ఆత్మీయ మిత్రులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి,
నమస్కారములు ! మీరు ఎంతో భక్తి శ్రద్దలతో రచించి, సంకలనం చేసిన పై గ్రంథం అంది నా డెందమానందమయమైనది. . పరమ పావనుదైన, లోకం లోని భక్తులందరికీ ఆదర్శప్రాయుడైన, రామ భక్తికి మారుపేరైన, శ్రీ ఆంజనేయ స్వామికి భారతదేశంలోనే కాక, విదేశాలలో కూడా నెలకొని ఉన్న ఆయన దేవాలయాల గురించిన విశేషాలను, అన్నీ స్వయంగా చూడలేని వారికి, కనుల ముందుకు తెచ్చి ఎంతో పుణ్యం కట్టుకున్నారు మీరు. రాముడంటే హనుమంతుని భక్తి ఎంత పరిపూర్ణమైనదో ఒక సందర్భంలో నిదర్శనమైనదని పెద్దలు చెప్తారు.
శ్రీ రామ పట్టాభిషేక సందర్భంలో, శ్రీ రాముడు వానార వీరులన్దరినీ పిలిచి యథోచితంగా బహుమతులిస్తూ సత్కారిస్తాడట. చివరికి, హనుమను పిలిచి, సీతమ్మ వైపు చూస్తాడట. ఆ తల్లి, ఎంతో ప్రేమతో తన కంఠహారాన్ని తీసి బహుమతిగా హనుమకు ఇస్తుందట. హనుమ, ఆ హారాన్ని నిశితంగా పరిశీలిస్తూ, ఆ హారంలోని ముత్యాలను ఒక్కొక్కదానిని కొరికి, చూసి, పెదవి విరిచి పారవేస్తాదట. అది చూసి, సీతమ్మ కినుక వహిస్తూ రామునివైపు, ‘అదేమిటి ? ఇలా ప్రవర్తిస్తున్నాడు ?‘ అని ప్రశ్నార్థకంగా చూస్తుందట. రామచంద్రుడు నవ్వి, హనుమ వైపు చూసి అంటాడట:” హనుమా, సీత ఎంతో ప్రేమతో తన కంఠ హారాన్ని తీసి నీకు ప్రత్యేకంగా ఇస్తే, నువ్వలా కొరికి పారవేస్తావేమిటీ ? ఆమెకు కోప వచ్చింది !”.
దానికి హనుమ వినయ వినమిత గాత్రంతో, ‘స్వామీ ! ఏమని చెప్పేది ? నాకు లోపలా బయటా, అంతటా నా రాముడే కనపడతాడు ! మరి ఈ హారంలో ఏ కోశాన అయినా, ‘నా రాముడు కనబడతాదేమోనని, వెతుకుతున్నాను. అలా కనపడక పోయేటప్పటికి, ‘నా రాముడు లేని ఈ ముత్యాలు నాకెందుకూ’ అని పారవేస్తున్నాను. అంతే !’ అంటాడట. పుత్ర సమానుడైన, ఆ భక్త పరాయణుడి రామ భక్తికి, ఎంతో మెచ్చుకుని సీతమ్మ కూడా సంతృప్తి చెందుతుందట. తనకు తెలుసు కాబట్టి, రామ చంద్రుడు చిరునవ్వుతో హనుమను ఆశీర్వదిస్తాడట’
ఈ ఘట్టాన్ని గురించి, ఎక్కడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉపన్యాసంలో విన్నాను. ఎవరి భక్తి ఐనా, అలా అంకిత భావంతో, ‘ఆత్మార్పణ’ భావంతో, నిర్మలంగా ఉండాలని చెప్పటానికి ఈ ఘట్టం నిదర్శనంగా చెప్తారు.
అటువంటి, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలను మీరు పరిచయంచేసి ధన్యులయారు. గ్రంథం ఆత్మీయతతో పంపినందుకు, శతాధిక ధన్యవాదాలు. ఈరకంగా, మీరు ఈ వయసులో కూడా సాహిత్య, వేదాంత సేవ చేస్తూ తరిస్తున్నారని నా భావన. ఇలాగే, మీ నిస్వార్ధ సేవ కొనసాగాలనీ, అందుకు ఆ పరమేశ్వరుడు మీకు నిండు ఆయురారోగ్యాలను ప్రసాడించాలనీ, ప్రార్థిస్తూ, సెలవు.
మీ గీతాంజలి మూర్తి
—
మీ గీతాంజలి మూర్తి

