ఆలవాలం

 


 
 

 
 

గబ్బిట దుర్గా ప్రసాద్

https://sarasabharati.wordpress.com
http://

బౌద్ధ ప్రపంచం

ఆలోచించే ప్రతి వ్యక్తీ ఏదో ఒక ఇజంను ఎన్నుకుంటాడు. ఇజం అంటే జీవితంపై ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక ఫిలాసఫీ ఆఫ్‌ లైఫ్‌ అనొచ్చు. తాను ఎన్నుకునే ఇజంలోని ఆలోచనా విధానం తనకు నచ్చాలి. అంతకన్నా ముఖ్యంగా అది తనకు ఎంత ప్రాధాన్యమిస్తూ ఉందన్నది ఆలోచిస్తాడు. సిద్ధాంతం ఎలా ఉన్నా తనకు సముచిత స్థానం, గౌరవం ఇస్తే దాన్ని స్వీకరిస్తాడు. లేదంటే వదిలేస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అనేక మేధావులను ఆక ర్షిస్తున్నది గౌతమబుద్ధుని భావజాలం.

దీనికి కొన్ని కారణాలున్నాయి. సైన్స్‌, శాస్త్రీయ ఆలోచనలు అప్పటివరకు ఉన్న మత విశ్వాసాలను పూర్తిగా సడలించాయి. ఆకాశంలో స్వర్గమనే చోట దేవుడున్నాడు, అతడు మనలను శాసిస్తున్నాడు అంటూ మతం చెప్పే కథల్ని అనేకులు ఒప్పుకోవడం లేదు. మతంతో పాటు ముడిపడి ఉన్న నైతిక విలువలు కూడా బలహీనపడ్డాయి. నాస్తికత పెరిగింది. అయినా ఆస్తికుల్లో ఎందరు మంచివాళ్లు ఉంటారు. శాసీ్త్రయ దృక్పథానికీ, మతవిశ్వాసానికీ సంఘర్షణ వచ్చే సందర్భంలో నాస్తికులు మతవిశ్వాసంతో సంబంధం లేని ఆధ్యాత్మికత కోసం అన్వేషిస్తారు. మానవ స్వభావంలో ఉన్న సాత్త్వికగుణం కారణంగా మంచి మార్గాన్నే ఎంచుకోవాలని ప్రయత్నిస్తారు. మతవిశ్వాసంతో సంబంధంలేని ఆధ్యాత్మికత, శాస్త్రీయ చింతన ఏదైనా ఉంటే.. దాన్ని అంగీకరిస్తారు. అందువల్ల దేవునితో సంబంధం లేని ఆధ్యాత్మికత కావాలనుకునే ఆధునికులు అన్నివిధాలా ఆకర్షించే సిద్ధాంతం బుద్ధుని భావజాలం.
ధ్యానం శరణం గచ్ఛామి..
మరోకారణం.. బౌద్ధ బిక్షువులు, ముఖ్యంగా టిబెట్‌కు చెందిన వాళ్లు ధ్యానం, సమాధి మొదలైన వాటిపై శ్రద్ధతో సాధనలు చేశారు. ఈ సాధనలు మనస్తత్త్వ శాస్త్రాల్ని ఆకర్షించాయి. శాస్త్రవేత్తలు బౌద్ధబిక్షువులు కలిసి మనసు, దాని నియంత్రణ మొదలైన వాటిపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ధోరణిలో ఇటీవల Sam Harris అనే ప్రముఖ అమెరికన్‌ నాస్తిక రచయిత రాసిన ‘Waking Up & A Guide to Spirituality Without Religion’ చూడవచ్చు. చాలా ఏళ్లుగా తన సొంత మతాన్ని విమర్శిస్తూ నాస్తికవాదాన్ని ప్రచారం చేసిన ఈయన భారతీయ సిద్ధాంతాలను పరిశీలించాడు. వాటిలో ముఖ్యంగా బౌద్ధానికి చెందిన విపశ్యనాయోగంలోని ధ్యాన పద్ధతులను సాధన చేశాడు. ధ్యానం ద్వారా తను పొందిన అనుభవాలను పై పుస్తకంలో వివరించాడు. ధ్యానపద్ధతులు అధునిక మనస్తత్త్వశాస్త్రంలో Mindfulness meditation పేరిట చాలా ప్రాచుర్యం పొందాయి. మతవిశ్వాసంతో అవసరం లేకుండా ఎలాంటి వాడైనా ఈ ధ్యానం చేసి లాభం పొందవచ్చు. ఒక వ్యక్తి తన కోపిష్టి స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ధ్యానం చేయవచ్చు. మరొకరు జీవితంలో మరొక సమస్య గురించి చేయవచ్చు. ఒక మీటింగుకు వెళ్లే మేనేజర్‌ తను మాట్లాడబోయే విషయాన్ని గురించి.. ఇలా ఏ విషయంలోనైనా ఈ ప్రక్రియ వాడవచ్చు. ఈ విషయాలతో పాటు బౌద్ధమతంలోనూ, అద్వైత వేదాంతంలోనూ చెప్పే జ్ఞానపద్ధతులను (Epistemology) కూడా రచయిత ఆ గ్రంథంలో వివరించాడు. నేను ఎవరు (who am I ?) అన్న విషయంపై రెండు మతాల్లోనూ దాదాపు ఒకే విధమైన విశ్లేషణ ఉంటుంది. ఈ రెండింటినీ హారిస్‌ తన రచనలో వివరించాడు. దీనివల్ల పాశ్చాత్యదేశాల్లోని యువత ఎలాంటి ఆలోచనా ధోరణిలో ఉన్నారన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి ఒక సర్వే ప్రకారం అమెరికా యువకుల్లో 25 శాతానికిపైగా మంది తమ విధానం Spiritual but not rel-igious (SBNR) అని చెప్పుకోవడం విశేషం
ధర్మం శరణం రక్షామి..

