గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
69-హేమచంద్రుని ప్రమాణ మీమాంసకు సంపాదకత్వం వహించిన జైన విద్యావేత్త –సుఖలాల్ సంఘ్వి(( 18 80 -1978 )
పండిట్ సుఖలాల్జీ అని అందరూ గౌరవంగా పిలిచే సుఖలాల్ సంఘ్వి జైన విద్యావేత్త ఫిలాసఫర్ .జైనం లోని స్తనక్ వాసి సంప్రదాయం వాడు .చిన్నప్పుడే విపరీతంగా మసూచికం బారి పడి నెమ్మదిగా కోలుకొని జైన గ్రంధాలలోని తర్క గ్రంధాలు చదివి బెనారస్ హిందూ యూని వర్సిటి లో ప్రొఫెసర్ అయ్యాడు .జైన మతాన్ని అద్భుతం గా వివరించి చెప్పగల సామర్ధ్యం సంఘ్వికి బాగా ఉన్నదని పాల్ దండాస్ అన్నాడు .ప్రసిద్ధ జైన విద్యా వేత్త పద్మనాభ జైన్ కు మార్గ దర్శి .సాహిత్య అకాడెమి అవార్డ్ ,పద్మ భూషణ్ పురస్కారం అందుకొన్నాడు .
గుజరాత్ లోని సౌరాస్ట్రలో లిమ్డి గ్రామం లో 8-12-1880 న జన్మించాడు .వణిక్ కులానికి చెందినవాడు .తండ్రి తల్సి సంఘ్వి.తల్లిమణిబెన్.నాలుగో ఏట తల్లి చనిపోయింది .దూరపు బంధువుల పెంపకం లో పెరిగాడు .జైన గురువుల బోధలు శ్రద్ధగా వినేవాడు .బెనారస్ లో యశో విజయ జైన్ సంస్కృత పాఠ శాలలో చేరి మూడేళ్ళలో సిద్ధ హేమ వ్యాకరణం ,తర్క సంగ్రహ ,ముక్తావళి ,వ్యాప్తి చంద్రిక లను అనేక వ్యాఖ్యానాలతో సహా చదివాడు .రఘువంశం ,మేఘ సందేశం ,నైషధీయాలను ఆమూలాగ్రం చదివేశాడు .అలంకార శాస్త్రాలు కోశాల ను అధ్యయనం చేసి సాధించాడు .1911 లో మిధిల, కాశీ లకు వెళ్లి సాహిత్యం ,ఫిలాసఫీ నేర్చాడు .ఆగ్రా వెళ్లి ‘’పంచ ప్రతిక్రమణ ‘’అనే దేవేంద్ర సూరి నాలుగు కర్మ గ్రంధాలలో మొదటి దానిని తన సంపాదకత్వం లో వెలుగు లోకి తెచ్చాడు .హరి భద్ర సూరి రాసిన యశో దర్శన ,యోగ వి౦శిక లను కూడా ప్రచురించాడు .న్యాయా చార్య పరీక్ష పాసై జైన పాఠశాలలో బోధించి ముని జిన్ విజయ ,ముని లలితా విజయ ,ముని పుణ్య విజయలకు గురువై బోధించాడు .
1922 లో గుజరాత్ విద్యా పీఠంలోని పురాతత్వ మందిర్ లో భారతీయ తత్వ శాస్త్రం బోధించాడు .సిద్ధ సేన దివాకరుని 5 భాగాల సన్మతి తర్క కు సంపాదకత్వం వహించి ముద్రించాడు .1933 నుంచి 10 ఏళ్ళు బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం లో జైన ఫిలాసఫీ ప్రొఫెసర్ గా ఉన్నాడు .సంస్కృత హిందీ గుజరాతీ భాషలలోని విలువైన గ్రంధాలకు అనువాదాలకు ఎన్నిటికొ ఎడిటర్ గా ఉన్నాడు. తత్వార్ధ సూత్రా ,న్యాయావతార లను గుజరాతీ భాషలోకి అనువాదం చేశాడు .హేమ చంద్ర సూరి రచన ప్రమాణ మీమాంస కు సంపాదకుడుగా ఉన్నాడు. జయ రుషి రాసిన తతావప్లవ ను వెలుగులోకి తెచ్చి గొప్ప కీర్తి పొందాడు .ఇది చార్వాకం పై ప్రసిద్ధ గ్రంధం .బౌద్ధ తత్త్వం పై కొత్త వెలుగులు ప్రసరింప జేశాడు .1944 లో రిటైరై భారతీయ విద్యా భవన్ లో చేరి జైనముని ఆచార్య జినవిజయాజి వద్ద పని చేశాడు .1957 లో బరోడా లోని ఎం .ఎస్ .యూని వర్సిటి ఆహ్వానం పై భారతీయ తత్వ శాస్త్రం పై 5 గొప్ప ఉపన్యాసాలు చేశాడు .ఇవి గుజరాతీ ,హిందీ ఇంగ్లీష్ లలో ప్రచురింపబడ్డాయి . ఆత్మ –పరమాత్మ ,సాధన ల పై ఆయన గుజరాత్ విద్యా సభలో చేసిన ప్రసంగాలను బాంబే యూని వర్సిటి ‘’ఆధ్యాత్మ విచారణ ‘’పేర ముద్రించింది .
నాధూరాం ప్రేమి ప్రభావం ఈయనపై ఎక్కువ దిగంబర జైనులతో కూడా చాలాస్నేహం గా ఉండేవాడు .జైనం బాగా అర్ధం కావాలంటే పాళీ భాష బాగా నేర్వాలి అనేవాడు .ఎందరో యువకులను మార్గ దర్శనం చేశాడు ఆయన అశేష శేముషి అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఈయన విద్వత్తుకు తగిన బిరుదులూ పురస్కారాలు లభించాయి .విజయ ధర్మ సూరి జైన్ సాహిత్య స్వర్ణపతకం ,మద్రాస్ యూని వర్సిటి డి.లిట్,1958 లో కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం ,1961 లో కేంద్ర ప్రభుత్వం సంస్కృత సేవకు యోగ్యతా పత్రం ,1974 లో పద్మ భూషణ్ అవార్డ్ ,1975 లో బీహార్ నవ నలంద విహార్ నుండి విద్యా వారిధి బిరుదు పొందారు. డా సర్వేపల్లి రాదా కృష్ణన్ సంఘ్వి ని జ్ఞాన యజ్ఞం చేస్తున్న మహానుభావుడు అని అభివర్ణించారు .97 వ ఏట 2-3-1978 న పండిట్ సుఖలాల్జి సంఘ్వి మరణించాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-17 –ఉయ్యూరు

