ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -107
45- రేడియో యాక్టివిటీ కనిపెట్టి నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ- మేరీ క్యూరీ -3(చివరి భాగం )
పియరీ శవాన్ని ఇంటికి చేర్చగానే ,ఆశవాన్ని వదిలిమేరీ ఉండలేక పోయింది .ఆమె దుఖం కట్టలు తెంచుకు ప్రవహించింది .ఆపుకోలేకపోయింది .ఆపటం ఆమెకు అసాధ్యమైంది .తన తల్లి దుఖాన్ని వర్ణిస్తూ కూతురు ఈవ్ ‘’పియరీ నా పియరీ ‘’అని ఎలుగెత్తి ఏడ్చింది .నువ్వుఅక్కడ సమాధిలో ప్రశాంతంగా ఉండిపోయావు .నా కలలో కూడా నువ్వే .మనం ఒకరికొకరం విడిచి ఉండలేని వాళ్ళం .నీ అంత్యక్రియలకు అనంత జనవాహిని వచ్చి నిన్ను స్మరించి దుఖించింది. పుష్ప వృష్టి కురిపించింది .చివరి నిద్రలో ఉన్నావు .ఇదే అన్నిటికీ ఆఖరు ,అవును అన్నిటికీ అన్నిటికీ ‘’అని ఫునేరల్ అయింతర్వాత మేరీ విపరీతంగా శోకి౦చి౦దని రాసింది .
నలభై వ ఏట తలమరింత నెరిసి ,మరింత ముసలిదానిలా మేరీ కనిపించింది .’’నేను ఆత్మ హత్య చేసుకోవాలనుకోలేదు .నేను హిప్న టైజ్ అయిన దానిలాగా ఏపనీ చేయకుండా ఉండిపోయాను .’’అని తర్వాత రాసుకొన్నది మేరీ .లేబరీటరీకి మేరీని పియరీస్థానం లో నియమించారు .మంచో చెడో తెలియక ఒప్పు కొన్నది .భర్త వదిలేసిన పనిని కొనసాగించి ముందుకు వెళ్ళటానికే నిశ్చయించి కార్య రంగం లో దిగింది .ఆమె మనసంతా రేడియో యాక్టివిటీ లెక్కలే ,భావనలే నిండిపోయాయి .లాబ్ పని తర్వాత ఇద్దరాడ పిల్లల విషయం పై ద్రుష్టి పెట్ట్టేది .ఇద్దరిపిల్లలకోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకొన్నది .మామ గారినిసంరక్షించాల్సిన బాధ్యతా ఆమెదే .భర్త మరణానంతరం మరో నోబెల్ ప్రైజ్ ను1911లో ఇచ్చారు దీన్ని భర్తకు అంకితం చేసింది .’’ది సార బాన్నే ‘’,మరియు పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ కలిసి మేరీ పరిశోధనలకోసం కోసం రెండు పెద్ద లాబ్ లను స్థాపించాయి .వాటి భవిష్యత్ దేవాలయాలు అన్నది .ఈ పవిత్ర ఆలయం లో ఆమె నిరంతర పరిశోధనలు చేసింది .మొదటి ప్రపంచ యుద్ధం యూరప్ ను కబళింఛి నప్పుడు ,రేడియం ను అందరి దృష్టికీ తెచ్చింది .రెనాల్ట్ పాసెంజర్ ఆటో మొబైల్ ను ‘’రేడియాలాజికల్ కార్ ‘’గా మార్చింది .యుద్ధం పూర్తీ ఆయె లోపు 20 మొబైల్ యూనిట్ లను తయారు చేసి అందులో రేడియాలాజికల్ సామగ్రిని ఏర్పాటు చేసి ,200పైగా హాస్పిటల్ రూమ్ లను తయారు చేసింది .
