మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -1

పుట్టుక విద్యాభ్యాసం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా కాకర పర్రు గ్రామం బ్రాహ్మణ అగ్రహారం .ఇక్కడే శ్రీ వేదుల సూర్య నారాయణ శాస్త్రి గారు అనే మహా కవి పండితుడు జన్మించి ప్రతాపరుద్రీయం ,ప్రాణ త్యాగం ,,బంగారం , నిందాపహరణం మొదలైన గ్రంథాలు రాశారు .తణుకు బోర్డ్ హైస్కూల్ లో సంస్కృత ఉపాధ్యాయుడు .వీరి రెండవ కుమార్తె  సుశీలాంబ  1-1-1911 న జన్మించారు .చలాకీ ఉత్సాహం ఉన్న పిల్ల .మగ పిల్లవాడు లేని తండ్రి ఆమెను కొడుకుగా పెంచారు .ఆమె సైకిల్ తొక్కేది, కాలవలో స్నానం చేసి ఈత కొట్టేది .బంగారు నగలపై మోజు ఎక్కువ .తండ్రి గారు తాను రాసిన కథ ‘’బంగారం ‘’చదివి వినిపించి బంగారం పై వ్యామోహం ఎంతటి అనర్ధమో తెలియ జేశారు. అప్పటి నుంచి ఆమెకు  నగలపై  విరక్తి కలిగింది .తండ్రి గొప్ప సంఘ సంస్కర్త .క్విట్ ఇండియా ఉద్యమలో ఆయనతో పాటు సుశీలకూడా పాల్గొన్నది .పెద్దగా చదువు లేకపోయినా జ్ఞాన వంతురాలు .వక్తగా విదుషీమణి గా పేరు పొందారు .శ్రావ్యమైన కంఠం తో  మధురంగా పాడేవారు .తల్లి గయ్యాళి. ఎప్పుడూ తగాదాలే భర్త తో.అన్నం కూడా వందేదికాదు .శాస్త్రిగారు ఊరి చివర కాలువ గట్టున పాక వేసుకొని పండ్ల తోటలు పెంచుతూ పళ్ళు, మరమరాలు  సెనగపప్పు, తిని బడికి వెళ్ళేవారు కాని భార్యను పల్లెత్తు మాట కూడా అనేవారు కాదు అంతటి ఉత్తములు .

వివాహం

కాకర పర్రు లోనే శ్రీచర్ల నారాయణ శాస్త్రి గారనే బహు భాషా కోవిదులున్నారు .వ్యాకరణ నిఘంటు కర్త .నారాయణా౦ద్రీ వ్యాకరణ౦ రాశారు  .మహిష శతకం ,మహా భారత మీమాంస రచించారు.   భారత మీమాంస గ్రంధాలు సీరియల్ గా ఉండేవి .వీటిని వీరి మనవరాళ్ళు హైదరాబాద్ లో అసెంబ్లీ భవనం దగ్గర ,తెలుగు యూని వర్సిటి దగ్గర అమ్ముతూ ఉంటె సుమారు 25 ఏళ్ళ క్రితం నేను కొని చదివాను. అద్భుతమైన పరిశోధనాత్మకమైన గ్రంథాలు అవి .వాటిని ఆధారం గా చేసుకొని కొన్ని వ్యాసాలు  రాస్తే శ్రీ శుభం పత్రిక  ప్రచురించింది .పిఠాపుర ఆస్థానం లో కొద్దికాలం ఉండి రాజు కోరికపై ‘’ఆంద్ర నిఘంటువు ‘’కూర్చి బయటి కొచ్చారు .సుశీల గుణ గణాలు తెలిసి ఆయన ఆమెను తమ కుమారుడు శ్రీ చర్ల గణపతి శాస్త్రి  గారి తో వివాహం 1921 లో ఆమె 10 వ ఏట  జరి పించారు .ఉభయుల అంగీకారం తో కట్న కానుకలు లేవు .గణపతి శాస్త్రి గారు ఉపనయన ,వివాహ విధి ,సులభ సంస్కృత చంద్రిక  బ్రహ్మ మీమాంసా దర్శనం రాశారు. బౌద్ధం మీద అనురక్తికలిగి బుద్ధుని కథలు రాశారు .శాస్త్రి గారు చెవులకు బంగారు పోగులు ధరించేవారు .దొంగలభయం తో ఆరు బయట పడుకున్నప్పుడు చెవులకు గుడ్డ కట్టుకొనే .వారు చివరికి దానిపై మోహం పోయి ఆయనా నగలకు వ్యతిరేకు లయ్యారు .భార్య పేరును సుశీలగా మార్చేశారు .ఈ దంపతులకు ఒక కొడుకు నలుగురు విమల ,కమల ,విదుల ,మృదుల అనే కూతుళ్ళు .తల్లి  పేరు లోని ‘’ల’’కారం వీరిలో ప్రతిధ్వని౦చేట్లు పేర్లు పెట్టారు .కొడుకు పేరు బుద్ధ నారాయణ శాస్త్రి .

