ర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 –

81- శ్రుతి సార సముద్ధరణ రాసిన తోటకాచార్య (8 వ శతాబ్దం )

ఆదిశంకరాచార్యులవారి  శిష్యుడు తోటకాచార్య .ఉత్తరాభారతదేశాన బదరీనాధ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జ్యోతిర్మఠ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలో వాడక్కే మఠ స్థాపకుడు . ఆదిశంకరాచార్య శృంగేరిలో ఉన్నప్పుడు గిరి అనే మూగ  బాలుడు వారిని దర్శించాడు .తమ శిష్యునిగా స్వేకరించారు . చాలా  కస్టపడి చదువుతూ సేవ చేస్తూ గురు అనుగ్రహం  అభిమానం పొందాడు .అంతగా తెలివి తేటలు లేని గిరి కి ప్రాదాన్యమిస్తున్న గురువుగారిపై మిగతా శిష్యులకు కోపం గిరిపై ఈర్ష్య అసూయలు కలిగాయి .శిష్యులకు అద్వైత వేదాంతాన్ని బోధి౦చ టానికి కూర్చునే సమయం లో శిష్యుడు గిరి గురువుగారి వస్త్రాలను ఉతుకుతూ౦డేవాడు .గిరివచ్చేదాకా పాఠం ప్రారంభించేవారు కాదు శంకరులు .ఒక రోజు పద్మపాదుడు గురువుగారికి ఎదురుగా ఉన్న గోడను చూపిస్తూ ,దానికి పాఠం చెప్పటం ఎలాంటిదో గిరి కి బోధించటం అలా౦టినిది అని ఎద్దేవా చేశాడు .

           శిష్యుని గురుభక్తికి ,వినయ విదేయతలకు సంతోషించిన శ్రీ శంకరులు అతనిని అనుగ్రహించాలను కొన్నారు .మానసికంగా నే శిష్యుడుగిరికి సర్వ శాస్త్రాలను బోధించేశారు .గుర్వనుగ్రహం తో సకలశాస్త్ర పారంగతుడైన గిరి  అకస్మాత్తుగా తోటక ఛందస్సులో గురువు శంకరులపై అష్టకం ఆశువుగా చెప్పాడు. అదే తోటకాస్టకం గా లోకం లో ప్రాచుర్యం పొందింది .మూగ గిరి తోటకాచార్యుడై ప్రసిద్ధి చెందాడు .తోటకాస్టకం లో కొన్ని రుచి చూద్దాం –

1-విదితాఖిల శాస్త్ర సుధాజలధే –మహితోపనిషతకధి తార్ధ నిధే –హృదయే కలయే విమలం చరణం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను .ఆయన దయామృత సాగరుడు .ఉపనిషత్ సారాన్ని గ్రహించి గ్రంధ రచన చేసిన శేముషీ విభవ సంపన్నుడు .

చివరి శ్లోకం

8-విదితా న మయా విశదైకకలా  -న చ కించన కాంచన మస్తి గురో .-ద్రుతమేవ విదేహి కృపాం సహజం –భవ శంకర దేశిక మే శరణం .

భావం –నేను శంకరుని శరణు వేడుతున్నాను . బుద్ధీ ,జ్ఞానం లేని చేతిలో దమ్మిడీ కూడా లేని ఈ నాపై ఆయన  కృపాకటాక్షం  ప్రసరించాలి .

Inline image 2

82- అజ్ఞాని జ్ఞాని గా  మారిన -హస్తామలకాచార్య (8 వ శతాబ్ది )

