భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం -3
కంచి వరద రాజ దర్శనం -2
సత్య వ్రత క్షేత్రమైన కంచి లో అశ్వమేధ యాగం చేసిన బ్రహ్మకు స్వామి దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం లో ఉంది .’’పురాకృత యుగే రాజన్ ——-ప్రదురాసీత్ జనార్దనః ‘’అప్పయ్య దీక్షితులు-
‘’ప్రత్యన్ముఖం తవ గజాచల రాజ రూపం –ప్రత్యన్ముఖా శ్చిరతరం నయనైర్నిపీయ
ఆఖ్యాన సమాప్త వచసా మవితర్కణీయం-ఆశ్చర్య మేతదతి నిశ్చయ మాపాహంతే’’అన్నాడు మరో శ్లోకం లో
‘’స్వామీ !పశ్చిమాభి ముఖంగా ఉన్న నిన్ను తత్వ వేత్తలు ఎన్ని జన్మలెత్తినా లభించని రూప మాధుర్యాన్ని చవి చూస్తున్నారు .ఆయన పర బ్రహ్మమే నని శబ్ద ,అనుమానాది ప్రమాణాలకు అందనివాడని భావం .ఇక్కడ ఆశ్చర్య శబ్దం సాభిప్రాయ ప్రయోగం .ఆశ్చర్యం అంటే సకల చరాచర సృష్టి కర్త అయిన భగవానుడు అని అర్ధం .హరి వంశం లో ‘’ఆశ్చర్యో పాఖ్యానం ‘’లో శ్రీ కృష్ణుని గురించి నారద మహర్షి చెప్పిన మాటలే దీనికి ప్రమాణం .
‘’ఆశ్చర్య౦ ఖలు దేవానాం ఏకస్త్వం పురుషోత్తమ –ధన్యశ్చాపి మహా బాహో లోకేనాన్యోస్తి కించన ‘’.కఠోపనిషత్ కూడా ‘’పరబ్రహ్మాన్ని గురించి వినటం ,తెలుసుకోవటం చెప్పటం అంతా ఆశ్చర్యావహం ‘’అన్నది –‘’ఆశ్చర్యో వక్తా ,కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞాతా కుశలాను షిస్టః’’.ఇవే మాటల సారాంశం భగవద్గీతలోనూ కనిపిస్తుంది .
ఇక్కడ వరద రాజస్వామి పశ్చిమాభి ముఖంగా ఉన్నాడు .ఆ దిశలో చూడటం కుదరదు .అయినా కనిపిస్తూనే ఉన్నాడు కదా .పడమర ముఖంగా ఉన్నవాడిని తూర్పు ముఖంగా చూస్తేనేగా కనిపించేది .
మరో శ్లోకం లో అల౦కా రాలకే అలంకారమైన స్వామి ని వర్ణించటానికి ఏ అలంకారం సాధ్యమవుతుంది అంటాడు .అంటే అతిశయోక్తి కాని స్వభావోక్తికాని ఆయన్ను వర్ణించ లేవని భావం .ఇంకో శ్లోకం లో లక్ష్మీ కా౦తుడవైన నువ్వు అందగాడైన మన్మధుని తండ్రివి .శృంగార రసాది దేవతవు .సర్వ గుణోన్నతుడవైన నిన్ను ఎవరు సంపూర్ణంగా వర్ణించగలరు ?అన్నాడు .భరతుడు నాట్య శాస్స్త్రం లో శృంగారానికి అధిదేవత విష్ణు మూర్తి అని చెప్ప్పాడు –‘’శృంగారో విష్ణు దేవత్యః ‘’
‘’నీ దగ్గరికి చేరితే తిరిగి రావటం అంటూ ఉండదు .ముక్తుడైపోతాడు నీకు అర్పించిన మనసును మళ్ళీ నువ్వు తిరిగి ఇవ్వవు ‘’అంటాడు దీక్షితులు .
‘’యత్ప్రణ సంయమ జుషాం యమినాం మనాంసి –మూర్తిం విశన్తి తవ మాధవ కు౦భకేన
ప్రత్యంగ మూర్చ దతివేల మహా ప్రవాహ –లావణ్య సింధు తరణాయ తదిత్య వైమి’’
‘’ప్రాణాయామం మొదలైన వాటి వలన ప్రాణాన్ని నిరోధిస్తూ ,తమ మనసులలో కుంభకం ద్వారా నీ రూప ధ్యానం చేస్తారు .ఆ పాద మస్తకం లో ఉండే ఒక్కొక్క నీ అవయవాన్నీ ధ్యానిస్తూ లావణ్య సింధువు ను తరిస్తున్నారు ‘’
లావణ్యా మృతాన్ని త్రాగుతున్నారని అర్ధం .ప్రాణాయామం చేసేటప్పుడు పూరక స్థితి లో నాభి చక్రం లో ఉన్న బ్రహ్మను ,కుంభక స్థితిలో హృదయం లో ఉన్న జనార్దనుడిని ,రేచక స్థితి లో లలాటం లో ఉన్న శివుడిని ధ్యానించాలి అని స్మృతి చెప్పింది –‘’నాభి చక్ర స్థితం ధ్యాయేత్ పూరకేణ పితామహం –హృదయాబ్జ గతం ధ్యాయేత్ కుంభ కేన జనార్దనం –లలాటస్థం శివం ధ్యాయేత్ రేచకేన మహేశ్వరం ‘’.
వేరొక శ్లోకం లో దీక్షితకవి ‘’నీ వదన పద్మం నుండి సరస్వతీనది ,పాదాల నుండి గంగానది ప్రవహిస్తుంటే ఈర్ష్యతో యమునా నది నీ నఖ శిఖ పర్యంతం నిరంతరం ప్రవహిస్తోందాఅన్నట్లు త్రివేణీ సంగమంగా నీ శరీర కాంతి శోభిస్తోంది ‘’అన్నాడు
‘’సర్వాతీ శయి సహజద్యుతి భూషితస్య –విశ్వైక నాయక విభూషణ ధారణం తే
ఆ బద్ధ సౌహృదయ మాపార సుఖాంబు రాశేః-వీక్షే తదైవ విషయాది కుతూహలేన ‘’
‘’సహజ కాంతి శరీరుదవైన నీకు వేరే అల౦కారా లెందుకు ?అయినా ధరిస్తున్నావు .అపరిమితానంద నిదివి అయిన నువ్వు కుతూహలం తో తుచ్చ విషయాలతో స్నేహం చేసినట్లుగా మామూలు ఆభరణాలు ధరిస్తున్నావు .నిత్య నిరతిశయ ఆనంద మహర్ణవ రూపుడవైన నీవు మామూలు గోపికలతో విహరించి నట్లుగా ఈ సాధారణ ఆభరణాలతో కనిపిస్తున్నావు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-16-ఉయ్యూరు

