విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు

Inline image 1

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి  వివాదం

ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా  ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు .వాళ్ళు నాటకం రాస్తే నాటకం తోనూ వ్యాసం రాస్తే వ్యాసం తోనూ జవాబు చెప్పటం శాస్త్రి గారి ప్రత్యేకత .సంస్కరణ పిపాసి వీరేశలింగం గారు ఎప్పుడూ శాస్త్రిగారికి ప్రధాన వ్యతిరేక పక్షమే .లింగం గారు విమర్శించారన్నమాత్రాన హిందూమతం లో ఏ స్వల్ప మార్పులు జరగటానికైనా శాస్త్రి గారు ఒప్పుకోనేవారుకాదు. అంతటి నియమ పరులు .కందుకూరి వారు కాలాన్ని బట్టి  యుక్తిని బట్టి మతం లో మార్పులు రావాలని కోరేవారు .కాని ఆయనే ఆ నియమాన్ని  పాటించలేదు అనే విమర్శ ఉండేది .ఆత్మకు పుట్టుక ఉందికాని చావు లేదనేవారు లింగం గారు .కానిలోకం లో పుట్టుట గిట్టుటకోసమే అనే మాట మర్చిపోయారని నింద మోశారు. శంకరాద్వైతం యుక్తి యుక్తమే అయినా ఒప్పుకోనన్నారు వీరేశలింగం  .డార్విన్ పరిణామ వాదం శాస్త్రీయమే అయినా తాను  అంగీకరించనన్నారు కందుకూరి .సృష్టివాదం అంటే క్రియేషన్ ధీరీ అశాస్త్రీయం అయినా అంగీకరిస్తున్నానన్నారు వీరేశలింగం .పులి ,పాము ,ఉప్పెన భూకంపం ,మహామారి మొదలైన విపత్తులను దేవుడే సృష్టించి ప్రజలకు భయం కలిగేట్లు చేసి తనను సేవి౦చేట్లు దేవుడు చేసినవే నంటారు కందుకూరి .ఇది మూఢ విశ్వాసంకాదా అని ఆనాడు శాస్త్రి గారు లాంటి సనాతనులు లింగం గారిని అవహేళన చేశారు ..ఇలా వీరేశలింగం గారు చాలా విషయాలలో పరస్పర విరుద్ధం గా ప్రవర్తించారనే అభిప్రాయం చాలా మందిలో ఉండేది .అందుకే బ్రహ్మయ్య శాస్త్రి గారు వీరేశ లింగం గారి అన్నివాదాలను సమూలంగా  చేది౦చాల్సి  వచ్చింది .ఇవన్నీ గమనిస్తే శాస్త్రిగారు మహా వక్త మహా రచయిత మహా విమర్శకులేకాక మహా నిర్మాణ కౌశలం కలిగినవారు అని స్పష్టమౌతుంది .హిందూమతాభిమానం ,ప్రచార ఉత్సాహం తాటాకు మంటలాగా కాసేపు ఉండి  ఆరిపోయేవికావు ఆయనలో .అవి నిత్య జ్వాలలే .యాభై ఏళ్ళు వీటికోసమే పోరాడిన మహితాన్వితులు .

స్పర్ధయా వర్ధతే విద్యా

శాస్త్రిగారిని ఇంత పని చేయించింది ప్రతిపక్షాలవారే. వారి ప్రేరేపణే.ఒక సారి ధిల్లీ దర్బారు సందర్భం గా ఒక సభలో బ్రహ్మ సమాజ ప్రవర్తకులు బ్రహ్మర్షి రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ బ్రిటిష్ వారు మనదేశానికి వచ్చిన తర్వాతనే శూద్రులు బాగు పడ్డారని  అంతకు ముందు బ్రాహ్మణ సమాజం చేత  అణగ ద్రోక్క బడినారని  చెప్పారు .దీనికి  శాస్త్రిగారు బదులిస్తూ ‘’బ్రాహ్మలు శూద్రులకు అన్యాయం చేసిరా?’’అనే చిన్న పుస్తకం రాసి ప్రచురించారు .ఇందులో శ్రుతి స్మ్రుతులనుండి ,మహాభారత నుండి శుక్రనీతి మొదలైన మహా గ్రంధాలనుండి అనేక ప్రమాణ వాక్యాలు ఉదాహరణగా ఇచ్చి శూద్రులు ఎప్పుడుకూడా నీచంగా చూడబడలేదని సప్రమాణంగా రుజువు చేశారు .ఇంకో సారి శ్రీ త్రిపురనేని రామ స్వామి చౌదరి ‘’శబుక వధ ‘’నాటకం రాసి బ్రాహ్మణులను అనవసరంగా నిందించటం గమనించిన శాస్త్రిగారు ‘’శ౦బుక వధా విమర్శన గ్రంధం ‘’రాసి తమ పాండిత్యాన్ని ,ప్రతిభను వాద పటిమను ,లోకజ్ఞానాన్ని ,యుక్తిని నిరూపించుకొన్నారు .మరోసారి కాకినాడలో బ్రహ్మ సమాజం వారు శివలింగం అశ్లీలాన్ని బోధిస్తోందని ఒక పెద్ద సభలో అన్నారు .వెంటనే స్పందించిన బ్రహ్మయ్య శాస్త్రిగారు సమాధానంగా  ‘’శివలింగం యోగి రూపం లో భావింపబడిన శివుని శిరస్సు’’ అనే సిద్ధాంతాన్ని చెప్పి దానికి ప్రమాణాలను పేర్కొని అనేక శాస్త్రాలను పరిశోధించి సిద్ధాంతాన్ని నిగ్గు తేల్చి వ్యాస పరంపరను పత్రికలో ప్రచురించారు .

