విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు
ఎవరిపేరు చెబితే విద్వాంసులు చేతులు జోడిస్తారో ,ఎవారు అజ్ఞాన తిమిరాలను చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించారో ,ఎవరు వందలాది శిష్యగణానికి ఆరాధనీయులో ఎవరు నడిచే విద్యా సరస్వతిగా భాసిల్లారో ,ఎవరు విమర్శనా వాజ్మయ జలధిని మదించి అనర్ఘ రత్నాలనీ వెలికి తీశారో ,ఎవరు సర్వ శాస్త్ర పారంగతులో, ఎవరు సమాజ దేవ పూజ చేశారో ,ఎవరు మూఢాచారాలను ఖండించి ప్రగతిమార్గ ప్రవర్తకులయ్యారో,ఎవరు సంస్కరణలను చెప్పటమేకాక పాటించి ఆదర్శంగా నిలిచారో వారే బ్రహ్మశ్రీ కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు .
శాస్త్రిగారి కుటుంబం
బ్రహ్మయ్య శాస్త్రిగారు తూర్పు గోదావరిజిల్లా పలివెల గ్రామం లో మాతామహులైన మైలవరపు నరసన్న గారింట క్రీ శ.2-4-1863 న జన్మించారు .అది రుధిరోద్గారి సంవత్సర చైత్ర శుద్ధ త్రయోదశి గురువారం .శాస్త్రి గారి పూర్వీకులు రాజోలు దగ్గర కడలి గ్రామం లో ఉండేవారు .తెలగాణ్యులు .గౌతమస గోత్రులు .ఆపస్థంభ సూత్రులు .ముత్తాత గారు కడలి గ్రామం వదిలి కాకినాడ లో జగన్నాధ పురానికి చేరుకొని స్వగృహమేర్పరచుకొని నివాసమున్నారు .తండ్రిగారు బ్రహ్మావదానిగారు వేద శాస్త్రాలలో నిష్ణాతులు .తల్లిగారు సుబ్బమ్మ గారు .బ్రహ్మయ్య శాస్త్రిగారి తమ్ములు కూడా తక్కువ వారేమీకాడు .తమ్ముడు సుబ్బయ్య శాస్త్రి’’ శ్రీరామ విజయ గ్రంధ కర్త ‘’.బ్రహ్మయ్య శాస్త్రి గారి పెద్దకుమారుడి పేరుకూడా బ్రహ్మయ్య శాస్త్రి యే..ఈయన ‘’శ్రీరామ శతకం’’ రాసి తండ్రిగారికి అంకితమిచ్చాడు .శాస్త్రిగారి రెండవ కుమారుడు నరసింహ మూర్తి సుబ్బయ్య శాస్త్రి గారికి దత్త పుత్రుడయ్యాడు .ప్రసిద్ధ సారస్వత సేవకుడు దేశభక్తుడు కోటమర్తి చిన రఘుపతి రావు గారు బ్రహ్మయ్య శాస్త్రిగారి అల్లుడే .శాస్త్రి గారు మొదటిభార్య సుబ్బమ్మగారు మరణించిన తర్వాత వెదురుపాక నివాసి దంతుర్తి బ్రహ్మయ్య శాస్త్రులుగారి పెద్ద కూతురు సూరమ్మగారిని శాస్త్రిగారు ద్వితీయం చేసుకొన్నారు .