పై చర్చంతా బుద్ధుడు నాస్తికుడు అని భావించి చెప్పినది. కానీ నిజంగా బుద్ధుడు దేవుడు ఉన్నాడని కానీ, లేడని కానీ చెప్పలేదు. బుద్ధుడు సమాజంలో అందరికీ ప్రాధాన్యం ఇచ్చిన కారణంగా ఆ మతం ప్రజలకు చేరువైంది. దాదాపు పది శతాబ్దాలపాటు హిందూ మతంతో సమానంగా వ్యాపించింది. అలాంటిది ఎందుకు బలహీనపడిందన్న విషయంపై అంబేద్కర్‌ మొదలైన ప్రముఖులు చారిత్రక కారణాలను చెప్పారు. అంబేద్కర్‌ బౌద్ధమతం స్వీకరించడం మన సాంఘిక చరిత్రలో గొప్ప సంఘటన. అన్ని మతాల స్వరూపాన్ని గమనించిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటిష్‌ వారి విధానాల వల్ల వర్గాలుగా చీలిపోతున్న ప్రజలను భారతీయ సంస్కృతిలోనే ఉండేటట్టు చేసి దేశంలో అంతర్గత కలహాలు నివారించి శాంతికి తోడ్పడ్డాడని చెప్పవచ్చు. ‘బౌద్ధం దేశ అఖండతను కాపాడే తత్వం’ అని, దేశ సమగ్రత కోరేవాళ్లు.. బుద్ధుని, అంబేద్కర్‌ మార్గాన్ని పాటించాలని ఇటీవల కత్తి పద్మారావుగారు చెప్పడ ం చాలా ప్రశంసనీయం.

ఇదం బ్రాహ్మం..

