ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -113
47- భారత జాతి పిత మహాత్మా గాంధి -3
డబ్బు బాగా వస్తోంది . అందులో ఎక్కువ భాగం సాంఘిక అభివృధికి ఖర్చు చేసేవాడు గాంధి .దక్షిణాఫ్రికా భారతీయులకోసం ఒక నిది ఏర్పాటు చేశాడు .రస్కిన్ ఆలోచనలతో తన జీవిన విధానాన్నీ మార్చుకొన్నాడు .రస్కిన్ సూక్తి ‘’the life of labor ,the life of the tiller of the soil and the handi craftsman is the life worth living’’బాగా వంట బట్టింది .ఏ విధానమైనా పరస్పర సహకారం లేకపోతె అర్ధ రహితమౌతుంతుని నమ్మాడు .కళ,కార్యం ,ప్రేమ జీవితపరమార్ధం అని గ్రహించాడు .ఫారం ఏర్పాటు చేసి అందులో భాగస్వాములుగా అందరినీ చేర్చి తన తో పాటు పని చేసేట్లు చేశాడు .అందరుకలిసి పని చేసి ఉత్పత్తి చేసి సమానంగా అనుభవించటం అనేదాన్ని ప్రయోగాత్మకంగా విజయవంతం చేశాడు .తాను శాకాహారిగా నే ఉన్నాడు .కొద్దిగా కాయలు ,పళ్ళ తో జీవించటం అలవాటు చేసుకొన్నాడు .బ్రహ్మ చర్యాన్ని పాటించాడు .37వ ఏట నలుగురు పిల్ల తండ్రి గాంధి దాంపత్య శృంగార వ్యవహారాలకు ఇష్టంగా నే దూరమయ్యాడు .జీవితాంతం దీన్ని కొనసాగించాడు .దీనివల్ల ఏంతో శక్తి ఆదా అయి ఆయన సేవాకార్యాలకు ఉపయోగించింది .స్వయం నియంత్రణ ఆయన పధ్ధతి .మంచి చేయటం మంచిగా ఆలోచించటం తో మహాత్ముడైనాడు .
గాంధీ పత్రికా సంపాదకుడై జీవితాంతం గడిపాడు .సంస్కరణకోసం జర్నలిజం ను వాడుకొన్నాడు .ప్రయోగాలకు అది పనికి వచ్చింది. తప్పులు తెలుసుకోవటానికి సహకరించింది .38వ ఏట భారతీయు లందరి పేర్లు రిజిస్టర్ చేసి వేలి ముద్రలు తీసుకోవాలన్న చట్టం పెండింగ్ లో ఉన్నప్పుడు జోహాన్స్ బర్గ్ లో భారీ నిరసన సభ నిర్వహించాడు . ప్రతి ఒక్కరిని ఒప్పించి ఆచట్టాన్ని వ్యతిరేకించాలని ,అవసరమైతే అరెస్ట్ అయి జైళ్లకు వెళ్ళినా దెబ్బలు తిన్నా ప్రాణాలు పోయినా అంగీకరించరాదని తెలియజేశాడు .మొదటి సారిగా ఇక్కడ ప్రారంభించిన ఈ నిరసన తర్వాత ఇండియాలో చాలాసార్లు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎదురు నిల్చి ఉద్యమించాడు దీనికే సత్యాగ్రాహం అని పేరు పెట్టాడు గాంది .ఇదే సత్య శక్తి లేక సత్య ప్రేమ .అక్కడి ప్రభుత్వం గాంధి ప్రొటెస్ట్ ను లెక్క చేయలేదు .చట్టం పాసైంది .గాంధీ వ్యతిరేకించి అరెస్ట్ అయ్యాడు .’’ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధి ‘’అనే అత్యద్భుత గ్రంధం రాసిన లూయీ ఫిషర్ తో గాంధీ ‘’జైలు నేరగాళ్లకు దొంగలకు అందరికీ జైలే .నాకు మాత్రం అదొక భవనం .దోరో ను చదవక ముందు నుంచే నేను జైలు కు వెళ్లాను ‘’అని చెప్పాడు
జైలు లో ఉండగానే గొప్ప రచనలు చదవటం పై మనసు కేంద్రీకరించాడు .దక్షిణాఫ్రికా జిల్లాలో గాంధి 249రోజులున్నాడు .ఇండియా జైళ్లలో,2089రోజులు గడిపాడు .ప్రజావ్యతిరేక చట్టాలను ప్రజలందరూ వ్యతిరేకిస్తే ప్రభుత్వం ప్రజలందరినీ జైళ్లలో పెట్టలేదని ,చివరికి దిగివచ్చి ప్రజలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నాడు .ఆయన ఫిలాసఫీ తర్వాత నిజంగానే రుజువైంది .దక్షిణాఫ్రికా నాయకుడు జనరల్ స్మట్స్ కొంత దిగొచ్చి ,ఇండియన్లు స్వచ్చందంగా పేర్లు నమోదు చేసు కొంటామని చెబితె చట్టాన్ని ఉప సంహరిస్తామని ప్రకటించాడు .దీనికి అందరూ వ్యతిరేకించినా గాంధీ అంగీకరించాడు .అందరిలాగానే గాంధీకి కూడా స్మట్స్ పై అనుమానం ఉన్నా’’ ప్రేమ సత్యం నమ్మకాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండేవని చెప్పాడు .దేనికైనా ప్రాతి పదిక నమ్మకమే .ఒక వేళ స్మట్స్ మోసం చేస్తే మళ్ళీ ఉద్యమిద్దాం .నమ్మకం లేక పొతే భవిష్యత్తు లేదు .’’అని అందరికి చెప్పి తానె మొదట తన పేరును నమోదు చేసుకొన్నాడు.కాని ఇప్పటిదాకా ఆయన్ను నమ్మి అనుసరించిన వారే గాంధీ మోసగించాడని తిట్టారు ,అసహ్యి౦చు కొన్నారు ,కొట్టారు కూడా .దాదాపు చంపినంత పని చేశారు ఇదే ఆయన ఎదుర్కొన్న సత్య పరీక్ష .
