ఘోరకలి -3
”Power tends to corrupt and absolute power corrupts absolutely ”అన్నాడు లార్డ్ జాన్ యాక్షన్ 18 87 లోనే .హిట్లర్ ఈ మాటలను రుజువు చేద్దామని కంకణం కట్టుకున్నాడు . దీనికి ఎన్నో మాయోపాయాలు నక్కజిత్తులు ,కపట నాటకాలు తడిగుడ్డతో గొంతులు కోయటాలు చేసిపారేశాడు పావులు చకచకా కదిపాడు అవతలి వాళ్ళను చిత్తైపోయేట్లు దిగ్భ్రము లోనయ్యేట్లు నటుడు మహేష్ పోకిరిలో చెప్పిన మైండ్ బ్లాకయ్యేట్లు చేశాడు శకునికి మించిన రాచకీయ జూదం ఆడాడు గోకర్ణ గజకర్ణ మాయల మరాఠీ విద్యలన్నీ ప్రదర్శించాడు .అదృష్టవంతులకే కాదు దురదృష్టవంతులకూ కాలం కలిసి వస్తుంది .జర్మన్ బజారులో పెయింటింగులు అమ్ముకుంటూ చింపి గుడ్డలు కట్టుకొని నిలువ నీడ లేక తిరిగినవాడికి అదృష్టం వరించి అందలమెక్కించింది . నహుషుడి లా కళ్ళు నెత్తికెక్కవా ?గర్వం తో కళ్ళు మూసుకుపోవా. ఉచ్ఛనీచాలు మర్చిపోయి పిచ్చ పిచ్చగా ప్రవర్తించి జర్మనీ ప్రజాస్వామిక పార్లమెంట్ మూడవ రీచ్ ను ను చిదిపి ఛిద్రం చేసి వాళ్ళతోనే రాజాధి రాజమార్తా0డ, చక్రవరి ఫురేర్ డిక్టేటర్ అనిపించుకున్నాడు దేనికీ ఎదురు లేకుండా సర్వాధికారాలు వారితోనే కట్ట బెట్టించుకొని థర్డ్ రీచ్ కి దిశా నిర్దేశం చేశాడు .ఎదురొస్తే ఖతం .దీనికి వంటపాడిన వాళ్ళు ఎస్ఎస్ దళం ప్రచార సార్వ భౌమ గోబెల్స్ వగైరా .
ఎర్నెస్ట్ రోహం ఎస్ ఎ. ను బలమైన జర్మనీ సాధారణ సైన్యం ను గడ గడ లాడించి ,హిట్లర్ అధికార ఆరోహణకు వీధి రౌడీలను రివాల్యూషన ర్ల ను అందించింది .వీళ్ళు వ్యతిరేకుల గొంతు నొక్కేశారు . హిట్లర్ ఛాన్సలర్ అవగానే వీళ్ళను కరేపాకు ఏరేసినట్లు ఏరేశాడు . ఇది రోహీమ్ కు నచ్చలేదు .అతడు జర్మనీ అంతా ఎస్ ఎస్ఏ చేతిలోకి వచ్చి జర్మన్ ఆర్మీని కంట్రోల్ చేయాలనుకున్నాడు .ఘటికుడైన హిట్లర్ వ్యాపార మిలిటరీ సంస్థల తోడ్పాటు లేనిదే చక్రవర్తి కాలేనని గృహహించాడు .వాళ్ళతో మాట్లాడి ఎస్ ఏ వాళ్ళ పవర్ తగ్గించేశాడు .రోహీమ్ ను వదిలించుకోవడానికి రీన్ హార్డ్ హెడ్రిచ్ ని ఉసిగొల్పాడు .ఎస్ ఏ బలపడితే తమ ఉనికికి ప్రమాదమని గ్రహించాడు రోహీమ్ ను బలహీనపరిచే చర్యలన్నీ చేశాడు నాజీపార్టీలో ఒక సీక్రెట్ సెల్ ఏర్పాటు చేశాడు .వీళ్ళు సహజం గా హోమో సెక్సువల్స్ అన్నవిషయం అందరికీ తెలుసు .ఇదేదో తామే కనిపెట్టినట్లు పెద్ద బిల్డప్ ఇచ్చారు వ్యతిరేకులు .
