జగదానందా రామం
శ్రీ రామ్ డొక్కా గారు నాకు పంపిన రెండవ పుస్తకం ‘’ఆత్మా రామం ‘’..శ్రీ సీతారామాంజనేయుల ముచ్చటైన ముఖ చిత్రం తో ,లోపల వారి కులదైవం ,ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మగారి చిత్రం తో ,ఆమెకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన ‘’యోగ్యతాపత్రం ‘’తో ,శ్రీ స్వామి పరమాత్మానంద సరస్వతులవారి ఆశీరభినందనలు ,శ్రీ సామవేదం వారి శుభాభినందనలు ,శ్రీ కొంపెల్ల రామకృష్ణమూర్తి గారి అభినందన చందనం ,శ్రీ సవితాల సూర్యమణి శాస్త్రి గారి ముద వచనాలు,అక్షర విందు ఆరగించమని ఆహ్వానించిన అమెరికా తెలుగు సాహితీ వేత్త బహు గ్రంధకర్త శ్రీసత్యం మందపాటి పిలుపుతో పుస్తకానికి విలువ అనేకరెట్లు పెరిగింది . తన మనోభావాలను అందమైన కందాలలో రామ్ గారు పొదిగి ,అంత ఎదిగినా ,ఒదిగి ఉండి ,రామభక్త హనుమాన్ అనిపించారు .
‘’’’ఆత్మారామం ‘’లో ప్రార్ధన ,పరిచయ ,ఉపనిషథ్ ,ఇతిహాస ,ఆనంద ,అద్భుత రామాలున్నాయి .అనుబంధంగా శ్రీ వరసిద్ధి వినాయక పద్యమాల ,మాతృ వందనం ,శంకరాచార్య భజగోవిందంకు ,శివమానస పూజ ,నిర్వాణ షట్కము నాకు ‘’కందా’’నువాదం ,పడగెత్తిన పద్యం ఉన్నాయి .శ్రీ రామ్ గారి విద్వత్తు ,ఆయన సాగించిన కవితా సేద్యం పొందిన లోతైన శాస్తాను భవం సాధించిన వేదోపనిషత్ ,విజ్ఞానం ఈ పుస్తకం లో సాధారణ జనులకు అరచేతి ఉసిరిపండుగా అందజేసిన ధన్య జీవి . లోతులు తరచే విద్వత్తు నాకు లేదు కానీ అందులో ఉన్న ఆనందాన్ని నాతో పటు మీరూ పాలు పంచుకోవాలన్న తపనతో రాస్తున్నాను .
. ‘’సీతామాత గ చేసిన -ఆ తపమే అన్నదాన మా ఫలితంబే -మా తరముల గాచునెపుడు ‘’అంటూ సీతమ్మగారికి నమశ్శతం సమర్పించారు . వాడుక భాషలో వేదాంతాన్ని ‘’తోడి ,పాడి ‘’అదంతా రామ లీల అన్నారు .ఊర్ధ్వ మూల మధ శ్శాఖం ‘’కు చక్కని కందం లో ‘’విశ్వాధారము గగనము -విశ్వపు శాఖలు ధరణిని విస్తారంబై -విశ్వంబొక తలక్రిందులు -అశ్వత్ధ0బని తెలియుము ఆత్మారామా ‘’అని అందంగా సరళంగా చెప్పారంటే వేదాంతాన్ని ఎంత బాగా వంట పట్టించుకొన్నారో అర్ధమవుతుంది .’’లోపల చూపే దీపాలను వెలిగించును’’అన్నది ఉపనిషత్సారం ..మనిషిలోని ద్వంద్వాలగురించి చెబుతూ ‘’నాలో వర్ణములెన్నో -నాలోనే మతములెన్నో ,నాకగుపించే -నాలో నాకము నరకము ‘’ఉన్నాయని సూక్ష్మీకరించారు .మనం పొందిన పాపపుణ్యాలు ,కర్మఫలాలు పేర్చినట్లుగా ఉండి ‘’రాటకుకట్టిన ఎద్దుకు -ఆట ‘’గా ఉందని మన గానుగెద్దు జీవితాన్ని ఆవిష్కరించారు . తైత్తిరీయ ఉపనిషత్ లలో చెప్పిన అన్న స్వరూపాన్ని ‘’అన్నమే ప్రాణము నిల్పును -యన్నంబె సకల సృష్టి కాధారంబౌ -అన్నము నన్నము మ్రింగును -అన్నమే ఈ భూతకోటి ఆత్మా రామా ‘’అంటూ ‘’అన్నోపనిషత్’’ సెలవిచ్చారు ..