గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
68 –‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦ జనం’’కు సంపాదకత్వం వహించిన డా .ఇనగంటి ఉమా రామా రావు
డా ఇనగంటి ఉమా రామారావు 10-8-1956 న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు కు దగ్గర లోని త్యాజం పూడి గ్రామం లో శ్రీ ఇనగంటి సీతారామ మార్కండేయ శర్మ ,శ్రీమతి సూర్య ప్రకాశమ్మ దంపతులకు జన్మించారు .సంప్రదాయ విద్య ను కొవ్వూరు లోని ఆంధ్ర గీర్వాణ విద్యా పీఠం లోను తిమ్మ సముద్రం లోని శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత విద్యా పీఠం లోను అభ్యసించారు .వీరి న్యాయ ,అలంకార శాస్త్ర గురువులు వీరి తండ్రిగారి తోపాటు ,శ్రీ బొక్కా వీరభద్ర శాస్త్రి ,శ్రీ రామ చంద్ర కోటేశ్వర శర్మ ,,శ్రీ దోర్బల ప్రభాకర శర్మ ,శ్రీ దుర్భా శ్రీ రామ చంద్ర మూర్తి గార్లు .శ్రీ రామారావు న్యాయం లో విద్యా ప్రవీణ ,అలంకార శాస్త్రం లో ఎం. ఏ. డిగ్రీలను ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి పొందారు .తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి విద్వాన్ పట్టా అందుకున్నారు . వీరికి న్యాయ శాస్త్ర బోధనలో 36 సంవత్సాల అనుభవం ఉన్నది .ప్రస్తుతం తిమ్మ సముద్రం సంస్కృత విద్యా పీఠం ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు . ‘’విష్ణు ధర్మోత్తర పురాణం ‘’ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ లో భాగం గా ఇప్పుడు అనువాదం చేస్తున్నారు .
శ్రీ ఉమా రామారావు 2015 లో కులపతి ఆచార్య హరే కృష్ణ శత పథి ముఖ్య సంపాదకులుగా ,తాము సంపాదకులుగా శ్రీ అన్నం భట్టు విరచిత ‘’తత్వ చింతామణ్యాలోక సిద్దా౦జనం ‘’(మంగల వాదః ) గ్రంధాన్ని ప్రచురించారు .దీనిని తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రచురించింది . ఈ గ్రంధం 17 వ శతాబ్దికి చెందిన అన్నం భట్టు రచించిన ‘’సిద్ధాంజనం’’ ఇప్పటి వరకూ ప్రచు రింప బడని వ్రాత ప్రతి నాధారం గా ప్రచురింప బడింది .ఇది 13 వ శతాబ్దానికి చెందిన గంగేశ ఉపాధ్యాయ రచించిన నవ్య న్యాయ పాఠ్య గ్రంధం పై పక్షాధర మిశ్ర అనబడే జయదేవ ‘’ఆలోక ‘’పేరిట రాసిన ఉప వ్యాఖ్యానం .
తత్వ చింతామణి లోని ‘’మంగల వాదం ‘’ అనేది తత్వ చింతామణి కి ప్రత్యక్షర ఖండం లో ఒక భాగం ఇందులో అనేక విషయాలపై చర్చ ఉన్నది .పూర్వపు విద్యా వేత్తలైన పక్షధార ,నరహరి ,రుచిదత్త ,మహేశ ,మధు సూదన ల సిద్ధాంతాలపై అన్నం భట్టు చేసిన ఆలోచనాత్మక విశ్లేషణాత్మక వివరణమే ఇది .వీటిని అన్నిటినీ తులనాత్మకంగా పరిశీలించి నిగ్గు తేల్చిన గ్రంధం .ఈ గ్రంధం లో మరో విశేషం –తత్వ చింతామణి ఆలోక వ్యాఖ్యానాల మూల రూపాలను యధా తధం దీనితోపాటు చేర్చి ప్రచురించి చదువరులకు సౌలభ్యం కలిగించటం .సంక్షిప్త ఉపోద్ఘాతం నోట్స్ వగైరా అందజేయటంకూడా లాభించింది .
ఆధారం -11-3-17 న విజయవాడ శివ రామ క్షేత్రం లో మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ మద్దుల పల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి మూడు రోజుల ఉత్సవాల మొదటిరోజున నన్ను శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గారు తమ వెంటబెట్టుకొని సభలో పాల్గోనేట్లు చేయగా , నేను రచించిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం –రెండవభాగం ‘’నుండి శ్రీ మాణిక్య శాస్త్రి గారు,శాస్త్ర విద్వాన్మణి,ఆర్ష విద్యా భూషణ ,న్యాయ రత్న భాషా శాస్త్ర వేత్త ,న్యాయ విద్యా ప్రవీణ వేదా౦తాచార్య డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి గార్ల పై నేను రాసిన వ్యాసాలను సంగ్రహించి ప్రత్యేక బుక్ లెట్ గా ప్రచురించి ,ఈ రోజు ఆవిష్కరణ చేసిన సందర్భంగా డా శ్రీ ఇనగంటి ఉమా రామా రావు గారు పరిచయమై నాకు అందజేసిన ‘’తత్వ చంతామణ్యాలోక సిద్దా౦జనం ‘’ గ్రంథం .
ఈ సందర్భం గా భోజనాల సమయం లో అక్కడ చేరిన సంస్కృత విద్వా౦సు లందరినీ నేను సంస్కృత కవుల పై తెచ్చిన రెండు గ్రంథాలను వివరించి మూడవదానినీ నెట్ లో రాస్తూ ఇప్పటికి 67 మంది గురించి రాశానని ,కనుక ఇక్కడ ఉన్నవారు తమ బయోడేటా, గ్రంథ రచన విషయాలను మాణిక్య శాస్త్రి గారిపై అందజేసిన బుక్ లెట్ లో ఉన్న నా చిరు నామాకు పంపించి వారిని గురించి రాసే అదృష్టం కలిగించమని ప్రార్ధించాను .చూడాలి ఎందరు స్పందిస్తారో .
.
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -11-3-17 –ఉయ్యూరు .

