కవి సార్వ భౌమ ,మహా మహోపాధ్యాయ కవిరాజ ,కళా ప్రపూర్ణ ,ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవి
శ్రీ శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారు -2(చివరి భాగం )
శ్రీనాధుని ‘’చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు ‘’పద్యం లాగానే శాస్త్రిగారు కూడా తన గ్రంధ రచనలను పరామర్శించి ‘’సీసం’’ లో కరగించారు –
‘’నే పది యారేండ్ల లోపల సత్య కధయు,సా –విత్రీ చరితంబు ,చిత్ర శతక –మిరువదేడు ల లోన వర గౌతమీ మహాత్మ్య ము,కాళిదాస వృత్తాంత వచన
మిరువదై దేండ్లలో నేకావళియు జగ –న్నాధ చరిత ,గజానన విజయము –ముప్పదేడులలోన మునుమున్న కావేరి కథ,వధూ విజయము ,కనకగిరియు
నవల శ్రీ వేంకటేశ్వ రీయమును వీర –రుద్ర విజయము ,ప్రద్యుమ్న చరిత
బొబ్బిలి యు, వేణిసంహారము కలభాషి –ణియు ను రాజ భక్తి యును
కమలినియును ,నానందోదయమును ,వీర –సేన విజయము లోనుగా జెప్పనైన
కృతులు శతకాస్ట కంబులు ,కృతి విమర్శన –నంబులు బెక్కు లొనరించి నాడనేను ‘’
తాను భారత భాగవత రామాయణాలను తెనిగించటం లో ‘’వాళ్ళ కంటే బాగా రాస్తానని కాదు ,కేవల చాపల్యం వల్ల రాస్తున్నాను ‘’అంటూ పద్యం చెప్పారు –
‘’నన్నయ తిక్కనాది కవి నాథుల కన్నను మిన్నగా తెలుం –గున్నుడు వంగ లాడ నధికుండను నేనని కాదు ,గ్రంథమం
దున్నెరసుల్ ,కొరంతలును దోచు నటంచని కాదు ,వెండియున్ –బన్నుట భారతేస్టతను బట్టిన చాపల మంచు నెంచుడి’’అని వినయంగా చెప్పారు .మూలాన్నివీసం కూడా దాట కుండా అనువదించారు .
శ్రీనాధుని లా వ్యవసాయం చేసి చేతికి చిప్ప మిగుల్చుకొని ఆయన బాధపడిన గతవైభవస్పురణ ‘’కవి రాజు కంఠంబుకౌగిలించెను గదా !పురవీధి నెదు రెండ బొగడ దండ ‘’సీసం లాగా మన కవి రాజు కూడా –సీసం లోనే –
‘’గౌతమీ మహత్మ్య కర్త కంఠము చుట్టు –కొని యు౦డెగదా !ఋణము చిలువ –కవి మిత్రుల మేనెల్ల చివికించే గదా –అప్పుల వారి వాక్యాయుధములు ‘’అంటూ చివరగా ‘’పేట లంకల పాట నీ పాటు దెచ్చె-మాల పురువుల పాలయ్యె మరి పొగాకు –అప్పు ముప్పది వేల రూప్యంబులింక –నెట్లు దీర్చెడు శ్రీ పాద కృష్ణ మూర్తి ‘’’అని పురుగు పంటలనే కాక తననూ నాకి పారేసిందని వ్యధ చెందారు .
