సుమారు 15 రోజులక్రితం 52 ఏళ్ళ క్రితం నా శిష్యురాలైన శ్రీమతి పసుమర్తి (కూచిభొట్ల )లక్ష్మి షార్లెట్ లో పరిచయం అవటం ఆతర్వాత రెండు సార్లు ఏదోకార్యక్రమం లో మళ్ళీ కలుసుకోవటం అక్టోబర్ 1 ఆదివారం షార్లెట్ లో సరసభారతి 108 వ కార్యక్రమంగా ”దసరా సరదా సాహితీ కదంబం ”అయిదు గంటలపాటు నాన్ స్టాప్ గా జరగటం లక్ష్మీ, కూతురు, అల్లుడూ కూడా అందులో పాల్గొనటం ,ఆ రాత్రి ల్లక్ష్మీ వాళ్ళమ్మాయి లావణ్య సనత్ దంపతుల ఇంట్లో విందు చేయటం జరిగింది .చదువు చెప్పిన గురువు అంటే ఎంతటి గౌరవం ఉంటుందో తెలియ జేసే సంఘటన ఇది .
లక్ష్మి దగ్గర ఇక్కడి మా అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకొని ,నాకు అత్యంత ప్రియ శిష్యుడు ,నేను రోల్ మోడల్ ఉపాధ్యాయుడుగా ప్రధానోపాధ్యాయుడుగా భావించే కృష్ణాజిల్లా పెదప్రోలు గ్రామ వాస్తవ్యులు నాకు అత్యంత ఆప్తులు నవ్వులు చిరునామా బంధుప్రియులు స్నేహ శీలురు నన్నూ లెక్కలమేస్టారు శ్రీ రమణారావు గారినీ వారింట్లో నెలరోజులు ఆతిధ్యమిచ్చి కన్నబిడ్డల్లాగా ఆదరించిన శ్రీ పసుమర్తి సీతారామ శర్మగారితమ్ముడు చి భగవంతం ఈ రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంతో సంబరపడి ఎన్నో విషయాలు ఆనందంగా చెప్పటం తర్వాత నాకు మెయిల్ రాసి ఇలా మాట్లాడుకోవటం ”వెరీ ఫార్ట్యనేట్ ”అని చెప్పటం మరింత సంతోషానికి కారణమై అతని గురుభక్తి కి ముచ్చటేసింది .ఆతను హైదరాబాద్లో యిసిఎల్ లో పని చేసి రిటైర్ అయి అక్కడే ఉంటున్నాడట ,ప్రస్తుతం అమ్మాయి దగ్గరకు వచ్చారట దంపతులు .నవంబర్ లో ఇండియా వస్తారట .అప్పుడు తప్పకూండా కలుద్దామని పొంగిపోయాడు .అతనికి వీక్లీ అమెరికా 27 పంపాను .
అతని తర్వాత అతని సోదరి శ్రీమతి దుర్గ కూడా లక్ష్మి నుంచి ఫోన్ నంబర్ సేకరించి నాతో ఆప్యాయంగా మాట్లాడింది .ఈమె భగవంతం కూడా 52 ఏళ్ళ నాటి మోపిదేవి శిష్యులవటం తమాషాగా ఉంది .దైవం ఎలా ఎప్పుడు ఎవరెవరిని కలుపుతాడో తెలియదు కదా ఆమె తనకొడుకు దగ్గర ప్రస్తుతం నార్త్ కరోలినా లోని మేము సెప్టెంబర్ 2,3 తేదీలలో వెళ్లిన కేరీ లో ఉంటోందట .ఫిబ్రవరిలో ఇండియా వస్తుందట . ఆమె కూడా గ్రీన్ కార్డు హోల్డర్ . దుర్గాకూడా తన మెయిల్ ఐడి చెప్పిందికాని దానికి పంపితే రిజెక్ట్ అయింది .ఈ విషయం భగవంతానికి రాసి కరెక్ట్ ఐ డి పంపమన్నాను
దురదృష్టవశాత్తు లక్ష్మి భర్త , శర్మగారి భార్య ,ఆయన పెద్దతమ్ముడిభార్య ,దుర్గ భర్త చనిపోయారన్న విషయం విని బాధ కలిగింది . హైదరాబాద్ లో ఉన్న నాలుగు రోజుల్లో శర్మగారిని తప్పక కలవాలనుకొంటున్నాను .ఆయనకు సుమారు 90 ఏళ్ళు వచ్చి ఉంటాయి .ఆయన 1963 లో నాకు మోపిదేవి హై స్కూల్ లో సహ ఉపాధ్యాయులవ్వటమే దీనంతటికి కారణం .ఆయననాకు ,లెక్కలమేస్టారు రమణారావు గారికి ఆరాధ్యం ఆదర్శం . రమణారావుగారు కూడా మరణించి సుమారు 15 సంవత్సరాలవుతోంది .ఆయన,నేను పెదప్రోలు లో ఒకే ఇంట్లో ప్రక్క ప్రక్క పోర్షన్ లలో ఉండేవాళ్ళం . కలిసి సైకిల్ మీద మోపిదేవి వెళ్ళేవాళ్ళం కలిసి ట్యూషన్ కూడా చెప్పాం . లక్ష్మి నా సైకిల్ వెనక ,దుర్గ లెక్కల మేస్టారి సైకిల్ వెనక కూర్చుని మోపిదేవి స్కూల్ కు వచ్చేవాళ్లమని లక్ష్మి జ్జ్ఞాపకం చేసుకొన్నది . అప్పటి శిష్యులే లక్ష్మి, భగవంతం, దుర్గ ,వీరేకాక నాకు మరీ దగ్గర శిష్యులు అడవి శ్రీరామ మూర్తి ,కృత్తివెంటి మాధవరావు .మా ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేవారు .మాధవ తమ్ముడే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస్ -మన తెలుగు తేజం . ఆ బాధ్యత నిర్వహిస్తున్న ఏకైక తెలుగు బిడ్డ శ్రీనివాస్ . ఈ శిష్యుల సంభాషణతో ఒకసారి ఫ్లాష్ బాక్ కు వెళ్ళాల్సొచ్చింది .ఇవాళ చాలా సంతోషకరమైన రోజు .-
మీ-గబ్బిట -దుర్గాప్రసాద్ -3-10-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా


బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గా ప్రసాదు గారికి, గుంటూరు శ్రీనివాస రామకృష్ణ (వయస్సు-62, భాగ్య నగరం, ప్రస్తుత మకాము: సెయింట్ లూయిస్, అమెరికా) ప్రణామములతో వ్రాయునది. కాకతాళీయముగా మీ జాలగూడు దర్శించటమైనది. ఇది నా భాగ్యమనీ, ఈశ్వర కటాక్షమనీ తలుస్తాను.
తమరి అనుమతితో తమను ఫోను ద్వారా (మీ జాలగూడులో ఇచ్చిన నంబర్లకు) సంభాషించగలను. అనుమతించవేడుతున్నాను.
LikeLike