సూక్తి సుధ
విజయ వాడ ఆకాశ వాణి కేంద్రం వారు సూక్తి సుధ లో ‘’ధార్మిక చంతన ,క్రోధం ‘’అనే రెండు విషయాలపై మాట్లాడమి కోరగా రాసి మాట్లాడాను .దానిని ఆగస్ట్ 1,8,15,22,29 తేదీలలో ఉదయం 6గంటల సూక్తి సుధలో అయిదు భాగాలుగా ప్రసారం చేశారు .దానినే మీకు అంద జేస్తున్నాను .
‘’ద్రుజ్ ధరణే’’అనే ధాతువు నుండి ‘’ధర్మం ‘’అనే పదం వచ్చింది .’’ధరతి విశ్వమితి ధర్మః –ధారణాత్ ధర్మః ‘’అని వ్యుత్పత్తి .సమస్త విశ్వాన్నీ ధరించేది ధర్మం .విశ్వ స్థితికి ఆధారమైనది ధర్మం .’’ధర్మ విశ్వస్య జగతిః ప్రతిష్టాలోకే –ధర్మిస్టం ప్రజా ఉప స్సర్ప౦తి-ధర్మేణ పాప మనువదతి-ధర్మే సర్వం ప్రతిష్టి తం –తస్మాధర్మం పరమం వదంతి ‘’అంటుంది శ్రుతి.అంటే ‘’సమస్తలోక స్థితికి పరమ ఆధారం ధర్మమే .ధర్మ నిస్ట కలవారిని ప్రజలు ఆశ్ర ఇస్తారు .ధర్మం పాపాన్ని తొలగిస్తుంది .ధర్మం లోనే అన్నీ ఉన్నాయి .కనుక ధర్మం సర్వ శ్రేష్ట మైనది ‘’అని భావం .రామాయణం లో కైక కూడా శ్రీ రామునితో ‘’ధర్మ మూల మిదం రామ విదితం చ సదామపి ‘’అని హితవు చెప్పింది .’’జగత్తు ధర్మ పైనే ఆధార పడి నడుస్తోందిరామా .ఈ విషయం పండితులకు తెలుసు ‘’అని ఆమె మనో భావం .వనవాసానికి వెడుతున్న కొడుకు రాముడితో తల్లి కౌసల్య ‘’నువ్వు ఆచరిస్తున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది ‘’అని ధైర్యం చెప్పి పంపించింది .
ఇంతకీ ధర్మం మనకు చేసే మేలు ఏమిటి ?’’యతోభ్యుదయ నిస్శ్రేయససిద్ద్దిః స ధర్మః ‘’అభ్యుదయం నిస్శ్రేయస్సు లను ధర్మం కలిగిస్తుంది .మనుస్మృతి ‘’దశ లక్షణోధర్మః సేవితవ్యః ప్రయత్నతః –ధృతి ,క్షమా ,దమోస్తేయం ,శౌచ మింద్రియ నిగ్రహః –ధీః,విద్యా ,సత్యమక్రోదః దశకం ధర్మ లక్షణం ‘’అని ధర్మానికి ఉన్న పది లక్షణాలను చెప్పింది .ధర్మాలు రెండు రకాలు .ఆశ్రమ ధర్మాలు ,సామాన్య ధర్మాలు .గృహస్థాశ్రమ ,వానప్రస్థాశ్రమ ,సన్యాసాశ్రమాలలోని వారు ఆశ్చరించాల్సినవి ఆశ్రమ ధర్మాలు .సామాన్య జనులందరూ ఆచారిమ్చాల్సినవి సామాన్య ధర్మాలు .ఇవే సత్యం ,క్షమా ,భూత దయ ,కృతజ్ఞత మొదలైనవి .వాల్మీకి మహర్షి రామాయణం లో సామాన్య ధర్మాలకే ప్రాధాన్య మిచ్చాడు .ఇవన్నీ మానవతా ధర్మాలుగా లోకం లో పిలువ బడుతున్నాయి .ఇవే సమాజ పురోగతికి అవసరమైనవి .
ఐతే మానవత్వం అంటే ?’’మన్యతే అనేనా ఇతి ‘’అని చెప్పారు .’’దేని వలన సమస్తవ్యక్త ప్రపంచం ,దానికి కారణమైన అవ్యక్త ప్రపంచం తెలియ బడుతుందో అదే మానవత్వం ‘’.మానవత్వం లేని బ్రతుకు నిరర్ధకం .సాటి మానవునిలో దైవాన్ని చూసే చూపు కావాలి ,రావాలి .అప్పుడే మనిషి జన్మ సార్ధకం .సమాజం అలాంటి మానవులతోనే అభ్యుదయం చెందుతుంది .’’యతో ధర్మ స్తతో జయతి ‘’సుఖ సంతోషాలతో అందరూ వర్దిల్లటానికి ఈ ధర్మాలు అందరూ ఆనుస్టించాలి .ఈ రకమైన ధార్మిక పరమైన ఆలోచనా ,నిరంతర మననం ను ‘’ధార్మిక చింతన ‘’అంటారు .
