కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1
కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి
శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -1
శ్రీ పాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి శత జయంతిఉత్సవం 1966 లో ,150 వ జయంతి వేడుకలు 2016 లో జరిగాయి .వారి అపూర్వ విద్వజ్జీవితం ఈ తరం వారికి తెలియ జేసే ఉద్దేశ్యం తో కొన్ని ముఖ్య విశేషాలు రాస్తున్నాను .
సాక్షాత్తు సరస్వతీ దేవి శ్రీ కృష్ణ మూర్తి శాస్త్రి గారి అవతారం దాల్చిందేమో నని పిస్తుంది .వారొక్కరే భారత రామాయణ భాగవతాలను మూల గ్రంధాలకు ఏ మాత్రం తేడా లేకుండా అనువాదం చేసి శ్రీ కృష్ణభారతం శ్రీ కృష్ణ రామాయణం శ్రీ కృష్ణ భాగవతం అని నామకరణం చేశారు .శ్రీ నాధుని కవి సార్వ భౌమ బిరుదం శాస్త్రి గారికీ అన్వర్ధమే కాక ఆయనకు బాగా ఇష్టమైన బిరుదు అది .1866 అక్టోబర్ 29 పశ్చిమ గోదావరి జిల్లా ఎర్న గూడెం దగ్గర దేవర పల్లి గ్రామం లో శ్రీపాద వేంకట సోమయాజులు ,శ్రీమతి వేంకట సుబ్బమ్మదంపతులకు జన్మించారు .గారాబం గా స్వేచ్ఛ గా పెరిగారు .చిన్ననాట చదరంగం,గుర్రపు స్వారి లలో మేటి అనిపించారు .కవిత్వమూ కావ్య నాటక శాస్త్ర జ్ఞానమూ అబ్బింది షోడశ కర్మాంత స్మార్తాన్ని ,చయనానంతశ్రౌతాన్ని ,సోమ పంచకాన్ని అభ్యసించారు .తండ్రి గారికి యజ్న నిర్వహణ లో తోడ్పడ్డారు .12 ఏళ్ళకే కుమార సంభవం నైషధం లను నేర్చి ,శ్రీనాధునిపై అభిమాన మేర్పడి 16 వ ఏట ‘’సత్యనారాయణో పాఖ్యానం ‘’రాశారు .
ఇతరుల కింద ఉద్యోగం ఇష్టం లేక గోదావరి లంక భూముల్ని కౌలుకు తీసుకొని పంట పండక విపరీతంగా పీకలలోతు అప్పుల్లో మునిగి పోయారు .అప్పుల నుంచి బయట పడటానికే అవధానాలు ,కవిత్వం లోకి దిగారు అస్టావ ధాన శతావధాన ,చిత్రావధానాలు చేసి మెప్పు పొందారు .మొత్తం 225 గ్రంథాలు రాశారు .98 పద్య కృతులు ,32 నాటకాలు ,5 శతకాలు ,8 5 వచన రచనలు ,21 విమర్శన గ్రంథాలు ,5 ప్రహసనాలు 9 సంస్కృత గ్రంథాలు రాసిన ఘనత వారిది .వీరి చివరి కృతి రాష్ట్ర పతి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారిపై రచించిన సంస్కృత కృతి ‘’రాజేంద్రాభ్యుదయం ‘’.శ్రీ పాద వారు సంపాదకులుగా ‘’గౌతమి ‘’అనే తొలి తెలుగు దిన పత్రిక నడిపారు .వజ్రాయుధం ,కళావతి ,మానవ సేవ మాస పత్రికలు ,స్వరాజ్యోదయం ,వందే మాతరం అనే పక్ష పత్రికలూ నడిపారు .వారి బొబ్బిలి యుద్ధం నాటకం బహుళ ప్రసిద్ధి పొందింది యజ్న ఫలం నాటకం ఇంటర్ కు బోధనా గ్రంథంగా ఉండి నేను ఇంటర్ మొదటి సంవత్సరం లో దాన్ని నాటకం గా చదువుకొన్నాను .శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు శ్రీపాద వారి వద్ద చదరంగం ,కొంత సంస్కృత సాహిత్యమూ నేర్చారు .
1930 లో పాలకొల్లు లో శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారికి సువర్ణాభిషేకం ,జరిగింది .1933 లో రాజమండ్రి లో సువర్ణ గండ పెండేరం ప్రజా సమూహం నిర్వ హించింది .1936 లో విజయవాడ ,సాలూరు లలో గజారోహణ జరిగితే ,1945లో విజయవాడలో మణికిరీట ధారి అయ్యారు .మయూర్భంజ్ లో గజా రోహణ సన్మానం ,1954 లో గుడివాడ లో సువర్ణ పుష్ప పూజ అందుకున్నారు .1950 లో మద్రాస్ ప్రభుత్వం ‘’ఆంధ్ర ఆస్థాన కవి ‘’గా నియమించి గౌరవించింది .ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వీరిని ఆజీవిత ఆస్థాన కవి గా నియమించింది ,1958 లో రాష్ట్ర పతి ఆ జన్మాంత సంస్కృత పండితునిగా పేర్కొని ‘’సనద్ ‘’పట్ట ప్రదానం చేసి , సంవత్సరానికి 15 00రూపాయల గౌరవ భ్రుతి కల్పించారు .రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి పురపాలక సంఘం వారికి ‘’స్వేచ్ఛా పౌరసత్వం ‘’ప్రసాదించాయి .1941 శ్రీపాద వారి శిలా విగ్రహాన్ని రాజమండ్రి పురపాలక సంఘ ఆవరణలో నెలకొల్పి గౌరవించారు .శాస్త్రి గారు 94 వ ఏట 29-12-19 60న శ్రీ పాద పీఠం చేరుకున్నారు .1966 లో శ్రీపాద వారి శత జయంతి వేడుకలను ప్రభుత్వం మూడు రోజులు ఘనంగా నిర్వహించింది .
శాస్త్రి గారి దౌహిత్రులు శ్రీ కల్లూరి సత్యనారాయణ మూర్తి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కార్మిక శాఖలో అధికారిగా పని చేసి ప్రతి ఏటా తాతగారి జయంతిని నిర్వహించారు .శాస్త్రి గారి కోరికపై వారి లభించిన అమూల్య గౌరవ పురస్కారాలను శత జయంతి నాడు ఆంధ్రవిశ్వ విద్యాలయానికి బహూకరించారు .విశాఖ లో మ్యూజియం ఏర్పడినప్పుడు వీటిలో కొన్నిటిని ఆంధ్రా యూని వర్సిటి వారు 1992 లో వస్తు ప్రదర్శన శాలకు తరలించి ప్రజలు ఈ అమూల్య ఆభరణాలను దర్శించటానికి వీలు కల్పించారు .
ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.
సశేషం
సంచిక కవర్ పేజీలు జత చేశాను చూడండి –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

