మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన
‘’బాబు చాలాబిజీ ‘’అన్న రేడియో మిర్చి లాగా అనుక్షణ సాహిత్య గవేషణలో చర్చలలో సాహితీ సభా నిర్వహణలో ,రమ్యభారతి పత్రికా ప్రచురణలో ,స్వంత పుస్తక ప్రచుణలతోపాటు ఇతరు లెందరికోప్రచురణ సాయమందిస్తూ , మా సరసభారతి లాంటి సంస్థలకు పుస్తకాలను డి .టి .పి .దగ్గర్నుంచి ముద్రణ దాకా అన్నీ స్వయంగా చూసి ,పర్యవేక్షించి అందింస్తూ కవితలు ,కధలు రాస్తూ బహుమతుల౦దుకొంటూ ,వాటిల్లో పోటీలు పెట్టి బహుమతుల౦దిస్తూ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ కార్య దర్శి బాధ్యత అత్యంత సమర్ధంగా నిర్వహిస్తూ ,ప్రతి ఆదివారం ఏదో ఒక జిల్లాలో ఆకార్య వర్గ సమావేశానికి హాజరౌతూ ,తన వృత్తికి ఏ మాత్రమూ ఇబ్బంది కలుగకుండా చూసుకొంటూ, కత్తిమీద సాముచేస్తున్న కలం వీరుడు శ్రీ .చలపాక ప్రకాష్ .వామనుడైనా అన్నిటా త్రివిక్రముడు .లబ్ధ ప్రతిష్టులైన కవులు రచయితలెందరితోనో, ఎన్నో సంస్థలతోనో పరిచయం , వర్ధమాన కవులకు ,రచయితలెందరి కో ఆదర్శం ,ఆసరా ప్రకాష్ .
ఇంత బిజీ జీవితం లో కూడా ఆయన దృష్టి అత్యాధునిక ప్రక్రియ నానీ పై పడి, దానిలోతు పాతులను తరచి చూడాలనే సంకల్పం కలిగి ,నిర్విరామ౦గా కృషి చేసి ,తరచూ పత్రికలో నానీలపై వ్యాసాలు రాస్తూ,వాటిపై పరిశోధన పత్రం రచించే సామర్ధ్యం అర్హత ఉందని గుర్తింపు పొంది ,మిత్రుల ప్రోత్సాహం తో ‘’కేంద్ర సాహిత్య మంత్రిత్వ శాఖ వారి ఫెలోషిప్ ‘’కోసం దరఖాస్తు చేసి ,తన సామర్ధ్యానికి గీటురాయిగా ఆ సంస్థ ప్రకాష్ ను ‘’నానీ ప్రాజెక్ట్ ‘’రెండేళ్లలో పూర్తీ చేయటానికి జూనియర్ ఫెలోషిప్ కుఎంపిక చేసి ఒక లక్షా నలభై వేల రూపాయలు నగదు అవార్డ్ అందజేస్తున్నట్లు ప్రకటించటం ,’’నానీ రచన అంతటి వేగంగా’’ జరిగి పోయాయి .’’నానీ ల నాన్న’’ఆచార్య ఎన్.గోపీ గారు( ఎన్ అంటే నానీల అని కూడా అర్ధం తీసుకోవచ్చు) ఫోన్ చేసి ‘’డా .ప్రకాష్ ‘’అని సంబోధించటం తో ప్రకాష్ కృషి ఫలించింది . ప్రతిభ ఉంటే అవకాశాలు ,పురస్కారాలు ఏ రికమండేషన్లూ అక్కర్లేకుండానే వెతుక్కుంటూ వెంట పడతాయి అనటానికి చలపాక ఒక గొప్ప ఉదాహరణ . కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి ‘’ఉత్తమ సాహితీ వేత్త ‘’పురస్కారం అందుకోవటం తో ప్రారంభమైన ఈ సాహితీ దిగ్విజయయాత్ర,అనేక సాహిత్య ,సాంస్కృతిక సంస్థలనుండి పురస్కారాలు ,మూడు పుస్తకాల ముద్రణకు తెలుగు విశ్వ విద్యాలయం నుండి ఆర్ధికసాయం అందుకోవటం ,జాతీయ , అంతర్జాతీయ స్థాయి ,ఆటా ,,నాటా సంస్థల బహుమతుల వరకు కోన సాగుతూనే ఉంది .ఇది ప్రకాష్ ప్రతిభా సర్వస్వం .ఈ అర్హతలతోనే1997 నుండి మూడేళ్ళు నానీల అంతు చూసి ,ఎవరూ స్పృశించని లోతులు తరచి సమగ్రమైన పరిశోధన చేసి ‘’అత్యాధునిక కవితా రూప ప్రక్రియ –నానీ ‘’గ్రంధంగా ప్రచురించారు .దీనినే నిన్న 12-2-17 ఆదివారం సాయంత్రం గుంటూరు బ్రాడీపేట లోని ప్రజాశక్తి గ్రంధాలయ సమావేశ మందిరం లోగుంటూరు జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన సభలో ఆచార్య శ్రీ ఎన్.గోపీ ఆవిష్కరించారు .వేదికపై శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య ,శ్రీమతి చిల్లర భవానీ దేవి వంటి ప్రముఖులున్నారు. శ్రీ గోపీ గారు నానీ ప్రాదుర్భవాన్ని ,ఎదుగుదలనువివరించి ప్రకాష్ కృషిని అభినందించారు .శ్రీమతి భవాని గ్రంధం లోని విషయాలను స్థూలంగా తెలియ జేశారు .
