ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -111
47- భారత జాతి పిత మహాత్మా గాంధి
భారత్ అంటే ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నాటి తొలి సంవత్సరాల వరకు సామాన్య పడమటి దేశీయులకు పట్టనే లేదు .దూరం ఒక కారణం కావచ్చు .కాని 1940 నాటికి ఇండియా ను గురించి ప్రపంచ మంతా గొప్పగా చెప్పుకొనే స్థితి వచ్చింది .దీనికి కారణం ఒకే ఒక్కడు .ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధి .అతి సామాన్యంగా ఉండి ,అణకువ ,హిందూ మతం పై గాఢమైన అభి వ్యక్తీ కలిగి ,రాజకీయాలలోకి వచ్చిన ముని అని పించుకున్నవాడు .సత్యాన్ని నమ్మి ఆచరించినవాడు .
గాంధి 2-10-1869న బొంబాయి సంస్థానం లోని చిన్న సముద్ర తీర పట్టణం పోర్ బందర్ లో జన్మించాడు .అక్కడి ప్రజల మాతృభాష గుజరాతీ .తాత పోర్బందర్ కు దివాన్ అయినా ,తండ్రి రెండు చిన్న సంస్థానాలలో అదే ఉద్యోగం చేశాడు .ఈ ఇద్దరూ విధి నిర్వహణలోనే గడిపారుకాని దౌత్య వేత్తలు రాజకీయ వేత్తలు కాలేదు ..
హిందువుల విధానం లో సంఘం లో నాలుగు కులాలుంటాయి .బ్రాహ్మణులు చదువు తో తెలివి తేటలు గలవారుగా గుర్తింప బడేవారు .తరువాతవారు సమాజ, దేశ రక్షణ లో ఉండి యుద్దవీరులుగా ,రాజులుగా ఉన్న క్షత్రియులు .తరువాతి వారు వర్తక వ్యాపారాలు చేసే వైశ్యులు .అందరిక౦టే అట్టడుగు వారు కూలీ పని చేసే శూద్రులు .గాంధి కుటుంబం మూడవ జాతి వైశ్య కుటుంబం .గాంధి అంటే నే కిరాణా వ్యాపారి అని అర్ధం .కాని వీరు విలాసాలకు చేరువలో సకల సుఖాలతో జీవించారు .ఇంటిలో పాశ్చాత్య వ్యామోహం లేదు కాని ఇంటినిండా పుస్తకాలు దంతపు సామాను ,సంగీత వాద్యాలు ,న గా నట్రా బంగారం ఘనంగా ఉండేవి .తండ్రి నాలుగవ భార్యకు నాల్గవ సంతానం గాంధి .బాలగా౦ధి ని చూసుకోవటానికి ప్రత్యేకం గా ఒక నర్సు ఉండేది .గాంధి బాల్యం పవిత్రంగా సురక్షితంగా గడిచింది .కొన్ని బలహీనతలలో చిక్కుకున్నాడు .కొన్ని సార్లు పొగ తాగాడు ,మాంసం తిన్నాడు అన్నగారి డబ్బు తస్కరించాడు .15వ ఏట తాను చేసిన తప్పులనుతండ్రికి చెప్పి ఒప్పుకొన్నాడు .ఏ శిక్షకైనా సిద్ధ పడ్డాడు .తండ్రి ఏడుస్తూ కొడుకును మన్నించి పెనాల్టీ విధించకుండా శిక్షించకుండా క్షమించాడు .దీనితో మోహన్ దాస్ మారిపోయాడు .హిందూ ధర్మాలైన ప్రేమ ,సత్య భావనలు ఉత్కృష్ట మైనవిగా అర్ధం చేసుకొన్నాడు .అప్పటి నుంచే వాటిని ఆచరణలో పెట్టటం ప్రారంభించి జీవితాంతం ఆచరిస్తూనే ఉన్నాడు .
