సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం ,స్పురద్రూపం ,ఆకట్టుకొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గళ వాగ్వైభవం ,చాందస భావాలకు దూరం ,అయినా సనాతన సాహిత్యం పై విపరీతమైన అభిమానం ,పూర్తీ కమ్యూనిస్ట్ అయినా, విశ్వనాధ అన్నా ఆయన సాహిత్యమన్నా వల్లమాలిన అభిమానం ,అభిరుచి ఉన్నవారే శ్రీ చక్ర వర్తుల రాఘవాచారి .ఈ పేరు చాలా మందికి తెలియదు .సి రాఘవా చారి అంటే కొంతమందికీ ,సి రా ‘’అంటే ఇంకొంచెం మందికి విశాలాంధ్ర రాఘవాచారి అంటే అందరికీ తెలుస్తుంది .33 ఏళ్ళు  విశాలాంధ్ర దిన పత్రికకు సంపాదకులుగా ఉండి,ఎన్నోన్నో సంపాదకీయాలు తనదైన శైలిలో నిర్మించి ఆ పత్రికకే గొప్ప సొబగు తెచ్చినవారు .విజయవాడలో ఆయన లేని సభ దాదాపు ఉండదు .రేడియోలో ఆయన ప్రసంగించని అంశం ఉండదు .చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పున్నవారు .ఆయన విజయవాడ వారే అని అందరూ అనుకొంటారు . కాదు .

బి ఏ చదివి ,సంస్కృతంలో విద్యా భూషణ అయి ,ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి తెలుగు ఏం ఏ .సాధించి  ,హైదరాబాద్ ఏ ఎస్ .సి లో పండిత శిక్షణ పొంది ,సంస్కృతం  లోనూ ఏం ఏ .అందుకొని ,మూడేళ్ళు సంస్కృత ఉపన్యాసకురాలిగా పని చేసి ,16ఏళ్ళ నుండి తెలుగు పండితురాలిగా ఉద్యోగిస్తూ ,  శ్రీ కోయిల్ కందాడైశ్రీనివాసన్ ను వివాహమాడి ,పుత్రుని పొంది ,సరసభారతికి ఆత్మీయురాలైన శ్రీమతి కొమాండూరి కృష్ణా ,’’రాఘవాచారి గారి సంపాదకీయశైలి  ‘’అనుశీలనం 2008లో  రాసి ప్రచురించి నాలుగు నెలల క్రితం  నాకాపుస్తాకాన్నిస్తే, తీరికగా నిన్నా ఇవాళా చదివి ,అందులో చాలా విషయాలు చాలా మందికి తెలియవు అనే అభిప్రాయం తో ముఖ్య విషయాలను మీకు అందిస్తున్నాను .

సాహితీ సంపాదకచక్రవర్తి శ్రీ చక్రవర్తుల రాఘవా చారి తెలంగాణాలోని వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం ‘’శాతాపురం ‘’లో 10-9-1939న శ్రీ నల్యాన్ చక్రవర్తుల వరదాచార్యులు ,శ్రీమతి కనకవల్లి దంపతులకు జన్మించారు .తొమ్మిది మంది సంతానం .అయిదుగురు అన్నదమ్ములలో చివరి వాడు .అందరు ‘’రాఘవన్ ‘’అని పిలిచేవారు .తల్లిగారిది కృష్ణాజిల్లా మానికొండ దగ్గర బొకినాల గ్రామం .ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్య నేర్చారు .అమ్మ తమిళం నేర్పింది .ఆంధ్రనామ సంగ్రహం ,రుక్మిణీ కల్యాణం బాల్యం లోనే చదివేశారు .అన్నయ్యలతో పాటు గుంటూరు జిల్లా పొన్నూరులో ఉండి అక్కడి భావనారాయణ సంస్కృత కళాశాలలో శ్రీ సంపత్కుమారాచార్య ,చల్లా సత్య నారాయణ శాస్త్రి గారల వద్ద పంచకావ్యాలు నేర్చారు .1951లో హైదరాబాద్ లోని లాల్ గుడా రైల్వే స్కూల్ లో హైస్కూల్ విద్య పూర్తీ చేశారు .  నిజాం కాలేజి లో పి యు  సి .మొదటి బాచ్ లో చేరి ఉస్మానియా పరిధిలో 6వ రాంక్ లో పాసైనారు .ప్రీ ఇంజనీరింగ్ పాసైనా ఇంజనీరింగ్ లో చేరకుండా బి ఎస్ సి లో చేరి చదివి ఉత్తీర్ణులయ్యారు