ధర్మం పురుషార్ధ హేతువు .కటుంబ ,బంధు ,సోదర ,దాంపత్య ,సాంఘిక ,న్యాయ ,రాజకీయాది ధర్మాలను అందరం ఆచరించాలి .అసత్యానికి మించిన అధర్మం లేదు .’’ధర్మ మూల జగత్సర్వం –ధర్మశ్చశ్రుతిమూలకః –భారతం పంచామో వేదః –శ్రుతి సర్వస్వ విస్తరం ‘’. ‘’సమస్త వేదాలకు మూలం ధర్మం .మహా భారతం పంచమ వేదం .వేదం సర్వస్వాన్ని మహా భారతం వివరించి చెబుతుంది .’’అని దీని భావం .భారతం చదివి అర్ధం చేసుకొని ,జీవితానికి అన్వయించుకొని ఆచరిస్తే ప్రపంచం సుఖ శాంతి మయమవుతుంది .అందుకే వివేకానందుడు ‘’ప్రాక్టికల్ వేదాంతం ‘’అవసరమని చెప్పాడు .ధర్మాలలో భూత దయ ఉత్త్తమమైనది .ఇదే భగవాన్ బుద్ధుని బోధనా సారాంశం .మానవుల విషయాలలోనే కాక పశు పక్షాదుల విషయం లో కూడా భూత దయ ఉండాలి అని వాల్మీకి మహర్షి బోధించాడు ..
ఒక క్రమ పద్ధతిలో ,అందరితో సహజీవనం తో ,అందరికి సమాన సంతృప్తిని కలిగిస్తూ జీవించటమే ధర్మం .’’అనేక ప్రాణి జేతే రహతి –త్యా సర్వా౦చి రహ వి సుస్తితి –సామాన్ సంధానాంఛి గతి వ్యాస –ధర్మ మహానవే ‘’.విశ్వాన్ని అంతటిని మన ఇల్లుగా భావించటం ,అందులో మన ఉన్నతి తో బాటు ,ఇతరుల సుఖ సంతోషాలు చూసే గొప్ప సంస్కృతినే ధర్మం అన వచ్చు .ఇందులో న్యాయం నీటి ,సమానత్వం ఉంటాయి .ఒకరికొకరు నిజాయితీగా సాయం చేసుకోవటమే లౌకికార్ధం లో ధర్మం .
2
ప్రపంచాన్ని ధరించేది రాక్షించేది ధర్మం .అనేక ధర్మాలు లోకం లో ఉన్నా వేదం ధర్మం శ్రేయస్కరం .’’ద్వివిదోహి వేదోక్తో ధర్మః ప్రవ్రుత్తి లక్షణో నివృత్తి లక్షణ శ్చ జగతః స్థితి కారణం ‘అని శ్రీ శంకర భగవత్పాదులు ‘’గీతా భాష్యం ‘’లో చెప్పారు .వేదం ధర్మాలు ప్రవ్రుత్తిధర్మం , నివృత్తి ధర్మం అని రెండు రకాలు .ప్రవ్రుత్తి ధర్మం అంటే ముందుకు వెళ్ళటం- ప్రోగ్రెస్ .నివృత్తి ధర్మం అంటే వెనక్కి తిరిగి చూసుకొని సవరించుకోవటం-రిగ్రేస్ .ఈ రెండు ధర్మాలు ప్రపంచం లో ప్రాణులన్నిటికి సహజమే .ఇందులో ఏది ముఖ్యమైనది అంటే రెండూ ముఖ్యమైనవే .ఉదాహరణకు-మానవుని పెరుగుదల శిశుత్వం తో ప్రారంభమై అనేక దశలలో,అనేక రకాలుగా విస్తరిస్తుంది .ఇది ప్రవ్రుత్తి ధర్మం .వృద్ధాప్యం లోఎదుగుదల ఆగిపోతుంది .మనిషి నెమ్మదిగా కుంచించుకు పోతాడు .ఇదే నివృత్తి ధర్మం .అంటే మొదట ప్రవ్రుత్తి ధర్మం ,తర్వాత నివృత్తి ధర్మం అనే దశలు ఉంటాయి .ఇవి ఒకదాన్ని వదలి రెండవది ఉండదు .ప్రవృత్తిలో ప్రేమ ప్రధానం .అదే అభ్యుదయ మార్గం .నివృత్తి లో శ్రేయస్సు ప్రధానం గా ఉండి ,ముక్తికి సోపానమవుతుంది .అలాగే మనసుకు కూడా ఈ రెండు ధర్మాలు వర్తిస్తాయి . జీవితం లో ముందుకు సాగటం ప్రవ్రుత్తి .ఏవైనా అడ్డంకులు ఎదురైతే ,కొంచెం వెనక్కి తగ్గి ,మనల్ని మనం రక్షించుకోవటం నివృత్తి .మెలకువ స్థితిలో ప్రవ్రుత్తి లో ఉన్న మనసు ,ఇంద్రియాలు , నిద్రించే చేముందు నివృత్తి లోకి చేరతాయి .ముందుగా కర్మేంద్రియాలు ,తర్వాత జ్ఞానేంద్రియాలు ,మనసు విషయాల నుంచి వెనక్కి మరలి ,ఆత్మలో కరగి పోతాయి .నివృత్తి తో బాటు ధర్మాన్ని కూడా అలవరచు కొంటేనే నిజమైన ఫలితం కలుగుతుంది .
