గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

దినచర్య (డైరీ )ను సంస్కృతం లోనే రాసుకొన్న’’ యాత్రా సాహిత్య పిత ‘’-రాహుల్ సాంకృత్యాయన్ (1893 -1963 )

             కేదార్ నాథ పాండే –రాహుల్ సాంకృత్యాయన్

మహా పండిత  రాహుల్ సాంకృత్యాయన్ అంటే నిరంతర యాత్రాశీలి ,వ్యాసకర్త యాత్రకు సాహిత్య గౌరవం కలిగించిన  బహుభాషా వేత్త .9-4-1893 న తూర్పు ఉత్తర ప్రదేశ్ లోఅజాం ఘర్ జిల్లాలో   కేదార్ నాథ్ పాండే గా జన్మించాడు .స్థానికంగా విద్య ప్రారంభించినా  తర్వాత సంస్కృత హిందీ ఇంగ్లిష్ ,పాళీ భోజ్ పూరి ,ఉర్దూ ,పర్షియన్ అరబిక్ ,తమిళం కన్నడ ,టిబెటన్, సింహళీస్, ఫ్రెంచ్ ,రష్యన్ భాషలు నేర్చి రాయగల సమర్ధత సాధించిన బహు భాషా వేత్త .ప్రారంభం లో ఆర్య సమాజం దయానంద సరస్వతి బోధనలపై ఆకర్షణ ఉండేది .తర్వాత బౌద్ధం అతనిని పూర్తిగా మార్చేసింది .దేవునిపై నమ్మకం లేకపోయినా పునర్జన్మ ను విశ్వసించాడు .తర్వాత మార్క్సిస్ట్ సోషలిజం మోజులో పడి దాన్నీ వదిలేశాడు .ఆయన రాసిన ‘’దర్శన్ – దిగ్దర్శన్ ‘’గ్రంథం ప్రపంచ తత్వ శాస్త్రాన్ని కూలంకషం గా వివరించింది .ఇందులో రెండవ భాగం –‘’ధర్మ కృతి ప్రమాణ వార్తికం’’ కు అంకితమై రాసినట్లు కనిపిస్తుంది .దీని మూలాన్ని టిబెట్ ఆ భాషలో ఉంటే సేకరించాడు ..

                        విస్తృత యాత్రికుడు

         విస్తృత నిరంతర యాత్రికుడైన సాంకృత్యాయన్ లడక్ ,కిన్ననూర్, కాశ్మీర్ ,నేపాల్ టిబెట్ ,శ్రీలంక ఇరాన్ ,చైనా రష్యా లను సందర్శించాడు .చాలాకాలం బీహార్ లో శరన్ జిల్లా పరసాగడ్ లో ఉన్నాడు .ఈ గ్రామ ప్రవేశ ద్వారానికి’’ రాహుల్ గేట్ ‘’అని పేరు పెట్టారు .టిబెట్ కు బౌద్ధ సన్యాసిగా వెళ్ళాడు. చాలా సార్లు టిబెట్ వెళ్లి విలువైన పాళీ ,సంస్కృత వ్రాత రాతులను, చిత్రాలను సేకరించి తెచ్చుకొన్నాడు .ఇవి విక్రమశిల ,నలందా విశ్వ విద్యాలయాలకు చెందినవి .వీటిని ఇండియాకు   23 కంచర గాడిద లపై తెచ్చి పాట్నా మ్యూజియం లో భద్ర పరచాడు .

                        బహుభాషా గ్రంధ రచన

అనేక భాషలలో నిష్ణాతుడైన రాహుల్ గొప్ప సృజన శీలి .20 లలో రచన ప్రారంభించి దాదాపు 100 పుస్తకాలు అనేక విషయాలపై-సోషియాలజీ ,హిస్టరీ ఫిలాసఫీ ,బౌద్ధం టిబెటాలజీ ,లేక్సికోగ్రఫీ  వ్యాకరణం ,సైన్స్ జానపదం  నాటకం వ్యాసం రాజకీయం మొదలైన వాటిపై  రాశాడు . ప్రాకృతం  లోని ‘’మైఝిమ నికాయ్ ‘’ను హిందీలోకి అనువదించాడు .రాహుల్ ప్రసిద్ధ రచన హిందీలో రాసిన ‘’ఓల్గా సే గంగ ‘’.చార్తిత్రాత్మక ఫిక్షన్ .ఇందులో క్రీ పూ 6000 కాలం నుండి 1942వరకు గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం వరకు చరిత్ర ఉంది .అన్నిభాషలలోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధమైంది .ఆయన రాసిన పుస్తకాలు 10 కి పైగా బెంగాలీ లోకి అనువాదం పొందాయి .చరిత్ర కారుడు  కాశీ  ప్రసాద్ జైస్వాల్ సాంకృత్యాయన్ ను గౌతమ బుద్దునితో సమానం అన్నాడు .స్కూలు విద్య లేకపోయినా అన్నీ స్వయంగా సాధించాడు. సోవియెట్ రష్యా వెళ్లి లెనిన్ గ్రాడ్ యూని వర్సిటి లో  ఇండాలజీ ప్రొఫెసర్ గా 1937 -38 వరకు మళ్ళీ 1947-48వరకు పని చేశాడు .