ఒక అవధానం లోశాస్త్రి గారికి ‘’వడ్డాణ మలంకరించె వనిత కుచంబుల్ ‘’అని సమస్యనిస్తే క౦ద౦ లో అందంగా వండారు-
‘’షడ్డకులు పోరుచో భూ -రాడ్డమ్మున నుడువనే గుర భవనంబునన్
నడ్డాక దెగుడు మెడగొను-వడ్డాణ మల౦కరించె వనితా కుచంబుల్ ‘’
తన కవితా సామర్ధ్యాన్ని గూర్చి చెబుతూ శాస్త్రి గారు –
‘’గడియకు నూరు పద్యములు కల్పన జేయగ జాలి ఎంతయే-గడు నవధానముల్ సలుపు వాడనయై .కవి రాజ నామమున్
బడసి ప్రశంస కెక్కగ బ్రబంధము లెన్నొరచించి ,మించు నే –నుడివెద కృష్ణ మూర్తి నని నూత్న కవీ౦ద్రు లెరింగి కో నిటన్ ‘’
రాజ మండ్రిలో శాస్త్రి గారి స్వగృహం పేరు ‘’సుదర్శన భవనం ‘’.అందులో పై అంతస్తులో పద్మాసనం వేసుకొని కూర్చునే వారు .సందర్శకులు ఎదురుగా చాపల పై ఆసీను లయ్యేవారు .దీన్ని వర్ణిస్తూ శ్రీ ఆర్ .ఎం చల్లా ఆంగ్లం లో ‘’this is the Vatican of the poetic pontiff .The poet and his wife are a hospitable couple .What Words worth said of Milton was true of Krishna Murty Sastry –
‘’thy soul was like a star ,and dwelt apart –thou hadst a voice whose sound was like the sea ‘’అన్నారు .ఇన్ని ఉద్గ్రంధాలు రాసి,అందరిలో ప్రధములుగా ఉన్నా’’his work is much praised and less read .He perhaps ranks first .i can admonish the Andhra reading public for their indifference to Sripada ;s writings ‘’అని బాధ పడ్డాడు చల్లా .
శాస్త్రి గారి కృష్ణ భారత కవిత్వాన్ని మెచ్చుకుంటూ శ్రీ కాశీ కృష్ణాచార్య ‘’ధారా శుద్ధికి జహ్ను కన్య ,పద సందర్భంపు పూదోట ,భాషా రామామణి దర్పణంబు ,కవితా సామ్రాజ్య సింహాసనం బౌరా –సర్వ రసామృదాంబునిధి ,శయ్యా పాక వ్రుత్యాద్యలం –కారాగారము కృష్ణ భారత మనంగా నెన్న సామాన్యమే ‘’ అన్నారు .శ్రీ మంగు శివరాం ప్రసాద్ శాస్త్రి గారిని ‘’సాహితీ వాచస్పతి ‘’అంటే ,డా దామెర వెంకట సూర్యా రావు ‘’శాస్త్రి గారిని వారిని వరించిన బిరుదులూ ,పురస్కారాలు ఏ కవికీ దక్కలేదేమో ‘’అన్నారు .
‘’నాకు జాతి మత ద్వేషం లేదు .సర్వమత సమ్మతుడనని చెప్పగలను .పూర్వా చార పరాయణుడనైననూ కాలమును బట్టి సమయోచితముగా ప్రవర్తి౦తు ను ‘’అని చెప్పుకున్నారు శ్రీపాద .శాస్త్రి గారికి శ్రీ జగన్నాధం లో ఇంద్ర ద్యుమ్నం దగ్గర పదేళ్ళ బాలుడు బంగారు బొమ్మవంటి పిల్లగాడు చిన్న గోచీ తో గంజాయి తాగుతూ హిందీ లో తనతో వస్తే అరణ్యం లో లోకాన్ని రక్షించే సింహ రాజాన్ని చూపిస్తాను ‘’అన్నాడట .ఇలాంటి వాళ్ళు మోసగాళ్ళు అని భావించి శాస్త్రి గారు నీటిలో దిగి స్నానిస్తుంటే బాలడు అదృశ్యమయ్యాడట .అతనికి కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉంటాయని నరసింహ ఉపాసకుడు అని శాస్త్రి గారు గ్రహించారు .