గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

79-మాండూక్య కారిక ను సంతరించిన -గౌడపాదాచార్య (6 వ శతాబ్దం )

శంకరా చార్యుల గురువు గోవింద భాగవత్పాదులవారి గురువు గౌడపాదాచార్య క్రీ.శ .6 వ శతాబ్దికి చెందినవారుగా పరిగణిస్తారు .మధ్యయుగం లో వేదానత శాస్త్ర వ్యాప్తి చేసినవారు ఆయన .ఆది శంకరులు వారిని ‘’పరమాచార్య ‘’గా పేర్కొని గౌరవించారు .మాండూక్య కారిక ను సంతరించిన మహాను భావులు  గౌడపాదులవారు .దీన్ని గౌడపాద కారిక ,అని ఆగమ శాస్త్రం అని  కూడా పిలుస్తారు .ఇది 4 అధ్యాయాల గ్రంధం .లేక నాలుగు భాగాల పుస్తకం .ఇందులో నాలుగవది బౌద్ధ పదజాలం తో ఉంటుంది కనుక బౌద్ధ ప్రభావం తో రాయబడిందని అంటారు .కాని ఆచార్య స్వామి రాసింది హిందూ వేద ధర్మమే కాని బౌద్ధ ధర్మ౦  కాదు .మొదటి మూడుభాగాలు అద్వైత భావ వ్యాప్తికి దీప్తికి పట్టు గొమ్మలు .ఇందులో మొదటిభాగం లో మాండూక్య ఉపనిషత్ ఉన్నది ఇది ద్వైత ,విశిస్తాద్వైతులకూ ఆరాధనీయమే .

మాండూక్య కారిక కేవలం 12  వాక్యాల చిట్టి  గ్రంధం .శంకరుల ముందుకూడా మాండూక్య ఉపనిషత్ ‘’శ్రుతి ‘’గా పేర్కొన బడేది .దీని వ్యాప్తి అనంతం ప్రభావం చెప్ప తరం కానిది .ఉపనిషత్ సారం  అంతా వడకట్టి ఇచ్చింది .ఇందులోని మొదటిభాగం  –ఆగమ ప్రకరణం(29 శ్లోకాలు )  2-వైతత్య ప్రకరణ (38 శ్లోకాలు )3-అద్వైత ప్రకరణ (48 శ్లోకాలు )4-అలతశాంతి ప్రకరణ (100 శ్లోకాలు )

ఆగమ భాగం లో ఆత్మమనిషి శరీరం లో 1-విశ్వ 2-తైజస 3 –ప్రజ్నఅనే మూడు రూపాలో ఉంటుందని చెబుతుంది రెండవ ప్రకరణం వైతత్య అంటే అసత్యం లో బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది .మూడులో అద్వైత విషయాలన్నీ క్రోడీకరించి ఉన్నాయి నాలుగవ ప్రకరణ అలత శాంతి అంటే అగ్ని,శాంతి లో ప్రముఖుల సూక్తులు ఉన్నాయి .ధర్మం ,సాంఖ్యం ,అజాతివాదం ,సంసారం ముక్తి విషయాలపై వివరణ ఉంది.

80-పంచపాదిక రాసిన పూరీ పీఠాధిపతి-పద్మ పాదాచార్య (8 వ శతాబ్దం )

శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు,సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ. శ్రీ శంకరులు శ్రీ శైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆపరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈదృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోదృగ్గుడై శ్రీలక్షీనృసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆదొంగలనాయకునిపై ఎటునుండొ హటాత్తుగా ఒక సింహము దాడి చేసినది అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.

శ్రీ శంకరులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో పూరీ గోవర్ధన మఠానికి పద్మపాదాచార్యులు పీఠాది పతిని చేశారు .శంకరాచార్యులవారు . అసలు ఆయన కేరళలో తెక్కే మఠం అనేదాన్ని స్థాపించాడని కొందరు అంటారు కాదు ఆయన దక్షిణ భారతం లో చోళప్రాంతం వాడని కొందరి అభిప్రాయం .సురేశ్వరాచార్యులతో కలిసి పద్మపాదుడు వివరణ భాష్యకారుడిగా గుర్తింపు పొందాడు .ఆయన రాసిన గ్రంధాలలో ఒకే ఒక్కటి ‘’పంచ పాదిక ‘’లభ్యం .శంకరులు తాను రచించిన బృహదారణ్య భాష్యం పై  వివరణ వ్యాఖ్య  రాయమని కోరితే పద్మ పాదుడు దీన్ని రాశాడు .అసూయతో ఉన్నమేనమామ దీన్ని తగలబెడితే శంకరాచార్యులవారి అమోఘ జ్ఞాపక ధారణా శక్తి వలన ఇప్పుడున్న రూపం లో మళ్ళీ పద్మపాదుడు రచించాడు .పద్మపాదుడు గురువే సర్వం గురువును మించినది లేదు అని అభిప్రాయపడ్డాడు .శంకర –పద్మ పాదుల గురు శిష్య బంధం మహా ఆదర్శప్రాయమైంది లోకం లో .

శంకరుల ‘’అధ్యాస ‘’భావాన్ని పద్మపాదుడు పంచ పాదిక లో సంపూర్ణంగా ఆవిష్కరించాడు .జీవ బ్రాహ్మలు ప్రతిబింబ బింబాల వంటి వారు అని ఇందులో సారాంశం .

 

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.