జీవులలో దేనినీ తక్కువ చేయరాదని అడవిలో మాకుల ఆకులే తినవలసి వస్తుందన్న చేదు నిజం నిర్మొహమాటంగా చెప్పారు ..చానళ్ల పత్రికల లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ‘’రంగు రాళ్ళఉంగరాల ’’ ప్రకటనల పై నర్మ గర్భంగా ‘’ఉంగరం మొక్కటి తొడిగిన -స0గర మైనట్టి బ్రతుకు స్వా 0తన పడునే- రంగుల భవితకు రాళ్లను -అంగాంగము బెట్టవలెన’’అని నిలదీశారు వెర్రి వ్యామోహాన్ని దూరం చేసుకోమని హితవు పలికారు
అర్ధ కామాల మధ్య సార్ధకమైన ధర్మాన్ని మోక్షాన్ని సాధన చేయమని చెబుతూ ‘’వ్యర్ధము కానట్టి బ్రతుకు కర్ధంబిది తెలియవలయు ‘’అంటారు . పరమాత్మకై అన్వేషణ బయటకాదు అంతరంగం లో చేయాలి అప్పుడు ‘వింతలలో వింతగా కనిపిస్తుంది ఆత్మ దర్శనం చింతనలోనే కామ్యం సిద్ధిస్తుంది అదే అద్భుతమై పరమానందాన్నిస్తుంది
శ్రీ వినాయక ఆవిర్భావ చరిత్రను పద్యమాలలో చెప్పారు -’’ఎలుకను ఏనుగు ఎక్కెను -పలుక విడ్డూరము గద పార్వతి తనయుల్ -చిలుకుచు ముద్దుల మూటలు -కులుకుల నెమలి యమరెను కొమరుడనుజుడున్ ‘’అంటూ అన్నాదమ్ముల అనుబంధాన్ని వాహనాల సొబగును వింతగా చెప్పారు వరసిద్ధి వినాయకుని స్థిర చిత్తం లో నిలిపి పూజిస్తే విఘ్నాలు రావని ‘’సిరి సంపదలెన్నొ గలుగు శీఘ్రంబుగనే’’అంటూ ఫలసిద్ధి కూడా చెప్పేశారు .
‘’ మాతృ వందనం ‘’ గా తమ కులదేవత సీతమ్మ తల్లికి అక్షరార్చన చేస్తూ ‘’అమ్మ చేతి ముద్దందుకొన్నజనులు -’’గన్నవరపు ‘’ప్రజలు ఘనులు ఘనులు -అవతరించె వారి యాకలి దీర్చగా -అన్నపూర్ణ మాత యామె సీత ‘’అంటూ వందనం చేశారు .ఆమె చేతిలో అక్షయ పాత్ర ఉందేమో నంటూ ‘’అక్షరంపు పాత్ర నందుకొంటి వేమొ -అన్ని వంట వార్పు లట్టు సేయ -గరిక పోచ కూడఘన శాఖ పాకమే -విందు చేసి పెట్ట ‘’అని ఆమెను ‘’విశ్వమాత ‘’గా అభి వర్ణించారు భేషైన పద్యం డొక్కా సీతమ్మతల్లి అన్నదానం రాత్రి పగలు తెలియనిది .అక్కడ కాలం తోపని లేదు అన్నార్థునికి ఇంత అమృతం వడ్డించి ఆకలి తీర్చటమే ఆమెకు తెలిసిన బ్రహ్మ విద్య బ్రాహ్మణ విద్యకూడా .’’వానల నొక్క కేక విని వానికి నన్నము బెట్టగా వడిన్ -ప్రాణము లెక్క సేయకనె ,పర్వున బొయితి నేరు దాటగన్ -దీనుల సేవలో గడుప దీక్షను గైకొని ,జీవితమ్మునే -దానము ధర్మమున్ సలిపి ధన్యగ నైతివి ధారా పోయుచున్ ‘’అనిఒకనాటి సంఘటనేకాదు ఆమె నిరతాన్నదాన పరాయణత్వాన్ని దీనజనోద్ధరణను కళ్ళకు కట్టించారు వారసులైన డొక్కా రామ భద్ర శర్మగారు
