సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

సరస్వతీపుత్రుని వీక్షణం లో విశ్వనాధ -3(చివరి భాగం )

‘’విశ్వనాధకు ఆంద్ర దేశపు గాలి నీరు ,వాన ,చివరికి చీమ అన్నీ మాననీయాలే .’’ఆకాశం లో క్రతు ధ్వనులు ‘’వింటాడు .ఆ క్రతుధ్వనుల్లో ఆయన శ్రోత్రియత చక్కగా వాసించింది .ఎంతగా కవి లీనుడైతేనో తప్ప ఈ తన్మయీ భావంకుదరదు .విశ్వనాధ రచనలు చదవటానికి ఒక ప్రత్యేక అధికారం కావాలి .తెలుగు సాహిత్యం లో ఆయన తాకకుండా విడిచిన మార్గం లేదు .ఆయన పద రచనలలో బాగా పండినవి కిన్నెరసాని పాటలు .దీని కదా వస్తువు ఆయన తయారు చేసుకోన్నదే .దీనికి ఆధారం రెండే రెండు .ఒకటి భద్రాద్రి దగ్గర కొండ ,రెండవది దాన్ని చుట్టుకొని ప్రవహించే యేరు .ఆ ఏరే ‘’తెలుగు సాని ‘’అయింది .పెనుగొండ లోని ‘’బృందావనం ‘’చూసి ,శుక్తిమతి ,కోలాహలపర్వత౦, గిరిక పాత్రలను   సృష్టించిన భట్టు మూర్తి జ్ఞాపకం వస్తాడు. ఒకటే దృశ్యం రెండు హృదయాలలో భిన్న రీతులలో భిన్న లక్ష్యాలకు ఆధార మైంది .భట్టు పాండిత్యాన్ని గుమ్మరించి ,మెదడును వంచి భళీ అని పించుకొంటే ,విశ్వనాధ తాను వాపోయి ,మనల్ని ఏడిపించాడు .రసనాళాలను తాకి ,రసము యొక్క మేరలు తడిమాడు .కిన్నెర సాని రసాకృతి .అందుచే ‘’ధునీ వైఖరి బూనింది .మగడు శిలా సదృశుడైన మగవాడు –రాయి అయ్యాడు .ఇద్దరికీ కలిగింది ఒకటే దుఖం .కాని సంభవించింది భిన్న పరిణామం .దీనికి కారణం స్త్రీ పురుషుల జన్మల మూలతత్వం లో ఉన్న భేదమే .ప్రకృతి రూపం లో ఉన్న స్త్రీ రసాకృతి .,ముగ్ధ లలితా స్వరూపిణి .పురుషుడు స్త్రీకంటే గంభీరుడు ,ఉదాత్తుడు .వాని హృదయం దుఖం చేత పగులు తు౦ది కాని ప్రవహించదు .ఈ దృశ్యాన్ని చదువుతుంటే ఉత్తర రామ చరితలో భవభూతి వర్ణించిన ‘’అనిర్భిన్న గభీరత్వా దంత ర్గూఢ ఘనవ్యదః –పుట పాక ప్రతీకాశో రామస్య కరుణో రసః ‘’జ్ఞాపకం వస్తుంది .కిన్నెర సాని దుఖాన ఒక వనమే కాదు ,తెలుగు వారి బ్రతుకులన్నీ పాట అయి పోతాయి .ఇదొక విలక్షణ కావ్యం .ఒక ప్రత్యేక రచనా పద్ధతికి దారి తీసింది .విశ్వనాధ –కిన్నెర సాని అనుస్యూతాలై ఆంద్ర సారస్వతం లో నిక్కచ్చిగా నిలిచి పోతాయి .సాంకేతిక కావ్య దృష్టిలో చూస్తే   కిన్నెర సానిలో ‘’పులుముడు ‘’ఎక్కువ .అందుకే దాన్ని చదవ కూడదు .పాడాలి .’’ఓ నాధ ఓ నాద ‘’అని నాలుగు సార్లు వస్తుంది .ఈ నాలుగు సార్లను వేర్వేరు స్వరాలలో మేళవిస్తే ,అనేక భావ ,రాగాలకంటే స్పష్టంగా కనిపిస్తుంది .దీనితో ‘’లీనత ‘’ధర్మం ఎక్కువై మనసుకు పడుతుంది .(దీన్ని విశ్వనాధ స్వరం లో  వింటే మధురాతి మధురం గా ఉంటుంది ఆ ఒయ్యారాలు పోకడలు అన్నీ కళ్ళకు కట్టిస్తాడు )కావ్యం అంతా ‘’రోకంటి పాట’’లాగా కాకుండా విషయ భేదాన్ని బట్టి గేయాల మట్టులు మారాయి .నిష్కల్మష ప్రేమకు భగవంతుడు దగ్గరలోనే ఉంటాడు .కిన్నెర ,దాని మగడు బతికి పవిత్రులు ,చచ్చి కూడా పవిత్రులైనారు .కనుక ఈ కావ్యం మోదాంతమే .

