’ భారతీయ సంస్కృతీ సంప్రదాయ పరమార్ధం –9
భారత ధర్మ సూక్ష్మాలు
సుమారు 30ఏళ్ళ క్రితం విజయవాడ ‘’రసభారతి ‘’సంస్థ ప్రచురించిన ‘’పీయూష లహరి ‘’లో మహా భారత ధర్మ సూక్ష్మాలను గురించి ఆర్ష ధర్మ ప్రబోధక ,కృష్ణా జిల్లా ఆరుగొలను వాసి ,మహాభారతోపన్యాసాలు పేరిట 18పర్వాలపై రాసిన వారు ,గీతా హృదయం మా౦డూక్యోప నిషత్ సార సంగ్రహం ,వాల్మీకి రామాయణోపన్యాసాలు వంటి గ్రంధ రచయిత శ్రీ నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పిన వాటిలో అతి ముఖ్యమైనవి అందజేస్తున్నాను.
‘’వేదోఖిల ధర్మ మూలం ‘’వేదమే అన్ని ధర్మాలకు ఆధారమైనది .’’వేదాలు అపౌరుషేయాలు ,సృష్టి అనాది .జీవుడు నిత్యుడు .’’అనే మహా విషయాలను భగవాన్ వేద వ్యాస మహర్షి మహా భారతం లో చెప్పాడు .వేదం సామాన్య ధర్మం అని విశేష ధర్మం అని రెండు ధర్మాలు విధించింది .విశేష ధర్మాన్నే ధర్మ సూక్ష్మం అని లేక సూక్ష్మ ధర్మమని అంటారు .దీనికే ఆపద్ధర్మం అనే ఇంకోపేరు కూడా ఉంది. భారతం లో శాంతి ,ఆనుశాసనిక పర్వాలు కేవలం ధర్మ ప్రబోధకాలు .వీటికి ముందున్న పర్వాలలో చరిత్రా౦తర్గత సూక్ష్మ ధర్మాలను చెప్పాడు వ్యాసర్షి .’’మా హి౦ సాస్సర్వ భూతాని ‘’అని వేదం నిర్ణయించింది .కాని యజ్ఞాలలో పశు హింస ధర్మ విశేషంగా చెప్పింది .కామాన్ని గర్హించినా గార్హస్త్య జీవితం లో కామం పవిత్ర జీవితంగా చెప్పింది .పాండవ జననాలు సూక్ష్మ ధర్మాలపై ఆధార పడి ఉన్నాయి .దీనివలననే కుంతీ పతివ్రతగా ద్రౌపది కి అయిదుగురు భార్తలు౦డటం ధర్మమే అయింది .
ద్రౌపది జననం అగ్ని కుండం లో జరిగింది .ఆమె స్వర్గ లక్ష్మి .పాండవులు అయిదుగురూ ఇంద్రులు .ఆమె సామాన్య మానవ స్త్రీ కాదు .అయిదుగురు భర్తలకు ఒక్కటే భార్య అవటం ఆనాడు సామాన్య లోక ధర్మం కూడా కాదు .విశేష ధర్మాన్ని బట్టే ఆమెను అయిదుగురు పాండవులు భార్యను చేసుకొన్నారు .ద్రుపద రాజ కొలువులో అర్జునుడు బ్రాహ్మణ వేషం లో మత్స్య యంత్రాన్ని ఛేదింఛి ద్రౌపదిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు .రాజాహ్వానం తో ద్రోపదితో సహా పాండవులు రాజాస్థానానికి చేరారు .భోజనాదులైపోయే దాకా పాండవులు బ్రాహ్మణులా క్షత్రియులా అనే నిర్ణయం జరగ లేదు .ద్రుపదుడు ధర్మ రాజును –‘’కదం జా నీమ భవతః క్షత్రియాన్ ,బ్రాహ్మణానుత –బ్రవీతునో భవాన్ సత్యం సందేహో హ్యత్రనో మహాన్ ‘’అని అడిగాడు ‘’స్వామీ !మేము మిమ్మల్ని క్షత్రియులు అనుకోవాలా ?బ్రాహ్మణులు అనుకోవాలా ?నిజం చెప్పి సందేహాన్ని తీర్చండి ‘’దీనికి ధర్మ రాజు తాము పాండురాజు కు మారులమని సుక్షత్రియులమైన పాండవులమని తేల్చి చెప్పాడు .