వీరేశలింగం గారు వితంతువుల కేశ ఖండననం ,పరలోకం లో దంపతులు కలుస్తారు అనే హిందూ మతం లో ఉన్న నమ్మకాన్ని పరిహసిస్తూ ‘’నారద సందర్శనం ‘’అనే ప్రహసనం రాశారు .దీనికి దీటుగా సమాధానం రాస్తూ శాస్త్రిగారు ‘’పర్వత సందర్శనం ‘’అనే ప్రహసనాన్ని రాసి వదిలారు .మరోసారి బ్రహ్మ సమాజీకులుతమ మందిరం లో  విగ్రహారాధన తుచ్చం, నీచం, హేయం అని నిందించారు  .దీనికి శాస్త్రిగారు ‘’ఇలాంటివి ఏదో ప్రైవేటు మందిరం లో కూర్చుని చెబితే తేలేవికావు ప్రజా సమక్షం లో వాదోపవాదాలు చేసి నిగ్గు తేల్చేవి. అప్పుడే అసలు సత్యం ఏమిటో సామాన్య ప్రజలు గ్రహిస్తారు .మేము బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం దానికి మీరు రండి మీ వాదాలు వినిపించండి మా వాదాలు మేమూ వినిపిస్తాం ‘’అని జవాబిచ్చి నిజంగానే బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో తన వాదంగా శాస్త్రిగారు విగ్రహారాధనను సమర్ధిస్తూ చేసిన ఉపన్యాసం మహా విశిష్టంగా ఉంది .చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖి౦పబడదగినదినది అయింది .అదీ శాస్త్రి గారి వాదనా సామరధ్యం .వాక్ పటిమ .సర్వ గ్రంధ పరిశీలనం .

శాస్త్రిగారు పరిష్కరించిన సమస్యలు

బ్రహ్మయ్య శాస్త్రి గారు తమ అమూల్యమైన ఉపన్యాసాలలో ఎన్నో విషయాలను చర్చించి విషయ వివరణం చేశారు .ఎన్నో సమస్యలకు తగిన సమాధానాలు పరిష్కరించి చెప్పారు .వారు పరిష్కరించిన వాటిలో కొన్ని సమస్యలు -1 శ్రీ కృష్ణుడు జారుడా ?2- గణపతి 3-జీవన్మత మేది ?4-హిందూమతం ఆవశ్యకత 5-త్రిమతములు మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ ప్రతి హిందువు చదివి అర్ధం చేసుకొని అనుసారించాల్సినవే .అలాగే రజస్వలానంతర వివాహం వితంతు వివాహం లను యుక్తి యుక్తంగా ఖండించి శాస్త్రాదారాలు చూపి నిరూపించారు. దీనిలో వారిని మించిన వారెవ్వరూ లేరని చెప్పటం అతిశయోక్తి కాదు

హిందూ విజ్ఞానం

బ్రహ్మయ్య శాస్త్రిగారు హిందూ విజ్ఞానం పైన అనేక అమూల్య వ్యాసాలూ రాశారు .ఆధునికులు చెప్పే ప్రక్రుతి శాస్త్రము మన ప్రాచీనులు చెప్పిన ప్రాచీన గ్రంధాలనుండి గ్రహించి వ్రాయబడినదే అని ఘంటాపధం గా రాసి నిరూపించారు . హిందూ విజ్ఞానంపై శాస్త్రిగారు ‘’జగము సృజింప బడినదా?భూమి తిరుగు చున్దా?భూమి వర్తులత్వం యెంత ,?భూమి తిరుగుటకు ఆధారమేమి ?భూమి యొక్క యాకర్షణ శక్తి ,రాశి చక్రము ,పంచ భూతములు గ్రహణ కదా చర్చ రామయణమందలి వానరు లెవరు ?మొదలైన వ్యాసాలూ విజ్ఞాన సోపానాలే. శాస్త్రిగారి అసమాన ప్రాక్ ప్రచీతీ విజ్ఞాన సమ్మేళనానికి గొప్ప ఉదాహరణలే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-5-15 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.