ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

ధృత రాష్ట్ర లో(కౌ)గిలి -3(చివరిభాగం )

భారతం లో వేదవ్యాసభగవానుడు ‘’భగవాన్ వాసు దేవో పి కీర్త్యతేత్ర సనాతనః ‘’అనిసనాతన వాసుదేవుడు ఈ కృష్ణుడు అన్నాడు .అలాంటి వాడు ‘’ఏను ‘’అంటే చాలు కాని భూసురులు ,  వేదాలు ఆయన తర్వాతవే .వాటి  గురించి ఆయన చెప్పక్కరలేదు .ప్రవర్తకులైన భూసురులు,వేదాలు ఆయన సనాతనత్వాన్ని చెప్పటానికి సాధనాలు మాత్రమే  .సాధ్యమైన పురుషోత్తముడే సిద్ధి౦చాక ,సాధనాల గురించి చెప్పక్కర లేదు .అయినా చెప్పాడు అంటే అందులో ఏదో విశేషం ఉంది అని మనం గ్రహించాలి అంటారు శలాక వారు .వాసుదేవుడు అంటే వాసుదేవుని కుమారుడు అని పురాణ అర్ధం కాదు .’’ఎల్ల యందు దావసించుట ,ఎల్లయును దనయందు వసి యించుటండ్రు వాసుదేవు డని పేరి కర్ధంబు’’అనే తాత్విక అర్ధం మనం గ్రహించాలి అన్నారు ప్రాచార్య శర్మగారు .ఈ తత్వానికి వ్యక్తిగత పక్ష పాతాలు ఉండవని ,ఉంటాయని భావిస్తే మనం తత్వ బాహ్యులం  అవుతామని శ్రీ శర్మగారు ఉవాచ .కనుక తేలింది ఏమిటి ?శ్రీ కృష్ణ నిర్ణయం సత్య నిర్ణయం .’’సత్య జ్ఞాన మనంతం బ్రహ్మ ‘’అని కదా శ్రుతి.శ్రీ కృష్ణుని భగవల్లక్షణాలను –పాండవులంత కాకపోయినా –ధృత రాష్ట్రుడు కొంత వరకు తెలిసిన వాడే అనటానికి ఆధారాలున్నాయి .కృష్ణుని అనుగ్రహం తోనే విశ్వ రూప సందర్శన అనుభూతి పొందాడు గుడ్డి రాజు .మళ్ళీ ఆ కళ్ళను మూసేయటం కూడా వాసుదేవుని అనుగ్రహం తోనే .దీన్ని బట్టి కృష్ణుని పక్షపాత రహిత దృష్టి ధృత రాష్ట్రు నికి బాగా తెలిసిందే .కనుక శ్రీ కృష్ణ ఉవాచ సర్వోపాదేయం అనే విషయం లో ఎవ్వరికీ సందేహాలు ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు శర్మ గారు .

ప్రమాణాలలో తలమానికం వంటిది శబ్ద ప్రమాణం .శబ్ద ప్రమాణం అంటే ఆప్త వాక్యం అని అర్ధం .రాగ ద్వేషం లేని స్వార్ధ దృష్టి లేని ,లోకతత్వం ,పరతత్వం బాగా తెలిసిన మహాత్ములు లోక హిత దృష్టితో ప్రతి పాదించిన సత్యాలే శబ్దాలు అంటారు శలాక శర్మ గారు .అవి తిరుగు లేని ప్రమాణాలు .గుడ్డిరాజు ఎదలోని కాపట్య౦  తెలుసుకోవటానికి ఈ శబ్ద ప్రమాణం బాగా గట్టిగా సహకరిస్తుంది . అదేమిటో వివరంగా తెలుసు కొందాం –

1-పాండురాజు మరణం తర్వాత పరలోక క్రియల అనంతరం వ్యాస భగవానుడు తన తల్లి సత్యవతికి ఏకాంతం లో

‘’మతి దలపగను సంసారం –బతి చంచల ,మెండ మావు లట్టులు ,సంప –త్ప్రతతతు లతి క్షణికంబులు –గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్’’.

