“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ / నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు…” అంటో, మనం పంచోపచార షోడశోపచార పూజావిధానాలలో, యజ్ఞ యాగాదులలో, వివాహాది, కల్యాణ ప్రకరణం ప్రతిపాదించే సంరంభాలలో, కలశ పూజ చేస్తాం..కాని ఈనాడా సరస్వతి కానరాదే?! ఎందుకు కనుమరుగైపోయింది?
పౌరాణికంగా. భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కూడా సాక్షీభూతమైన ‘సరస్వతీ నది ఏ కారణంతో అంతర్ధానమైంది? ఎప్పుడు అంతర్హితమైంది? ఎలా అంతరించింది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకడానికి జరిగే అన్వేషణే, సరస్వతీ నది పునరుధ్ధరణ ప్రణాళిక! ఇదిప్పుడు కార్యరూపం దాల్చడం ముదావహం.
ఇందులో భాగంగా, 4,000 సంవత్సరాల తరువాత, హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం సరస్వతీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల, ప్రయాసల ఫలితంగా, 2015, మే నెల 12 వ తేదీన పౌరాణిక సరస్వతీ నదీ జలాలు , ఒక నూతిలోంచి ఉవ్వెత్తున ఎగసి పడడంతో, భారతీయుల హృదయాలలో ఆనంద వాహిని వెల్లి విరిసింది.
యమునానగర్ జిల్లాలో, ముగల్‌వాలీ గ్రామంలో, 80 మంది గ్రామీణులు సరస్వతీనదీ పరీవాహక ప్రాంతాన్ని తవ్వుతున్న సమయంలో, అకస్మాత్తుగా ఆ నూతిలో తడిని గమనించారు. అలా తవ్వగా, తవ్వగా. ఆ తడి చిత్తడిగా మారిపోయి, 8 అడుగుల లోతులోంచి, నీరు పొంగి ప్రవహించింది.
“ఆరోజు మధ్యాహ్నం 1గంట ప్రాంతంలో, ఖలీల్ అహమ్మద్, సల్మా, ప్రదీప్, ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తులు ఒక నూతిని తవ్వడం మొదలు పెట్టారు. అప్పుడు, 8 అడుగుల లోతు తవ్వగా, నీటి మట్టం పెరగడం మొదలయ్యింది.” అన్నారు స్థానిక పంచాయతీ కార్యదర్శి, బల్‌కర్ సింగ్. అలాగే, ఆ దగ్గరలో వరుసగా తవ్విన మరో 4 నూతులలోకూడా నీరు అగుపించింది. ఆ వార్త క్షణాలలో కార్చిచ్చు లా వూరంతా పాకి, క్రమంగా వూరి జనం అంతా అక్కడికి చేరి పోయారు.
సరస్వతీ నది బృహత్ప్రణాళికను 2015 ఏప్రిల్ 21వ తేదీన ప్రారంభించారు. ఆ తవ్వకాల పనులు ప్రారంభించిన యమునానగర్ డిప్యూటీ కమిషనర్ ఎస్.ఎస్. ఫూలియా, హర్యానా అసెంబ్లీ స్పీకర్ కన్వార్ పాల్ గుజ్‌రార్‌తో సహా, వెనువెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆయన నీటిని పరీక్షించి, దాదాపు 15 రోజులుగా ఆ తవ్వకాలు జరుపుతున్న వారితో సమావేశమయ్యారు.
అసలు, యమునానగర్ జిల్లాలో, ఆది బద్రీ ప్రాతంలో పుట్టి, సరస్వతీ నది 21 గ్రామాల గుండా ప్రవహిస్తుందని హర్యానా ప్రభుత్వం నమ్ముతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్,యీ పధకంకోసం 50 కోట్ల రూపాయలు కేటాయించారు.
సో౦బ్ నది కోసం, 400 ఎకరాలలో నిర్మించాలని ప్రతిపాదించిన ఒక పెద్ద ‘చెక్ డామ్’ను ఇప్పుడు సరస్వతీ నది కోసం మళ్ళిస్తున్నారు. ఈ పౌరాణిక సరస్వతీ నది 4,000 సంవత్సరాల క్రితం ఎండిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనవాలు పట్టి, అప్పట్లో సరస్వతీ నది వాయవ్య భారతదేశంలో ప్రవహించేదని నిర్ణయించాయి. ఒక శక్తిమతమైన భూకంపం తాకిడికి సరస్వతీ నది ప్రవాహం అదృశ్యమైపోయిందని ‘రిమోట్ సెన్సింగ్’ నిపుణులు చెబుతున్నారు.
సరస్వతీ నది ఛాయలు, పరమ పవిత్రమైన కురుక్షేత్ర నగరంలో కూడా కానవచ్చాయి. కురుక్షేత్ర సమీపంలోని అలనాటి, హర్షవర్ధన సామ్రాజ్య రాజధాని థానేసర్ ద్వారా సరస్వతి ప్రవహించిందట! పాండవులు స్నానం చేసిన ‘కపాలమోచన్’, ‘రణ్‌మోచన్’ అనే రెండు నూతులలో సరస్వతీ నది నీరు నింపేదని ప్రతీతి.
సరస్వతీ నదిని పునరుధ్ధరిస్తే, హర్యానాలో మతపరమైన పర్యాటకం ఇనుమడించడమేకాక, ఈ నదీ తీరంలోని గ్రామాల దాహం కూడా తీరుస్తుందని ఆశ! మళ్ళీ గంగా, యమునా, సరస్వతుల త్రివేణీ సంగమంలో అనతికాలంలోనే భక్తులు అఘమర్షణ స్నానాలు ఆచరిస్తారని భారతీయ సంస్కృతీ పునరుద్ధరణ దీక్షాదక్షుల ఆకాంక్ష!

