత్వ వాదులు ఆయన అస్తిత్వాన్ని నాశనం చేసే ఉద్దేశంతో ఆయన్ని విష్ణుమూర్తి అవతారాలలో ఒక అవతారంగా చేశారు. బౌద్ధ ఆరామాలను పడగొట్టి హిందూ దేవాలయాలుగా మలిచారు. ఆంధ్ర దేశంలోని శైవ మతానికి చెందిన పంచారామాలన్నీ ఒకప్పుడు బౌద్ధ క్షేత్రాలే! హిందూ రాజులు బౌద్ధ సన్యాసులను చంపి మిగిలిన వారిని దేశం నుంచి తరిమివేయగా మరోపక్క ఆది శంకరాచార్యుల వంటివారు బౌద్ధంపైన నైతిక దాడికి పాల్పడ్డారు. బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టి భారతదేశం తన ఆత్మను కోల్పోయింది అని గురజాడ వాపోయాడు.
బ్రాహ్మణవాదులు కోరుకున్నట్టు బౌద్ధ ధర్మం నశించలేదు. అది భారతదేశంలో ధ్వంసం చెయ్యబడినప్పటికీ ప్రపంచమంతా వ్యాపించింది. ఈరోజు ప్రపంచం బౌద్ధం వైపు చాలా ఆసక్తిగా చూస్తోంది. ఇటీవలి దశకాలలో దేశవ్యాప్తంగా ముందుకొచ్చిన అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా సామాజిక ఉద్యమకారులు, మేధావులు, పరిశోధకులు ప్రాచీన భారతదేశంలో హేతువాద దృష్టి, సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి వంటి భావనలను గురించి ప్రస్తావించిన బౌద్ధం వైపు తిరిగి ఆలోచించడం జరుగుతోంది. ఈ దేశ సంస్కృతిని చరిత్రకారులు ఎలా విశ్లేషించినప్పటికీ గెయిల్‌ ఆంవెత్‌ వంటి వారు భారతదేశపు నాగరికత, సంస్కృతులలో అంతర్లీనంగా ఇమిడి వున్న బౌద్ధ ధర్మాన్ని దృష్టిలో వుంచుకుని ప్రాచీన భారతదేశ నాగరికతను ‘బౌద్ధ నాగరికత’గా అభివర్ణించడం సముచితంగా వుంది.
ఇటీవల ముందుకొచ్చిన నినాదం ‘ఘర్‌ వాపసీ’ అంటే హైందవేతర మత సంస్కృతులలో వున్నవారు తిరిగి హిందూ మతంలోకి రావడం అని హిందూత్వవాదం చెబుతున్నప్పటికీ, ఈ దేశపు మత వారసత్వం బౌద్ధంలో వుందని ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాలు, ఇతర చారిత్రక ఆధారాల వలన రుజువయ్యింది. దీనికితోడు అశోక ధర్మచక్రం, సారనాథ్‌ స్థంభం వంటి జాతీయ చిహ్నాలతో పాటు పంచశీల వంటి బౌద్ధధర్మ సూత్రాలను అంబేద్కర్‌ రాజ్యాంగంలో అణువణువునా పొందుపరిచి ఈ దేశం బౌద్ధ దేశమని చాటి చెప్పాడు. అలాగే ఒక చర్మకారుడైన విధికుడు అమరావతి బౌద్ధక్షేత్రానికి కానుకగా ఇచ్చి న పూర్ణ ఘటం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చిహ్నంగా గుర్తింపు పొందింది. చారిత్రక వాస్తవాల దృష్ట్యా ఈ దేశం బౌద్ధ దేశమైనప్పటికీ తర్వాత ప్రజలు ఇతర మతాలలోకి వెళ్ళి తిరిగి తమ అస్తిత్వ పునాదుల వైపు దృష్టి సారించారనవచ్చు. ఎవరి ఇంటికి వారు తిరిగి రావడం అనే దానికి జనంలో బౌద్ధం వైపు పెరుగుతున్న ఆసక్తే తార్కాణం.
చల్లపల్లి స్వరూపరాణి
(నేడు బుద్ధ పూర్ణిమ)
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.