భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -1

కాంచీపుర వైభవాన్ని  కాంచు దాము రా రండి

Inline image 1Inline image 2

‘’అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా –పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః’’అన్న శ్లోకం తెలియని భారతీయుడు ఉండడు.ఇందులో మధ్యలో ఉన్న కాంచీ పురాన్ని మనం కాంచ బోతున్నాం .కాంచి అంటే మధ్య భాగం .ఓద్యాణంఅంటారు అంటే వడ్డాణ౦ అన్నమాట .శరీర మధ్య భాగాన ధరించే నగ .కాంచిని ఓద్యాణపీఠం అంటారు .స్వయంభువు చేత పూజింప బడింది కనుక కాంచి అయిందని శివపురాణసంగ్రహం అన్నది  .దిగ్గజాలు పూర్వం ఇక్కడ విష్ణువును పూజించటం చేత దీనికి ‘’హస్త గిరి ‘’అనే పేరొచ్చింది .కనుక కా౦చీని’’ హస్తగిరి’’ అనీ అంటారు .-‘’దిగ్నాగై రర్చితస్తత్ర పురా విష్ణుః సనాతనః ‘’

కాంచి అంటే ‘’మొలనూలు ‘’అనే అర్ధం కూడా ఉంది .మణి,కా౦చనాదుల ప్రభలతో వెలిగేది అని భావం .భూమిని విశ్వంభర అంటారు .భూమి అనే ఉత్తమ నాయిక మొలనూలుగా కాంచీ పురం భాసిస్తోంది .కాశీ ఖండం లో మూడు భువనాల కంటే మనోహరమైనది కాంచీ అని చెప్పబడింది .-‘’జగామ నగరీం కాంచీం కాంతాం త్రిభువనాదపి’’.భాగవతం దశమ స్కంధం ,71వ అధ్యాయం 4వ శ్లోకం లో  బలరామ తీర్ధ యాత్రా ప్రకరణం లో ‘’కామ కోటి పురీ కాంచీ ‘’అని ప్రశంసింప బడింది .’’మేరు తంత్రం ‘’అనే గ్రంధం కాంచీ –బ్రహ్మాండానికి నాభి స్థానం అని పేర్కొన్నది .అశోకుని శిలా శాసనాలలో చేర ,చోళ ,పాండ్య రాజ్యాలతో బాటు సత్య పుత్రుని రాజ్యం కూడా ఉందని తెలియ జేయ బడింది .కాంచీ ని’’ సత్య వ్రత క్షేత్రం’’ అనీ అంటారు .ఆ రాజును బట్టేఈ  పేరు వచ్చి ఉండ వచ్చు ‘’.బెంగాలీ విశ్వ కోశం’’లో కాంచీ ని ‘’మహా పీఠ స్థానం ‘’అని ఉన్నది  .అష్టాదశ శక్తి పీఠాలలో కాంచీ ఒకటి .

కా౦చీలో 108శివ క్షేత్రాలు ,18వైష్ణవ క్షేత్రాలున్నాయి .విష్ణు కంచిలో శ్రీ వరద రాజ స్వామి ఆలయం ప్రసిద్ధమైనది .అందులో వంద స్తంభాల మండపం ,శిల్ప ప్రతిభ వెదజల్లే రాతి వ్రేలాడే గొలుసులు ,,స్వామి మెడ లో సాలగ్రామ శిల బంగారు వెండి బల్లులున్నాయి.వాటిని తాకితే బల్లిపడిన దోషం పోతుంది. తాకిన వారిని తాకినా అదే ఫలితం కలుగుతుంది అని నమ్మకం .అమ్మవారి పేరు ‘’పెరు౦ దేవి ‘’పుష్పవల్లీ తాయార్ అనీ పిలుస్తారు .బంగారుపూత ఉన్న ధ్వజ స్థంభం ఇక్కడి ప్రత్యేకత .ఆలయ ప్రాంగణం లో అనంత తీర్ధం ,వసంత ,అభిషేక ,పవిత్రోత్సవ మండపాలు వైష్ణవ భక్త మందిరాలు ,ఉద్యానవనంముచ్చట గొలుపుతాయి .మే ,నూన్ నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లార్డ్ క్లైవ్ స్వామికి నవ రత్నాలు సమర్పించాడని ,ప్లేస్ అనే ఆంగ్ల దొర లక్షలు విలువ చేసే మణులు దానం చేశాడని చరిత్ర చెబుతోంది .