మరొక సారి పెద్దపల్లి నుంచి హనుమకొండకు వెడుతుంటే దొంగలు బండీని ఆపి దిగమని హెచ్చరిస్తే ,అకస్మాత్తుగా ఒక పోలీసు సాయుధుడు గా వచ్చి దొంగలను భయపెట్టి హనుమకొండకు చేర్చి మాయం అయ్యాడట . తనపాలిటి దేవుడే ఆ పోలీసు అనుకొన్నారు.శాస్త్రి గారు రెండు మూడు అచ్చు యంత్రాలు స్థాపించి అనేక పురాతన గ్రంధాలు ప్రచురించి లోకోపకారం చేశారు .’’రోజుకు కనీసం ఒక ప్రబంధం అయినా రాయగలను ‘’అని చెప్పుకొన్నారు .వారి అవధానాలలో వ్యస్తాక్షరి ,న్యస్తాక్షరి ,లిఖితాక్షరి ,నిషేధాక్షరి ,దత్తాక్షరి ,ఆకాశ పురాణం,సహ పఠనం ముఖ్యమైన అంశాలు .వీరు సుందర కాండ రాస్తుంటే ఒక వానరం ఇంట్లో ప్రవేశించి గ్రంధం చుట్టూ తిరిగి ,వీరు చూసేలోపు అంతర్ధానం అయిందట .శాస్త్రిగారికి ప్రధమ కోపం ఎక్కువ .ఆ తర్వాత ఎంతో మర్యాద చేసేవారట .హృదయం లో కల్మషం ఉండేదికాదు .కాని గ్రాంధిక భాషను మాత్రం వదిలి పెట్టే వారు కాదు .అప్పు చేసి కూడా దాన ధర్మాలు చేసిన పుణ్య మూర్తి .వెంకట శాస్త్రిగారు వీరి శిష్యులే అయినా వ్యవహారం లో షస్టాస్టకం.ఒక సారి గురూ గారితో తగాదా పరిష్కరించుకొందామని వచ్చారు .శాస్త్రి గారు అమాంతం లేచి వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆశీర్వదించి భోజనం చేయందే వదలను అన్నారు .’’మన తగాదాల గూర్చి మాట్లాడటానికి నేను వచ్చాను. అది అయితేనే భోజనం ‘’అన్నారు వెంకట శాస్త్రి గారు ‘’నువ్వు భోజనం చెయ్యక పొతే అసలు నీతో నేను మాట్లాడను ‘’అన్నారు శాస్త్రి గారు .భోజనం చేసి మాట్లాడుకొని తగవు పరిష్కరించుకున్నారు. అంతటి వాత్సల్య పూర్ణులు శాస్త్రి గారు .ఒక రామ చిలకను పెంచేవారు .అది పంజరం నుంచి ఎగిరిపోయినా మళ్ళీ వీరింటికి వచ్చి చేతిపై వాలేదట .
‘’వ్యాసుడే మళ్ళీ రాజమండ్రిలో కృష్ణ మూర్తి శాస్త్రి గారిగా పుట్టారు ‘’అన్నారు శ్రీ బోయి భీమన్న .తాను హరిజనుడను అని చెబితే నమ్మలేదట శాస్త్రిగారు ‘’కులాన్ని బట్టి భాష ఉండదు.గ్రామం లో ప్రతికులం వారు ఒకే భాష మాట్లాడుతారు .పాత్రోచిత భాష నాకు నచ్చదు ‘’అన్నారట భీమన్నగారితో .శాస్త్రి గారికి కోపం జాస్తి అని అందరూ అంటారు. ఎన్నో కోర్టు కేసులు ఎందరిమీదో వేసి కోర్టు పక్షి అని పించుకొన్నారు .మద్రాస్ ఉమ్మడి రాష్ట్ర మంత్రి శ్రీ బెజవాడ గోపాల రెడ్డితో శాస్త్రిగారు శ్రీ ప్రోలాప్రగడ వారి ఆఫీసుకు వచ్చి ఫోన్ లో మాట్లాడేవారట .ఒక సారి చలికాలం వచ్చి మాట్లాడుతుంటే దంతాలు టకటక శబ్దం చేశాయట –రెడ్డిగారితో ‘’అబ్బాయీ !మనకు ఆస్థానకవి పదవి వచ్చేసినట్లే .కళ్ళు ,పళ్ళు సరిగ్గా లేని వాళ్లకు ఆ పదవి ఇవ్వద్దు అన్నాడట రాజాజీ .మనకి కళ్ళు శుభ్రంగా కని పిస్తున్నాయి. పళ్ళు ఊడే ప్రసక్తే లేదు కట్టుడు దంతాలు కనుక .కనుక పదవి గారంటీయే ‘’అని పకపక-సారీ ‘’టకటక’’నవ్వారని శ్రీ ప్రోలాప్రగడ చెప్పారు .
