ఆనంద రామాయణ విశేషాలు -9

ఆనంద రామాయణ విశేషాలు -9

                     పన్నెండు పెళ్ళిళ్ళు

ఒక రోజు రామ రాజు  సింహాసనం  పై ఆసీనుడై జ్యోతిశాస్త్ర పండితులను పిలిపించి ,కులగురువు వశిస్టమహర్షిని సగౌరవంగా ఆహ్వానించి కూర్చో బెట్టి ,నాగ గాంధర్వ పురోహితులనూ ఆహ్వానించి తన 7 గురు కుమారులకు దివ్యమైన వివాహ ముహూర్తాన్ని నిర్ణయించమని అర్ధించాడు .అందరు పండితులు తమలో తాము సంప్రదించుకొని ఏకగ్రీవం గా ‘’వైశాఖ మాసం లో శుక్ల పక్షం లో ఒక ముహూర్తాన్ని దానికి పదిహేను రోజుల్లో కృష్ణ పక్షం లో మరో ముహూర్తాన్ని సూచించారు .అలాగే జ్యేష్టమాసం లోకూడా శుక్ల పక్షం లో ఒకటి కృష్ణ పక్షం లో మరొకటి దివ్యమైన ముహూర్తాలని సెలవిచ్చారు ,మార్గశిరమాసం లోనూ రెండు ,మాఘ మాసం లో మూడు ముహూర్తాలున్నాయని చెప్పారు .ఇలాగ పన్నెండు ముహూర్తాలు పన్నెండుమందికన్యలకు తగి ఉన్నాయని సెలవిచ్చారు .మళ్ళీ అందరూ కలిసి వసిస్టూలవారి తో సంప్రదించి శ్రీరామునికి నివేదించారు .లవునికి ,అంగదునికి వైశాఖ మాస ముహూర్తాన్ని ,చిత్రకేతు ,పుష్కరులకు జ్యేష్టమాస ముహూర్తాన్ని ,వేర్వేరు పక్షాలలో బాగున్నాయని నిర్ణయించారు .తక్షుడికి సుబహువుకు మార్గ శిరమాస ముహూర్తాలు భేషుగ్గా ఉన్నాయన్నారు .యూపకేతువుకు ,అంగదునికి ,చిత్రకేతువుకు మాఘ మాస ముహూర్తాలు కుదిరాయన్నారు పుష్కర ,తక్షక ,సుబాహువులకు ఫాల్గుణ మాస మూడు ముహూర్తాలు తగినవిగా ఎంచారు .ఇలా రాజకుమారులు 12 మందికి 12 శుభ ముహూర్తాలు నిర్ణయించారు జ్యోతిశ్శాస్త్ర పండితులు .వారిని రాముడు ఘనంగా సన్మానించాడు .

      జ్య్తోతి ష్ శాస్త్ర పండితులు మహర్షి వసిస్టూడు ,గాంధర్వ నాగ పురోహితులు అందరూకలిసి శ్రీరాముని సన్నిధానానికి చేరి గాంధర్వ ,నాగ కన్యలను పెళ్లి కుమారులకు చక్కగా పంచారు . కన్జానన  ను లవునికి ,కంజాక్షి ని అంగదునికి కన్జాంఘ్రిని చిత్ర కేతువునికి ,కలావతిని పుష్కరునికి ,కాలిక ను తక్షునికి ,కమలను సుబాహునికి ,మాలతిని యూప కేతువునకు ,ఇచ్చి వివాహం చేస్తే చక్కని పొంతన ఉంటుందని తెలియ జేశారు .ఈ విధం గా ఏడుగురు నాగ కన్యలకు తగిన వరులను నిర్ణయించి చెప్పారు .తర్వాత చంద్రికను అంగదునికి ,చంద్రాస్యను చిత్ర కేతువుకు ,చంచలను పుష్కరుడికి ,ఆచలను సుబాహువుకు ఇచ్చి వివాహం చేస్తే  దాంపత్యం  అన్యోన్యంగా వర్ధిల్లుతుందని చెప్పారు .సంతోషించిన రాముడు అందరిని సముచితంగా సత్కరించిపంపి సీతా దేవికి ఈ విషయ౦ వర్తమానం పంపాడు .

         ఏడుగురు కొడుకులకు పన్నెండు మంది కన్యలతో వివాహం చేసిన తండ్రి శ్రీరాముడు

 రాజకుమారుల వివాహవార్త దేశమంతటా చాటించగా అశేష జన సందోహం అయోధ్యకు వచ్చి చేరుకొన్నది. ఎక్కడ చూసినా జయ జయ ద్వానాలే .రాజవీదులన్నీ క్రిక్కిరిసిపోయాయి .అందరికి తగిన వసతి సౌకర్యాలు కల్పించారు .రాక్ష సేనతో విభీషణుడు ,వానర సేనతో సుగ్రీవుడు ,ఇద్దరు కొడుకులతో భూరి కీర్తి ,సపరివారంగా జనక మహారాజు తమ్ముడు ,యుదాజిత్తు తో సహా విచ్చేశారు .ఎవరికీ ఏ లోపం లేకుండా మంత్రులు ఏర్పాట్లు అద్భుతంగా చేశారు .