కేవలం నిద్రించటమే నివృత్తి ధర్మం కాదు .దానికి తోడుగా జ్ఞానం ఉండాలి అప్పుడే మోక్షం లభిస్తుంది .నివృత్తి స్థితికి చేరాలంటే మొదట ఇంద్రియ స్వేచ్చను అరి కట్టుకోవాలి .తర్వాత అనేక విషయాలపై ఉన్న దుఖాన్ని గుర్తిస్తూ వివేకం తో వాటిని విశ్లేషిస్తూ ,అనవసరమైన వాటిని విసర్జించాలి .అప్పుడు మాత్రమె మనసు నివృత్తి చెంది ఆత్మను తెలుసుకో గలుగుతుంది .అంటే ఆత్మ జ్ఞానం లభిస్తుందన్నమాట .అయితే ఇదంతా సద్గురువుల సాన్నిధ్యం లో ,మార్గ దర్శకం లో మాత్రమె సాధ్యమవుతుంది .అప్పుడే ప్రవ్రుత్తి ,నివృత్తి ధర్మాలకు ధర్మ సూక్ష్మాలు గ్రహించే జ్ఞానం వస్తుందని సాధనలో పరి పక్వమైనవారు తెలియ జేశారు .ఈ జ్ఞాన సాధన వలననే పునరావృత్తి రహిత మోక్ష పదం సిద్ధిస్తుంది .
‘’శరీరమాద్యం ఖాలు ధర్మ సాధనం ‘’అన్నారు ఏది సాధించాలన్నా శరీరం కావాలి .అది ఆరోగ్యం గా ఉండాలి .’’A sound mind in a sound body ‘’శరీరం ఆరోగ్యం గా ఉంటె మనసూ ఆరోగ్యంగా ఉంటుంది .’’బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి ‘’బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు .అలాగే ‘’ధర్మ విద్ ధర్మైవ భవతి ‘’ధర్మం తెలిసిన వాడు ధర్మ మూర్తి అయిన పరమాత్మయే అవుతాడు .ఇహ లోక వ్యవహారాలతో ముడి పడి ఉన్నదే ప్రవ్రుత్తి ధర్మం .పరలోక వ్యవహారాలకు సంబంధించింది నివృత్తి ధర్మం .’’అరయగ ధర్మ తంత్రముల యందు –నిరర్ధకము లేదోకండు-నెవ్వరి మది యందు వ్రాలె దగ –వారు ,దానిన పూని యాచరింతురు’’అని తిక్కన గారు శాంతి పర్వం లో చెప్పారు .అంటే మానవుడికి ధర్మ స్వీకార స్వేచ్చ ఉన్నదన్నమాట .అనుమానం లేదు .ప్రవ్రుత్తి నివృత్తి ధర్మాలు ఒక దానికొకటి విరుద్ధం కావు .పరస్పర పోషకాలే . దీనికి మహత్తర ఉదాహరణ మన జాతి పిత మహాత్మా గాంధీయే –‘’ఒడలు దేశ సేవకు –ఎడద రాముని సేవకు –అప్పగించి ముక్తి గాంచె గాంధి ‘’అన్నారు తెనుగులెంక శ్రీ తుమ్మల సీతారామ మూర్తిగారు .
మానవ జీవితం లో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీస్సి ,సమాజ సేవకు అన్క్తం కావాలని మహా భారతం బోధించింది .జీవితం ద్వంద్వాత్మకం .మంచిని గ్రహించి ముందుకు సాగి జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