అనుకోన్నట్లే స్మట్స్ తన వాగ్దానం నిలబెట్టుకోలేదు. చట్టాన్ని ఉపసంహరించ లేదు.గాంధీ వ్యూహా సంచారి అయి ఉంటె ఈ సంఘటన తో మట్టి గరచి ఉండేవాడు .కానీ ఆయన కలల బేహారి కాడు.ఒక ఆచరణ శీలి అయిన రాజకీయ నాయకుడు .ఒకసారి మొదలు పెట్టాక ఆగటం అసాధ్యం అని తెలిసినవాడు .స్మట్స్ ను నమ్మి చేసిన పొరబాటు ఆయన్ను నాశనం చేసి ఉండాలి .’’ సత్యాగ్రహ బలం ఏమిటో ప్రపంచానికి తెలిసింది .మనలను వ్యతిరేకి౦చే వాడికి పరిస్తితులనుపూర్తిగా అర్ధం చేసుకోవటానికి మరో అవకాశం ఇద్దాం.’’అని చెప్పి ,మళ్ళీ ప్రజా సమీకరణ చేశాడు. ఈ సారి అందరూ ఆయనపై పూర్తీ విశ్వాసముంచి ముందుకు కదిలారు .అప్పటిదాకా ధరించిన యూరోపియన్ వేషాన్ని తీసి పారేశాడు . తెల్లని పంచ ,అంగోస్త్రాన్ని కట్టాడు,మామూలు చెప్పులు తొడిగాడు .అసలైన భారతీయుడిలా కనిపించాడు .వేలాదిగా పురుషులు స్త్రీలు పిల్లలతో బ్రహ్మాండమైన ప్రొటెస్ట్ మార్చ్ నిర్వహించాడు .గని యజమానులు సానుభూతి చూపారు .రైల్ రోడ్ ఉద్యోగులైన తెల్లవారు కూడా సమ్మెలో చేరారు . .పరిస్థితులు చేయి దాటి పోతున్నాయని ప్రభుత్వానికి అర్ధమైంది .స్మట్స్ దిగొచ్చి మరోమారు సంప్రదింపులు జరిపాడు .’’ఇండియన్ రిలీఫ్’’ గాంధీకి అద్భుత విజయాన్ని కట్ట బెట్టింది .అనుకొన్నది సాధించి తిరుగులేని ప్రజానాయకుడు, ప్రజా బంధువు అయ్యాడు గాంధి .