అద్వైత బోధకులు ఆది శంకరాచార్యులవారి మరో శిష్యుడే హస్తామలకాచార్యులు .ద్వారకామ్నాయ పీఠాధిపతి .అంతకు పూర్వం కేరళలోని త్రిశూల్ లో ఇడయిల్ మఠాన్ని స్థాపించాడు .కర్నాటక లోని కొల్లూర్ లో  ఆదిశంకరులున్నప్పుడు ఒకసారి భిక్షాటన చేస్తూ ఇప్పుడు శివల్లి అని పిలువబడే శ్రీ బాలి గ్రామానికి వచ్చినప్పుడు ప్రతి ఇంటిలోనూ అగ్ని హోత్రపు సుగంధం పరవశి౦ప జేసి ప్రతి ఇల్లు భిక్షకు ఆహ్వానించింది .రెండు వేలకు పైగా ఉన్న ఆ గ్రామ బ్రాహ్మణులు వేద వేదాంగ, శాస్త్రాలలో నిష్ణాతులు ,వేద విధానం లో యజ్న యాగాలు చేసేవారు .అక్కడ శివ పార్వతులు కొలువైఉన్న ఒక శివాలయం ఉన్నది .ఆ గ్రామం లో ప్రభాకరుడు అనే బ్రాహ్మణుడు అన్నీ తెలిసిన మహా జ్ఞాని .కాని ఆయన కొడుకు అందగాడే కాని శుద్ధ  తెలివితక్కువ దద్దమ్మ  .ఉపనయనం జరిగింది కాని వేద విద్య ప్రారంభం కాలేదు .ఊరికే రికామీగా సోమరిగా స్తబ్దుగా ఉండేవాడు .

 శంకర భగవత్పాదులు తమగ్రామ౦  వచ్చారని తెలిసి ప్రభాకరుడు కుమారునితోసహా  వారిని దర్శించి ,అమాంతం వారి పాదాలపై తండ్రీ కొడుకులు  వాలిపోయి సాష్టాంగ నమస్కారం చేశారు .కరుణా శంకరునికి తన కొడుకు  గోడు విన్నవించుకొన్నాడు  .శంకరులకు ఆకుర్రాడిపై వాత్సల్యం కలిగి ‘’నువ్వు ఎవరు ‘’’?అని ప్రశ్నించారు .అప్పటిదాకా లోకం ఏమిటో ,తన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో  కూడా తెలియని అతడు అకస్మాత్తుగా ఆశువుగా 12 శ్లోకాలలో అద్వైత పరమార్ధాన్ని చెప్పేశాడు .ఆన౦దించిన శ్రీశంకరులు అతడిని శిష్యునిగా స్వీకరించి ‘’హస్తామలకాచార్య ‘’అని నామకరణం చేశారు .అరచేతిలో ఉసిరికాయ లాగా అతనికి సర్వ విజ్ఞానం ఒక్కమారు లభించినందున సార్ధకంగా ఆ పేరు పెట్టారు .

  హస్తామలకుని ప్రతిభా పాండిత్యాన్ని గ్రహించిన శంకరులు ఆయను తన సూత్ర భాష్యం పై వార్తికం రాయమని ఆదేశించారు .అలాగే హస్తామలకుడు రాసి పూర్తి చేశాడు .ఇక్కడ ఒక ఫ్లాష్ బాక్ కథ ఉంది.తెలుసుకొందాం

ఒక సారి యమునా నదీ తీరం లో ఒక ముని తపోధ్యానం లో ఉన్నాడు ,బ్రాహ్మణ స్త్రీలు స్నానం చేయటానికి వచ్చారు .అందులో ఒకావిడ తన రెండేళ్ళ పిల్లాడిని ఆముని దగ్గర వదిలి జాగ్రత్తగా చూడమని చెప్పి యమునా నదీ స్నానికి వెళ్ళింది .ఆపిల్లాడు నెమ్మదినెమ్మదిగా జారి యమునా నదిలో పడి  మునిగిపోయాడు .తల్లి  వచ్చి విషయం తెలిసి నిర్ఘాంత పోయింది .సమాధి నిస్టు డైన ముని  కళ్ళు తెరిచి చూశాడు .రోదిస్తున్న ఆ మాతృమూర్తి వేదనకు చలించిపోయాడు .తన  శరీరాన్ని  త్యాగం చేసి ఆ బాలుడిలో చేరిపోయాడు .మునిగి చనిపోయాడు అనుకొన్న బాలుడు బ్రతికి బయటికి వచ్చాడు .ఆ బాలుడే హస్తామలకాచార్య .అందుకే ఆయన లో అంత అగాధమైన జ్ఞానం నిండి ఉన్నది .అది శంకర కరుణతో ఉబికి బయటికి వచ్చి,అద్వైత ధార గా  ప్రవహించింది .

Inline image 1

  సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-3-17 –ఉయ్యూరు

  

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.