ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -37
16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -3
శాన్ ఫ్రాన్సిస్కో జీవితం-జాతీయ రచయితగా గుర్తింపు
ఇరవై తొమ్మిదో ఏట ట్వేన్ ఎంటర్ ప్రైజెస్ అన్నీ వదిలేసి ‘’మార్నింగ్ కాల్ ‘’ పత్రికలో ఉద్యోగం పొంది శాన్ ఫ్రాన్సిస్కో చేరాడు అక్కడ హార్టే ,చార్లెస్ వారెన్ ,మొదలైన పడమటి తీర మేధావుల పరిచయమేర్పరచుకొన్నాడు .ఇదే మొట్టమొదటిసారిగా సాహిత్య జీవులతో మాత్రమె పొందిన అరుదైన పరిచయం .అనేక కాలిఫోర్నియా పత్రికలకు హాస్య వ్యంగ్య రచనలు చేస్తూ ఆర్టిమస్ వార్డ్ సలహా పై కొన్ని రచనలను తూర్పు తీరపత్రికలకు కూడా పంపేవాడు .’’జిం స్మైలీ అండ్ హిస్ జంపింగ్ ఫ్రాగ్ ‘’న్యు యార్క్ సాటర్ డే ప్రెస్ లో అచ్చయింది. ఇదే తరవాత ప్రసిద్ధ మైన ‘’జంపింగ్ ఫ్రాగ్ ఆఫ్ కలేవరస్ కౌంటి ‘’గా 1865లో ముద్రణ పొంది బాగా ప్రాచుర్యం పొందింది .ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించి దేశ వ్యాపితంగా మార్క్ ట్వేన్ అంటే ఏమిటో తెలిసింది .అకస్మాత్తుగా అందరూ ఉదాహరించే గొప్పగా చెప్పుకొనే రచయిత అయిపోయాడు .అమెరికా జాతీయ రచయిత గా ఎదిగిపోయాడు .ఆనాడు సాంద్ విచ్ ఐలాండ్స్ అని పిలువబడిన నేటి హవాయి ద్వీపానికి న్యూస్ పేపర్ కరస్పాండెంట్ గా మార్క్ ట్వేన్ ను పంపారు .యూరప్ పర్యటన చేసి మెడిటరేనియన్ ,పాలస్తినాలు తిరిగి తన అనుభవాలను ‘’హిలేరియస్ ఇన్నోసేన్త్స్ అబ్రాడ్ ‘’పేరుతొ రాశాడు .ఇవి అచ్చు అయ్యేనాటికి ట్వేన్ వయసు 34 మాత్రమే .
రాతో రాత
రచయితగా విజయాలు సాధించి స్థిరపడ్డాడు .అభిమానులు గణనీయంగా పెరిగిపోయారు .ఉపన్యాస చక్ర వర్తిగా అవతారం ఎత్తి ఇందులోనూ తనకు సాటి లేరనిపించుకొన్నాడు .ఆల్వియా లాంగ్ డన్అనే న్యు యార్క్ లోని ఎల్మైరా పౌరుడైన ధనిక ప్రముఖుని అమ్మాయి ఫోటోను చూసి పీకల్లోతు ప్రేమలో పడి వెంటనే ఆమెను కలిసి ఆ వెనువెంటనే పెళ్లి చేసేసుకొన్నాడు .అప్పుడు నివాసాన్ని ఈస్ట్ కు మార్చాడు .’’బఫెలో ఎక్స్ ప్రెస్ ‘’పత్రికకు సగం యజమాని గా ఉండినిర్వహించి ,37 వ ఏట కనెక్టికట్ లోని హార్ట్ ఫోర్డ్ కు చేరాడు .ఇక్కడ ఉండి రాసిన పుస్తకాలలో సెంటిమెంటల్ రచనలతో బాటు నిర్లక్ష్యంగా,సందర్భ శుద్ధి లేకుండా రాసినవీ ఉన్నాయి .వయసు మీదపడిన కొద్దీ కోపం ,ప్రపంచ ద్వేషం పెరిగిపోయాయి .కాని ఏదిరాసినా వాస్తవానికి అతి సన్నిహితంగా నేటివ్ స్పిరిట్ తో నిజాయితీగా ,పాత్రల స్వభావాలను పూర్తిగా తీర్చి దిద్ది రాశాడని అనిపించాడు .