46వ ఏట గాంధి బ్రిటిష్ కబంధ హస్తాలనుండి ఇండియాకు విముక్తి కలిగించాలన్న ధ్యేయం తో ఇండియాకు తిరిగొచ్చాడు .మొదట్లో అది అసాధ్యమని పించింది .ఇండియా చాలా పెద్ద దేశం అనేక కులాలు వర్గాలు భాషలతో ఉన్న దేశం .హిందూ ముస్లిం ల మధ్య సఖ్యత లేదు .కులాల వారీగా హిందూ సమాజం చీలి పోయి ఉంది .దక్షిణాఫ్రికాలో విజయం సాధించినట్లుగా ఇక్కడ విజయం పొందటం చాలా కష్టం .కాని అసాధ్యం మాత్రం కాదు .ఇండియా రాగానే మొదటగా ప్రజలకు తమ గౌరవాన్ని గుర్తు చేశాడు .వారికున్న సంస్కృతీ అనాది అని దాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు .అన్నికులాలుసమానమేనని తెలిపాడు .అందరూ గౌరవం గా సహకారం తో నమ్మకం తో జీవి౦చా లన్నాడు .అసమానత తొలగిపోవాలి .నిరక్షరాస్యత రూపు మార్చాలి .స్వయం గా వేసుకొన్న బంధనాలనుండి అందరూ ముందుగా విముక్తి పొందాలి. తర్వాత భారతమాత దాశ్య శృంఖలాలను చేదించి స్వతంత్రం సంపాదించాలి .స్వేచ్చ స్వాతంత్ర్యాలు అందరి అభి వృద్ధికీ తోడ్పడాలి .భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా సంచరించి పరిశుభ్రత పాటిస్తేనే జీవన వృద్ధి జరుగుతుందని బోధించాడు .అంటరాని తనం భారతీయ సమాజానికి చేటు అని దాన్ని రూపు మాపాలని తీవ్రంగా ప్రచారం చేశాడు. తానే ముందుగా తన ఆశ్రమం లో ఒక నిరుపేద అంటరాని కులానికి చెందిన అమ్మాయికి ఆశ్రయమిచ్చి అందరికి మార్గదర్శి అయ్యాడు .పారిశ్రామీకరణ భారతీయ కుటీర పరిశ్రమలకు హాని చేసిందని ,మన కుటీర పరిశ్రమలకు చేయూత నిచ్చి కాపాడుకోవాలని ఉద్బోధించాడు .గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహం కలిగించాలన్నాడు .చేనేతకు అధిక ప్రాధాన్యమిచ్చి స్వయంగా రాట్నం పై తన వస్త్రాలకు సరిపడా నూలు తీశాడు .దీనితో ప్రతి ఇంటా రాట్నం వెలిసింది .చేతి పరిశ్రమలకు ఊతమొచ్చింది .పల్లె టూళ్ళు ప్రగతి పదంలో చేరాయి గ్రామీణాభి వృద్ధే దేశాభి వృద్ధికి రాచబాట అన్నది గాంధీ పిలుపు .
గాంధీ నాయకత్వం తో జాతీయోద్యమం పరవళ్ళు తొక్కింది బ్రిటిష్ ప్లా౦టర్స్ భారతీయ రైతులను పీల్చి పిప్పి చేస్స్తుంటే చంపారాన్ కు వెళ్ళాడు .గాంధీని జోక్యం కలిగించుకోకుండా బ్రిటిష్ ఆఫీసర్లు అడ్డం పడ్డారు .చట్టాన్ని వ్యతిరేకి౦చాడని కేసుపెట్టి ఇబ్బందికలిగించారు .అదొక గొప్ప సంఘటనగా చరిత్రలో నిలిచి పోయింది .ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది .ఇంపీరియల్ ప్రభుత్వం ఇండియా పౌరుడిని రౌడీ గా చిత్రి౦చ లేదని గ్రహించింది .చంపారాన్ పోరాటం పై లూయీ ఫిషర్ రాస్తూ ‘’it did not begin as an act of defiance ,It grew out of an attempt to alleviate the distress of large numbers of poor peasants .This was typical Gandhi pattern .His politics were intertwined with the practical day –to-day problems of the millions His was a loyalty to living human beings but not a loyalty to abstractions .In every thing Gandhi did ,he tried to mold a new free Indian who could stand on his own feet and thus make India free .He was a natural fighter and a born peace maker He had the might of a dictator and the mind of a democrat ‘’అంటూ చక్కగా విశ్లేషించి మహాత్ముని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .ఆయన యంత్రాలను నమ్మక పోవటానికి కారణం ఆయన మాటలలోనే ‘’the human today is a most delicate piece of machinery ‘’.అనేకులపై ఎక్కి యంత్రం స్వారిచేస్తూ కొద్దిమందికే ఉపయోగ పడుతుంది ‘’అన్నాడు .మార్క్స్ చెప్పిన లేబర్ సర్ప్లస్ విలవ ను నమ్మాడు. కార్మికులు యజమాని మధ్య ఘర్షణ అర్ధం చేసుకొన్నాడు .కాపిటలిజం తగదన్నాడు .భౌతిక ,ఆధ్యాత్మిక స్వేచ్చ ను గాంధి ప్రచారం చేశాడు .చర్చించాడు రాశాడు నచ్చ చెప్పాడు ,మందలించాడు వినక పొతే చివరి ఆయుధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు .వ్యతిరేకులకు భయం కలిగించటానికో ,ప్రచారం కోసమో నిరాహార దీక్ష చేయలేదు .తనను నమ్మిన వారినందరినీ ఏకం చేయటానికి వారి ద్రుష్టి కేంద్రీకరణకోసం మాత్రమే చేశాడు .సమస్యపై పలు కోణాలలో అధ్యయనం చేసి దాన్ని సాధించటానికి ఒక మార్గం గా చనిపోవటానికైనా తాను సిద్ధం అని తెలియ జేసిన వాడు గాంధీ మహాత్ముడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-2-16-ఉయ్యూ

