గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
62-సాహిత్య రత్న –కె..పి .నారాయణ పిశరోడి (1909-2004 )
95 ఏళ్ళు పూర్ణాయుస్సుతో వర్ధిల్లిన కె.పి. నారాయణ పిశరోడి 23-8-1909న కేరళలోని పాలకాడు జిల్లా పట్టా౦బి దగ్గర పుతిస్సేరి పశుపతి నంబూద్రి ,నారాయణి పిశురస్యార్ దంపతులకు జన్మించాడు .మహా విద్వాంసులైన పున్నస్సేరి నంబి నీల కంఠ శర్మ ,అత్తూర్ కృష్ణ పిశరోడి ల వద్ద సంస్కృత కావ్యాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు.19 32 లో పట్టా౦బి లోని సంస్కృత కళాశాల నుండి సాహిత్య శిరోమణి పరీక్ష ఉత్తీర్ణుడై చాలా స్కూళ్ళు ,కాలేజీలలో సంస్కృత ,మళయాళలను బోధించాడు ..కేరళ వర్మ కాలేజి లో రిటైర్ అయ్యాక యూని వర్సిటి గ్రాంట్స్ కమిషన్ ఫెలోషిప్ సాయం తో పరిశోధన చేశాడు .మణి దీపం, కళాలోకం , శ్రుతి మండపం ,ధనంజయం ,తోరణాయుధాంకం ,కాళిదాస హృదయం ,అత్తూర్ ,నాట్య శాస్త్రం (అనువాదం ) రచించాడు .సాహిత్య నిపుణ ,పండిత తిలకం ,సాహిత్య రత్నం బిరుదులు పొందాడు కేరళ ప్రభుత్వసాహిత్యం సేవకు అందజేసే అత్యున్నత ‘’ఎదు తచ్చన్ ‘’,పురస్కారం ‘’అందుకున్నాడు .20-3-2004 న 95 వ ఏట నారాయణ పిశరోడి నారాయణ లోకం వైకుంఠం చేరుకున్నాడు ..
63-వ్యాస మధ్వ ప్రతిష్టాన ట్రస్ట్ ఏర్పాటు చేసిన –వ్యాసంకర ప్రభంజనా చార్య
భారత దేశ అత్యున్నత సంస్కృత విద్వాంసులలో ఒకరుగా పేరెన్నిక గన్నవాడు వ్యాసంకర ప్రభంజనా చార్య .మధ్వాచార్యుల ద్వైత మత ప్రచారకుడు .మధ్వవేదాంత శాస్త్రం పై అనేక గ్రంధాలు రాశాడు .దేశ ,విదేశాలలోని ఎన్నో సంస్థలు ఆయనకు విశేష బిరుదులను ప్రదానం చేసి సన్మానించాయి .1994 లో బెంగళూర్ లో జరిగిన అఖిలభారత మధ్వ వేదాంత సభకు చైర్మన్ గా వ్యవహరించాడు .బెంగళూర్ లోని ఫస్ట్ గ్రేడ్ గవర్నమెంట్ కాలేజి ప్రిన్సిపాల్ గా పని చేశాడు .స్వచ్చందం గా పదవీ విరమణ చేసి వేదాంత భావ వ్యాప్తికి జీవితాన్ని అంకితం చేశాడు .’’జయతీర్ధ వ్రాత ప్రతి గ్రంధాలయం ‘’స్థాపించి అంతవరకూ ముద్రించని ,అరుదైన భారతీయ తత్వ శాస్త్ర గ్రంధాలను ప్రచురించాడు .ప్రచురించిన వాటిలో భారత ,భాగవత ,భగవద్గీత వంటి విలువైనవి ఎన్నో ఉన్నాయి .
‘’ వ్యాస మధ్వ సంశోధన ప్రతిష్టాన ట్రస్ట్’’ నెలకొల్పి ,భారతీయ సంస్కృతీ, విలువలు ,సంప్రదాయాలను పరిరక్షింఛి వ్యాప్తి చెందించే కార్య క్రమాన్ని చేబట్టాడు .’’ఐతరేయ ప్రకాశన ‘’అనే ముద్రణాలయం ఏర్పరచి ఎన్నో విలువైన గ్రంధాలను ముద్రించాడు .వైష్ణవ సంప్రదాయానికి చెందిన వందలాది స్తుతులను స్తోత్రాలను సేకరించి’’స్తోత్రమాలిక ‘’గా వెలువరించాడు .శ్రీమతి జయశ్రీని వివాహమాడి ఒక కుమారుడిని పెంచుకున్నారు ..
ప్రభంజనాచార్య సంస్కృత సాహిత్య సేవకు భారత రాష్ట్ర పతి 2005 లో పురస్కారం అందజేశారు .ఆచార్యుల వారి రచనా ప్రభంజనం –శ్రీ జయ తీర్ధ దర్శన ,బ్రహ్మ సూత్ర నామావళి,పూర్ణ ప్రజన దర్శన ,సదాచార వినోద ,శ్రీ వేద వ్యాస దర్శన ,శ్రీ బ్రహ్మణ్య తీర్దారు ,ప్రవచన భారతి ,శ్రీ మధ్వాచార్య కాల నిర్ణయ ,శ్రీ రాఘవేంద్ర దర్శన .