సందేహం తీరిన రాజు ద్రౌపదిని అర్జునున కిచ్చి వివాహం చేస్తానని ,దానికి శుభ ముహూర్త నిర్ణయం చేయిస్తానని అన్నాడు .ఇప్పటి వరకు కుల ధర్మాన్ని పాటించటం జరిగింది అంటే అర్జునునికే ద్రౌపదినిచ్చి అ నాటి లోకాచారం ప్రాకారం పెళ్లి చేసే ప్రయత్నం చేశాడు రాజు .వెంటనే ధర్మ రాజు ‘’నాకూ పెళ్లి కావాల్సి ఉంది ‘’అన్నాడు .’’దానికేం నీకు ఇష్టమైతే నీకైనా నా కూతుర్నిస్తాను ‘’అన్నాడు .మళ్ళీ ధర్మ రాజు ‘’సర్వేశామ్మహిషీ రాజన్ ద్రౌపది నో భవిష్యతి ‘’అని బాంబు పేల్చాడు .అంటే మా అన్న దమ్ములైదుగురకు ద్రౌపది భార్య కాగలదు అన్నాడు .నిజంగా అది సామాన్య ధర్మమే అయితే ద్రుపదుడు ఏమనాలి ?సరే అలాగే చేద్దాం అనాలి మరి అలా అనలేదాయన –‘’
‘’ఏకస్య బహ్వ్యో విహితా మనుష్యః కురునంద –నై కస్యా బహువ్య పుంసః శ్రూయంతే బహువ్య క్వచిత్
లోక వేద విరుద్ధం త్వం నా ధర్మం ధర్మ విచ్చుచిః-కర్తు మర్హసి కౌన్తేయ కస్మాత్తే బుద్ధి రీద్రుశీ’’అన్నాడు . అంటే ‘’లోకం లో ఒక మగవాడికి అనేక మంది భార్యలు ఉండటం సహజం .ఒక స్త్రీకి బహు భర్తలు ఉండటం ఎక్కడా చూడలేదు ‘’అని అర్ధం .ఇందులో వ్యాసులవారు వాడిన ‘’పుంసః ‘’అనే పదానికి నీల కంఠ వ్యాఖ్యలో ‘’వేద కర్తుః పరమాత్మానః సకాశాత్ న శ్రూయంతే’’అని ఉన్నది అంటే లోకం లో లేదు వేదం లో కూడా ఈ ఆచారం లేదు .ధర్మాత్ముడవైన నువ్వు ఇలాంటి అధర్మానికి ఎందుకు పాల్పడుతున్నావు?అని అడిగాడు .కనుక ఆకాలం లో లోక ధర్మాన్ని వేదోక్త ధర్మాన్నీ రెండిటినీ పాటించారు అని తెలుసుకోవాలి .దీనికి ధర్మ రాజు సమాధానం –
‘’సూక్ష్మో ధర్మో మహా రాజ నాస్య విద్మో వయం గతిం –పూర్వేషామాను పూర్వ్యేణ యాతమ్ వర్త్మాను యామహే
నమే వాగనృతం ప్రాహనా ధర్మే దీయతే మతిః-ఏవం చైవ వదత్యం చామమచైతన్య నోగతం ‘’అని బదులిచ్చాడు దీని భావం –ద్రుపద మారాజా !ఇది స్థూల దృష్టికి గోచరించని ధర్మ సూక్ష్మం .ఈఆచారం వేదం లో ఉంది .ప్రచేతసనులను ఇలాగే చేసుకొన్నారు.నానోట అసత్యం రాదు .ఇది ధర్మమే ‘’అని నొక్కి వక్కాణించాడు .ఇంతలో వ్యాసభగవానుడు ప్రత్యక్షమైనాడు .ఇప్పుడు బంతి ఆయన కోర్టులో ఉంది .ఆయన ద్రుపద మహా రాజుకు దివ్య ద్రుష్టి నిచ్చి చూడమన్నాడు .పాండవులు అయిదుగురు ఇంద్రులే అని ద్రౌపది స్వర్గ లక్ష్మి అని చూపించి దుష్టసంహారం కోసం అవతరించిన’’ దుర్గా దేవి’’యే ద్రౌపది అని తెలియ జెప్పి ,రాజును ఒప్పించి పాండవులు అయిదుగురకు ద్రౌపదినిచ్చి దగ్గరుండి వివాహం జరిపించాడు .ఇదే భారతం లోని సూక్ష్మాతి సూక్ష్మ ధర్మం .