తర్వాత భజగోవిందం లో ‘’భజనలతో గోవిందుని -నిజముగా సేవించు మదిని ,నీ పాండిత్యం -రుజువుగా మరణము నాపదు -భజనలతోనే విముక్తి భజ గోవిందం ‘’అని తేట తేట మాటలతో శంకరుల ఆంతర్యాన్ని తేట తెల్లం చేశారు రామ్ ..మరొక చోట ‘’అచ్చముగా ప్రాణమొకటి -చొచ్చిన దేహమె మనిషిగా చోద్యము చేయున్ -చచ్చిన శవమందురిలను -పచ్చి నిజము తెలిసికొను భజగోవిందా ‘’ఊపిరి ఉన్నంతవరకే జీవుడు శివుడు .ఆగాక శవమే అనే యదార్ధం .చివరగా ‘తన భార్యా ధనములపై -లవలేశము ఆశ విడుము ,రావవి నీతో -భవుడవె దైవము నెరుగక -భవ సాగరమునకు నావ భజ గోవిందం ‘’పరిణతి చెందిన వేదాంతం కురిపించారుసూక్షపదాలతో
‘’మానస పూజ ‘’లో ‘’నీకు లేనిదేది నీది కాని దేది -ఆత్మ తృప్తి కొరకె అన్ని విధులు -సాగిలబడే తనువు సాష్టాంగ వందనం -మంత్రపుష్ప మాయె మనసు నేడు ‘’అని భావగర్భితంగా సాగింది కవిత్వం
‘’నిర్వాణ షట్క0’’లో ‘’’మనో బుధ్యహంకార చిత్తాలు నేనుకాను -పంచేంద్రియాలతో బంధించబడను -పంచ భూతాలతో పంచుకో బడను -చిదానంద రూపాన్ని -శివుడనే నేను’’బహు సొంపైన అనువాదం ఆచార్యభావానికి అనువైన అనువాదం మరొక ఆణిముత్యం -’’నిర్వికల్పుడ నేను,నిరాకారుడు నేను -ముక్త సంగుడ ,మూలతత్వాన్ని నేను -అంత కొలువున్నాను ,అన్ని చూస్తున్నాను -చిదానంద రూపాన్ని శివుడనే నేను ‘’
శంకరుల శ్లోకాలను నాగరి లిపిలో ముద్రించటం వారిపైగల ఆరాధనకు పరాకాష్టగా నేను భావించాను .
‘’చివరిదైన పడగెత్తిన పద్యం ‘’ లో తెలుగు వాడి ఆస్తి ,ప్రకాస్టి అయినపద్యం, దాని వైభవాన్ని వర్ణిస్తూ -’’పద్య విద్య లేదు భాషలన్నిటి యందు -పద్య వారసత్వ పటిమ నెరిగి -పద్య మొక్కటి రాసి పది మంది మెచ్చగా -పలుకు ,పరమ శుభము ,పగను విడుము ‘’అంటూ పద్య కేతనాన్ని భుజాన దాల్చి ఆదర్శ ప్రాయులయ్యారు డొక్కా రామభద్రగారు .
పుస్తకం లోని పద్యాలన్నీ ధారాశుద్ధితో మానసిక శ్రవణానందాన్నిస్తున్నాయి .మాటకు వెతుకులాట కనిపించదు అవి అక్కడ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది .వశ్యవాక్కున్నవారికే సాధ్యం అది రామ్ గారు సాధించుకొన్న వరం . వాణి వారి కరవాణి అయింది .మరిన్ని రచనలతో ఇటు పద్యం లోను అటు వచన కవిత్వం లోనూ రామ్ గారు సవ్య సాచి అవ్వాలని మనసారా కోరుకొంటున్నాను . తమ ఆత్మానంద ,ఆత్మారామం లతో నన్నూ మమేకం చేసిన డొక్కా రామ్ గారి ఆత్మీయతకు అభినందనలతో ధన్య వాదాలు –
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-17 కాంప్ -షార్లెట్-అమెరికా
రామ్ డొక్కా గారి చిరునామా -rdokka@yahoo.com
cell-001-91-40-27174577
—