చారు శీల సుశీల – ఇంట సాత్వికాహారం

మాతృమూర్తి సుశీల కరుణామయి. ఆకలితో ఉన్నవారికి ఇంత అన్నం పెడితేకాని తినేదికాదు .ఆర్ధికం గా పుష్టి లేని వారి ఇళ్ళకు   వెళ్లి వారికి తెలియకుండా కూరగాయలు, బియ్యం గుమ్మాల వద్ద పెట్టి వచ్చేది .రహదారి పడవలు నడిపే వారి శ్రమ గుర్తించి ,వారి కి పెరుగు అన్నం పెట్టి చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని చెప్పేది .గణపతి శాస్త్రిగారు గాంధీ అనుయాయులు .ధర్మ పత్నిగా ఆమె ఆయన్ను అనుసరించింది .భర్త రాసిన తెలుగు భగవద్గీత గీతాలను ఉదయం 5 గంటలకే లేచి పారాయణ చేసేది .బ్రహ్మ సమాజం పాటలు భక్తీ గీతాలు  రాట్నం మీద నూలు వడుకుతూ ఆలపించేది .ఇంటిలో సత్సంగం జరిపేది .కుటుంబం అంతా ఆవుదగ్గర గుమ్మ పాలు త్రాగే వారు .అల్పాహారం లో పెసలు అరటి పళ్ళు ,మధ్యాహ్న భోజనం లో పుచ్చకాయ ముక్కలు ,సీతాఫలాలు ,జామ పళ్ళు పెరుగు .పచ్చి దొండ బెండ సొరకాయ ,టమేటా, బీరకాయ  ముక్కలు తినేవారు .సాయంత్రం నూకల జావలోకారం లేని ఆవకాయ ,పెరుగు కలిపి తీసుకొనేవారు .వారు పెట్టిన కారం లేని ఆవకాయ సంవత్సరం నిలవ ఉన్నా చెడి పోయేది కాదు. కారం లేని ధనియాల ఆవకాయ వారింట్లో స్పెషల్ .రాత్రి 6 గంటలకే భోజనం గా జావ తాగి ఆరుబయట మంచాలు వేసుకొని పడుకొనే వారు .సుశీల పిల్లలకు చద్దన్నం లో పెరుగు పోసి బ్రేక్ ఫాస్ట్ గా మది బట్టలు కట్టించి మొదట్లో ఇచ్చేది.భర్త మాట విని ఆ పధ్ధతి మార్చుకొని చద్ది కూడు , మదడి బట్టలకు స్వస్తి చెప్పింది .చాదస్తంగా ఎప్పుడూ మడి బట్టలతోనే ఉండేది .మాలవాళ్ళను చూసేదికాదు . ఇతర కులస్తులను ఇంటికి రానిచ్చేదికాదు.భర్త అనునయంగా నచ్చ చెప్పి అన్నీమానిపించాడు  .శాస్త్రి గారు కాపు వాడితో ఇంట్లోకి నీళ్ళు తెప్పించి ,పిల్లలతో మొక్కలకు నీళ్ళు పోయి౦చే వారు .పెరడు ప్రకృతి నిలయంగా అన్ని రకాల కాయ గూరలు ,పండ్ల చెట్లు, పూల చెట్ల తో కళకళ లాడేది .తేనె టీగలను పెంచి తేనే తీసేవారు .ఆవులు గేదెలు ఉండేవి .పాలు పెరుగు అనాధలకు  బీదలకు పోసేవారు .

శాస్త్రి గారిల్లు పూరి గుడిసె మాత్రమే  .తర్వాత పెంకుటిల్లు .నుయ్యి ,కొబ్బరి చెట్లు ధాన్యం నిలువకు’’ గాదె’’తో  చూడ ముచ్చటగా ఉండేది .నూలు వడికి అందరూ ఖద్దరు బట్టలే కట్టేవారు .ఎక్కడికి వెళ్ళినా’’ తకిలీ ‘’తమతో తీసుకు పోయేవారు పిల్లలతో సహా .’’సూత్ర యజ్ఞం ‘’పేరు తో ఇంటి వారు, బయటివారు రోజూ కనీసం మూడు గంటలు నూలు వాడికే వారు .సుశీల గారు రాజమండ్రి నుంచి ఖద్దరు బట్టలు కొనుక్కు వచ్చి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేవారు .ఆడా మగా అందరి చేత ఖద్దరు కట్టించేవారు .పండగలకు పిల్లలకు కొత్త బట్టలు కొనేవారు కాదు .సామాన్యులు పుట్టిన రోజు చేసుకో కూడదని మహాత్ముల పుట్టిన రోజులే చేయాలని పిల్లలకు నచ్చ చెప్పేవారు .దంపతులు తాము ఆచరించి తర్వాత ఇతరులకు చెప్పేవారు అంతటి ఆదర్శం వారిది .

మధుర భాషిణి సుశీల

మధుర భాషిణి ,మధుర గాయని సుశీల గారు అనర్గళంగా ఉపన్యాసాలిచ్చేవారు .ఒక సారి దుర్గా బాయ్ దేశముఖ్  సభలో 5 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడమంటే సుశీలగారికిమరో  10 నిమిషాల దాకా ఇచ్చి ఆమె వాగ్ధాటికి ఆశ్చర్య పోయింది దేశ్ ముఖ్ .కోమల భావాలు సేవా దృష్టి ఉన్నందున అన్ని రంగాలలో దూసుకు పోయింది .ఒక రైతు కొడుకు తమ ఇంట్లో  దొంగతనం చేసి పట్టుబడితే పోలీస్ స్టేషన్ కు వెళ్లి బ్రతిమిలాడి వాడు చిన్నపిల్లాడు వదిలేయమని విడిపించుకొని వచ్చి వాళ్ళు కొట్టిన దెబ్బలకు నూనె రాసి కట్టు కట్టిన దయామయి .శాస్త్రి దంపతులు హరిజన వాడకు వెళ్లి శుభ్రత గురించి తెలియ జెప్పేవారు .తమ పిల్లలనూ తీసుకొని వెళ్లి వాళ్ళ చేత ఉత్తరాలు రాయించేవారు ,రాయటం చదవటం నేర్పించారు .రోగాలకు హోమియో మందులు ఇచ్చేవారు .’’కళ్ళు మాన౦డోయ్ –కళ్ళు తెరవం డోయ్ ‘’అని పాడుతూ వారి అలవాట్లను మాన్పించిన  సంస్కారులు  .

కస్తూరి బాయి మహిళా సమాజ స్థాపన

శాస్త్రిగారు ‘’శ్రీ కస్తూరి బాయి మహిళా సమాజం ను 1950 లో స్థాపించారు .అనాధ ,అసహాయ ,పతితలకు , , పెళ్లి కాని యువతులకు , భర్తను కోల్పోయినవారికి ఉపాధి కల్పించటమే వీరి ఆశయం .సుశీల గారు దీని చైర్మన్ .విద్యార్ధి సంఘానికి కూతురు కమల ప్రెసిడెంట్ .తండ్రీ కూతుళ్ళు హిందీ నేర్పేవారు .భవన నిర్మాణం కోసం పిల్లలు ఇంటింటికీ తిరిగి పావలా వంతున ఒక లక్ష రూపాయలు సేకరించి భవనం నిర్మించిన  దీక్ష వారిది .హిందీ తోపాటు కుట్టుపని ,ఎంబ్రాయిడరీ క్లాసులు నిర్వహించేవారు .ఖాళీ స్థలం లో కూరలు పండించి వేలం వేసి డబ్బు కూడ బెట్టేవారు .కొడుకు కూడా వీరితో పాటు కష్టపడేవాడు. అయితే అతన్ని భవనం లోకి వెళ్ళకుండా కట్టడి చేశారు శాస్త్రి గారు అదీ పధ్ధతి అంటే . బయట ఉండే సేవలు చేసేవాడు .మొదటి ఏడాది వార్షికోత్సవం 3 రోజులు ఘనం గా చేసి వక్తల నాహ్వానించి స్పూర్తి కలిగించారు .శాస్త్రిగారు రాసిన ఝాన్సి లక్ష్మి బాయి ,భారత మాత ,మీరాబాయి నాటకాలను వేయించారు .ప్రతి ఏడాది వార్షికోత్సవం జరిపి తాము రాసిన పొట్టి శ్రీరాములు ,బాపూజీ అల్లూరి బుర్రకధలను చెప్పించేవారు .సుశీలమ్మ గారి సమాజం అంటే ఆడ పిల్లలకు భయం లేదని తలిదండ్రులు నమ్మేవారు .హిందీ పరీక్షలకు రాజమండ్రి తీసుకు వెళ్లి ఎక్కడా ఉంచకుండా బంధువు భారతమ్మ గారింట్లో ఉంచిపరీక్ష రాయించేవారు .ఆడపిల్లల రక్షణ విషయం లో అంతటి శ్రద్ధ తీసుకొనే వారు .‘

శ్రీమతి చర్ల సుశీల గారి  ఫోటో జత చేశాను చూడండి

ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 -ఉయ్యూరు

‘’

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.