2-‘’క్రూరులు ,విలుప్త ధర్మా –చారులు ధృత రాష్ట్ర సుతు లస ద్వ్రుతులు ,ని –ష్కారణ వైరులు ,వీరల –కారణమున నెగులు వుట్టు గౌరవ్యలకున్ ‘’

ఋషి,గ్రంధ ప్రణేత  భారత వంశ వివర్ధనుడు ,సాక్షాత్తు నారాయణుడు అనే పేరున్న వ్యాసుని మాటలు ఇవి .రెండవ పద్యం లో  గుడ్డిరాజు కొడుకుల లస్వభావం ,దాని ఫలితం విస్పష్టంగా వివరించాడు .’’ధృత రాష్ట్ర సుతులు ‘’అంటే షష్టీ సమాస౦ గా  అర్ధంగా తీసుకోరాదని ,’’ధృత రాష్ట్ర శ్చసుతాశ్చ’’అనిఅంటే ధృత రాష్ట్రుడు, సుతులూ అని   కవి హృదయంగా చెప్పుకోవాలని అంటారు ప్రాచార్య .  దీన్ని ఎలా సమర్ధించాలి ?’’దాని ధృత రాష్ట్రు౦డు తాన యనుభ వి౦చుం ,గానీ మీరీ దారుణంబు చూడక తపో వనంబున కరుగు౦డని చెప్పి చనిన ‘’అని అరణ్య పర్వం లో నన్నయ గారు వ్రాసిన మాటలు విచారిస్తే సత్యం బోధ పడుతుంది అన్నారు శర్మగారు .ధృత రాష్ట్రుడు మూల కారణం కనుక దాని ఫలం ఆయనే అనుభవిస్తాడు అని వ్యాసర్షి హృదయం .ఇంతకంటే పరమ ప్రమాణం ఏం కావాలని ఆచార్య ప్రశ్న .

2-ధృతరాష్ట్రు ని కాపట్యం గురించి అతని సతి గాంధారి ఇంకా స్పష్టంగా చెప్పింది .భారత స్త్రీ సాధారణంగా భర్త తప్పును సమర్ధిస్తుంది .ఏకాంతం లో ఏకి పారేసినా,పది మందిలో వెనకేసుకొస్తుంది .ఈగ వాలనీయదు భర్తమీద . కాని ఈ భారతం లోని స్త్రీ అయిన గాంధారీ దేవి నిండు సభలో ధృతరాష్ట్రు ని స్వభావానికి’’ గొప్ప నీరాజనమే’’పట్టింది .అందులో తన కొడుకులు చెడి పోతున్నారన్న ఆవేదన తప్ప మరో భావనే లేదు .ఎలాగంటారా-చూద్దాం రండి –

రాయబార కృష్ణుడు కరుసభలో చెప్పాల్సింది అంతా చెప్పాక ,దుర్యోధనుడు తన చతుస్టయం తో సభాసదు లందరికి అసహ్యం ఆశ్చర్యం జుగుప్సా పుట్టేట్లు సభనుంచి ‘’వాకౌట్ ‘’చేసేశాడు .కృష్ణుడు చీదరించుకొన్నాడు వాడి వింత ప్రవర్తనకు .ఆవేదనాపడ్డాడు .’’సత్కులము బాలి౦పగ వర్ణింప రాదే దుస్టాత్మకు నీచు నొక్కరిని బోదే భేద మీ జాతికిన్ ‘’అన్నాడు ఉద్యోగ పర్వం లో .’’మా వంశం లో కంసుడు ఇలాగే ప్రవర్తిస్తే ,మా వాళ్ళందరూ నాకు చెబితే ,నేను వాడిని అంతం చేసి వంశం కాపాడాను .మీరు కూడా ఆపని చేసి వంశం రక్షించు కో రాదా ?’’అన్నాడు ఈ మాటలతో ధృత రాష్ట్రు డికి ‘’గుండె జారి గల్లంతైంది ‘’.కృష్ణుడు అన్నంత పనీ చేసి కొంప ముంచు తాడేమోనని బెదిరి పోయాడు గుడ్డిరాజు .వెంటనే విడురుడిని పిలిపించి మనసులోమాట ఉండబట్ట లేక కక్కేశాడు –

‘’బుద్ధి మంతురాలు ,పొందుగ బలుకంగ-నేర్చు ,వచ్చి కొడుకు దేర్చి పోవు –గాన వేగ నీవు గాంధారి దోడితె-మ్మనుడు ,నరిగి యతడు నట్ల చేసె’’

భర్త పిలుపుతో గాంధారి సభలోకి ప్రవేశించింది .రాజు ‘’నీ తనూభవుడు దుర్వినియంబున జనియె నిట్టి వెంగలి గలడే?’’అన్నాడు తానేదో పత్తిత్తు అయినట్లు –