విద్యాభ్యాసం –సకల కళా ప్రపూర్ణులు
బ్రహ్మయ్య శాస్త్రి గారు కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో ఆంగ్ల విద్య నేర్చి మెట్రిక్ పాసైనారు .ఎఫ్ ఏ .పరీక్షకు చదువుతుండగా కుటుంబ పరి స్థితులవలన చదువు సాగక మానేశారు .కాలేజీ లో చదివేటప్పుడే శాస్త్రిగారు ఆంద్ర ప్రబంధ సాహిత్యాన్ని అవలోడనం చేశారు .ఇంగ్లీష్ నేర్వక ముందే సంస్కృత పంచకావ్యాలు చదివేశారు .కాలేజి వదిలేసిన తర్వాత ‘’సిద్ధాంత కౌముది ‘’ని ఆపోసన పట్టారు .దానిపై వ్యాఖ్యానాలను చదవక పోయినా అందులోని సారాన్ని ఆస్వాదించారు .సంస్కృత ,ఆంద్ర ఆంగ్ల భాషల త్రివేణీ సంగమ స్నానం చేసి’’ సాదృశ భాషా శాస్త్రం’’ (ఫైలాలజి )లో క్రుషికూడా చేశారు .త్రిభాషా పాండిత్యం అబ్బటం వలన ప్రతి విషయాన్ని తులనాత్మకం గా పరిశీలించేవారు .దేశం లోని సాంఘిక విషయాలనూ అవగాహన పరచుకొన్నారు .హిందూ మతం పై వీరాభిమానమేర్పడింది .హిందూమతం లాంటి మతం, హిందూ సంఘం లాంటి సంఘం ప్రపంచం లో ఇంకెక్కడా లేవు అనే దృఢమైన అభిప్రాయమేర్పడింది .హిందూమతం యొక్క బాహ్య స్వరూపం తెలుసుకొంటే చాలదని భావించి అందులోని మత విజ్ఞానం పై ద్రుష్టి సారించారు .వివిధ శాఖలలో ఉన్న అతి సూక్ష్మ విషయాలను కూడా ఆకళింపు చేసుకొన్నారు .ప్రాయశ్చిత్త పశు నిర్ణయం ,పురాణాలలో ఉన్న గ్రహణాల విషయం అధ్యయనం చేశారు .వీటిపై అనేక వ్యాసాలూ రాశారు .అవి చదివితే శాస్త్రిగారికి ఉన్న శ్రౌత పాండిత్యం ,జ్యోతిష అవగాహన మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి .గానకళ లో నాట్యకళ లో ప్రావీణ్యం సాధించారు .ఎప్పుడూ ఏదో ఒక కొత్త విద్య నేర్వటం దాని లోతుపాతుల్ని తరచటం శాస్త్రిగారి హాబీ .అందుబాటులో ఉన్న గ్రంధాలయాలకు వెళ్లి తనకు కావలసిన విషయాలను చదువుకొంటూ లోకాన్నే మర్చి పోయేవారు .ఇతర గ్రంధాలను అనేకం చదవటం వలన ఆయనకు 60 వ ఏట నేత్ర ద్రుష్టి క్షీణించింది .మద్రాస్ వెళ్లి నేత్ర వైద్యులు డాక్టర్ కోమన్ నాయర్ కు చూపించగా వారు మరల దృష్టిని ప్రసాదించారు .రెట్టించిన ఉత్సాహం తో మళ్ళీ గ్రంధ పఠనం కొనసాగించారు .విద్య నేర్పటంకంటే విద్యార్ధిగా ఉండటమే శాస్త్రి గారికి మహా ఇష్టం .