 శ్రీరాముడు వైశాఖ శుక్లపక్షం లో పురోహిత ,బంధు మిత్రులతో మంగళ స్నానాలు చేశాడు .లవకుమారునికి మంగళ స్నానాలు చేయించి పెండ్లికోడుకును చేయించాడు వ.ధువు చే  సువాసినీ పూజ జరిపించాడు .సీతాదేవి మిగిలిన రాణులు అభ్యంగన స్నానాలు చేశారు .దివ్యాభరణాలతో శోభాయమానంగా అల౦కా రాలు చేసుకొన్నారు .మంగళ వాద్య ధ్వనులు మిన్నులు ముట్టు తున్నాయి .శ్రీరాముడు పురోహితుల సహాయం తో శ్రీ మహా గణపతి పూజ చేశాడు .తర్వాత పున్యాహవాచనం నవ గ్రహ పూజ చేశాడు .మునులన్దరిని ఉచిత రీతిలో సత్కరించాడు .ముహూర్త సమయానికి ముందే నాగ రాజులున్న విడిది ఇంటికి చేరుకొన్నాడు ..లవకుమారుని నాగకన్య కన్జనయనకు శాస్త్రోక్తంగా ముహూర్త సమయానికి వివాహం చేశాడు .నాలుగవ రోజున లవుడు మంగళ మంటపం లో శోభాయమానం గా విరాజిల్లాడు .రాముడు స్వగృహం లో లవుని చేత శ్రీమహా లక్ష్మీపూజ చేయించాడు .అనేక దానాలు ఇప్పించాడు .వివాహానికి తరలి వచ్చిన నాగ యక్ష గాధర్వ పౌరజనం అంతా రామునికి నూతన వస్త్రాభరణాలు చదివించి పూజించి ధన్యులయ్యారు .లక్ష్మణుడిని కుశుడిని సన్మానించారు .రాజ పత్నులు ,మిత్రపత్నులు గంధర్వ పత్నులు వేర్వేరుగా సీతాదేవి మొదలైన రాజ పత్నులను సత్కరించారు .వారందరికీ సీతా దేవి యధోచిత సత్కారాలు చేసింది .ఇలా వైశాఖ మాస శుక్లపక్షం లో రాముడు లవుని వివాహం చేసి అందరికి ఆనందం కలిగించాడు .

     వైశాఖ కృష్ణ పక్షం లో రాముడు అంగద వివాహం మహా వైభవం గా నిర్వహించాడు .జ్యేష్టమాసం లో శుక్ల ,కృష్ణ పక్షాలలో చిత్ర కేతు ,పుష్కరులకు పెళ్ళిళ్ళు ఘనం గా చేశాడు .సమస్త రాజులను సత్కరించి మర్యాద చేసి పంపాడు .మళ్ళీ మార్గ శిరమాసం వివాహాలకు రావాలని కోరాడు .మళ్ళీ అందరి సమక్షం లో మార్గశిరమాసం లో తక్షకునికి సుబాహువుకు వైభవోపేతం గా కళ్యాణాలు జరిపించాడు .మాఘ మాస వివాహాలకు ఆహ్వానించి యూప కేతువు అంగదుడు ,చిత్రకేతువు లకు ఘనంగా వివాహాలు నిర్వహించి వచ్చినవారందరినీ  వెనక్కి వెళ్ళకుండా అయోధ్యలోనే ఉంచుకొని ఫాల్గుణ మాసం లో పుష్కర,తక్షక ,సుబాహువుల పెండ్లిండ్లు మహా వైభవోపేతంగా జరిపించాడు .ఈ విధంగా తన ఏడుగురు కుమారులకు పన్నెండుమందికన్యలతో వివాహం జరిపించి రికార్డ్ సృష్టించాడు రాముడు .ఈ కళ్యాణాలు జగదానంద కారకాలుగా ,బ్రహ్మానందం గా జరిగినందుకు దేవ యక్ష గాంధర్వ నాగ ,రాక్షస వానర సమూహాలన్నీ పరమానంద భారితులయ్యాయి .అందరినీ శ్రీరామ పరివారం సగౌరవం గా సత్కరించి మర్యాదలతో వీడ్కోలు పలికి రాముని గొప్పతనానికి వన్నె తెచ్చారు .వారందరూ అయోధ్యను ,రాముని వదలలేక వదలలేక వెళ్ళారు .  సశేషం

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-5-15 –ఉయ్యూరు .

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.