జూదం లో ఓడిపోయిన పాండవులున్న కురు సభలోకి దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకు వచ్చాడు అక్కడున్న భీష్మ ద్రోణాది పెద్దలన్దర్నీ నిలదీసింది ద్రౌపది అది న్యాయం ధర్మమేనా అని .అప్పుడు భీష్మ పితామహుడు ‘’ధర్మ నిర్నయానికోసంనేనిప్పుడు స్పష్టంగా చెప్ప కూడదు –‘’సూక్ష్మత్వాద్గహనత్వాచ కార్యస్యాన్యచ గౌరవాత్ ‘’అన్నాడు .తెలుగు భారతం లో భీష్ముడు కురుసభలో మాట్లాడినట్లు కనిపించదు .సంస్కృత భారతం లో రెండు సార్లు పితామహుడు మాట్లాడినట్లు ఉన్నది .మరోసూక్ష్మ ధర్మాన్ని గురించి తెలుసుకొందాం .అర్జునుడి గా౦డీవాన్ని ఇతరులకు ఇవ్వమని అతనితో ఎవరైనా అంటే వాడి గొంతుక కోస్తానని కిరీటి ప్రతిజ్న చేశాడు .యుద్ధం లో ధర్మ రాజే ఈమాట అన్నాడు . అన్నను చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఫల్గుణుడు .అన్నను చంపటం హింస శపథం నేరవేర్చుకోక పోవటం ఆసత్య దోషం .ఈ రెండు ధర్మ సంకటాల మధ్యా పాండవ మధ్యముడు ఇరుక్కుపోయాడు .అపాయాలకు చక్రం అడ్డం వేసే కృష్ణుడు ఉపాయంగా ధర్మ రాజును పార్దునితో తిట్టించి ,అనృత దోషాన్నుంచి ,భ్రాత్రు హింస నుంచి కాపాడాడు .సత్య వ్రత పాలన కంటే అహింసా వ్రత పాలన శ్రేష్టం ఇదే ధర్మ సూక్ష్మం .ఇది శాస్త్ర విషయం. వ్యక్తి హృదయం కాదు .శాస్త్ర హృదయం తెలిసిన శ్రీ కృష్ణుడు చేసిన మహత్తర కార్యం .భారత యుద్ధం పాండవుల రాజ ధర్మం పైనే ఆధార పడింది కాని రాజ్య కాంక్ష మీద కాదు అంటారు శ్రీ నండూరు వారు .
భారతం లో వ్యాసభగవానుడు చెప్పని రాజ నీతి లేదు .నీతి వేరు ధర్మం వేరు . నీతిఅనే పదం ధర్మం అనే అర్ధాన్ని ఇవ్వదు .ధర్మం అంటే శాసనం .భారతం లో దుర్మార్గుల నీతికూడా ఉంది .ధర్మాపన్న నీతిని బోధించింది .భారతం లో ఉన్న కఠోర నీతియే ఈ నాటి దుండగుల నీతి .విదురనీతి ధర్మ విశిష్టమైన నీతి .ధర్మ విశిష్టమైన నీతిని పాండవులు అనుసరించారు .అర్ధ పురుషార్ధ ప్రధానమైన నీతిని దుర్యోధనాదులు అనుసరించారు .ఈ రెండూ అనాదివే .వ్యాసుడు భారతం లో కౌరవ పాండవులను రెండు వృక్షాలతో పోల్చి చెప్పాడు ‘’దుర్యోధనో మన్యుమయో మహా ద్రుమః ‘’అంటే కౌరవ వృక్షానికి బీజం తన బుద్ధి మాత్రమే ప్రధానం గా చేసుకొన్న ద్రుత రాస్ట్రుడు అన్నాడు మరి ధర్మ రాజు సంగతి –‘’ధర్మ మయో మహాద్రుమః ‘’అన్నాడు .అనగా ‘’యుధిష్టిరుడు అనే ధర్మ వృక్షానికి వేదాలు ,శ్రీ కృష్ణుడు బీజాలు ‘’అన్నాడు .నన్నయ భట్టు ఈ శ్లోకాన్ని అనువదించాడు .వేద శాస్త్ర విధులు తాత్కాలికాలే కాని సార్వకాలికాలు గా ఆచరణ యోగ్యం కాదని భావించి నన్నయ్య వీటిని తెనిగించలేదు .తిక్కన పూర్వ ,ఉత్తర మీమాంసా శాస్త్రాలను రెండిటినీ భారతం లో చక్కగా వ్యాఖ్యానించాడు .’’మన రాజకీయ నాయకులు –(వీరికే నండూరు వారు’’ దేశోద్ధారకులు ‘’అని ముద్దుపేరు పెట్టారు )మహా భారత శాంతి పర్వాన్ని చదివి ప్రజాస్వామ్యాన్ని గురించి తెలుసుకొని ప్రజా పాలన చేయాలి ‘’అనిఆర్ష ధర్మ ప్రబోధక శ్రీ నండూరు సుబ్రహ్మణ్య శర్మ గారు హితవు చెప్పారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-4-16-ఉయ్యూరు


నమస్తే!
చాలా గొప్ప వ్యాసంం.
అనేక విషయాలు చక్కగా చర్చింంచారు.
సన్నిధానంం వారు పోతన భాగవతంం సంంస్కృృతంంలో వ్రాశారా?ఆ ప్రతి మీ వద్ద కలదా? కొనుక్కొడానికి దొరుకుతున్నదా?
దయచేసి తెలుప గలరు!
ఆచార్య ఆర్వీ కుమార్
LikeLike