సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )
సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ,జీవనాధారం సంపాదకీయ రచనే .ఈ రచనలో క్లుప్తత స్పష్టత నిబద్ధత ,వార్తవిలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తాయి .నిష్టగా ఇష్టం తో రాశారు .సుమారు 5వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా తెలుగు ,పోతన జీవన రీతిలో నీతి ,పత్రికలూ ,పరిణామం ,ప్రయోజనం వంటివి అమూల్యాలని పించాయి .’’పత్రికకు సంపాదకత్వం వహించేది సంపాదకుడో,అడ్వర్ టైజ్ మెంట్ మేనేజరో తెలియటం లేదు ‘’అని నిజాన్ని నిర్భయంగా చెప్పారు .సంగీత సామ్రాజ్ఞి ఏం ఎస్ అంటే మహా అభిమానం .ఆమె సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి గేయాలను పాడి యువతకు మార్గ దర్శనం చేశారని మెచ్చుకొన్నారు .ప్రజా హక్కుల సాధనకోసమే ఆయన కలం పనిచేసింది .ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం ఆయనది
సి రా .ఒక విజ్ఞాన సర్వస్వంగా భాసించే వారు .తాపీ ధర్మారావు ,విజయ లక్ష్మి ,చింతామణి ,కాశీనాధుని ,స్మారక అవార్డులను అందుకొన్నారు .సిద్ధార్ధ కళా పీఠం,రాష్ట్ర ప్రభుత్వం ,రామినేని ఫౌండేషన్ ,మద్రాస్ తెలుగు అకాడెమీ వీరిని ఆహ్వానించి ఘన సన్మానం చేశాయి .జాతీయ సమైక్యతా పురస్కారం అందుకొన్నజర్నలిస్ట్ సరస్వతి ఆచారి గారు .సాటి పత్రికా సంపాదకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు వీరిని ‘’త్యాగధనుడు ‘’అని కీర్తించారు .తమ విశ్వాసాలతో ఏకీభవించని వారితోనూ కలిసి మెలిసి సంచరించే విశాల హృదయం ఆయనది .ఇదే అరుదైన వ్యక్తిత్వం .అతిసున్నిత మనస్తత్వం ఆయనది .’’అక్షర శాస్త్ర దారి ‘’ అయిన ఆయన కలానికీ గళానికీ విపరీతమైన శక్తి ఉంది .మౌనంగా కళా సాహిత్యార్చన చేసే సంస్కారి .సంస్కరణ వివాహాలు వీరి చేతుల మీదుగా వెయ్యి కి పైనే జరిగాయి .వివాహ పరమార్ధాన్ని అతి తేలిక మాటలతో వివరించి చెబుతూ జరిపించే వీరి పధ్ధతి సర్వ జనామోదమైంది .విశాలాంధ్ర సంస్థాపకులు శ్రీ మద్దూరి చంద్ర శేఖర రావు ఉపన్యాసాల పరంపరకోసం ప్రముఖ పాత్రికేయులైన ఏం. చలపతిరావు గారిని ఆహ్వానించి ప్రారంభం చేయటం ఆయన విశాల దృక్పధానికి గొప్ప నిదర్శన .వీరి సంపాదక ప్రతిభను గుర్తించిన ఈ నాడు సంపాదకులు శ్రీ రామోజీ రావు పొత్తూరి వారితో వీరిని తమ పత్రికలో పని చేయమని ఆహ్వానం పంపగా సున్నితంగా ‘’ఎందుకు లెండి ‘’అని తిరస్కరించిన నిబద్ధత వారిది . నిరాడంబరతకు నిజరూపం ,విలాసాల మీద మోజు లేని వారు .కమిటెడ్ కమ్యూనిస్ట్ .
సంస్కృతం ఎకానమీ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ కు ఉదాహరణ .శ్లోకాలు తేలిగ్గా గుర్తుంటాయి అని మెచ్చుకొన్నారు .గొప్ప పద ప్రయోగ శైలి వారిది .”’Fundamentals of Bharata Natya Shastra ‘’కు ముందుమాట రాస్తూ ‘’శతాబ్దాలుగా కళ నే నమ్ముకొని ,ప్రచారం చేస్తూ ,కూచిపూడి వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది ‘’అన్నారు .సమాజం లోని అన్ని కోణాలను స్ప్రుసించే కవిత్వం అమృతం కురిసిన రాత్రిలో దేవరకొండ బాల గంగాధర తిలక్ రాశాడని చెప్పారు .వట్టికోట ఆల్వార్ స్వామి ,దాశరధి ,కరుణశ్రీ , లపై గాఢమైన మమకారమున్నవాడు ఉద్యమ కవితగా ప్రసిద్ధి చెందిన వేములపల్లి శ్రీ కృష్ణ గేయం ‘’చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ‘’అంటే వీరాభిమానం .పుట్టపర్తి వారి శివ తాండవం చదివి పులకించిన సంస్కారి .అందులో ‘’హరియే హరుడై ,లచ్చి అగజాత యై సరికి సరిగ ,హరులోన హరి చూసి ,హరి యందు హరు జూసి ,భేద భావన లెల్ల బ్రదిలి పాడేనమ్మా భవుడు ‘’,అన్న రచనలో అద్వైత సిద్ధి కనిపిస్తుంది .నటరాజ తాండవానికి జగన్మాత లాస్యానికి అందె అద్వైత౦ దర్శన మిస్తుంది .ప్రతీకాత్మక మైన సంప్రదాయ వాదన విచ్చుకొని ,,చూడ గల లోచూపు గల వ్యక్తీ ,సంఘం ,సాహిత్యం ,జీవితాల పరస్పరాశ్రయాను బంధాల ఏకాత్మతా బంధం సాక్షాత్కరిస్తుంది ‘’అని విశ్లేషించిన సంస్కారి .
విద్యా వైద్య ,రాజకీయ ,న్యాయ చట్ట విషయాలెన్నిటి పైనో వేలాది వ్యాసాలూ రాసి మనసుకు హత్తుకోనేట్లు చేసిన హృదయవాది ,అభ్యుదయ వాది.. శ్రీ జువ్వాది గౌతమ రావు గారు విశ్వనాధ కల్ప వృక్షం లో ని పద్యాలను రెండుగంటలకు పైగా బెజవాడ రామ మోహన గ్రంధాలయం లో అచ్చగా విశ్వనాధ పాడినట్లే పాడుతుంటే రాఘవాచారిగారు ఆ రెండు గంటలు తన్మయ స్థితి లో వినటం నేను చూశాను .కార్యక్రమం అవగానే వారిని ‘’మీరు కమ్యూనిస్ట్ ,విశాలాంధ్ర సంపాదకులు కదా ,విశ్వనాధ పై ఇంత ఆరాధన ఎలా సాధ్యమైంది “”అని అడిగా .చిరు నవ్వు నవ్వి ‘’అది వ్రుత్తి ధర్మం ఇది ప్రవ్రుత్తి ధర్మ౦ ‘’అన్నారు. అప్పుడు వారి సంస్కారానికి జోహార్లర్పించాను .బెజవాడలో ఎన్నో సభలలో వారిని దర్శించాను .అంతటి సంస్కారి సజ్జనులు ,సహృదయులు నిబద్ధ జీవి ,విశాల హృదయులు శ్రీ రాఘవాచారి గారి సంపాదకీయ శైలిని శ్రీమతి కొమాండూరి శ్రీ కృష్ణ అత్యద్భుతంగా ఆవిష్కరించారు . ఆమెను అభినందిస్తూ ముగిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-4-16-ఉయ్యూరు