ఆ నాటి సంఘాచారం ప్రకారం గాంధీకి 13ఏట వివాహం చేశారు .పోర్బందర్ వ్యాపారి కుమార్తె కస్తూరి బాయి ఆయన భార్య. సమాన వయస్కురాలు .ఆమెతో జీవితాంతం కాపురం చేశాడు .ఈ బాల్య వివాహాలు ఆర్ధిక సౌకర్యం కోసం జరిగేవి .వివాహం విద్య నాశాయ అన్నట్లు ఒక ఏడాది చదువు గుంట కొట్టింది .భార్య కాపురానికి వచ్చింది .తనకు తెలిసిన చదువు కస్తూర్బా కు బోధించాడు .ఆమెకు గుజరాతి లో ప్రాధమిక విద్య తప్ప ఏమీ రాదు .కాని ఆమెను ఆరాధించి ప్రేమించి జీవనం సాగించాడు .యవ్వన మదం దిగలేదు .తండ్రి చనిపోయినప్పుడు ,ఆయన ప్రక్కన ఉండి సేవ చేయకుండా ,హాయిగా భార్య తో గదిలో శృంగారం లో మునిగి తేలాడు .మొదటి సంతానం పుట్టి వెంటనే చని పోయే నాటికి గాంధి దంపతులకు కేవలం 15 ఏళ్ళు మాత్రమే .మొదటి సారిగా తనకున్న వ్యామోహం పై ఏవగింపు కలిగింది .
తండ్రి మరణం తర్వాత 19వ ఏట గాంధీని లా చదవటానికి ఇంగ్లాండ్ పంపారు .గాంధికి మెడిసిన్ చదవాని ఉంది .కాని లా చదివితే సంఘం లోపలుకుబడి వ్యవహారాలను చక్క బెట్టె నేర్పు వస్తాయని కుటుంబం పట్టు బట్టింది .రెండో కొడుకును, భార్యను వదిలి 1888లో లండన్ చేరాడు .20ఏట తీసుకొన్న ఫోటో అప్పటికి గొప్ప .నల్లని జుట్టు ఒకప్రక్కకు ఒరిగి ,నల్లటి కళ్ళతో తీక్ష్ణ మైన ద్రుష్టి తో ఉండేవాడు .దొప్పల్లాంటి పెద్ద చెవులు పొడవైన కొంగ ముక్కు ,మొరటు పెదవులు .మొదటి సారి లండన్ వెళ్ళినప్పుడు పడమటి వాసన తో అల౦క రించుకొన్నాడు .చొక్కా కాలర్లకు పిండి పెట్టి స్టిఫ్ గా ఉంచుకోనేవాడు ,మార్నింగ్ కోట్ వేసేవాడు .తోలు చెప్పులు ధరించాడు .పెద్ద సిల్క్ టోపీ పెట్టేవాడు .చేతులకు గ్లోవ్స్ విలాసంగా చేతిలో కర్ర .వీటికి విరుద్ధంగా చాలా సాధారణ జీవితమే గడిపేవాడు .మైళ్ళకొద్దీ దూరం రోజూ నడిచే వెళ్ళేవాడు .కొద్దిమందే స్నేహితులు .లా తో పాటు లాటిన్ ,ఫ్రెంచ్ ,ఫిజిక్స్ లు కూడా చదివాడు .ఇంగ్లీష్ అమెరికన్ సాహిత్యాన్ని బహు ఇష్టంగా చదివాడు .తూర్పు ,పడమటి దేశాల మతాలు వాటిలోని తేడాలు అధ్యయనం చేశాడు .తమాషా ఏమిటి అంటే ఇంగ్లాండ్ లోనే మొదటి సారిగా భగవద్గీత ఇంగ్లీష్ అనువాదాన్ని చదివాడు .గీత నుండి తన జీవిత ఫిలాసఫీ ని నిర్ణయించుకొని ఆచరణ లో పెట్టాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-2-16-ఉయ్యూరు