64-సంస్కృత ,సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ –వి.రాఘవన్(1908 -1979 )
1908 లో జన్మించి 71 వ ఏట 1979 లో మరణించిన వి. రాఘవన్ సంగీతం లో సంస్కృతం లో సవ్య సాచి .అనేక గ్రందాల రచయిత, అత్యున్నన్నత పురస్కార గ్రహీత .120గ్రంధాలు ,1200 పరిశోధన వ్యాసాలు రాసిన మహా రచయిత రాఘవన్ .1963 లో భోజుని బృహత్ గ్రంధమైన శృంగార ప్రకాశిక నుఅనువదించాడు .దీని అనువాదానికి ,అత్యున్నత వ్యాఖ్యానానికి 1966 లో సాహిత్య అకాడెమి అవార్డ్ పొందాడు .దీన్ని హార్వర్డ్ ఓరియెంటల్ సిరీస్ వారు మళ్ళీ ప్రచురించారు .రవీంద్రుని మొదటినాటకం ‘’వాల్మీకి ప్రతిభ ‘’నుఅనువదించాడు .బోయవాడు పరిణామం చెంది వాల్మీకి మహర్షిగా మారిన కధను టాగూర్ అపూర్వంగా సృష్టించాడు .మయూరజుని’’ఉత్తర రాఘవం ‘’నాటకాన్ని శోధించి సాధించి వెలువరించాడు .1958లో ‘’సంస్కృత రంగ ‘’అనే నాటక శాల స్థాపించి చాలా సంస్కృత నాటకాలు ప్రదర్శించాడు . కర్ణాటక సంగీతం లో ప్రావీణ్యం సాధించి మద్రాస్ మ్యూజిక్ అకాడేమికి 1944 నుండి మరణించేదాకా సెక్రెటరి గా ఉన్నాడు .ఆయన కుమార్తె నందినీ రమణి గొప్ప కళా విమర్శకురాలు .ఆయన మరణానతరం ‘’వి .రాఘవన్ రిసెర్చ్ సెంటర్ ‘’ను నెలకొల్పారు .2008 లో రాఘవన్ ప్రధమ శత జయంతిని ఘనంగా నిర్వహించారు .రాఘవన్ పై ‘’స్మ్రుతి కుసుమాంజలి ‘’అనే ప్రత్యెక సావనీర్ నుప్రచురించారు .అందులో ప్రెసిడెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ ,వైస్ ప్రెసిడెంట్ వి.వి .గిరి గార్ల ప్రశంసలున్నాయి .ప్రముఖ రచయితా వ్యాఖ్యాత కపిలా వాత్సాయన్ ‘’ No work on Indian aesthetics is complete without its quoting Dr. Raghavan’’ అన్నమాటలు యదార్ధం .
65-ప్రబంధ సార న్యాయ గ్రంధ కర్త –గంగా సహాయ్(1840- వ శతాబ్దం )
రాజ పుటానాలోని షికార్ జిల్లా పటాన్ లో ఉన్నత బ్రాహ్మనవంశం లో సహాయ జన్మించాడు .అక్కడే చదివి పండితుల ప్రబోధం తో ఉన్నత విద్య కోసం కాశీ వెళ్ళాడు .అక్కడ గొప్ప పండితులవద్ద వేద ,శాస్త్ర ,పురాణ ఉపనిషత్తులను రెండేళ్లలో అధ్యయనం చేసి తిరుగులేని మహా విద్వాంసుడు అని పించుకొన్నాడు .అక్కడి ఆచార్యులు సహాయ్ వైదుష్యానికి ఆశ్చర్య పడి ఆయన తమకు మరింత విజ్ఞాననం ప్రసాదింఛి మార్గ దర్శకం చేయాలని కోరారు .బుండీ మహారాజు గంగా సహాయ ను దర్శించి తన బుండీ రాజ్య పాలన అత్యంత సమర్ధ వంతంగా నిర్వ హించటానికి మార్గ దర్శనం చేయమని అభ్యర్ధించాడు ..దీని తో సంస్కృత పండిత కవి గంగా సహాయ్.1877 నుంచి 1913 వరకు బుండీ రాజ్యానికి దివాన్ గా వ్యవహరించాడు .
.న్యాయ శాస్త్రం లో మహా విద్వాంసుడు .భాగవత మహా పురాణాన్ని లిప్య౦తరీకరణ(ట్రాన్సిలరేట్ ) చేసి ,అనువదింఛి వ్యాఖ్యానించాడు .అంటే పండితులకు మాత్రమె ఆ నాడు అర్ధమయ్యే రీతిలో ఉన్నభాషను ఆధునికంగా అందరికి సులభంగా అర్ధమయ్యే రీతిలో రాశాడన్నమాట. దీనికి ఆయన ‘’అన్వితార్ధ ప్రకాశిక ‘’అనే సార్ధక నామాన్ని పెట్టాడు .1901 లో దీనిని బొంబాయి లోని వెంకటేశ్వర ప్రెస్ ముద్రించింది .
1877 నుంచి 1930 వరకు ఆయన 127 గ్రంధాలు రాసి ప్రచురించాడు .ఇందులో బుండి రాజ్య చరిత్ర అయిన ‘’వ౦స్ ప్రకాష్ ‘’కూడా ఉంది .’’కాందార్ ,‘’పండిత ‘’బిరుదులు పొందాడు .1880లో ‘’ప్రబంధ సార ‘’రచించాడు .రాజస్థాన్ లో ఇదే అతి ప్రాచీన న్యాయ శాస్త్ర గ్రంధం .అంతకు ముందు వరకు రాజస్తాన్ లో స్థానిక న్యాయ చట్టాలు సంప్రదాయం ,ఆచార వ్యవహారాలమీద ఆధార పడి ఉండేవి .బుండీ నగర ద్వారాల్లో ఒక దానికి ‘’పండిట్ గంగా సహాయ్ ‘’పేరు పెట్టి గౌరవించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-2-17-ఉయ్యూరు
.

