దాగుడుమూత దండాకోర్ (09-May-2015)

దాగుడుమూత దండాకోర్ (09-May-2015)
లయన్’ (14-May-2015)

సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా తర్వాత వచ్చే మూవీ విషయంలో స్టార్ హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘లెజెండ్’ లాంటి కొత్త రికార్డులు సృష్టించిన సినిమా తర్వాత అంటే… ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘లయన్’ కు దర్శక నిర్మాతలు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా? సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ‘లయన్’ పేరుకు తగ్గట్టు బాక్సాఫీస్ వద్ద గర్జించిందో లేదో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే… ముంబాయిలోని రామ్ మనోహర్ హాస్పిటల్ లో కోమాలో ఉన్న గాడ్సే ఎనిమిది నెలల తర్వాత స్పృహలోకి వస్తాడు. అయితే తాను గాడ్సే కాదని, తన పేరు బోస్ అని చెబుతాడు. అంతేకాదు… తన తల్లిదండ్రుల్ని, భార్యను కూడా గుర్తు పట్టలేకపోతాడు. గానీ నువ్వు మా అబ్బాయివే అంటూ అతని తల్లిదండ్రులు రుజువులు చూపిస్తారు. అయినా నమ్మశక్యం కాని బోస్ తానెవరో తెలుసుకోవడానికి హైదరాబాద్ బయలుదేరతాడు. అక్కడ తన తల్లిదండ్రులను చూసి దగ్గరవుతాడు. కానీ వాళ్ళేమో నువ్వు మా అబ్బాయివి కావంటారు… గాడ్సే అని రూఢీ చేసే ఆధారాలు ఒకవైపు… కాదని మనసు చెప్పే మాట ఇంకోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇంతలో హైదరాబాద్ లో అతనికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇక బోస్ విషయానికి వస్తే… మాజీ ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య అనుమానాస్పద మృతిపై ఈ సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అది ప్రస్తుత ముఖ్యమంత్రి భరద్వాజకు ఏ మాత్రం నచ్చదు. అటువంటి పరిస్థితుల్లో బోస్ అదృశ్యమౌతాడు. మరి… ముంబై హాస్పిటల్ లో కోమాలోంచి బయటకు వచ్చింది గాడ్సేనేనా? లేక బోసా? వీరిద్దరికి అసలు ఏమిటి సంబంధం? ఎవరి పాత్రలోకి ఎవరు పరకాయ ప్రవేశం చేశారు? ఈ చిక్కుముడులను విప్పేదే మిగిలిన సినిమా!
స్టార్ హీరో సినిమా కథలో కొత్తదనం లేకపోయినా… కథనం ఆకట్టుకునేలా ఉంటే… తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ ప్రయోగం పేరుతో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ… కొత్తగా చూపాలనుకుంటే పరాజయం తప్పదు. ఓ మామూలు కథను, కొత్తగా చూపించాలనే నూతన దర్శకుడు సత్యదేవ తాపత్రయం ఈ సినిమాకు శాపంగా మారింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే అన్ని హంగులకూ నిజానికి ఈ కథలో చోటు ఉంది. దాని మీద ఇంకాస్తంత హోమ్ వర్క్ చేసి ఉంటే ‘లయన్’ మంచి సినిమానే అయ్యేది. అయితే… డిఫరెంట్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కించాలనే దర్శకుడి ఆలోచన… అనుభవరాహిత్యం కారణంగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. అయితే బాలకృష్ణ పోషించిన గాడ్సే పాత్ర ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిబిఐ ఆఫీసర్ బోస్ పాత్రను కూడా అరుపులు, కేకలకు పరిమితం చేయకుండా ఇంకాస్త పకడ్బందీగా చేసి ఉండాల్సింది. బాలకృష్ణ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించి త్రిష కేవలం గ్లామర్ డాల్ గానే మెప్పించింది. ఇక రాధికా ఆప్టేకు ఉన్న అవకాశం తక్కువే. ప్రతినాయకులుగా ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్ బాగానే నటించారు. పోసాని కనిపించేది కాసేపే అయినా తనదైన మేనరిజంతో మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా పాత్రల పరిధి మేరకు చేశారు.
