అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

అన్యాయం పై పోరాడుతున్న ముగ్గురు భారత నారీ మూర్తులు

1-ఆకాంక్ష ఫౌండేషన్ వ్యపస్థాపకురాలు -షహీన్ మిస్త్రి

బొంబాయిలో పార్సీ కుటుంబానికి చెందిన షహీన్ మిస్త్రి స్త్రీ విద్య కోసం పాటుపడిన మహిళ.మహిళకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉండాలని ఉద్యమించిన నారి .ఆమె పెంపకం అనేక దేశాలలో జరిగింది .ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూని వర్సిటి నుండి విద్య లో మాస్టర్ డిగ్రీ పొందింది .కాని బొంబాయి లోని మురికివాడల ప్రజలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారని ,నాణ్యమైన విద్య వారిక౦దటం లేదని ,వారు మిగిలిన వర్గాల వారితో చదువులో పోటీ పడలేక పోతున్నారని గ్రహించింది .వారికి ఆసరా ,విద్య పై మక్కువ కలిగించి జనజీవన స్రవంతిలో చేర్చిఈ పోటీ ప్రపంచం లో ధైర్యంగా నిలబడి తమ సత్తా చాటి చూపాలని భావించింది షహీన్ .
తన ఆలోచనలకు అనుగుణంగా 1898 లో ‘’ఆకాంక్ష కేంద్రం ‘’అనే లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థను నెలకొల్పింది .దీని ద్వారా అల్పాదాయ వర్గాల పిల్లలకు స్కూల్ అయిపోయాక ట్యూషన్లను ఏర్పాటు చేసింది .ఆమె కృషి ఫలించి మంచి గుర్తింపు రావటం తో మరింత వ్యాప్తి చేయటానికి 2008 లో ‘’టీచ్ ఫర్ ఇండియా ‘’ఏర్పాటు చేసి మరిన్ని ప్రయోజనాత్మక కార్యక్రమాలను చేబట్టింది .అప్పటి నుంచిదాదాపు 2 వేలమంది పిల్లలను చేర్చుకోవటం ,శిక్షణనివ్వటం ,ఉద్యోగ సదుపాయాలూ కల్గించటం చేసింది .ఆమెనిరంతర విద్యా సేవకు 2001 లో ‘’అశోకా ఫెలో ‘’అవార్డ్ ,2002 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘’గ్లోబల్ లీడర్ ఫర్ టుమారో ‘’అవార్డ్ నిచ్చి గౌరవించారు .2006 లో ‘’ఏషియా సొసైటీ 21 లీడర్ ‘’పురస్కారం అందుకొన్నది .అనేక విద్యా బోర్డ్ లలో ఆమెకు స్థానం కలిపించి సలహాలు తీసుకొంటున్నారు .

2- బాలికల పై యాసిడ్ దాడికి వ్యతిరేక పోరాటం చేస్తున్న –లక్ష్మీ అగర్వాల్

15 వ ఏట 35 ఏళ్ళ ‘’మృగాడు ‘’ బరి తెగించి ప్రవర్తిస్తుంటే ,తనకు ఇష్టం లేదని మొత్తుకొంటున్నా హద్దు మీరి ప్రవర్తిస్తుంటే తీవ్రంగా వ్యతిరేకించినందుకు లక్ష్మీ అగర్వాల్ ముఖం పై యాసిడ్ పోసి తన వికృత చేస్ట కు పరా కాస్ట గా నిలిచాడు.హిందూ స్థాన్ పత్రిక లక్ష్మి పై జరిగిన యాసిడ్ దాడి ఉదంతాన్ని సీరియల్ గా ప్రచురించి ప్రజలలో చైతన్యం కలిగించింది .తనకు జరిగిన ఈ క్షోభ మరే ఆడపిల్లకూ జరుగ కుండా చేయాలని లక్ష్మి నిశ్చయించుకొని ,యాసిడ్ దాడికి వ్యతిరేకంగా 27 వేలమందితో సంతకాలు చేయించి సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి,ప్రజా ఉద్యమానినికి నాంది పలికింది .సుప్రీం కోర్ట్ ధర్మాసనం వెంటనే చర్య ప్రారంభించి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ పెట్టమని ,యాసిడ్ దాడికి పాల్పడిన వారిపై సత్వరం కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ జారీ చేసింది .
యాసిడ్ దాడి లో ప్రాణాలతో బతికి బయట పడిన వారి సంరక్షణ కోసం లక్ష్మీ అగర్వాల్ ‘’చాన్వ్ ఫౌండేషన్ ‘’ఏర్పాటు చేసి సేవలందిస్తోంది .20 14 లో అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సతీమణి ,అమెరికా ప్రధమ పౌరురాలు లేడీ మికిల్లీ ఒబామా చేతులమీదుగా లక్ష్మీ అగర్వాల్ ‘’ఇంటర్ నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ అవార్డ్ ‘’ను అందుకున్నది .’’ఎన్ .డి .టి .వి .ఇండియన్ ఆఫ్ ది యియర్’’పురస్కారమూ లభించింది .వీవా దీవా ప్రకటనలలో ఆమె ముఖ చిత్రం ప్రచురించి బాలికలకు బాహ్య సౌందర్యం కంటే అంతస్సౌ౦దర్యం ముఖ్యమని గ్రహించేట్లు చేశాయి .

3- గృహ హింసపై ఉద్యమిస్తున్న లాయర్ –ప్రమీలా నేసర్గి

ప్రమీలా నేసర్గి తల్లి స్వాతంత్ర సమర యోధురాలు తండ్రి .స్వయం కృషితో ఎదిగినవాడు ఆమె పై తలిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువ ..అతితక్కువ వయసు లోనే న్యాయ శాస్త్రం చదివి పాసై లాయర్ వ్రుత్తి చేబట్టింది .ధైర్య సాహసాలు స్వతంత్ర భావాలు ఉన్న మహిళా న్యాయవాది గా పేరు పొంది౦ది.ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగినా వారి తరఫున వాదించి న్యాయం చేకూర్చటం ఆమె లక్ష్యం .బాలకార్మికులు ,గృహయాజమాన్యం ,గృహ హింస ,కార్యాలయాలలో సెక్సువల్ వయోలెన్స్ ,ఖైదీల దయనీయ స్థితులు వంటి అతి సున్నితమైన సమస్యలపై ఆమె గళం విప్పి బాధితుల పక్షాన న్యాయం కోసం నిరంతరం పోరాడే యోధురాలు .అసంఘటిత వర్గాలను ఐక్యపరచి ఒకే వేదికపై నిలిపి పోరాటం చేయిస్తున్న మార్గ దర్శకురాలు .ఇంగ్లీష్ –కన్నడ అనువాద నిఘంటు కమిటీలో సభ్యురాలు .50 ఏళ్ళ కన్నడ బార్ కౌన్సిల్ కు బార్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన ప్రధమమహిళా లాయర్ ప్రమీలా నేసర్గి .అతి పెద్ద కేసు నుంచి అతి చిన్న కేసు దాకా స్వీకరించి సమర్ధంగా వాదించి గెలిపించే నేర్పు ఆమె ప్రత్యేకత ..

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.