ప్రస్తుతం బుద్ధుడి గురించి చెప్పేవారు బౌద్ధ సిద్ధాంతంలోని గొప్పదనాన్ని, ఉపనిషత్తులకూ ఆ సిద్ధాంతానికీ ఉన్న అనేక పోలికలు మొదలైన వాటిని విశ్లేషించడం లేదు. సామాజిక సిద్ధాంతం విశ్లేషణ మాత్రమే జరుగుతోంది. ముఖ్యంగా బుద్ధుడిని వైదిక ధర్మ వ్యతిరేకిగా చిత్రీకరించడం, అతడు బ్రాహ్మణులను నిందించాడని చెప్పడం వింటుంటాం. కానీ చాలా మంది పాశ్చాత్యులు కూడా ఈ వాదంతో ఏకీభవించారు. ఉదాహరణకు J.E. Jennings అనే రచయిత ఇలా అంటాడు ‘”It should never be forgotten that Buddhism is a reformed Brahmanism, as is evidenced by the invariably honorific use which Gautama makes of the title Brahmin’ (The Vedantic Buddhism of Buddha). అలాగే Rhys Davids దంపతులు బౌద్ధంపై రాసిన పుస్తకాల్లో ఇదే భావాలను చెప్పారు. ’బౌద్ధమతం సాంప్రదాయక విశ్వాసాల నుండే పుట్టింది. వాటితో పరిపుష్టమైంది’ (Rhys Davids – Buddhism p.85). బుద్ధుడు స్వయంగా చెప్పిన బోధనలు అని భావించే దమ్మపదంలో బ్రాహ్మణవర్గ అని ఒక అధ్యాయం ఉంది. బుద్ధుడు ఎంత గౌరవభావంతో ఈ పదాన్ని ప్రయోగించాడో చూడగలం. ఎవడు నిజమైన బ్రాహ్మణుడు అనే విషయంపై వేదవ్యాసుడు భారతంలో గాని, భాగవతంలో గాని వాడిన ఘాటైన మాటలతో పోలిస్తే.. బుద్ధుడు చె ప్పిన మాటలు ఎంతో గౌరవప్రదంగా ఉన్నాయి.

ఇదం బౌద్ధం..

బుద్ధుడు తన జీవితకాలంలో ఏం చెప్పాడ న్నది యధాతథంగా తెలియదు. అతని నిర్యాణం జరిగిన వందేళ్ల తర్వాత అతని శిష్యపరంపరలోని వారు బుద్ధుని బోధనలు సంగ్రహించి మూడు విభాగాలుగా చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. వీటిని త్రిపిటకములు అన్నారు. పిటకము అంటే బుట్ట. ఆ కాలంలో తాటాకుల పుస్తకాలను బుట్టలో భద్రపరిచే వారు. ఈ మూడు పిటకాల పేర్లు వినయ పిటకము, సుత్త పిటకము, అభిదమ్మ పిటకము. వీటిలో అభిదమ్మ పిటకంలో తత్త్వానికి సంబంధించిన చర్చ ఉంటుంది. తర్వాతి కాలంలో నాగార్జునుడు మొదలైన వారు దీన్ని విస్తరించారు. వీటిలో చాలా విషయాలు ఉపనిషత్తులకూ. అద్వైత వేదాంతానికీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టారా అన్నట్లుంటుంది. వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం ఇద్దరూ ఒప్పుకుంటారు. ఇద్దరూ ప్రపంచం మిథ్య అంటారు. ప్రతీత్య సముత్పాదం (doctrine of dependent origination) ఉపనిషత్తుల్లో మధుబ్రాహ్మణంను పోలి ఉంటుంది. చైతన్యం గురించి బౌద్ధవిద్వాంసులు, శంకరాచార్యులు ఒకే రీతిలో చెబుతారు. అందుకే బుద్ధుని తర్వాత వాడైన శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నారు. వేదాంతం ముసుగు కప్పుకున్న బౌద్ధుడు అని హిందూమతంలోని వారే కొందరు విమర్శించారు.

ప్రస్తుతం మనదేశంలో జాతీయవాదులు కొంతవరకు బుద్ధుడిని గురించి చెబుతున్నా.. ఒకప్పుడు బుద్ధిజంను ఆదరించిన వార్గాలు మాత్రం ఇతరమత ప్రచారాల ప్రభావంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మేధావులు కొందరు బుద్ధుడి గురించి మాట్లాడుతూ పనిలో పనిగా బ్రాహ్మణులను విమర్శించి తన సామాజిక బాధ్యత పూర్తయిందని భావిస్తారు. దీనివల్ల బౌద్ధమతానికి ఎలాంటి లాభమూ లేదు. మరెవరో లాభం పొందుతారు. నిజంగా ఆనాడు బుద్ధుని ప్రథమ శిష్యులు, బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది బ్రాహ్మణులే. ఇప్పుడు కేవలం విమర్శలు కాకుండా దళిత వర్గాల్లో ప్రచారం చేయగలిగితే ఎందరో దానిలో భాగస్వాములవుతారు.
(రచయిత ప్రసంగాలను www.advaitaacademy.org అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు)

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.