56-ఆధునిక సాహిత్య రధ సారధి – జెర్ ట్రూడ్ స్టెయిన్-1(1974-1946)
జెర్ ట్రూడ్ స్టెయిన్ పై రెండు వర్గాలమధ్య రేగిన విపరీత మైన దుమారం అంతా ఇంతా కాదు .మధ్యే మార్గమే లేదు .ఆమె వ్యతిరేకులు ఆమెనుఒక ఫ్రాడ్ గా ,ఆమె చెప్పిన ఆటోమాటిక్ రైటింగ్ ఒక అవహేళనగా భావించారు .ఆమెది ‘’క్లినికల్ కేస్ ఆఫ్ మేగలోమానియా ‘’అన్నారు .కొద్దిమంది ఆమెను రచయిత్రిగా కంటే ఆమె ఒక ఒకమతం గా ,దేశం లో అత్య౦త విప్లవాత్మక సృజన శీలిగా సాహిత్యం లో శాస్త్రీయ దృక్పధం ఉన్న విద్యార్ధినిగా,ప్రపంచాన్నే మార్చేసిన ఏక వ్యక్తి విప్లవ వనితగా ఆరాధించారు .మిగిలిన చాలా మందికి ఆమె నిరంతర వివాదాస్పద వ్యక్తి .ఎవరేమనుకొన్నా ఆమె తిరుగులేని ఉన్నత స్థాయి మతాధికారి .
3-2-1874 నా అమెరికాలో పెన్సిల్వేనియా లోని అల్లెఘేని లో డేనియల్ ,అమీలియా కేజర్ స్టెయిన్ దంపతులకు జన్మించింది .తండ్రిసంపన్నమైన స్ట్రీట్ రైల్వే వైస్ ప్రెసిడెంట్,నిరంతర సంచారి .పెద్దన్న లియో తో ఆమే వియన్నా ,పారిస్ కాలి ఫోర్నియా లలో బాల్యం గడిపింది . చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు .లైబ్రరీలకు వెళ్లి దొరికిన ప్రతి పుస్తకాన్నీ చదివేసింది .తర్వాత స్మోల్లేట్ ,స్కాట్ ,షేక్స్పియర్ ,బన్యన్ ,ఫీల్డింగ్ వర్డ్స్ వర్త్ రచనలతో పాటు ‘’కాంగ్రెషనల్ రికార్డ్స్ ‘’కూడా ఊది పారేసింది .19 వ ఏట రెడ్ క్లిఫ్ లో సైకాలజీ ప్రత్యేకంగా చదివి విలియం జేమ్స్ కు శిష్యురాలైనది .పరీక్ష ముందు రోజు రాత్రి ఒపేరా హౌస్ కు వెళ్లి ,అక్కడి నుంచి అర్ధ రాత్రి లేట్ పార్టీ లో ఉండి ఇంటికి వచ్చింది .పరీక్ష లో సమాధానం పేపర్ పై భాగాన ‘’డియర్ ప్రొఫెసర్ జేమ్స్ నేనుఫిలాసఫీ పేపర్ రాయలేక పోతున్నందుకు మన్నించండి ‘’అని రాసింది .దానికి సమాధానంగా జేమ్స్ ‘’డియర్ మిస్ స్టెయిన్ –నిన్ను పూర్తిగా అర్ధం చేసుకొన్నాను .అప్పుడప్పుడు నేను అలానే చేసేవాడిని .’’అని రాసి ఆమెకు అతి ఎక్కువ మార్కులు వేశాడు .
రెడ్ క్లిఫ్ లో ఉండగానే ఆటోమాటిక్ రీడింగ్ ,రైటింగ్ లో ప్రయోగాలు చేసింది .లియాన్ సాల్మన్ అనే గ్రాడ్యుయేట్ విద్యార్ధి తోకలిసి సృజన కార్యం అంతశ్చేతన తో కాకుండానే సాధ్యం అని రుజువు చేసి తమ పరిశోధన వివరాలను 1896 లో ‘’నార్మల్ మోటార్ ఆటో మాటిజం’’అనే శీర్షికతో ‘’సైకలాజికల్ రివ్యు ‘’లో ప్రచురించింది . అదే ఆమె మొట్టమొదటి ప్రచురణ వ్యాసం .దీనిపై విస్తృతంగా రాస్తూ ఆ తర్వాత బాగా ప్రసిద్ధి చెందింది .ఆ తర్వాత కాలం లో ‘’ఇందులో మాటలూ వాక్యాలు సరైనవే కాని ఒక దానికొకటి సంబంధం సరిగ్గా లేదు ‘’అని చెప్పు కొన్నది .రెడ్ క్లిఫ్ పరిశోధన జరిగిన 38 ఏళ్ళ తర్వాత ప్రొఫెసర్ బి .ఎఫ్ .స్కిన్నర్ ఆ పత్రాన్ని కనుగొని ‘’హాజ్ గెట్రూడ్ స్టెయిన్ అ సీక్రెట్ ‘’అనే దానిలో ఆమె సైకలాజికల్ రివ్యు లో రాసిన దానిలో అది చాలా పాక్షికంగా ఉన్న పేపర్ మాత్రమే అని రాశాడు .అచేతన స్థితిలో రాసిన రాత అన్నాడు .