సూక్తి సుధ-
3
ధార్మిక జీవిత వైశిష్ట్యం ఏమిటి అంటే ‘’కష్ట సహిష్ణుత ,స్వార్జిత విత్తానుభవ ప్రశస్తి ,సోదరత్వ సౌజన్యం ,ఆధ్యాత్మిక చింతన ,ద్వేష రాహిత్యం ,భగవద్భక్తి ,బాంధవ్యం ,సత్య నిష్ట,రుజు ప్రవర్తన ,స్నేహ శీలం ,విద్యా వినయ సంపద ,ఐకమత్యం ,పరోపకారం ,సానుభూతి ,సహవేదన .వీటిని ఆవరచుకొని ఆచరిస్తే సమాజం లో హింస ,క్రూర ప్రవ్రుత్తి నశించి ,సుఖ శాంతులు వర్ధిల్లి ,పురోగమనం చేకూరుతుంది .ఈ భావనలు కలగాలంటే నిరంతర ధార్మిక చింతన ఉండాలి .సద్గ్రంధ పఠనం ఆవశ్యకం. సత్సాంగత్యం ,సద్గురు బోధ ,ఉండాలి .మహా భారతం లో లేనిది ఏదీ లేదు .అది మనిషి కద.మనిషి మనసు కధ.మనిషిలోని ఉన్నత శిఖరాలను ,అతి భయంకరమైన లోయలను ,కుదుపులను చెప్పే కధ..విప్పే కధ. మానవ జీవితానికి అద్దం భారతం .వ్యక్తీ ప్రగతికి ,సమాజ ప్రగతికి , ,సుఖ దుఖాలకు అవసరమైన ధర్మాలు ,ధర్మ సూక్ష్మాలు వివరించింది .మానవ జీవితానికి వాటిని సమన్వయం చేసి , రసమయం చేసింది ,లోచూపు వెలిగించే దీపంగా భాసిస్తుంది భారతం .
రక్త మాంసాలతో ,రకరకాల మనస్తత్వాలతో ,మనతో పాటే ఉండే ,శకునులు ,శల్యులు ,సైంధవులు ,కీచకులు బకాసురులు ,దుర్యోధన ధృత రాష్ట్రాదులు అన్ని యుగాల్లో ,అన్నికాలాల్లో ,అన్ని జాతుల్లో ఉన్నారు,ఉంటారు .వారిని పెరగనీయ కుండా మనమే జాగ్రత్త పడాలి .లేక పొతే మానవ జీవితం కల్లోలమయమై పోతుంది .ధర్మాన్ని ఆచరి౦చటమేకాదు ,ధార్మిక బోధనా అవసరమే .శాస్త్ర సాంకేతిక విద్యావలయం లో పరిభ్రమిస్తున్న నేటి ప్రపంచం మేధస్సుకు ఇస్తున్న విలువను ,ప్రాధాన్యాన్ని హృదయానికి ఇవ్వటం లేదు .హృదయం లేని మనిషి దానవుడు అయ్యే ప్రమాదం ఉంది .ఉంటోంది కూడా .ఇది అందరికి అనుభవమే .అందుకే మానవ విలువలను బోధించే సాంఘిక శాస్త్రం విద్యలో అంతర్భాగం కావాలి .హ్యుమానిటీస్ లేక పొతే మనిషి ‘’ఇన్ హ్యూమన్ ‘’అవుతాడు .పరస్పర గౌరవం ,మర్యాద అవగాహన అందించే విద్య నేర్పాలి .ప్రపంచం కుగ్రామం అయిన కొద్దీ ,మనిషి స్వార్ధం తో మరీ కుంచించు కు పోతున్నాడు .మానవత్వాన్ని మంట గలుపుతున్నాడు .బుద్ధి ,మేధస్సు వికసిస్తోందికాని హృదయ వికాసం రావటం లేదు .
ధార్మిక ప్రవ్రుత్తి నుంచి మనిషి వైదొలగితే వచ్చే ప్రమాదం ఇదే .’’మనం బ్రతికే అచ్చమైన ,స్వచ్చమైన బ్రతుకే ధర్మ స్వరూపం ‘’అన్నది కాశ్మీర దేశపు సంస్కర్త ,యోగిని ‘’లల్లాదేవి ‘’.అందుకే ముస్లిములు కూడా ఏంతో గౌరవించి ఆమెను ‘’లల్లారిఫా ‘’అని ఆత్మీయంగా గౌరవం గా పిలుచుకొన్నారు . ధర్మమే అందరిని కలిపి ఉంచుతుంది అని దీనిని బట్టి మనకు అర్ధమవుతుంది .’’ఇదంశరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే ‘’అని చెప్పిన భగవద్గీత వాక్యానికి ‘’ఈ శరీరం ధర్మం అనే పంట పండించే క్షేత్రం ‘’అని పరమోత్క్రుస్టమైన అర్ధం చెప్పారు శ్రీ కంచి పరమాచార్య .
‘’సర్వేషాం యః సుహృత్ నిత్యం –సర్వషాంచ హితే రతః –కర్మణా ,మనసా ,వాచా ,స ధర్మం వేదం జాజలే ‘’అని జాజలికి వర్తకుడు తులాభారుడు భారతం లో ధర్మ విషయం గురించి బోధించాడు .’’’’జాజలీ !నిత్యం అందరికి స్నేహితుడిగా ,మనో వాక్కాయ కర్మలా ,పర హితంగా ,ఉండే వాడే నిజంగా ధర్మం తెలిసిన వాడు ‘’అని భావం .’’తనను అధిగమించి ,తనను నిర్మించుకోక పొతే –యెంత పేదవాడు ఈ మనిషి ?’’అన్నాడు ప్రముఖ ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ .
రామాయణం లో రాముడు రావణాసురుడికి ధర్మ బోధ చేస్తూ ‘’ధర్మ ఏవ హతో హంతి-ధర్మో రక్షతి రక్షితః –తస్మాధర్మో న హంతవ్యః –మానో ధర్మో హతో వదీత్ ‘’అన్నాడు ‘’అధర్మాన్ని అణచి వేసే ధర్మాన్ని నువ్వు అణచి వేశావు రావణా !అందుకే ధర్మం నిన్ను హతం చేస్తుంది .ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది .ధర్మాన్ని అణచ కూడదు.ధర్మం హతమైతే మనల్ని ధర్మం హతం చేస్తుంది ‘’.
‘’సత్యం పరమం ధర్మం ‘’అన్నారు .సత్యం లో ధర్మం ఉంది సత్యమే నాశనం లేనిది .సత్యం తర్వాత పదమే మోక్షం .విశ్వాన్ని సుఖ శాంతులతో ,ఉన్నతిలో ఉంచటమే అందరి ధ్యేయం కావాలి . ‘’అందర్నీ ప్రేమించే మనసు ,అందర్నీ సేవించే వయసు ,అందరి క్షేమం కోరే బుద్ధి నాకు ప్రసాదించు ‘’అన్నది మన ప్రార్ధన కావాలి .’’కుర్వంతు విశ్వం ఆర్యం ‘’అనేది భారతీయ సంప్రదాయం .విశ్వాన్ని సర్వోత్క్రుస్ట ,ఉన్నత మయమానవులనుగా తీర్చి దిద్దటమే భారతీయ ధార్మిక ఆదర్శం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-9-15-ఉయ్యూరు