19 34 జూన్ 30 న వీళ్ళ భరతం పట్టటానికి మాస్టర్ ప్లాం వేశాడు హిట్లర్ అదే ”నైట్ ఆఫ్ ది లాంగ్ నైవ్స్ ”హిట్లర్ అనుచరులు బ్రయోన్ షార్ట్ ఎస్ ఏ లను చుట్టుముట్టి బజారులో కాల్చి చంపించాడు కొందరు ఇళ్లల్లోనే కైమా అయ్యారు మిగిలిన వాళ్ళు జైలుపాలయ్యారు రోహిన్ ను తెల్లవారుజామున హిట్లర్ ఆర్డర్ పై కస్టడీ లోకి తీసుకొని ఎక్సిక్యూట్ చేశారు .ఈ ఆకస్మిక హననం లో ఎంతమంది చచ్చారో తెలియదు కనీసం వందమందిని లేపేసి ఉంటారు .వీళ్ళ చావుపై విచారణ లేదు కారణం వీరంతా దేశ ద్రోహులని ముద్ర వేయటమే ..హిట్లర్ అండ్ కో కు ఆ రాత్రి శుభ రా త్రి .ఎస్ ఏ లకు కాళరాత్రి .ఈ హత్యలు ఆగిపోక ముందే జనరల్ వీల్ హెల్మ్ వాన్ బ్లూమ్ బెర్గ్ సైన్యం పూర్తిగా ఫ్యుహెర్ హిట్లర్ ను సమర్ధిస్తున్నట్లు ప్రకటించాడు హీంలర్ కు ఘెట్టో ఆపరేషన్ అధికారం కట్టబెట్టాడు హెడ్రిచ్ కి రోజువారీ కార్యక్రమాలకు -హత్యలకు అధికారం వచ్చింది గోరింగ్ విమాన దళం అనబడే లూప్త్వాఫీ కి అధికారిఅయ్యాడు హిడేన్ బర్గ్ చనిపోయాక హిట్లర్ ప్రెసిడెంట్ ఛాన్సలర్ అయ్యాడు .అంటే సైన్యం కూడా హిట్లర్ చేతిలోకి వచ్చి సర్వ సత్తాక నియంత అయ్యాడు ఒకే దెబ్బకు ఎన్ని పిట్టాల్నో రాల్చేశాడు హిట్లర్ ..
శుద్ధ జర్మనీ
అధికారాలన్నీ హస్తగతమయ్యాక హిట్లర్ అనవసరమైన వాళ్ళను ఏరిపారెయ్యాలని జర్మన్ల శుద్ధ రక్తం కలుషితం కాకూడదని భావించాడు .హోమో సెక్సువల్స్ ను ముందు అరెస్ట్ చేయించి బహిష్కరణ (డిపోర్టేషన్)కాంప్ లకు తరలించాడు దీన్ని మతగురువులు సమర్ధించారు వీళ్ళవలన పబ్లిక్ హెల్త్ దెబ్బ తింటుందని గగ్గోలు పెట్టించాడు జర్మనీ అంతా గాలించి హోమోలను హోమో అని అనుమానమొచ్చింది వాళ్ళనూ అరెస్ట్ చేశారు .. తర్వాత చర్య ”జెహోవాస్ విట్నెస్ ”అంటే నాజీ పతాకమైన స్వస్తిక్ పతాకానికి సెల్యూట్ చేయనివారిని అగౌరవ పరచినవారినీ హిట్లర్ కు విధేయత ప్రకటించనివారినీ ,ఆర్మీలో చేరనివారినీ ”రాజ ద్రోహులు ”(treasons) గా ముద్రవేసి బొక్కలో పెట్టారు .మతాన్నివదిలేసి రీచ్ కి కొందరు సాల్యూట్ కొడితే కొందరు వ్యతిరేకించి చువ్వలు లెక్కబెట్టారు .
జిప్సీ ల హననం
తరువాత ఘనమైన హిట్లర్ గారి ద్రుష్టి జిప్సీ లపై ప్రసరించింది .ఈ సంచార జాతికి థర్డ్ రీచ్ లో స్థానమే లేకుండా పోయింది .వాళ్ళు నల్లగా ఉండే సంచారులు వాళ్లకు స్వతంత్రం కావాలి ఎవరి కంట్రోల్ లోనూ ఉండని జాతి .వాళ్ళు సోషల్ ఆర్డర్ ను భంగపరచి ఆర్య రక్తాన్ని కలుషితం చేస్తున్నారని హిట్లర్ ఉవాచ . అందుకని 1930 లో నాజీలు జిప్సీ సమస్యకు పరిష్కారం ఆలోచించింది స్థానిక పోలీసులు వారిపై దొంగతనం దోపిడీ ,సోమరితనం అభియోగాలు మోపి అరెస్ట్ చేసే అధికారం ఇచ్చాడు .సహజం గా వాళ్ళకు జర్మనీ పౌరసత్వం ఉండదు కనుక వాళ్ళను దేశ బహిష్కరణ చేయటం తేలిక యింది .
