ప్రేక్షక రంజకం ‘పాండవ విజయం’
- 20/05/2015
రాజమండ్రి, మే 19: కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు అంపశయ్యపై చేరడంతో ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించటంతో మొదలైన పాండ విజయం పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షక రంజకంగా సాగింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మంగళవారం నాలుగో రోజు నాటకోత్సవాల్లో పాండ విజయం పద్య నాటక ప్రదర్శన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన కళారాధన సాంస్కృతిక చైతన్య మండలి కళకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే తిరుపతి వేంకటకవులు రచించిన ఈ పద్యనాటకానికి మల్లాది గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. సైంధవుడ్ని సంహరించడానికి ముందు సూర్యుడికి సుదర్శన చక్రం అడ్డువేయటం, సైంధవుడి తలను బాణంతో నరికి, ఆ తల ముని చేతిలో పడటం, కర్ణుడి రథ చక్రం భూమిలో దిగటం, మడుగులో ధుర్యోధనుడి జలస్థంభన వంటి సన్నివేశాలు రక్తికట్టించాయి. ఈ సన్నివేశాలు జరుగుతున్నపుడు ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం దద్దరిల్లింది. ద్రోణాచార్యుడు పన్నిన పద్యవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు మరణించటం, ఆ తరువాత పుత్రశోకంలో మునిగిన అర్జునుడు, ధర్మరాజు తదితరులను కృష్ణుడు ఓదారుస్తాడు. కర్ణుడిని హతమార్చాలన్న విషయంలో అర్జునుడు, ధర్మరాజు మధ్య జరిగిన సంవాదం అందర్నీ ఆకట్టుకుంది. ధర్మరాజు, అర్జునుడు మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలను తొలగించిన కృష్ణుడు ఇద్దర్నీ యుద్ధానికి కార్యోన్ముఖులను చేస్తాడు. అభిమన్యుడు మరణానికి కారకుడైన సైంధవుడ్ని, కర్ణుడ్ని కూడా అర్జునుడు యుద్ధంలో చంపుతాడు. ఈ నేపథ్యంలో ఆప్తులందర్నీ పోగొట్టుకుని మడుగులో జలస్తంభన విద్యతో దాక్కున్న ధుర్యోధనుడ్ని పాండవులు, కృష్ణుడు సూటిపోటి మాటలతో బయటకు రప్పించిన సన్నివేశంలో నటులంతా అదరగొట్టారు. గదా యుద్ధం సన్నివేశంలో భీముడు, సుయోధనుడు పాత్రదారులు అద్భుతమైన నటనతో మన్ననలను పొందారు. ధర్మరాజుగా క్రమధాటి వెంకటేశ్వరశర్మ, భీముడుగా పి సూర్యప్రకాష్, అర్జునుడిగా కొమరవోలు శ్రీనివాసరావు, నకులుడిగా టి ధనుంజయ, సహదేవుడిగా బుగ్గోజి, కృష్ణుడిగా వల్లూరి శ్రీనివాసరావు, దుర్యోధనుడిగా సుబ్బారావు, కర్ణుడిగా పి శ్రీనివాసరావు, శల్యుడిగా గోవిందరాజుల నాగేశ్వరరావు, ద్రోణుడిగా బి నాగిరెడ్డి, అభిమన్యుడుగా టి శ్రీనాథ తదితర పాత్రల్లో చక్కని నటనను ప్రదర్శించారు.
పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో కడప జిల్లా రాజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘మనో వైకల్యం’ తల్లిదండ్రులకు మంచి సందేశాన్ని ఇచ్చింది. మేనరికం కారణంగా మానసిక వైకల్యంతో పుట్టిన వారికన్నా, అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నప్పటికీ సరయిన మనస్తత్వం లేని మనో వైకల్యం ఉన్న వారు ఎలా ఉంటారో చక్కగా ప్రదర్శించారు.