అన్నిట్లో వేలు
ఎక్కడో పల్లెటూరి కుర్రాడు ఇప్పుడు జాతీయ హీరో అయ్యాడు .విజయాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి వెంటపడి వచ్చాయి .అమెరికా దేశం లోనే ‘’గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ‘’అని పించుకొని ,దేశ మేధావుల సరస న చేరిపోయాడు .స్పెక్యులేషన్ బుద్ధి మాత్రం ఆయన్ను వదలలేదు అదృష్టాన్ని పుస్తక ప్రచురణ లో పరీక్షించుకొందామని పబ్లిషర్ అయ్యాడు .తాను రాసిన పుస్తకాలేకాకుండా ,’’మేమాయిర్స్ ఆఫ్ యు ఎస్ గ్రాంట్ ‘’అనే ఆనాటి ప్రసిద్ధ గ్రంధాన్ని కూడా ముద్రించాడు .కొంతలాభం కనిపించే సరికి మెకానికల్ టైప్ సెట్టర్ పై ఉన్న డబ్బు అంతా ఖర్చు చేసేశాడు .అదృష్టం కలిసి వస్తే కోట్లాది డాలర్లు సంపాదించి ఉండేవాడు .కాని అది పని చేయక మొండి చేయి చూపే సరికి నష్టాల్లో కూరుకుపోయి దివాలా తీశాడు .దీనికి తగ్గట్టు కుటుంబం లో కూడా దురదృష్ట సంఘటనలు తోడైనాయి .
వరల్డ్ లెక్చర్ టూర్ –ఆశనిపాత వార్తలు
పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయి అందులో నుంచి బయట పడటానికి అరవై వ ఏట
ప్రపంచ లెక్చర్ టూర్ ప్రారంభించాడు .ఇది మాత్రం అనుకోని విజయాలను సమకూర్చి ఆర్ధికం గా బాగా లాభించింది .నిరంతరం తిరుగుతూ ఉండటం తో డబ్బు వచ్చింది కాని ఆరోగ్యం దెబ్బ తిన్నది .కొడుకు పసిప్రాయం లోనే చనిపోయి మనోబాద మిగిల్చాడు .ఇతర దేశ పర్యటనలో ఉన్నప్పుడే బాగా అభివృద్ధిలో ఉన్న పెద్ద కూతురు సూసీ కూడా అకస్మాత్తుగా చనిపోవటం తో చాలా కు౦గి పోయాడు .వియన్నాలో ఉండగా అన్నగారు ఓరియన్ చనిపోయినట్లు తెలిసింది .అదృష్టం ఎలా వెంటపడిందో ఇప్పుడు దురదృష్టం కూడా అలానే వెంటపడి తరిమిందిపాపం .ప్రజలు బ్రహ్మ రధం పట్టి కనక వర్షం కురిపిస్తున్నారు .కాని కుటుంబం లో ఆశినిపాతం లాంటి విషాద వార్తలకు తట్టుకోలేక పోయాడు .అనేక మైన గౌరవ డాక్టరేట్లు బిరుదులూ వస్తూనే ఉన్నాయి .ఎన్నోకాలేజేలు యూని వర్సిటీలు సన్మానించి గౌరవిస్తున్నాయి డి.లిట్ ఇచ్చి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి సన్మానించింది .కాని తరువాతి జీవితం చీకటిగా అసంతృప్తిగా దుఃఖ భాజకం గా గడిచిపోయింది ఆ మహా రచయితకు .ఆయనకు అరవై తొమ్మిదో ఏట భార్య కూడా మరణించి మానసిక దుఖాన్ని మరింత పెంచింది .ఆ తర్వాత కొన్నేళ్ళకే ఇంకొక కూతురు జీన్ ‘’ఎపిలేప్సి’’ వ్యాధితో చనిపోయింది .ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది మార్క్ ట్వేన్ కు . ఎలా తట్టుకోన్నాడో ఆ మహాను భావుడు ?
సశేషం

