సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ

ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా వెలువరించిన ‘’విశ్వనాధ సాహితీ విశ్వరూపం ‘’20 16 మార్చి లో విడుదల అయింది .ఒక రిఫరెన్స్ గ్రంధంగా రూపు దిద్దుకొన్న ఈ పుస్తకం లో చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితల రచనలున్నాయి .నాకు అందులో సరస్వతీ పుత్రులు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్య గారి వ్యాసం’’మహా కవి శ్రీ విశ్వనాధ సత్యన్నారాయణ ‘’ శిరో భూషణం గా ఉందని పించింది .అందులోని విషయాలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తో అందులో అతి ముఖ్యమైన విషయాలను మీ ముందు ఉంచుతున్నాను .

‘’  విశ్వనాధ స్పర్శ అగ్ని కణం.-తీవ్ర బాధ –దారుణ తపస్సు .అతడొక విచిత్ర మానవుడు .విశిష్ట వ్యక్తీ .ఆ హృదయానికి విషాదమే పరి వేషం .సుఖం లో ఒదిగిన దుఖం .జ్ఞానం లో ఉన్న అజ్ఞానం ,సంయోగం లో భావ వియోగం వీటినే చూస్తాడు .తెలుగు నేలపై విశ్వనాధ వంటి పండితుడు ఉండవచ్చు కాని అటువంటి సంస్కారి అరుదు .అతని జీవితం అగ్ని కుండం .కుంగి కుంగి దుఖం పట్టలేనప్పుడు వహ్ని పర్వతం లావాను వెదజల్లినట్లు ఒక్క సారి తన రచనలను బయటికి వెదజల్లుతాడు .జీవచ్చవమై పోతున్న సమాజాన్ని చూసి కుంగి కన్నీరు మున్నీరుగా బావురు మన్నాడు .దీనికి తోడూ దరిద్రం .దానితో వైదుష్యం .స్వాతంత్ర్యం మతి ప్రభ అన్నీ కిం భాగ్యమైపోయాయి .విశ్వనాధ కు వ్యాస భగవానునితో ప్రారంభమై ,భవభూతిలో పండిన మార్గమే పట్టింది .ఇదే ఆయన మూల తత్త్వం .తాను మాయ నేర్వ లేడు.నేర్చిన వారిని చూసి ఓర్వ లేదు .తనకు సరిపోని ప్రపంచాన్ని విడువ లేడు,సరి పోనీ వాడిని సహనం తోసహింప లేడు.ఆయన కవిత్వం లో ఆంధ్ర రక్తం మాటేమో కాని వైదిక రక్తం ప్రవహించింది .లేమిడి పెద్ద ఆస్తిగా దక్కింది .దరిద్రం ఆభిజాత్యంగా సంక్రమించింది .ఆయనకు వైదిక కవి నన్నయ ఇంటి దేవుడు .ఆంధ్ర దేశం లో సంస్కృతాన్ని వైదికులు ,తెలుగును నియోగులు పోషించారు .నన్నయ కంటే తెలుగు తీపిదనం తిక్కనలో వేయి రెట్లు ఎక్కువ .నన్నయ కవితలో పోకడలు తప్ప విశ్వనాధ లో తిక్కన తెలుగు దానం లేదు .కోకిలమ్మ పెళ్లి లో తెలుగు కోకిల నుసృష్టించాడు .కాని తానుమాత్రం సంస్కృత చిలకే అయ్యాడు .అతని వైదుష్యం అంతు లేనిది .సంస్కృత వాజ్మయాన్ని సమగ్రంగా పరిశోధించాడు .వ్యాకరణాన్ని వల్లె వేశాడు .ప్రస్థాన త్రయ పాఠం చదివాడు .భాసుని నుండి నీల కంఠ దీక్షితులు వరకు ఉన్న అనేక కవుల చాయలు అతని రచనలలో ఉన్నాయి .ఆంధ్రాన్ని ఔపోసనే పట్టాడు .నన్నయ ను ఉపాసి౦చాడు .తిక్కనను సేమమడిగి ,శ్రీనాదునితో చేయి కలిపాడు .పోతనకు మొక్కి ,రాయల వాజ్మయాన్ని చదివి ,తెనాలి రామునితో వియ్యమందాడు .

ఆంగ్ల భాషలో ప్రాచ్య హృదయం లోని శాంతి-రుషిత్వం విశ్వనాధ కు కనిపించలేదు .ఆయన పరీక్ష మహా నిశితమైనది .వస్తువునుకాని ద్రుశ్యాన్నికాని నిశితంగాపరీక్ష గా  చూస్తాడు .ఆ పరీక్ష లో సౌందర్య సీమను దాటుతాడు .సౌందర్యం గౌణం అయి కర్కశత్వం ఏర్పడుతుంది .ఏదైనా చెబితే పాఠకుడు మరువనట్లు మరచి పోలేనట్లు చెప్పాలని ఆకాంక్ష .అమిత వేధ అనుభవిస్తాడు .లెక్కలేనన్ని కొత్త పదాలు సృష్టిస్తాడు .భాషను సుడులు తిప్పుతాడు .కొత్త ఉక్తుల్ని కల్పిస్తాడు .ఇదే వేదన భవభూతి పొందాడు .భవ భూతికి సీత లాగా విశ్వనాధకు దేవదాసి ,గిరి కన్నేలలలో భగవంతుడు ఆడాడు .వీరిద్దరికీ స్త్రీ జగన్మాత .

ప్రయోగాలలో విశ్వనాధ సర్వ స్వతంత్రుడు .సంస్కృత వైకల్పికాలన్నీ రచనలో గుప్పించాడు .ఆయన ఆచ్చిక ప్రయోగాలకు వ్యాకరణం ఇంకా సాధించాలి .గ్రామ్య పదాలేన్నిటికో గ్రా౦ధికత కల్పించాడు .ఆవేశం లో ఆయనకు శరీరమే తెలియదు .సంస్క్రుతాభిమానం తో జాను తెలుగు సొగసుల్ని  అభిమాని౦చ లేదేమో .రసలబ్దులగు రచయితలకు అనవసరం కూడా .నాకు మాత్రం పాత్రోచిత భాషా వాది అని పిస్తాడు .ఆయన భాష గీర్వాణ సార్వ భౌమత్వాన్ని అంగీకరించింది .ఆయన అనుభవం ‘’రావి ఆకుల చుట్టలు కాల్చుకొనే పాలేరు బుడ్డ వాళ్ళు మొదలు కొని ,జమీందారుల వరకు విరిసి కొన్నది’’ .ప్రౌఢత్వం ఆయన స్వభావం అయి పోయింది .చిన్న భావాన్ని కూడా గొప్ప భాషలో చెబుతాడు .భాషా సంధిలో భావ బంధాన్ని ఇరికించి నపుడు భావం మనకు అందుబాటులోకి రాదు ‘’.

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-16 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.