స్టెయిన్ కూడా ఆ తర్వాత తన స్వీయ చరిత్రలో తన ప్రయోగం విజయవంతం కాలేదని ,ఆటోమాటిక్ రెస్పాన్స్ కు తగిన సరైన సాక్షాలు లేవని రాసింది .’’ఇది ఆటోమేటిక్ అని నేననుకోలేదు ,ఇప్పుడు కూడా అనుకోను .విశ్వ వ్యాప్తంగా ఏ విద్యార్ధి అయినా దీనిపై ఇంకా పరిశోధించి నిగ్గు తేల్చవచ్చు మనిషి మనసులో ఉన్నది ఏదో ,సరైన పదాలతో ఆ భావోద్వేగం రాత వలన బయటికి వస్తుంది ‘’అని చెప్పింది .ఇదంతా భాషా శాస్త్ర వేత్తల దృష్టి ని ఆకర్షించింది . . దీనిని ఆమె గురువు విలియం జేమ్స్ బాగా ప్రోత్సహించాడు .ఆయన రాసిన ‘’సైకాలజీ ‘’గ్రంధం లో ‘’స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్’’అధ్యాయం లో సాహిత్యం లో ఈ కొత్త పదాన్ని సృష్టించి వాడాడు .ఇందులో ప్రతి ఆలోచనా విడి విడిభాగాలుగా బయటికి వస్తుంది .ప్రతివాక్యం ఒక కాల అవధికి సంబంధించింది అవుతుంది .ఇది స్టెయిన్ ను బాగా ఆకర్షించింది .ఇందులో సెన్స్ ఆఫ్ టైం అంటే ఆమెకు బాగా ఇష్టమైంది .
23 వ ఏట ఆమె జాన్స్ హాప్కిన్స్ యూని వర్సిటి లో చేరినాలుగేళ్ళు మెడిసిన్ చదివింది .అన్నిటా బాగా మార్కులు వస్తున్నా ,డిగ్రీ పొందకుండానే మానేసింది .మార్కులకంటే చదువే ముఖ్యంగా భావించింది .లండన్ వెళ్లి జీవిత గమనాన్ని మలుపు తిప్పు కొన్నది .ఎలిజబెతన్ ప్రోజ్ కు అంకితమైంది .20 వశతాబ్ది ప్రారంభం లో పారిస్ మేధావులకు కేంద్ర నిలయ౦ గా ఉండేది . .1903 లో పారిస్ చేరి ,ఆలిస్ బి .టోక్లాస్ అనే సాన్ ఫ్రాన్సిస్కో స్నేహితురాలితో పరిచయం చేసుకొని స్నేహాన్ని జీవితాంతం నిలుపు కొన్నది .ముప్ఫై ఏళ్ళలో ఒక్క సారి మాత్రమే చుట్టపు చూపుగా అమెరికా వెళ్లి వచ్చింది .మిగాతాకాలం అంతా పారిస్ లోనే .సోదరుడు,’’ ది ఎ.బి.సి .ఆఫ్ అద్లేటిక్స్ రచయితా అయిన లియో తో ఉన్నది .వీరి భావాల మధ్య వైరుధ్యం ఉన్నందున తరచూ కీచులాడుకోనేవారు .కొత్త ,అంతగా పేరు లేని పెయి౦టర్స్ నుగుర్తించి చిత్రాలను అతను సేకరించి భద్ర పరిస్తే ,తానే వారిని కనుక్కున్నానని ఆమె పోట్లాడేది .ఆమె రాసే విధానమూ అతనికి నచ్చేదికాదు .ఆమె రాతలో స్పష్టత లేదని ,పునరుక్తులు ఎక్కువని ఈసడించేవాడు .ఆమె పురుష వేషం మాట విధానం అతనికి ఏవగింపు .బిగుతు ,పొట్టి బట్టలను అతడు వద్దనే వాడు .జుట్టు కత్తిరించుకోవటం గిట్టేదికాదు .చురుకైన నళ్ళకళ్ళ చిన్నదిఆమె . పికాసో ఈమె చిత్రాన్ని అర్ధ నిమీలిత ధ్యాన యోగం లో సగం వాదం లో ముందుకు వంగి ప్రత్యర్ధి ని ఉచ్చులో పడేస్తున్నట్లు గొప్పగా చిత్రించాడు .అయితే పికాసో చిత్రించిన దానికి భిన్నంగా ఆమె కవళికలు ఉండేవి .ఆమె ముఖం ఆవేశ పూరితుడైన బుద్ధుని ముఖంలా లేక ఉలెన్ బట్టలలో చుట్టబడిన రోమన్ సెనేటర్ ముఖంలా అనిపించేది .ఆమె డామినేటింగ్ నేచర్ కు కొంపలో ఇద్దరు ఆడ వాళ్ళ మధ్య ఉండటం భరించలేక లియో అక్కడి నుంచి మారి వేరే చోట ఉన్నాడు .స్టెయిన్ అతనికి ‘’prolonged disease ,a kind of mild insanity ‘’తో బాధ పడుతున్నదానిలా అనిపించింది .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-3–17 -ఉయ్యూరు