శాస్త్రి గారు తిలక్ ,గాంధీజీ లపై నాటకాలు రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెడితే కోర్టు కొట్టేసిందని ,పంచమ జార్జి చక్రవర్తి పై శ్రీ పాద గ్రంధం రాయటమేకాక పంచ వర్ష ప్రణాళికలు పైనా నాటకం రాసిన బుద్ధి శాలి అని డా .పి ఎస్ ఆర్ అప్పా రావు గారు తెలిపారు .’’వారి పద్య గద్య నాటకాలు సంగీత ప్రధానమై ,ప్రాచ్య ,పాశ్చాత్య లక్షణాలను స్వతంత్ర మార్గం లో ఏర్చికూర్చినవి ‘’అన్నారు శ్రీ ఐ. శ్రీనివాసరావు .శ్రీ విశ్వనాథ ‘’శాస్త్రి గారు పోతే కర్మను మించిన ప్రశ్నవచ్చి దుఖించాల్సి వస్తుంది .రేపు చనిపోతారనగా ఇవాళ కూడా రాసిన మహానుభావుడు .శ్రీపాద, మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఇద్దరూ మహా పురుషులు ,దీర్ఘాయుష్మంతులు .మన శాస్త్రాలు నిజమైతే ఆయన స్వర్గం లోనే చిరకాలం ఉంటారు ‘’.అన్నారు . శ్రీ తాపీ ధర్మారావు ‘’యువకవులను ,వృద్ధి లోకి వచ్చే వారిని వారెన్నడూ చిన్న చూపు చూసి ఎరుగరు .’’అనగా ,శ్రీ దాశరధి ‘’ప్రాచీన సాహిత్యానికి ఎంత ప్రతినిధియో ,ఆధునిక సాహిత్యం పట్ల అంత మక్కువ ఉన్న వారు .ప్రాచీన ,ఆధునిక సాహిత్య వారధి శ్రీపాద .ఆయన స్థానాన్ని ఎవరూ పూరించలేరు .ప్రబంధ యుగానికి ఆయనే ఆఖరిమహా కవి ‘’‘’అని కీర్తించారు .
ఇంతటి కీర్తి కాయుని జన్మదినాన్ని ప్రభుత్వం నిర్వహించాలని ,వారి ప్రచురణలు వెలుగులోకి తేవాలని ,వారిజీవిత చరిత్ర ,రచనలను పాఠ్య అంశాలుగా చేర్చాలని ,వారి శిలా విగ్రహాన్ని పునరుద్ధరించాలని ,విశాఖ మ్యూజియం లో ఉన్న వారి గండ పెండేరం ,మణి కిరీటం ,మొదలైన వాటిని ప్రజల దర్శనార్ధం ఉంచాలని ,వారి పేర సారకోపన్యాసాలు ఇప్పించాలని ,వారి స్వగృహం ‘’సుదర్శన భవనం ‘’ను ప్రభుత్వం స్మృతి మందిరంగా మార్చాలని ,వారి అముద్రిత గ్రంధాలను ముద్రించాలని వారి జీవిత చరిత్రను ఆంధ్ర ,కేంద్ర సాహిత్య అకాడెమీలు ప్రచురించాలని సాహిత్యాభిమాను లందరూ కోరు కొంటున్నారు .
‘’ఒక నన్నయ్యయు ,నొక తిక్కన్న యమాత్యుం డొక్కయెర్రన్న,తా-నొక శ్రీనాధుడు ,నొక్క పోతనయు ,నీ యుర్విం బెడంబాసి ,తా
నకలంకంబుగ కృష్ణ మూర్తి మహనీయాకారము౦ దాల్చి ,యాం –ధ్రికి సేవల్ పొనరించి రంచు దలతున్ శ్రీ పాద వంశోన్నతున్ ‘’
‘’పునర్జీవిత శ్రీ నాథః-అపరా౦ ద్రీసరస్వతి –రాశీ భూతాత్మ విశ్వాసః –కృష్ణ శాస్త్రీ ర్మహా కవిః’’
ఆధారం – నాకు 15- 3- 17 విశాఖలోఆచార్య సార్వ భౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారింట్లో శ్రీ మంగు శివరాం ప్రసాద్ గారు కానుక గా అందజేసిన- శ్రీపాద వారి ప్రపౌత్రులు శ్రీ కల్లూరి శ్రీరాం గారు –(విశ్రాంత ముఖ్య అధికారి –హిందూస్తాన్ షిప్ యార్డ్ –విశాఖ పట్నం )గారు శ్రీపాద వారి 150 వ జయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