‘’నీవైన జెప్పి శాంతుం –గావింపగ నోపుదేని ,గౌరవ కుల మీ-గోవిందు శాసనము సం –భావి౦ప౦ గాంచి చెడక బ్రతుకుం జుమ్మీ ‘’అని నోరు జారేశాడు .కోపం వచ్చినప్పుడు మన ఇళ్ళలోనూ భార్య భర్తని ,భర్త భార్యని ‘’నీ కొడుకు ‘’అని దెప్పటం ఉందికదా .గుడ్డిరాజు నీకొడుకు అన్నమాట  రాజమాత కు ‘’ఎక్కడో ‘’కాలింది .ఇక చెడా మడా కడిగి పారేసింది నిండుసభలో –

‘’అనుడు ‘’నీ పుత్రడవి నీతుడగుట ఎరిగి ,వాని వశంబున నేల పోయె-దీవు ,పాండవులకు నేమి ఇచ్చితేని-నడ్డ పడ నెవ్వరికి వచ్చు నధిప!చెపుమ ‘’అని ఝాడించింది .అంటే ‘’రాజా !తప్పంతా నీదే .నువ్వు తండ్రివి .అధికారం అంతా నీ చేతుల్లోనే ఉంది .వాడు ఆడి౦చి నట్లల్లా ఆడటం నీ లోపం .పాండవులకు నువ్వు ఏది ఎంత ఇస్తే నిన్ను కాదనగలిగే గుండె ఎవరి కుంది ,ఎవరు కాదనగలరు ?’’అంటూ చివరగా ‘’అధిపా ‘’అని అంటించింది కొసరుమాటగా .మామూలు ఆడది అయితే ‘’నీ నిర్వాకం మండినట్లే ఉంది ‘’అన్నదానికి సమానార్ధం .’’అసలు వాడిని అలా తయారు చేసింది నువ్వే నీ పెంపకం లోనే వాడు త్రాస్టుడు భ్రష్టుడు,కులనాశకుడుఅయ్యాడు’’ అని ఈసడింపు .’’అలాంటి వాడికి తండ్రి వైన నువ్వు ‘’నీ  కొడుకు ‘’అని నన్ను అనటానికి నీ నోరెలా వచ్చింది ?’’అని రెట్టించింది .’’వాడు అచ్చంగా నీ కొడుకే ఫో ‘’అన్నది .ఎన్నాళ్ళనుంచో అమెమనసులో రగిలి పోతున్న సెగను, నగ్న సత్యాన్ని  ఒక్కసారి వెలిగ్రక్కి ఊపిరి పీల్చుకున్నది .ఏ సంకోచం లేకుండా ఆమె మనసులోని మాట అనేసింది .దటీజ్ గా౦ధారిమాత .గుడ్డిరాజు కపట స్వభావం ఎంత బాగా, ఎంత స్పష్టంగా గాంధారి చెప్పిందో మనకు తెలిసింది .భగవద్గీతలో మానవ సంబంధాలలో ఉన్న ఏడు రకాలను 1-సుహ్రుత్తు ,2-మిత్రుడు 3-అరి 4-ఉదాసీనుడు 5-మధ్యస్తుడు6-ద్వేష్యుడు 7-బంధువు అనే వారున్నట్లు చెప్పబడింది .వీళ్ళల్లో ఉదాసీన ,మధ్యస్థ ,బంధువు లఅభిప్రాయాలకు అనేక సందర్భాలలో విలువ ఎక్కువగా ఉంటుంది అంటారు శలాక వారు .గాంధారి దేవి ప్రాణ బంధువు అయిన భర్త స్వరూపం గురించి దాపరికం లేకుండా చెప్పిన మాట శబ్ద ప్రమాణంగా అత్య౦తవిలువైనదని  కురువంశ నాశనానికి గుడ్డిరాజే మూలకారణం అని స్పష్టమైంది అన్నారు సమాప్తి చేస్తూ ప్రాచార్య డా శలాక రఘునాధ శర్మ గారు .

వింటే భారతమే వినాలి అనటానికి ఈ ఘట్టం ప్రత్యక్ష నిదర్శనం ‘.

ఆధారం –ముందే చెప్పినట్లు శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’వ్యాస భారత వరి వస్య  ‘’గ్రంధం లో ‘’భారత యుద్ధం –ధృత రాష్ట్రుడు’’వ్యాసం .

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-2-17 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.