జ్యుల ఏరివేత
1935 లో నాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నూరేం బెర్గ్ లో జరిగి మొదటిసారిగా జ్యుల కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇక వరుస స్టేట్ మెంట్లు షురూ చేశారు .జర్మనీ వాళ్ళు కానీ జర్మన్ రక్తమున్నవారుకాని జ్యుల తో వివాహ మాడటాన్ని 15-9-1935 న చట్టం ద్వారా రద్దు చేశారు పిల్లలు పుట్టే వయసున్న జ్యులు కాని ఆడపిల్లలు జ్యుల ఇళ్లల్లో పనిమనిషులుగా ఉండరాదని శాసించారు .చివరికి జ్యులు జర్మనీ జాతీయ జెండా ఎగుర వేయటాన్ని నిషేదించారు ..నవంబర్ 14 న జ్యుల పౌరసత్వాన్ని ఓటుహక్కును లాక్కుని ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలనుంచి ఊడబెరికారు .
వెర్రి వెయ్యి విధాలు
స్వచ్ఛ రక్త నినాదం జ్యులు జిప్సీలు ,ఇతర తక్కువ స్థాయి మనుషుల విషయంలోనే కాక రీచ్ పౌరుల విషయం లోనూ అవలంబించారు ..దీనికోసం దేశవ్యాప్తం గా ”జాతి ఆరోగ్యం ”(రేషియల్ హైజీన్ )ప్రోగ్రామ్ అమలు జరిపారు .ఉత్తమ మానవ జాతిని సృష్టించటం ”అనే యుజెనిక్స్ ”ను అమలు చేశారు దీనికోసము వంశ చరిత్రలను త్రవ్వి తీశారు .జీన్ ఆధారంగా మానవ స్వభావాలుంటాయని ఈ శాస్త్రం చెబుతోంది .ఉదాహరణకు ”దాలా సోఫీల్లా ”అనే జీన్ ఉన్న వారి వంశం అంతా నౌకా రంగం లో రాణిస్తారు ”నోమాధిజం ”జీన్స్ ఉంటె ఇంటిపట్టున ఉండకుండా ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఇది వారసత్వ లక్షణమై జిప్సీలు ,కోమాంఛెస్ తెగలు సంచార జాతులయ్యాయి ..ఇవాళ ఈ విషయాలు నవ్వు పుట్టిస్తాయికానీ హిట్లర్ కాలం లో ఇదేంటి అని ఎవరూ ప్రశ్నించలేదు .యుజెనిక్స్ అప్పుడు ఒక గొప్ప శాస్త్రమై నాజీకాలం లో విజృంభించింది ..దీన్ని అడ్డం పెట్టుకొని నాజీలు బలవంతపు స్ట్రెయిలైజేషన్ అమలు చేసి అంటేలోపమున్న వ్యక్తులకు బలవంతంగా సంతానోత్పత్తి లేకుండా చేసి జాతిని శుద్ధి చేసే ప్రయత్నం చేశారు .దీనికి అనుగుణంగా చట్టాన్ని 1933 జులై 14 న తెచ్చి అనువంశిక లోపాలు లేకుండా జాతి శుద్ధ రక్తం కలుషితం కాకుండా చేస్తున్నట్లు ప్రకటించి ఇందిరా గాంధీ కాలం లో కొడుకు సంజయ గాంధీ ప్రవర్తించినట్లు బలవంతపు కుటుంబ నియంత్రణ చేసిపారేశారు .మానసిక బలహీనులు మానసిక రోగులు ,కొన్ని రకాల నరాల జబ్బువాళ్ళు ,గుడ్డి కుంటి క్రానిక్ ఆల్కహాలికులు అందరూ దీని బారిన పడ్డారు ..ఆతర్వాత తెలివిమీరిన ప్రభుత్వం వ్యక్తులకు అనుమతి లేకుండానే ,వాళ్ళకసలు తెలియ కుండానే స్టెరిలైజేషన్లు శత సహస్రాలుగా చేశారు .