‘’విశ్వనాధ నవలలో మూడు నేను చూశాను .అవి నవలలు కాదు కావ్యాలే .విశ్వనాధ నవలలు రాయటం అంటే భవభూతి నాటకాలు రాయటం లాంటిదే .నాటక కారుడు సహస్రాక్షుడు అవ్వాలి .భవభూతి నాటకాలలో ‘’సెన్స్ ఆఫ్ ప్రోపోర్షన్ ‘’-పరిమాణం లో మితి తక్కువ .మాలతీ మాధవ నాటకమే దీనికి ముఖ్య సాక్ష్యం .విశ్వనాధ ‘’మహావేశి.చెలియలి కట్ట నవల లో ఆత్మ వేదన మొదటి నుంచి చివరిదాకా ఛాయా రూపంగా పారింది .ఆయన వచనం వచనం కాదు –కవిత .అంటే గద్యానికి కావలసిన గుణాలకంటే ,పద్యానికి కావలసిన భావన ,ఆవేశం ముందు నడుస్తాయి .వేయి పడగలు చదువు తూ ఉంటె ఒక మహా కావ్యాన్ని చదువుతున్నట్లు అనిపిస్తుంది .ఆయన వచనం లోనూ అనేక శయ్యలున్నాయి .నన్నయ లాగా దీర్ఘ కోమల సమాసాలు ,తిక్కన లాగా విరుపులు ,శ్రీనాధుని బిగువైన పటాటోపం ,పోతన లాగా గలగలమనే అనుప్రాస లతో మధుర లాస్యం చేస్తాయి .పెద్దన లాగా శిరీశ కుసుమ పేశల వైదగ్ధ్యాన్ని ,రాయలలాగా మారు మూల పదాల పోహలింపు ,తెన్నాలి వానివలె ఉద్దండ శైలి చిమ్మగలడు. చేమకూర వాని లాగ తెలుగులోని అచ్చు కత్తులు చూపిస్తాడు .చివరికి చూర్నికలనూ వదలలేదు .చిత్ర విచిత్ర శయ్యల్ని కొత్తగా సృష్టించాడు .వచన రచనలో అతనికి అతడే సాటి .నిజంగా గద్యానికి శైలి అంటూ ఉండదు. కాని ఈయన ఎన్నో పద్ధతులను ప్రవేశ పెట్టి అప్రతిభులను చేశాడు .వేయి పడగలు అపూర్వ సృష్టి ..సుబ్రహ్మణ్య స్వామికి వేయి పడగలు .కాని ఈ కవి ప్రతిభాషణం అసంఖ్యాకాలై తెలుగు నేలను ఆవరించాయి .దానిలో ఒక ‘’విరాట్ స్వరూపం ‘’ఉంది.ప్రాచీన ,నవీన సమాజాలకు వేయి పడగలు ఒక లంకె .దాన్ని చదవకూడదు .వల్లించాలి .ప్రేమించ దగినదే కాదు పూజించాలి ఆంధ్రులకు అది గర్వ కారణం పసరిక పాత్ర భావనా కల్పితం .గిరిక దేవ దాసీత్వం గూడు కట్టిన మూర్తి .అరుంధతి సాక్షాత్తు అరుంధతీ దేవియే .ధర్మారావు  విశ్వనాధ యే..అదొక అమృత ప్రవాహం .గ౦ధర్వ లోకం .

వేన రాజు నాటకం పండితులలో ఒక ‘’తుఫాను నే లెవ దీసింది .దాన్ని పరా మర్షించే  విమర్శ గ్రందాలెన్నో వచ్చాయి .నర్తన శాల చిన్నతనం లో రాసినట్లు అనిపిస్తుంది .ఆయన ప్రాచీన మహా కవుల కెవ్వరికీ తీసిపోని సాహితీ సార్వ భౌములు ,మహా పండితుడు ,విశంకటుడు ‘’అయన మరో రూపం లో వచ్చిన నన్నయ .గుడివాడలో జరిగిన సన్మానం చంద్రునికో నూలు పోగే .న్యాయం గా ఆయనను ‘’ధర్మ సింహాసనం పై ఎక్కించి ,రాజులు మోయాలి .ఆయన గౌరవం ఆంధ్ర దేశ గౌరవం .ఇప్పటికే అ మహా కవి ‘’కాలమందు అరుగని వాడు ‘’అయ్యాడు .ప్రతి పద్య రాసాస్పదమైన  రామాయణ కల్ప వృక్షాన్ని పాడి రుషియే కాగలడు.’’అంతా వ్యర్ధం .వట్టి ఆశ పెను మాయా వల్లి ‘’అంటూ మూల కూర్చు౦టాడేమోనని భయం నాకు ఉంది  .తెలుగు వారి నోముల  చేత ,ఆంద్ర సాహితీ పుణ్యం చేత అలాంటి దుష్కాలం మాత్రం రాకుండు గాక ‘’అనిసరస్వతీ పుత్రులు కోరుకొన్నారు .   ఇదీ శ్రీ పుట్ట పర్తి నారాయణ చార్య గారి దృష్టి కోణం లో విశ్వనాధుని  సాహితీ విశ్వ రూపం ..

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-9-16 –ఉయ్యూరు

Inline image 1 Inline image 2

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.