చాలాకాలం తర్వాత బాలకృష్ణ సినిమాకు సంగీతం సమకూర్చిన మణిశర్మ బాణీలు ఏమంత ఆకట్టుకోలేదు. అయితే నేపథ్య సంగీతంతో చాలా సన్నివేశాలకు ఆయన జీవం పోశారు. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు మరి కాస్తంత చొరవ చూపి అన్ వాంటెండ్ సీన్స్ కు కత్తెర వేయాల్సింది. రంపచోడవరంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆ క్రెడిట్ రామ్ లక్ష్మణ్ కు దక్కుతుంది. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలే కాదు… కామెడీ సైతం పండకపోవడం ప్రధానమైన లోటు. స్వతహాగా బాలకృష్ణ అభిమాని అయిన నిర్మాత రుద్రపాటి రమణారావు ఖర్చుకు వెరవకుండా ‘లయన్’ను నిర్మించారు. అందువల్ల తెర మీద ప్రతి సన్నివేశం గ్రాండ్ గా ఉంది. గాడ్సేగా బాలకృష్ణ అభినయం, ఆయన చెప్పిన పంచ్ డైలాగ్స్ నందమూరి అభిమానులకు ఊరటనిస్తాయి. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చే ఏ సినిమా అయినా పోలికకు గురి అవుతుంది. దీనిని దృష్టి లో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అలాంటి ప్రయత్నం చేసినట్టు కనిపించదు. ఏతావాతా ‘లయన్’ బాలకృష్ణ మార్కు సినిమా అని చెప్పొచ్చు!
రేటింగ్…3/5

తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్… ‘మదరాసి పట్టణం’ నుండి తీసిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూనే ఉంది. అయితే… అతని తాజా చిత్రం ‘శైవం’ మాత్రం తెలుగులో రీమేక్ అయ్యింది. ఉషాకిరణ్ మూవీస్ తో కలిసి ఆర్.కె. మలినేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… ‘శైవం’ సినిమాను ‘దాగుడుమూత దండాకోర్’ పేరుతో క్రిష్ పునర్ నిర్మించారు. శనివారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఓ పచ్చని పల్లెటూరిలో అతి పెద్ద కుటుంబం రాజు (రాజేంద్ర ప్రసాద్) గారిది. నలుగురు సంతానంలో ఒక్క కొడుకు మాత్రమే రాజుగారితో పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. మిగిలిన వారిలో ఓ అబ్బాయి ఢిల్లీలోనూ, మరొకడు చెన్నయ్ లోనూ ఉంటారు. కూతురి కుటుంబం దుబాయ్ లో ఉంటుంది. పల్లెటూరిలో జరిగే పోలేరమ్మ జాతర సందర్భంగా అక్కడక్కడా ఉన్న రాజు గారి కుటుంబ సభ్యులంతా ఊరుకు చేరతారు. ఎవరికి వారికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా… పెద్దంతగా బయటపడరు. అయితే ఊరిలోకి వచ్చిన దగ్గర నుండి ఎదురైన అశుభాలతో తమ కుటుంబానికి ఏదో చెడు జరుగుతోందనే భావన వారికి కలుగుతుంది. కాస్తంత లోతుగా ఆలోచిస్తే… అప్పుడెప్పుడో పోలేరమ్మకు కోడిని బలి ఇస్తానని మొక్కుకుని దానిని తీర్చలేదని రాజు గారి భార్య (సంధ్యా జనక్) గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఆ బలి కోసమే వాళ్ళు ఇంట్లో నాని అనే కోడిపుంజును పెంచుతూ ఉంటారు. ఆ నాని అంటే… రాజుగారి ముద్దుల మనవరాలు బంగారం (సైరా అర్జున్) కు ఎంతో ప్రేమ. పోలేరమ్మకు నానిని బలి ఇస్తారని తెలియగానే బంగారం తల్లడిల్లిపోతుంది. విచిత్రంగా పోలేరమ్మ జాతరలో బలికి సర్వం సిద్ధమౌతున్న వేళ నాని కనిపించకుండా పోతుంది. అది ఎక్కడకు వెళ్ళిపోయింది? నాని కనిపించకుండా పోవడం వెనక ఎవరి హస్తం ఉంది? పోలేరమ్మకు నాని ని బలి ఇచ్చారా లేదా అన్నది మిగతా కథ.