యుద్ధం అయిన తర్వాత మేరీ అమెరికా వెళ్ళింది .అక్కడి మహిళలు ఆమెకు ఒక గ్రాము రేడియం కొనటానికి కావలసిన డబ్బు వసూలు చేసి ప్రెసిడెంట్ హార్డింగ్ చేతుల మీదుగా వైట్ హౌస్ లో కానుకగా అందించారు .రేడియం అనేది తన స్వంత ఆస్తికాదని అది సైన్స్ కు చెంది౦దని అన్నది .కార్నెజీ హాల్ లో కాలేజి లో ఆమెకు ఘన సన్మానాలు జరిగాయి .కూతురు ఈవ్ కూడా వెంట ఉంది ఆమె గొప్ప మేధావి రచయిత్రి గా ప్రసిద్ధి చెందింది .పెద్దకూతురు ఐరీన్ భర్త ఫ్రెడరిక్ జోలియట్ తోకలిసి 1935లో ‘’రేడియో యాక్టివ్ మూలకాలను కృత్రిమంగా ఉత్పత్తి చేసినందుకు నోబెల్ బహుమతిని అందుకొన్నది .అంటే క్యూరీ కుటుంబానికి నాలుగు నోబుల్స్ లభించాయి .పిల్లల కీర్తి ప్రఖ్యాతులను చూసి ఆన౦దించే సమయం ఆమెకు లేదు .తన ప్రయోగాలు ,పరిశోధనలో మునిగి పోయింది .58వ ఏట తన స్వదేశం పోలాండ్ కు వెళ్లి ,’’రేడియం ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ వార్సా ‘’కు శంకుస్థాపన చేసింది .అరవై వ ఏట రెండవ సారి అమెరికా వెళ్లి ,మళ్ళీ మరొకఅరుదైన అతి విలువైన గ్రాము రేడియం ను కానుకగా పొందింది .65వ ఏట కూడా రోజుకు 12నుంచి 14గంటలు పని చేసింది .ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది .అంధత్వం వచ్చినట్లు అనిపించింది .ఎవరికీ చెప్పలేదు .అక్క బ్రోన్యాకు జాబు రాస్తూ ‘’ .నా కళ్ళ చూపు బలహీనమై పోతోంది .ఇక వాటికి ఏ చికిత్సా పని చేయదు .ఇక నా చెవుల సంగతి చూస్తె ,నిరంతరం రణగొణ ధ్వనులు అతి పెద్దగా విని పిస్తున్నాయి .’’అని తెలిపింది .
తన వ్యాధులకు రేడియం కొంత కారణమై ఉండచ్చు ననుకొన్నది మేరీ .డబుల్ కేటరాక్ట్ కోసం నాలుగు సార్లు ఆపరేషన్ జరిగింది .అంధురాలైన తల్లికి చిన్న కూతురు ఈవ్ సేవలు చేసింది .క్రమంగా ఆమెకు చూపు వచ్చి ,’’యాక్టిమం x.’’ను తయారు చేయటం లో నిమగ్నమైంది .మరొక బాధ తో ఇబ్బందిపడింది ఎక్స్ రే తీస్తే గాల్ బ్లాడర్(పిత్తాశయం ) లో రాళ్ళు ఉన్నట్లు తేలింది .ఇక ఆపరేషన్ చేయించుకొనే స్తితి లేక ,తన పరిశోధనకు అడ్డంకి అవుతుందని వద్దని తిరస్కరించింది .1934మే నెలలో ఆమెకు తీవ్రంగా జ్వరమొచ్చి , లాబ్ .కు వెళ్ళలేక పోయింది .మళ్ళీ లాబ్ కి వెళ్ళలేదామే .బ్రాంకైటిస్(శ్వాస నాళం వాపు ) వచ్చి ,అలసట ఎక్కువై ,విపరీతమైన రక్త హీనత తో సెయింట్ సేల్మోజ్ శానిటోరియం లో 4-7-1934న 66ఏళ్ళ వయసులో డబుల్ నోబెల్ లారియెట్ మేరీ క్యూరీ తుది శ్వాస విడిచి భర్త పియరీని కలుసుకోవటానికి వెళ్ళింది .చరిత్రలో అరుదైన మహిళా సైంటిస్ట్ గా నిలిచి పోయింది మేరీ క్యూరీ .
పోలాండ్ ,ఫ్రాన్స్ దేశాలు 2011సంవత్సరాన్ని మేరీ క్యూరీ సంవత్సరంగా ప్రకటించి గౌరవించాయి .అమెరికా ఆ ఏడాదినే అంతర్జాతీయ రసాయనిక శాస్త్ర సంవత్సరం గా ప్రకటించింది .నోబెల్ బహుమతితో బాటు మేరీ డేవీ మెడల్ ,మాత్యూ మెడల్ ,ఆక్టోనియం ప్రైజ్ ,ఫ్రాన్క్లిన్ ప్రైజ్ అందుకొన్నది .అమె పేర ప్రపంచామంతా అనేక స్మారక చిహ్నాలు వెలిశాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-2-16-ఉయ్యూరు