ఎలా చేశారో జర్మన్ చరిత్రకారుడు అలెక్సా0డర్ మిత్స్ రిలీచ్ ”వ్యక్తులు డాక్టర్ ఎదురుగా కుర్చీలలో కూర్చుని ఫారాలు ఫిలిప్ చేస్తుంటారు వారికి తెలియ కుండానే ఎక్స్ రే పరికరాలు వాళ్ళ కుర్చీలకిందనే పెట్టి వాళ్ళ జనానావయవాలపై మూడే మూడు నిమిషాలు కిరణ ప్రసారం చేయించి స్టెరిలైజేషన్ చేశారు ”అని రాశాడు . ఇంతకంటే ఘోరం -మాస్ స్టెరిలైజేషన్ కోసం ఒక ఇర్రిటేటింగ్ పదార్ధాన్ని స్త్రీల గర్భాశయం లోకి పంపి అండ ఉత్పత్తి ని నాశనం చేసి పిల్లలు పుట్టకుండా చేయటం .ఈ పని నమ్మకమైన చెకప్ పేరిట డాక్టర్ల చేత ఇంజెక్షన్లు చేయించటం .ఇలా జరిగిందని పేషేంట్ కు అసలు తెలియని తెలియదు నమ్మక ద్రోహం అంటే ఇదే .ఇదేమీ కాకమ్మకబుర్లుకావు స్టెరిలైజేషన్ ప్రాజెక్ట్ లో పాల్గొన్న కార్ల్ బ్రాన్డ్ట్ చెప్పిందే -”పెద్దగా డబ్బు ఖర్చుకాని అతి తేలికైన ,త్వరగా జరిగే స్టెరిలైజేషన్ ను జర్మన్ రీచ్ కు వ్యతిరేకులైన రష్యన్లు ,పోల్స్ జ్యుల పై ప్రయోగించారు.ఇది శత్రు వులను ఓడించటమే కాక సంపూర్ణ శత్రు సంహారం చేస్తుంది ”అని నమ్మకంగా చెప్పాడు
అర్ధ రాత్రి అంకమ్మ శివాలు
1938 అక్టోబర్ 27 న హిట్లర్ జ్యులకు వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చి 18 వేలమంది జ్యులను జర్మనీ నుంచి బహిష్కరించాడు వీళ్ళు పోలాండ్ ,రష్యాలలో పుట్టినవాళ్ళు కనుక వాళ్ళు జర్మన్ పౌరులు కాదుఅన్నాడు .వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కుక్కలని పిల్లుల్ని కుక్కినట్లు వాన్ లలో కుక్కి పశువులను సంతకు తోలుకు వెళ్లినట్లు సరిహద్దులలదాకా తీసుకొని వెళ్లి వాళ్ళమానాన వాళ్ళను వదిలేశారు .ఇందులో ఒక బాధితుడు జిండెల్ గ్రీన్ స్పీజిన్ ”ఎవరిదగ్గరా చిల్లిగవ్వ కూడా లేదు పదిమార్కులడబ్బుదాటి ఉంటె లాగేసుకున్నారు .ఇదేమిటి అంటే ఇదే జర్మన్ చట్టం అన్నారు .ఎస్ ఎస్ మనుష్యులు మమ్మల్ని కొరడాలతో కొట్టారు రక్తం కారిపోతున్నా కనికరించలేదు మా సామాన్లన్నీ లాగేసుకున్నారు .అత్యంత ఆటవికంగా పాశవికం గా మా జీవితాలతో ఆటలాడారు ..జర్మనీలో ఇదే నేను చూసిన మొట్టమొదటి అమానుష చర్య ”అని ఆతర్వాత గుర్తు చేసుకున్నాడు . అయ్యా అదీ హిట్లరయ్య నాజీ నియంత పాలన .
జ్యుల నివాసాలపై పడి దోచుకుని తగలబెట్టి భయపెట్టి చంపి విధ్వసం సృష్టించారు ఫైరింజన్ వాళ్ళు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. వేలకొద్దీ జ్యుల ఆరాధనా స్థలానను ,7500 వ్యాపార సంస్థలను నాశనం చేశారు లక్షలాది జ్యులను చంపారు .ఇంత చేసిన హిట్లర్ ఆల్కల్ తాగేవాడుకాదు సిగరెట్ అలవాటులేదు పూర్తి శాకాహారి ,పెళ్లి పెటాకులు సంసారం చట్టబండలు లేనివాడు .మానవ సంబంధాలు తెలియనివాడు ప్రేమ స్నేహం అంటే ఏమిటో తెలీనివాడు అంటే నమ్మగలమా నమ్మాలి ఇది నిజమే ..గోముఖ వ్యాఘ్రం సరైన పదమా ?ఇతని కేరక్టర్ ను చార్లీ చాప్లిన్ ”డి గ్రేట్ డిక్టేటర్ ”మూకీ చిత్రం లో అద్భుతంగా ఫన్నీగా పోషించి చూపాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-17 కాంప్-షార్లెట్ -అమెరికా
—

