విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2
గ్రంధాలయ స్థాపన
1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను ఇరవై సంవత్సరాల వయసు లోనే స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు .కృత్తివెంటి పేర్రాజు ,నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్య దీక్షకు మెచ్చి చేయూత నిచ్చారు .ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండా గారం ‘’అనే గ్రందాలయన్నీ స్థాపించారు . మొదట్లో జగన్నాధ పురం లో ఉన్న ఈ లైబ్రరి తర్వాత పెద్ద వీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’లోకి మ్కార్చారు .కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు .సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు .ఇక్కడే శాస్త్రి గారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు .ప్రసిద్ధులను కూడా ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించేవారు .హరికధా కాలక్షేపాలు కూడా ఏర్పాటు చేశారు .ఆర్య మత బోధిని సభ ద్వారా శాస్త్రి గారు చేసిన హిందూమత సేవ అపారమై నిలిచింది .
వీదిప్రచారం
క్రైస్తవ మత ప్రచారకులు బ్రహ్మ సమాజికులు ఆనాడు వీధుల్లో బృందాలుగా వచ్చి మత బోధ చేయటమేకాక హిందూమతాన్ని తీవ్రంగా దూషించేవారు .సనాతన ధర్మంపై వ్యతిరేక ప్రచారం ఎక్కువ చేసేవారు .వారి ప్రచారం లో పస లేదని రుజువు చేయాలని శాస్త్రి గారు భావించి తానుకూడా వీధుల్లోకి వచ్చి ప్రచారం చేసి నిర్వీర్యులను చేయాలని నిశ్చయించుకొన్నారు .1884లో ఈ వీధి ప్రచారం మొదలు పెట్టి శాస్త్రిగారు ఎన్నో వీధి ప్రచార సభలు నిర్వహించి ,కరపత్రాలను అచ్చు వేసి పంచి పెట్టారు .ప్రజలలో భక్తిని ప్రబోది౦చటానికి భక్తీ గీతాలను పాడుకొంటూ వీధుల వెంట తిరిగేవారు .దీనికోసం ఒక సమాజాన్ని 1885 లో స్థాపించారు .అవసరమైన పాటలను,కీర్తనలను శాస్త్రిగారే రచించి పాడటం నేర్పించి సమాజాన్ని వీధి ప్రచారానికి పంపేవారు .దీని వలన గొప్ప ప్రచారం జరిగీ క్రైస్తవ బ్రహ్మ సమాజాలు సమాజాలు బయటికి రావటానికి భయపడ్డాయి .
మహా పురుషుల జయంతి వర్ధంతులు
భారత దేశం లో జన్మించి తమ అమూల్య జీవితాలను ఆదర్శ వంతంగా తీర్చి దిద్దుకొన్న మహా పురుషులైన శ్రీ రామ కృష్ణ పరమ హంస ,శ్రీ శంకరాచార్య ,శ్రీ రామానుజాదుల జయంతి వర్ధంతి ఉత్సవాలు నిర్వహించి వారి జీవితాలలోని ప్రధాన ఘట్టాలను వివరిస్తూ ప్రేరణ కలిగించేవారు .శాస్త్రిగారు ఆనాడేప్పుడో మొదలు పెట్టిన శంకర జయంతి కాకినాడలో ఈ నాటికీ నిర్వహిస్తూనే ఉన్నారు .తర్వాత ఈ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఉద్యోగులు నిర్వహి౦చారు .
మాస పత్రిక నిర్వహణ
శాస్త్రి గారు హిందూ మత విజ్ఞానాన్ని జన సామాన్యానికి అందించాలన్న తలంపుతో ‘’ఆర్య మత బోధిని ‘’అనే మాస పత్రిక ను స్థాపించి నిర్వహించారు .దీన్ని 1905 జనవరి ఒకటవ తేదీ ప్రారంభించారు .అప్పటికే శాస్త్రిగారు హిందూ మత సంబంధమైనవి ,సాహిత్య పరమైనవి అయిన వ్యాసాలూ వందల కొద్దీ రాసి ఉన్నారు .అవి వివిధ పత్రికలలో ప్రచురితాలుకూడా. కనుక శాస్త్రి గారి పేరు ఆంద్ర దేశం లో తెలియని వారు ఆ రోజుల్లో ఎవరూ ఉండేవారు కాదు. అంత గా పాప్యులర్ అయ్యారు శాస్త్రిగారు ‘’ఆర్య మత బోధిని కి దేశ మంతటా విశేషం గా పాఠకులు౦డేవారు శాస్త్రి గారి ప్రభావం వలన క్రమంగా బ్రహ్మ సామాజికుల ప్రభావం బాగా తగ్గి పోయింది అని వీరేశ లింగం పంతులుగారే అంగీకరించారు శాస్త్రి గారి ప్రభావం అంత గొప్పది .వీరేశ లింగం గారి మాటల్లోనే ‘’వెయ్యగా వెయ్యగా వెర్రి వాడే గెలిచి నట్లు శాస్త్రి గారి రాతలు ,చేతలు జనులను భ్రమల్లో ముంచాయని గ్రహించి నేను తలపెట్టిన మహా కార్యానికి విఘాతం కలుగుతుందని భావించి ‘’సత్య వాదిని ‘’అనే పత్రిక ప్రారంభించాను ‘’అని వీరేశ లింగం గారే రాసుకొన్నారు .ఆనాడు సంఘ సంస్కార పత్రికలన్నీ శాస్త్రి గారి మీద కత్తి కట్టాయి .అయినా జంకూ గొంకూ లేని శాస్త్రిగారు సరైన సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి వారి నోరు మూయి౦చ గలిగారు .అదే వారి ఘన విజయం .పరుషంగా వారు మాట్లాడినా శాస్త్రిగారు మృదువుగా యుక్తి యుక్తం గా సమాధానాలిచ్చేవారు .కలహానికి కందుకూరి ఎప్పుడూ కాలుడువ్వేవారు .చివరికి లింగం గారే పశ్చాత్తాపం ప్రకటించాల్సి వచ్చింది .సత్యమేవ జయతే అని శాస్త్రి గారు రుజువు చేశారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -23-5-15 –ఉయ్యూరు