22 శీర్షికలో ప్రకాష్ నానీ పూర్వరంగం ,అత్యాధునిక ప్రక్రియ నానీ ,నానీ నిర్మాణం ,కొనసాగింపు ,నానీల వస్తు వైవిధ్యం ,ఏక వస్తు నానీలు ,వినూత్న ప్రయోగాలూ ,నానీలలలో సూక్తులూ ,సుభాషితాలూ ,వాటిలో హాస్య వ్యంగ్య చమత్కారాలు ,నానీ కవయిత్రులు ,ప్రసారమాధ్యమాలలో నానీలు ,నానీలపై జన వాక్యాలు ,వాదోపవాదాలు ,కవుల రచయితల అభిప్రాయాలు ,నానీసంపుటాలు ,అవార్డ్ లు ,కొత్త ప్రక్రియలకు స్పూర్తినిచ్చిన నానీ వగైరాలతో సమగ్ర పరిశోధనాత్మక గ్రంధంగా రచించారు .నాదృష్టిలో ఇది ‘’నానీ సర్వస్వం ‘’.అంతే కాదు శ్రీ చలపాక ప్రతిభా సర్వస్వం (మేగ్నం ఓపస్ )కూడా .352 పేజీల ఈ నానీ పరిశోధనా బృహద్గ్రంధం చక్కని ముఖ చిత్రం తో పాలరాయి లాంటి తెల్లని కాగితాలతో కనుల విందు చేస్తోంది .దీని వెల కేవలం రూ.87 . అందరు కొని తప్పక చదవాల్సిన రిఫరెన్స్ పుస్తకం .
సభ జరుగుతున్నప్పుడు నా ప్రక్కనే కూర్చున్న గుంటూరులో ప్రముఖ వైద్యులు ,కవి, రచయితా, విమర్శకులు డా రమణ యశస్వి తో మాట్లాడటం మహదానందం వేసింది .కాగితం పై నాఅభిప్రాయాలను నానీల్లాంటి రూపం లో రాసి వారికి చూపిస్తుంటే వారి ప్రశంసలు ,హావభావాలు మర్చి పోలేనివైనాయి .వీటినే శ్రీ గోపీ గారికీ ,ప్రకాష్ సుబ్బయ్యగార్లకూ వినిపిస్తే వారూ ఎంతో సంతోషించారు .ఆచిలిపి నానీలు మీకోసం –
1-మైక్రో నానీ పై– మాక్రో పరిశోధన 2-నానీల పరిశోధన –సుఖ ప్రసవానికి –చలపాక –ఒక మంచి నర్సు .
3-‘’గోపీ ‘’నోట –‘’నానీ ‘’నాని –వట వృక్షమై –నేడు నిలబడింది .
నేను ఈ ప్రక్రియ పై అప్పటివరకు ఎప్పుడూ ప్రయత్నించేలేదు .సభ ప్రేరణగా రాసినవి ఇవి .ఇవి నానీలో నూనీలో నేనీలో నాకు తెలియదు .భావావిష్కరణకు నాకు తోడ్పడిన బుజ్జి పదాలు .
కొస మెరుపు -జిల్లా ముఖ్య పట్టణమైన గుంటూరు లో గుంటూరు జిల్లా రచయితల సంఘం నగరం నడి బొడ్డు బ్రాడీ పేటలో సభ నిర్వహిస్తుంటే ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘ అధ్యక్ష,కార్యదర్శులు , మాజీ వైస్ చాన్సలర్ ,ప్రముఖ సాహితీవేత్తలు వేదికపై పాల్గొనే ఈ సభలో గుంటూరుపట్టణం వారు పట్టుమని పాతిక మంది లేక పోవటం ,ఇతర సుదూర ప్రాంతాలనుండి వచ్చినవారు 15 మంది ఉండటం బాధ కలిగించింది .సాహిత్య సభలకు ఇలాంటి స్థితి రాకూడదు .పండుగ వాతావరణం లో జరగాల్సిన సభ నీరసంగా జతగటం ఊహించలేకపోయాను .ఈ విషయాన్నే డా రమణ యశస్వి గారితో చెవిలో నెమ్మదిగా చెబితే ‘’ఇక్కడ అంతేనండి .మీకు అక్కడ బాగా వస్తారా ?’’అంటే అవాక్కయ్యాను .
దీనితో పరిశోధనా గ్రంధం ముఖ చిత్రం జత చేశాను చూడండి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు

