మమతా మయి శ్రీమతి చర్ల సుశీల -2 (చివరి భాగం )
అన్యోన్య దాపత్యం
శ్రీ చర్ల గణపతి శాస్త్రిగారు శ్రీమతి సుశీల గారు చాలా అన్యోన్యంగా కాపురం చేశారు .శాస్త్రిగారు శతాధిక గ్రంధ కర్త 1988 లో వారికి కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి ఆంధ్రా యూని వర్సిటి సత్కరిస్తే ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రదానం చేసింది .అయినా ఏమాత్రం గర్వం ఆయనలో లేదు .సుశీలగారు వారి గ్రంధాలను అత్యంత శ్రద్ధాసక్తులతో చదివారు వారామెతో ‘’బాల రామాయణం ‘’రచింప జేయించారు .అది అలభ్యం .శాస్త్రి గారి ఆకాశమంత పాండిత్యాన్ని చూసి తాము రచించటం మానేశారు .వారి సాహిత్యం పై ప్రసంగించేవారు సుశీల .తండ్రి గారి గ్రందాలప్రచారం చేయమని కూతుళ్ళను ప్రోత్సహించారు .స్త్రీల కోసం ‘’మాతృశ్రీ స్తోత్ర రత్నాలు ‘’సంకలనం చేసి ప్రచురించారు.గాంధీ పైఒక మంగళహారతి రాశారు .’’మంగళమని మంగళమని మంగళమనరే –మంగళమని పాడరే మహాత్మా గాంధీకి ‘’అనేది ఆపాట .’’బీదలకు నేను సేవ చేస్తే నా పిల్లలకు భగవంతుడు సహకరిస్తాడు ‘అనే నమ్మకం ఆమెది .స్వాతంత్ర సమర యోధులైన శాస్త్రిగారు జైలు కు వెళ్ళినప్పుడు, వినోబా తో పాద యాత్ర చేసినపుడు ధైర్యంగా పిల్లల ఆలనా పాలనా చూసుకోనేవారు .భర్త గారికి జున్ను ఇష్టం అని బకెట్ నిండా జున్ను వండి జైలుకు తీసుకు వెళ్లి పోలీసులను కూడా తినమనే వారు .మన ‘’మామయ్యలు’’ మాయ గాళ్ళు కదా ,వారికి పెట్ట కుండా అంతా తామే ‘’జుర్ర్రేసే’’వారు .తెలిసినా ఆమె వారిని ఏమీ అనేది కాదు .పిల్లలకు ఇంగ్లీష్ నేర్పకుండా తెలుగు హిందీ నేర్పించారు .శాస్త్రి గారి పుస్తకాలను పిల్లలు అమ్మి ,కొన లేని వారికి ఉచితంగా ఇచ్చేవారు .భర్తల ఆశయాలకు అనుగుణంగా మసలు కొనేవారు .నగలు లేక పోయినా ,తెల్ల ఖద్దరు చీర ధరించి మెడలో నల్లపూసల దండతో అసలైన భారత నారిగా కని పించేవారు .
భూదాన ఉద్యమానికి భర్త 5 ఎకరాలు దానం చేసినప్పుడు ,ఆమె సహకరించారు . తర్వాత తర్వాత కొడుకు కూతుళ్ళు ఆంగ్ల విద్య నేర్చి ఎంతో అభి వృద్ధి సాధించారు .కుమారుడు ఆంధ్రా యూని వర్సిటి లో ఎం ఎస్ సి పాసయ్యాడు కమల అక్కడే ప్రొఫెసర్ అయింది .పెద్దమ్మాయి సంస్కృతం హిందీలలో ఎం ఏ .చేసి సంస్కృత లెక్చరర్ గా రిటైర్ అయింది రెండవ కూతురు హిందీ లో ఎం ఏ పి హెచ్ డి.. మిగిలిన ఇద్దరూ ఎం ఏ పి హెచ్ డిచేసి ఉద్యోగాలు చేసి స్వంత కాళ్ళపై నిల బడ్డారు .శాస్త్రి గారు హైదరాబాద్ మకాం మార్చి లలితా ఆర్ట్ ప్రెస్ పెట్టి నడిపారు .కస్తూరి బాయ్ సమాజం 26 ఏళ్ళు నిరాఘాటం గా నడిచింది .సుశీలగారు స్పురద్రూపి .భవిష్యత్ జ్ఞానం బాగా ఉండేది .నలుగురైడుగురను తీసుకుని తరచుగా తీర్ధ యాత్రలు చేసేవారు .సత్య సాయి పై ఆరాధన ఏర్పడింది. ఆయనకూ ఈమె సేవా విషయాలు తెలిసి నిర్వహణకు ధనం ఇచ్చేవారు .బాబాపై పద్యాలు కూడా రాశారు .1976 డిసెంబర్ లో ఒక్కగానొక్క కొడుకు హార్ట్ ఎటాక్ తో చని పోయాడు ఇది దంపతులను బాగా కుంగ దీసింది .శాస్త్రి గారి మరణం తర్వాత సుశీలగారు 1976 లో 65 ఏళ్ళ వయసులో చనిపోయారు .
శాస్త్రిగారు సుశీల దంపతులు నిడద వోలులో కస్తూరి బాయి ఆశ్రమాన్ని స్థాపించి కుట్లు అల్లికలు హిందీ నేర్పించారు .కార్తీకమాసం లో అన్నదానం తో పాటు వస్త్ర దానమూ చేసిన ఉత్తమ మహిళ.నిరాడంబర జీవి .ఉన్నత సంస్కారం ఆధ్యాత్మిక భావ సంపదా ఉన్న ఉత్తమా ఇల్లాలు .సుశీల గారు అమృత వర్షిణి అంటారు అందరు .ఆమె గారి స్పూర్తితో ఎందరో అనాధ ఆశ్రమాలు పెట్టి నిర్వహించారు .ఆమె సంతానాన్ని ఆణి ముత్యాలుగా తీర్చి దిద్దిన మహిళా మాణిక్యం .శాంత స్వరూపిణి సుశీలగారు .వారి కుమార్తె విదుల ‘’అమ్మ అంటే అమృతం .త్యాగం అనే కొవ్వొత్తి .తను కరిగిపోతూ ఇతరులకు వెలుగు నిచ్చేదేవత .మూర్తి రాజు సంస్థల అధ్యక్షులు శ్రీ మూర్తి రాజు ఆమెకు బంగారు గొలుసు కానుక గా ఇస్తాను అంటే ‘’మళ్ళీ మీరు గొలుసు ఏదీ అని అడగ వద్దు .ఎవరైనా బాగుంది అంటే ఇచ్చేస్తాను ‘’అన్నారు .విదుల ‘’చర్ల సుశీల వృద్ధాశ్రమం ‘’పెట్టి 150మందితో నడుపుతున్నారు .మనిషిలోని ప్రతిభను గుర్తించి సాయం చేసే దొడ్డ గుణం ఆమెది .ఏ కొత్తపాట విన్నా నేర్చుకొనే వారు నేర్పే వారు .తెల్లవారు ఝామున 4 గంటలకే లేచి ధ్యానం చేసేవారు .తర్వాత అన్నం ,మజ్జిగ ఊరగాయ తీసుకొని రైలు గేటు దగ్గర రిక్షా వాళ్లకు ,ముష్టి వాళ్ళకూ పంచి ఇచ్చేవారు .ఎందరో పేద పిల్లలకు ఫీజులు కట్టి చదివించి ,ఉద్యోగాలు ఇప్పించిన మహా ఇల్లాలు .సుశీల గారు లాంటి మనిషి ఉంటారా అని ఆశ్చర్య పోతాం .అంతటి ఉత్తమ మహిళా ఆదర్శ మూర్తి శ్రీమతి చర్ల సుశీల గారు .
ఆధారం –శ్రీ మంగు శివరామ ప్రసాద్ గారు విశాఖ లో నాకు అందజేసిన –సుశీల గారి 103 జయంతికి పుస్తక రూపం లో వచ్చిన ‘’మమతామయి శ్రీమతి చర్ల సుశీల గారి జీవిత చరిత్ర ‘’
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-17 –ఉయ్యూరు