మూగజీవులను హింసించడం తగదని ప్రతి ఒక్కరూ ఉపన్యాసాలు చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం చూపరు. ముఖ్యంగా అమ్మవార్లకు ఇచ్చే జంతుబలిని నిషేధించాలని ఎంతోమంది ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారు. అయినా… భక్తుల మూఢనమ్మకాల ముందు ఈ పోరాటలు నీరు కారి పోతున్నాయి. ఈ సున్నిత అంశాన్ని ఓ చిన్నారి హృదయస్పందనగా తెలియచేసే ప్రయత్నం చేశాడు కథకుడు ఎ.ఎల్. విజయ్. తమిళంలో నాజర్ పోషించిన పాత్రను ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ చేశారు. ఆ పాత్ర పోషణలోని సహజత్వం తెలుగులో కొరవడింది. లేని గాంభీర్యాన్ని తీసుకురావడం కోసం తెల్లటి కనుబొమ్మలు, మీసాలు, జుత్తుతో హడావుడీ చేశారు. దాంతో సహజత్వం కొట్టుకుపోయింది. ఇక రాజుగారి మనవరాలు బంగారంగా తమిళంలో చేసిన సైరా అర్జున్ ఇక్కడా నటించింది. చక్కని అభినయ పటిమ ఉన్న ఈ బాలనటి మరోసారి తన నటనతో మెప్పించింది. నిజానికి ఈ సినిమాలో పెద్దవాళ్ళ కంటే పిల్లలే చక్కగా నటించారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ సినిమాలో బాలనటిగా మెప్పించిన నిత్యాశెట్టి… ఇప్పుడు కుమారిగా ఎదిగి, రాజుగారి పెద్ద మనవరాలుగా ఓ కీలక పాత్రను పోషించింది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఇ.ఎస్. మూర్తి సంగీతం, పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రధానమైన లోటు… కథా విస్తరణే. చిన్న పాయింట్ ను తీసుకుని సాగతీయడం వల్ల… బిగువు లేకుండా పోయింది. ప్రథమార్ధంలో చక్కని వినోదాన్ని అందించిన దర్శకుడు ద్వితీయార్థంకు వచ్చే సరికీ చేతులెత్తేశాడు. సహజంగా ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేసేప్పుడు ఆత్మను పట్టుకుని, దానిని మన వాతావరణానికి తగ్గట్టుగా మార్చితే బాగుంటుంది. కానీ ఇక్కడ అది జరగలేదు. సెంటిమెంట్ సీన్స్ పెద్దంత పండలేదు. భారీ భవంతిలో నివాసం ఉంటే రాజుగారి కుటుంబ సభ్యులంతా కట్టకట్టుకుని ఒకే హాలులో పడకలేయడం విచిత్రంగా అనిపిస్తుంది. కోడిపుంజును వెతికే క్రమంలో ఊరి జనంతో జరిపే కొట్లాట కూడా అతిగా ఉంది. సహజత్వానికి దగ్గరగా సినిమా తీయాలని తపించిన దర్శకుడు పతాక సన్నివేశానికి వచ్చేసరికీ… సినిమాటిక్ ముగింపునే ఇచ్చాడు. అమ్మవారికి కోడిపుంజును బలి ఇవ్వకపోయినా… అందరికీ మంచే జరిగిందని చెప్పడం నాటకీయంగా ఉంది. ఈ సంఘటనలను ఇంకాస్త విపులంగా చూపి ఉంటే బాగుండేది. ఏదేమైనా… సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరకెక్కించి, ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించడానికి క్రిష్ బృందం చేసిన ప్రయత్నం ఫలించలేదు!
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.