గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
76 –ఆది శంకరుల గురు పాదులు –గోవింద భగవత్పాదులు( 8 వ శతాబ్దం )
అద్వైత మత స్థాపకులు శ్రీ శంకర భగవత్పాదుల గురువు గారే గోవింద భగవత్పాదుల వారు .ఆయన జీవితం రచనల గురించి పెద్దగా లోకానికి తెలియదు .కాని శంకరాచార్యులవారు తమ రచనలో వారి ప్రస్తావన చేశారు .శంకర విజయం లో కూడా ఆయన గురించి సమాచారం లేదు .గోవింద పాడుల గురువు గౌడపాదులవారు .శంకరాచార్య ప్రకరణ గ్రంథం వివేక చూడామణి మొదటి శ్లోకం లో గోవింద భగవత్పాదుల గురించి లో పేర్కొన్నారు .శృంగేరి శారదా పీఠం గురు పరంపరలో గౌడపాదుల తరువాత గోవింద భగవత్పాదుల ను తర్వాత శంకరాచార్యులను పేర్కొంటారు .
మాధవీయ శంకర విజయం ప్రకారం కేరళను వదిలి వెళ్ళిన ఆది శంకరులు నర్మదా నది తీరం లో ఉన్న ఓంకార క్షేత్రాన్ని చేరి అక్కడ కొండపై ఉన్న చిన్న గుహలో ఉంటున్న గోవింద భగవత్పాదుల దర్శనం చేశారు .శంకర విజయం ప్రకారం ఒకనాడు రేవా నదికి అకస్మాత్తుగా విపరీతంగా వరదలు వస్తే ,శంకరులు తన కమండలాన్ని అడ్డం పెట్టి వరద ను ఆపేసి సమాధిలో ఉన్న గురువుగారికి తపో భంగం కాకుండా కాపాడారని ఉన్నది .ఇప్పటికీ ఆగుహను మనం దర్శించవచ్చు .ఓంకార క్షేత్రం లో ఓంకార మహా శివుడు కొలువై ఉంటాడు .గోవింద పాదులు శంకరుని చూడగానే ‘’నువ్వు ఎవరు /?అని ప్రశ్నిస్తే
‘’న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం’’అని శ్లోకం చెప్పారు .ఇదే దశ శ్లోకి గా లోకం లో ప్రసిద్ధి చెందింది .భావం –
నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.
ఇది విన్న గురువు చాలా సంతోషించి ఆయన అద్వైత వైదుష్యానికి అబ్బురపడి తన శిష్యునిగా స్వీకరింఛి సన్యాస దీక్ష అనుగ్రహించారు .గురువు గోవిందపాదుల ఆదేశం తో శ్రీ శంకరులు బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాయటం ప్రారంభించారు .
77- హిందూ మత పరిరక్షణకు బౌద్ధం స్వీకరించి ప్రాయశ్చిత్తం చేసుకున్న -కుమారిల భట్టు (భట్టిపాదుడు )(8 వ శతాబ్దం )
తన 15 వ ఏట, ఆది శంకరాచార్యులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుని దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరుడు “శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు” అని కోరాడు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరునితో చెప్పాడు.
భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి భౌద్దమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు భౌద్దం గురించి తెలుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని భౌద్ద బిక్షువుగా వేషం ధరించి ఒక భౌద్ద మతగురువు వద్ద భౌద్ద శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒక నాడు ఒక భౌద్ద బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోతుంది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా భౌద్ద సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షీంచవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాడుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక కాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహావిష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని భౌద్ద బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు.దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, భౌద్దంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరుడు అక్కడకు వచ్చి వారిస్తాడు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుని చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరుడు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తాడు.
78-మీమాంస ,అద్వైత దర్శనాలపై రచనలు చేసిన సురేశ్వరాచార్యులే మండన మిశ్రులు(8 వ శతాబ్దం )మండన మిశ్రుడు 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త, ఆది శంకరాచార్యుని శిష్యుడు. మీమాంస, అద్వైత దర్శనాలపై రచనలు చేశాడు. కర్మ మీమాంస పై అధారిటీ .స్పోట వాదానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు .ఈయన సన్యాసము స్వీకరించిన తర్వాత సురేశ్వరాచార్యుల అను పేరుతో ప్రసిద్ధిపొందాడు. శంకరాచార్యులను తర్క గోష్ఠిలో ఓటమి పాలై శంకరులను గురువుగా అంగీకరిస్తారు. ఆ ఓటమి సురేశ్వరాశ్వరాచార్యులకు విజయవంతమైన ఓటమి ఎందువలనంటే అ ఓటమి వల్ల జగద్గురువైన శంకరులకు శిష్యరికం చేసే అవకాశం దొరికింది. శంకరాచార్యులకు అత్యంత ప్రీతి పాత్రులైన శిష్యులలో సురేశ్వరచార్యులు ఒకరు. శంకరాచార్యులు అందువలన దక్షిణామ్నాయ మఠమైన శారదా మఠానికి మెదటి పీఠాదిపతిగా నియమిస్తారు. సురేశ్వరాచార్యులకు ఒక ప్రత్యేక ఉన్నది. సాధారణంగా గురువుల వయస్సు శిష్యుడి వయస్సు కంటే ఎక్కువగా ఉంటుంది. కాని సురేశ్వరాచార్యుల విషయంలో సాధారణానికి భిన్నంగా శిష్యుడి వయస్సు గురువు కన్నా ఎక్కువ. వేదాంత సంస్కృతిని అనుసరించి రెండు రకాలా మీమాంసలు ఉన్నాయి. ఒకటి పూర్వ మీమాంస ( మీమాంస అని అంటే దాని అర్థం పూర్వమీమాంస) రెండొ మీమాంస ఉత్తర మీమాంస దీనినే వేదాంత విద్య అని కూడా పిలుస్తారు. వేదాంత విద్య అంటే వేద=జ్ఞనం అంత = అంచులు జ్ఞానం అంచులు తెలిపేది పూర్ణ జ్ఞానం). ఫుర్వమీమాంస అనుసరించి వైదిక కర్మ కండ,యజ్ఞ యాగాదులు నమ్మకాలు ఉంటాయి. ఉత్తర మీమాంస అంతా ఉపనిషత్తుల సారం , జ్ఞాన సముపార్జన గురించి ఉంటుంది.
మండన మిశ్రులు బీహారీ బ్రాహ్మణుడు .బీహార్ లోని మహేశీ ప్రాంతం లో నివశించాడు .ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మం డలేశ్వర్ అంటారు.గుప్తేశ్వర మహా శివాలయం లో శంకరాచార్యుల వారితో వాదం చేశాడు .అందుకనే ఈ పట్నం ఆయన పేరుమీద నే పిలువ బడుతోంది . కుమారిలభట్టు ప్రచారం చేసిన మీమాంస సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు మండన మిశ్రుడు .అద్వైత భావనలతో ‘’బ్రహ్మ సిద్ధి ‘’ గ్రంథంరాశాడు .బ్రహ్మ సిద్ధి మండన మిశ్ర గా ప్రసిద్ధుడయ్యాడు .కర్మ మీమా౦సపై అత్య౦థ అభిమానం ఉన్నందున గొప్ప కర్మిస్టి గా మారి పోయాడు .వేదం లో చెప్పబడిన కర్మకాండలను తుఛ తప్పక పాటించాడు .మండన మిశ్రుని బ్రహ్మ దేవుని అవతారంగా భావిస్తారు .అయన భార్య ఉభయ భారతి సాక్షాత్తు సరస్వతీ దేవి యే.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-24-3-17 –ఉయ్యూరు