                            వివాహం వగైరా

బాల్యం లోనే రాహుల్ వివాహం ‘’సంతోషి’’ తో జరిగింది . ఆతర్వాత ఆ బాల వధువు ఏమైందో ఆయనకు తెలియదు .వయసు 40 లలో రెండో సారి రష్యా వెళ్ళినప్పుడు సంస్కృత, ఫ్రెంచ్, ఇంగ్లీష్ ,రష్యన్ భాషలలో ప్రవీణురాలైన మంగోలియన్ స్కాలర్ ‘’లోలా’’ తో సన్నిహితం గా ఉన్నట్లు ఆయన డైరీ వలన తెలుస్తోంది .టిబెటన్ –సంస్కృత నిఘంటు నిర్మాణానికి ఆమె ఆయనకు తోడ్పడింది .ఇద్దరూ పెళ్ళిచేసుకొని ‘’ఇగార్’’ అనే కొడుకుకు జన్మనిచ్చారు .ఆయనతో వాళ్ళిద్దరూ ఇండియా రావటానికి స్టాలిన్ రష్యా  అనుమతి నివ్వ లేదు  .తర్వాత కమల అనే ఇండియన్ నేపాలీ ని పెళ్లి చేసుకొని జయ ,జేత అనే అమ్మాయిని అబ్బాయిని సంతానంగా పొందాడు .జేత నార్త్ బెంగాల్ యూని వర్సిటిలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. జయ డెహ్రాడూన్ లో ఉండేది .

                  సుదీర్ఘ యాత్ర

 రాహుల్ శ్రీలంక యూని వర్సిటి లో పని చేస్తుండగా విఅరీతమైన మాదుమేహ వ్యాధి,  అతి రక్తపు పోటు  వలన  గుండెపోటు వచ్చి డార్జిలింగ్ లో 1963 ఏప్రిల్ 14 న 70  వ ఏట  సుదీర్ఘ యాత్ర లో సుదూర తీరాలకు చేరుకొన్నాడు .ఆయన పేర అవార్డ్ లను అందజేస్తున్నారు .

                 సాంకృత్యాయన్ సాహిత్య సర్వస్వం

హిందీలో దివోదాస్ ,మధుర స్వప్న ,విస్మృతి యాత్ర మొదలైన 8 నవలలు ,వోల్గా సే గంగ ,బహురంగి మధుపురి వంటి 4 కథా సంపుటులు ,3 భాగాలుగా ‘’మేరీ జీవన్ యాత్ర ‘’అనే స్వీయ చరిత్ర ,సర్దార్ ప్రిద్వి సింగ్ ,బచ్ పన్ కి స్మ్రుతి యాన్ ,కప్తాన్ లాల్ ,మహామానవ్ బుద్ధ , స్టాలిన్ ,లెనిన్ ,మొదలైన 16 జీవిత చరిత్రలు ,మాన్సిక్ గులామీ ,రుగ్వేదిక్ ఆర్య ,ఘుమక్కార్ శాస్స్త్ర ,దర్శన్ –దిగ్దర్షన్ ,మధ్య ఆసియా కా ఇతిహాస్ సామ్యవాద్ హి కోన్ వంటి ఇతర రచనలు ,భోజ్పురి భాషలో 2 ,నేపాలీ భాషలో 1 ,టిబెటన్ భాషలో 7 పుస్తకాలు రచించాడు .

  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేసినందుకు మూడు సార్లు అరెస్ట్ అయిన జాతీయ వాది రాహుల్  .ఆయన విజ్ఞానం  మహా పండితుని విజ్ఞానం .1963 లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం అందజేసి సన్మానించింది .తన దిన చర్య ను డైరీలో నిత్యం సంస్కృతం లోనే రాసుకోనేవాడు .దీని ఆధారంగానే అనేక రచనలు చేయగలిగాడు సాంకృత్యాయన్ .

Inline image 1

   సశేషం

  మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-3-17 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.