కాంచిలో 4కొట్టాలున్నాయి రుద్ర కొట్టం లో శ్రీ ఏకామ్ర నాధుడు ,కామ కొట్టం లో శ్రీ కామాక్షీ అమ్మవారు ,పుణ్య కొట్టం లో శ్రీ వరద రాజ స్వామి ,కుమార కొట్టం లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర  స్వామి కొలువై ఉంటారు .పూర్వ తమిళ సాహిత్యం లో ,పతంజలి భాష్యం లో కంచి వివరాలున్నాయి .పంచ లింగాలలో ప్రుద్వీలింగం అంటే సైకత  లింగమే ఏకామ్ర నాద స్వామి

అపరాజిత ,అశ్వత్ధ వృక్షాలతో అలంకరింప బడిన కాంచీ క్షేత్రం లో ఉన్న దివ్య సరోవరం దగ్గర బంగారు గృహం ఉందని అక్కడ  లక్ష్మీసమేత శ్రీ వరద రాజస్వామి వేంచేసి ఉన్నాడని అప్పయ్య దీక్షితులు వరద రాజ స్తవం లో వర్ణించాడు .వామన పురాణం ‘’తేజస్వంతులలో సూర్యుడు ,స్త్రీలలో రంభ ,ఆశ్రమాలలో గృహస్తాశ్రమం ,పురాలలో కాంచీపురం శ్రేష్టం అని చెప్పింది .-‘’తేజస్వినా యద్వది హార్క,ఉక్తో నారీషు రంభా ,–ఆశ్రమిణాం గృహస్తః  ,కాంచీ తదా శ్రేష్ట తయా పురీణాం-దేశేషు సర్వేషు చ మధ్య దేశః ‘’.కాశీలో ఉండటం కంటే  కాంచీలో ఉండటం శ్రేష్టం అని సనత్కుమార సంహిత –‘’శ్రీమత్కాశీపురీ వాసా ద్వాసః కాంచీ పురే వరః ‘’అన్నది .కాంచీ లో ఉన్న దివ్య సరస్సు దగ్గర ‘’పంచ నాగాది’’సరస్సులున్నాయని ,అందులో ‘’నాగ హ్రదం ‘’ శ్రేష్ట మని ,దాని దగ్గరే ఆశ్వత్దాది వ్రుక్షాలున్నాయని ,,మధ్యలో హిరణ్య గృహం ఉందని ,పుణ్య కోటి అనే విమానం ప్రసిద్ధమైనదని ,దానిలో దివ్య మూర్తి అయిన వరద రాజ స్వామి నెలకొని ఉన్నాడని సనత్కుమార సంహిత పేర్కొన్నది .ఇది ఛాందోగ్య ఉపనిషత్ లో చెప్పిన ‘అరశ్చహ వై —హిరణ్యం ‘’మొదలైన మంత్రాలతో చెప్పినట్లే ‘’ద్యులోకం లో అరమని ,ణ్య మని రెండు సముద్రాలున్నాయని ,అక్కడే సంతోషాన్నిచ్చే’’ ఐరం మదీయం ‘’అనే సరస్సు ,అమృతాన్ని స్రవించే అశ్వత్ధ వృక్షం ఉన్నాయి అని చెప్పినదానికి సరి పోలినది .బ్రహ్మ చర్యం పాటించని వారికి పొంద శక్యం కానిది ,హిరణ్య గర్భుని కి నివాసంగా ఉన్న బ్రహ్మ పురం ,దాని మధ్యలో స్వామి అధిష్టించే హిరణ్మయ మండపమూ ఉన్నాయి .

అప్పయ్య దీక్షితులు ‘’భక్తి ప్రదమైన ‘’విరజ ‘’అనే పేరుతొ విరాజిల్లే క్షీరనదిని దాటి  కాంచీ లో ప్రవేశించిన భక్తుడికి స్వామి పాద తీర్ధం తులసీ దళాలు పుష్ప సుగంధం లభిస్తాయని చెప్పాడు .విరజ అంటే రజస్సు లేనిది .సూక్ష్మ దేహం లయం అయినపుడు ,విశుద్ధులైన సత్పురుషులకు పరమ పదమే లభిస్తుంది .ఇంతటి విశిష్టమైనది కాంచీ పురం .

ఆధారం –శ్రీ మత్ అప్పయ్య దీక్షిత కృత –వరద రాజ స్తవం –దానికి  శ్రీ దేవరకొండ శేషగిరి రావు గారు రాసిన వ్యాఖ్యానం

మరో విషయం తో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-4-16-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.