నిత్య కర్మ వీరులు
బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత నిఘంటువు లో విశ్రాంతి అనే మాట కు చోటే లేదు .అనునిత్య కర్మవీరులు శాస్త్రిగారు .ప్రజా విషయాలపై అత్యంత శ్రద్ధ చూపటం మొదటి నుండి అలవాటు .కాకినాడ ట్రెజరీ డిప్యూటీ కచేరిలో గుమాస్తాగా శాస్త్రి గారు ఉద్యోగించారు .అక్కడ పని చేస్తున్నా వీరి ఇతరపనులకు ఏ ఆటంకమూ ఉండేదికాదు .కాలేజీ చదువు మానేసి ఇందులో కొలువులో చేరి నిరాఘంటంగా తమకు 56 వ ఏడు వచ్చేదాకా పని చేశారు .తరువాత దీనికి గాను నెలకు ఇరవై రూపాయలు పెన్షన్ పొందేవారు .విధి నిర్వహణలో ఏమరుపాటు లేకుండా పై అధికారుల మెప్పును పొందేవారు .ఆఫీసులో బండ చాకిరి చేసి ఇంటికి వచ్చినా శాస్త్రిగారు విశ్రాంతి తీసుకొనే వారుకాదు .ఎక్కడో ఒక చోట ఉపన్యాసం ఉండేది .వ్యాసాలూ రాసేవారు .అంతేకాక ప్రజాహిత సంస్థలను ఏర్పాటు చేసి వాటిద్వారా ప్రజా సేవ చేసేవారు .అందుకే వారికి విశ్రాంతి అనేది గగన కుసుమమే అయింది .
నాటక సమాజ స్థాపన
శాస్త్రిగారు విద్యార్ధిగా ఉండగా మహా రాష్ట్ర నుండి ధార్వాడ నాటక సమాజాలు వచ్చి ప్రదర్శనలు ఇచ్చేవి . .వారి రంగాలంకరణ ,ప్రక్రియా వైవిధ్యం ఆంధ్రులను ముగ్ధులను చేసేవి .ఆ కొత్త పద్ధతులు ఆంద్ర దేశం లో కూడా అభి వృద్ధి చెందాలని శాస్త్రిగారు భావించారు .’’ఆంద్ర బృందానంద సంధాయి ‘’అనే పేరుతొ ఒక నాటక సమాజాన్ని స్థాపించారు .ఈ సమాజం వీరేశ లింగం గారు రాసిన శాకుంతలం ‘’నాటకాన్ని బ్రహ్మయ్య శాస్త్రి గారు రాసిన ‘’త్రిపురాసుర విజయ వ్యాయోగం ‘’నాటకాన్ని ఆడేవారు .ప్రసిద్ధ కవులు రాసిన నాటకాలనూ ప్రదర్శించి ప్రజారంజనం చేసేవారు .తర్వాత ఈ సమాజం మరో సమాజం లో కలిసి పోయింది .
భక్త సమాజ స్థాపన
విద్యార్ధి దశనుండి హిందూ మతానికి నవ నాగరికత వలన వస్తున్న ముప్పును బ్రహ్మయ్య శాస్త్రి గారు గ్రహించారు .దానిని నివారించటానికి ప్రజలలో భగవద్ భక్తీ పెంచటానికి అనువుగా 1880లో ‘’భక్త సమాజం ‘’అనే సమాజాన్ని స్థాపించారు .శాస్త్రి గారి నిర్మల నిశ్చయ భక్తీ వలన సమాజం దిన దిన ప్రవర్ధమానమైంది .సమాజం తరఫున అనేక గ్రామాలలో పర్యటించి భక్తిపై స్పూర్తిపూర్వకప్రసంగాలు చేసేవారు .కొంతకాలం తర్వాత ఈ సమాజం ‘’హిందూమత బాల సమాజం ‘’లో కలిసి పోయింది .
ఆధారం – మా తండ్రిగారు కీ .శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రిగారు భద్రం గా తమ గ్రంధాలయం లో2-4-1940అని తమ సంతకం కింద తేదీ వేసి సంతరించి దాచుకొన్న ‘’విమర్శకాగ్రేసర కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత చరిత్రము ‘’ అనే గ్రంధం .సుమారుగా 75 ఏళ్ళక్రిందటిపుస్తకం అన్నమాట .అనుకోకుండా నా కంట బడితే సార్ధకం చేసుకొంటున్నాను . కవర్ పేజి చినిగిపోయింది .కనుక గ్రంధ కర్త ఎవరో నాకు తెలియలేదు .ఇది 40 పేజీలున్న చిన్ని పొత్తం .రచయితకు కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-5-15-ఉయ్యూరు