1961లో ఉస్మానియాలో ‘’లా కోర్సు ‘’చదివి ,ఎ.ఎల్ ఏం కూడా పూర్తీ చేశారు .ఇక్కడే రాజకీయ అరంగేట్రం చేశారు .అప్పటి ఆర్ట్స్ కాలేజి విద్యార్ధి ప్రెసిడెంట్ మాజీ కెంద్ర మంత్రి శ్రీ జయపాల్ రెడ్డి .వీరిద్దరూ సన్నిహితంగా మెలిగారు .సి ఆర్ ను ‘’ఆంధ్రా ‘’అని ,’’చైనీస్ కమ్యూనిస్ట్ ‘’అనీ సహచరులు పిలిచేవారు.వీరికి ధర్మ శాస్త్రాధ్యయనం ‘’జూరిస్ ప్రిడేన్స్’’అంటే విపరీతమైన అభిమానం ..ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ అయినా పట్టుదలగా దానినే ఎంచుకొని 1964లో పాసైనారు .క్రికెటర్ శ్రీ జయ సింహ ,దర్శకుడు శ్యాం బెనెగల్ ,శ్రీ చేకూరి రామారావు ,శ్రీ జే బాపురెడ్డి ,ఆచార్య శ్రీ జి వి సుబ్రహ్మణ్యం ,అంపశయ్య నవీన్ ,శ్రీ ముదిగొండ వీరాభాద్రయ్య వీరి సహ విద్యార్ధులు .అప్పటికే కమ్యూనిజం ను అవపోసనపట్టిన వీరు ఉద్యమం లో మొదట చనిపోయి అమరురాలైన శ్రీమతి చాకలి ఐలమ్మ ప్రేరణ గా నిలిచింది .1948లో తెలంగాణా లో రజాకార్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు వీరి కుటుంబం కమ్యూనిస్ట్ లకు  ఆశ్రయ మిచ్చింది .తాతగారు శ్రీ నరసింహా చార్యులు గొప్ప ఆయుర్వేద వైద్యులు .ఇంటికి దగ్గరగా పాకలు వేయించి ఆసుపత్రులుగా మార్చి వైద్య సేవ చేశారు .ఇంటికి ఎవరు వచ్చినా వండి వడ్డించే దొడ్డ ఇల్లాలు వీరి తల్లిగారు .1953నుండి ‘’విశాలాంధ్ర ‘’పత్రికను చదవటం ప్రారంభించారు ‘’జన ధర్మ ‘’ను కూడా  చదివే వారు .కమ్యూనిస్ట్ నాయకుసు శ్రీ మోటూరు హనుమంతరావు రచనలంటే ఇష్టపడి చదివేవారు .

కాలేజీ చదువులోనే’’ క్రీడాభిరామం లో ఓరుగల్లు వర్ణన ‘’వ్యాసం రాసి ప్రశంసలందు కొన్నారు .శ్రీ శ్రీ వరవర రావు లపై రాసిన వ్యాసాలూ ‘’సృజన ‘’లో ప్రచురితమైనాయి .ఇప్పటికీ రోజుకు రెండు గంటలైనా సాహిత్యాధ్యనం చేయకుండా ఉండరు .భావాలలో కమ్యూనిస్ట్ అయినా వేషధారణ సంప్రదాయ పద్ధతిలోనే ఉండేది .పిలక కూడా ఉండేది అందుకే విద్యార్ధి దశలో ‘’యెర్ర సభ్యతం ‘’తీసుకోలేదు .తండ్రి తద్దినాలు కూడా పెట్టేవారు .చివరి సారిగా 1959-60లో పెట్టి ‘’ఇక పెట్టను ‘’అని ప్రకటించి సభ్యత్వం  తీసుకొన్న నిబద్ధత ఆయనది ..ఆదర్శాలు మాటల్లో కాదు చేతల్లో చూపిన వారాయన .శ్రీ కనపర్తి నాగయ్య గారి చివరి కూతురు ,న్యాయవాది అయిన శ్రీమతి జ్యోత్స్నను ‘’కులాంతర  ఆదర్శ ,ప్రేమ వివాహం ‘’చేసుకొన్నారు . ఈ విషయం నా లాటి చాలామందికి తేలియదు.వీరిది చాలా అన్యోన్య దాంపత్యం .’’మాస్టర్ ఆఫ్ లాస్ ‘’అయిన భర్తావద్ద ధర్మ సందేహాలు తీర్చుకోనేవారామె .

న్యాయ వాదవ్రుత్తి స్వీకరించకుండా జర్నలిజం పై ద్రుష్టి పెట్టారు .భారత రాజ్యాంగం ,ఇతర దేశాల రాజ్యా౦గాలను  తులనాత్మకంగా పరిశీలింఛి విషయాలను కరతలామలకం చేసుకొన్నారు .అన్నీ ‘’ఫింగర్ టిప్స్’’పై ఉండేవి .’’భాషా సాహిత్యాలపై ఉన్న టెంపరమేంట్ పార్టీ నిర్మాణం లో పనికి రాదు ‘’  అని గ్రహించి పార్టీ పత్రికలో పని చేసేందుకు సిద్ధమయ్యారు .తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ శ్రీ మోహిత్ సేన్ ప్రభావం తో హైదరాబాద్ లో విశాలాంధ్ర విలేకరిగా చేరారు .నాలుగేళ్ల తర్వాత పేట్రియట్,  లింక్ పేపర్లకు పని చేశారు .1968లో ధిల్లీ లో పేట్రియట్లో పని చేస్తూ ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ‘’హాబ్స్ వెన్ ‘’ను ఇంటర్వ్యు చేయటం మరపు రాని అనుభవమైంది .

అనేక విశ్వ విద్యాలయ జర్నలిజం కోర్సులకు అధ్యాపకులుగా ,సందర్శనాచార్యులుగా ,,ఎక్సామినర్ గా సేవలందించారు .1971లో విశాలాంధ్ర సంపాదక వర్గం లో చేరి ,1972లో సంపాదక బాధ్యత,2002వరకు  వహించి దాని ఉన్నతికి ముఖ్యకారకులైనారు .2006లో సాంకేతికంగా విశ్రాంతి పొందినా సలహాలు సంప్రదింపులు అందిస్తున్నారు .33ఏళ్ళ కుర్ర వయసులో సంపాదకుడైన ఆచారిగారు’’ ప్రజా సంపాదకులు ‘’ గా పేరు తెచ్చుకొన్నారు .

పుస్తక ముఖ చిత్రం జత చేశాను చూడండి

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.