శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారి ‘’పద్య యోగ వైభవం ‘’-1
ప్రధాని మోడీ పిలుపు ననుసరించి ప్రపంచమంతా యోగ మాయ లో మునిగి పోతోంది .ఇప్పటి వరకు తెలుగులో యోగా పై వచన రచనలే వచ్చినట్లు జ్ఞాపకం .పద్యాలలో యోగ వైభవాన్ని సామాన్యులకు కూడా అర్ధమయ్యేట్లు చెప్పగలం అని రుజువు చేశారు డా శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు .వారికి పద్యం నల్లేరు పై బండి .చాలా సరళం గా సాగిన రచన ఇది. శృతి లయలతో పద్యానికి శోభ కలుగు తుంది .కాని అది నేడు గ్రహణం పట్టింది .ఛందస్సులో రాసినవే శాశ్వతాలు అని కవి గారి నమ్మకం .ముందుగా యోగ వైభవాన్ని బోధించిన పతంజలి మహర్షికి నమస్కరించి ,యోగాన్ని పరంపరానుగతంగా నేర్పు తున్న వారందరికీ శత కోటి వందనాలు సమర్పించారు .యోగా చేస్తే -’’ఉదర దోషంబు తొలగు ,నూబ కాయ మడుగు నంద మారోగ్యంబు నంద గలుగు –సుఖము సంతాన సౌఖ్యంబు చూర గొనగ –సాధకులకు యోగ మొక రసాయనంబు ‘’అని దాని వలన పొందే లాభాలను తెలియ జెప్పారు .దేవ ,పితృ,రుషి రుణాలు తీర్చుకొని తరిస్తారు .కాని యోగ సాధన జగతికభ్యుదయ మొసగు ‘’అని రూఢిగా చెప్పారు . యంత్రాల సాయం తో అన్ని సుఖాలు పొందుతున్నాం .’’శరీర రక్షణ ముపకరింప ,యోగ రక్షణము కల్పింప వలయు ‘’నని సుద్ది చెప్పారు .’’సకల రోగ నిరోధక శక్తికి యోగం అభయమిస్తుంది మానసిక శారీరక బాధలు నాడీ రోగాలకు దివ్యౌషధం యోగ .వజ్రాసనం ఉదర రోగాలపాలిటి వజ్రాయుధం .వ్యసనాలకు బానిస కాకూడదు .’’యోగాభ్యసనమే అభి వ్రుద్ధిపధము ‘’అని ఢంకా బజాయించి చెప్పారు .సుప్త పవన ముక్తాసనం అపూర్వ ఫలాలనిస్తుంది .భస్త్రిక చేస్తే నరాలకు ఊర్జవం వస్తుంది .ఎన్నోరకాల ఆసనాలున్నాయి గురుముఖతా నేర్చి అభ్యాసం చేయాలి .’’జీవులకు యోగమె సిద్ధు లెనయ ‘’అంటారు .
‘’వజ్రము నవ రత్నములలో వాసికెక్కు –నటులెఆసనములను వజ్రాసనంబు –అరుగుదలయు నారోగ్యంబు నలర జేయు –కాళ్ళు ముడిచి కూర్చుండి మోకాళ్ళ పైన –చేతులుంచి ఏకాగ్ర మౌ చిత్త మెనయ – వెన్నెముక నిటారుగా నిల బెట్ట వలయు –సకల జీవులన్ నరులకే సాధ్యమగును-నాత్మ యోగంబు సిద్ధింప ననువు పడును ‘’అంటూ పద్యం లో వజ్రాసనం ఎలా వేయాలో సులభంగా చెప్పారు .’’యమ నియమములా సనములు ,ప్రాణ నియతి –ధ్యాన ధారణ యోగముల్ తత్సమాది –‘’అని యోగం లో 8విభాగాలను వివరించారు .ఇలాంటి యోగామ్రుతాన్ని అందరూ గ్రోలి సుఖ శాంతులు పొందాలి .శ్వాస కోశ బాధలకు ‘’కపాల భాతి ‘’దివ్యాస్త్రమే .’’ఆత్మ యన ప్రాణ మది పరమాత్మ తోడ –జేర్చుటయే యోగ మానంద సిద్ధి ఫలము –పరిమితంబైన వ్యక్తి ,అపరిమిత మగు – విశ్వ శక్తితో జేరి వివేక మెనయ ‘’అని యోగ రహస్యాన్ని విప్పి చెప్పారు .యోగం లో ప్రాణాయామం ఊపిరి ఉండే దాకా చేయాలి .కారణం ‘’బ్రతుకు లూపిరితోడ ,సంబద్ధ మగుట –నభ్యుదయ సాధకము యోగ మరయ బ్రజకు ‘’అని యోగ అభ్యుదయ సాధనమన్నారు .యోగం శాంతి సౌఖ్యాలిచ్చే ప్రశస్త ఔషధం. యోగ సాధన వలన ఆత్మ శోధనం అలవడుతుంది .నేను, నాది అనే సంకుచిత పరిధి దాటి విశ్వ చైతన్య శక్తిలో చేరిపోతాం .’’చిత్త వ్రుత్తి నిరోధింప శీఘ్ర గతిని –బుద్ధి వికసించు నెందు నపూర్వముగను –కోరికలు జయింప బడుచు ,క్రోధ లోభ –మద మత్సరము లు విముక్తమగును ‘’అని యోగం అందించే పరమ విభూతిని వివరించారు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-2-16-ఉయ్యూరు .

